1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మ ఛాయాచిత్రం అంటే సాక్షాత్తూ అమ్మే

అమ్మ ఛాయాచిత్రం అంటే సాక్షాత్తూ అమ్మే

Indhumuki Ramakrishna Rao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : January
Issue Number : 6
Year : 2022

అమ్మ ప్రసాదించే అనుభవాలు చాలా ఆశ్చర్యకరంగా ఉండటమే కాకుండా నమ్మశక్యంగా కూడా ఉండవు. కానీ అవి అన్నీ యదార్ధములే.

నా ఉద్యోగరీత్యా మద్రాసులో అనిల్‌ బన్సల్‌ అనే ఆయనతో పరిచయం ఏర్పడింది. వాళ్ళకి పాండిచ్చేరిలో మూడు ఫాక్టరీలు ఉండినవి. మా పరిచయం స్నేహంగా మారడం, వారికి నేను అమ్మ గురించి చెప్పడం, వారికి అమ్మమీద నమ్మకం కలగడం జరిగింది.

ఒకసారి అనిల్‌గారు వాళ్ళ మూడు ఫాక్టరీలలోనూ మూడు అమ్మ పెద్ద ఫొటోలు (18”þ12”) పెట్టాలని ఉందని కాబట్టి అవి ఏర్పాటుచేయమని నన్ను కోరారు. నేను అలాగే పైన చెప్పిన సైజులో అమ్మ ఫొటోలు స్టూడియోలో తీయించి, మంచి ఫ్రేమ్‌లో వేయించి రెడీచేశాను. బెంగుళూరునుంచి నేను మద్రాసు వెళ్ళలేక మన సోదరుడు జేమ్స్‌ మద్రాసు వెడుతూ ఉంటే ఆయన ద్వారా ఆ ఫోటోలు పంపించాను. అవి అనిల్‌గారికి చేరాయి. ఒక రెండు-మూడురోజులు పోయిన తరువాత నేను అనిల్‌గారికి ఫోన్‌చేసి ఫోటోలు ఫాక్టరీలో పెట్టారా అని అడిగాను. నేను ఊహించని సమాధానం వచ్చింది. అది ఏమిటంటే ఆ మూడు ఫోటోలు కూడా పోయాయి అని. నేను షాక్‌ తిని అవి ఎలా పోయాయి, అవేమి చిన్న ఫోటోలు కావుకదా పోవడానికి అని అడిగాను.

వాటిని మద్రాసునుండి పాండిచ్చేరి ఎలా పంపించారు అని అడిగాను. మేము మా స్వంతకారులో పంపించాము, మా డ్రైవరు తప్ప కారులో ఇంకెవరూ వెళ్ళలేదు, కారు మద్రాసునుంచి బయలుదేరి పాండిచ్చేరి వెళ్ళేవరకూ ఎక్కడా ఆగలేదు అనికూడా చెప్పారు. బయలుదేరే ముందు అమ్మకు (అమ్మ ఫోటోలకు) హారతి ఇచ్చారా, ఫోటోలు ఎక్కడ పెట్టారు అని అడిగాను. హారతి వగైరాలు ఏమీ ఇవ్వలేదు. ఫోటోలు కారు డిక్కీలో భద్రంగా పెట్టాము అన్నారు. పాండిచ్చేరి చేరిన తరువాత కారు డిక్కీ తీసి చూస్తే ఫోటోలు లేవు. ఎలా పోయాయో మాకూ అర్థం కాలేదు. వెంటనే మీకు చెప్పాలంటే మొహమాటం వేసింది అని అన్నారు.

నేను ”మీరు అమ్మకి హారతి ఇచ్చి మర్యాదగా వెనుక సీట్లో కూర్చోబెట్టి ఇంకొక వ్యక్తిని సేవకుడిగా తీసుకెళ్ళవలసినది. అమ్మ ఫోటో అంటే కేవలం ఫోటో కాదు. సాక్షాత్తూ అమ్మయే” అని వాళ్ళకి చెప్పాను. వారు ఈ పొరపాటుకి బాధపడ్డారు.

వారు అడగకుండానే మళ్ళీ మూడు ఫోటోలు చేయించి వారికి పంపించి ఈ సారి శ్రద్ధాభక్తులతో తీసుకెళ్ళమని చెప్పాను. వారు అలాగే చేశారు.

అమ్మ ఫోటో అంటే అమ్మ స్వరూపమే. అనే విషయాన్ని నిర్ధారణ చేసిన సంఘటన కొన్నాళ్ళతరువాత జరిగింది. ఆ రోజు కొంతమంది ప్రముఖులు అమ్మ దర్శనానికి వచ్చారు. రామకృష్ణ అన్నయ్య అమ్మ ఫోటోలు కొన్ని తెచ్చి, అమ్మతో”అమ్మా, ఈ ఫొటోలలో ప్రాణప్రతిష్ఠ చెయ్యి. వీరికి ఇవ్వాలి”అని అన్నారు. వెంటనే అమ్మ ”ఇప్పుడు అందులో ప్రాణం లేకపోతే కదా నాన్నా”అని అన్నది. అప్పుడు నేను అక్కడ ఉండటంవల్ల ఈ మహత్తర సన్నివేశం చూడటమేకాకుండా అమ్మ పలికిన ఆ మాటలు తు.చ. తప్పకుండా ఇప్పటికీ గుర్తు ఉన్నాయి. అందుకే ఇప్పటికీ కొంతమంది అమ్మ ఫోటోలో కదలికలు, హావభావాలు కనబడుతూ ఉంటాయని ఎంతో ఆనందంతో చెబుతూ ఉంటారు.

కనుక అమ్మ ఫోటో, విగ్రహం అనేవి వస్తువులు కాదు; సాక్షాత్తూ అమ్మే. రక్తమాంసాలతో, కరచరణాదులతో అవతరించి మన కళ్ళముందు నిలిచిన ప్రేమమూర్తి, అనురాగ దేవత.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!