(గత సంచిక తరువాయి)
అమ్మ ఆదరణలో అపర చైతన్యులు
అది 1954 సంవత్సరం. జిల్లెళ్ళమూడిలో ఎవరో అవధూత సంచరిస్తూ కనిపించారు. ” వారిని భిక్షకు రావలసినదిగా అమ్మ ఆహ్వానించింది. అభ్యాగతునికి ఎదురేగి కాళ్ళు కడుగ బోగా, అమ్మలో ఏమి దర్శించారో గాని వద్దని వారించారు. అమ్మ “తప్పు లేదు నాన్నా! బిడ్డ ఒళ్ళు, కాళ్ళు కడగ వలసింది తల్లే కదా!” అన్నా ఒప్పుకోలేదు. చివరకు హైమ కడిగితే అంగీకరించారు. అలవాటు ప్రకారం అన్నం పెట్టి ఆదరించింది. వారికి అమ్మ యెడల భక్తి ప్రపత్తులు, అమ్మకు వారి పట్ల అపార వాత్సల్యము ఏర్పడ్డాయి. “నాన్నా! నీవు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఈ అమ్మ దగ్గర ఉండవచ్చు. ఇక్కడ నీ తల్లి ఉందన్న సంగతి మరచి పోకు” అని చెప్పింది. వారే శ్రీరఘువరదాస్ గా ప్రఖ్యాతులైన శ్రీ అవధూతేంద్ర సరస్వతీస్వామి.
ప.గో. జిల్లా అత్తిలి నివాసులగు పెమ్మరాజు హనుమాన్లు, పొలాలమ్మ దంపతుల పుణ్య ఫలముగా 1914 నవంబరు 28 నాడు మగ శిశువు జన్మించాడు. కాశీయాత్ర చేసి వచ్చిన అనంతరం పుట్టి నందువల్ల ఆ పిల్ల వానికి విశ్వేశ్వర రావు అని పేరు పెట్టుకున్నారు. ఆరువేల నియోగి శాఖకు చెందిన ఈ కుటుంబము వారు నిష్టాగరిష్ఠులై, ఆచార సంప్రదాయాలు పాటిస్తూ జీవితము గడిపిన వారు. తండ్రి గారి వలెనే ఈ పిల్లవానికి చిన్నతనము నుండి భజనలు, భగవన్నామ సంకీర్తన పట్ల అనురక్తి ఏర్పడింది. స్వయంకృషితో కర్ణాటక సంగీతము, హైదరాబాద్, గ్వాలియర్లలో హిందుస్తానీ సంగీతము నేర్చుకుని ఔరా అనిపించుకున్నారు. నాటకాల మీద అభిరుచి కలిగి శ్రీరామ, శ్రీ కృష్ణాది పలు పాత్రలు ధరించి మెప్పించారు. ఆ నాడు ప్రాచుర్యంలో ఉన్న గ్రామఫోన్ ప్లేట్ల ద్వారా కూడా తన సంగీతాన్ని అందించారు.
శ్రీరామచంద్ర ప్రభువుని దర్శించాలన్న కోరికతో అయోధ్య వెళ్ళారు. ముందు నుంచీ ఉన్న వైరాగ్యం ఇనుమడించి, జీవితంలో గొప్ప మార్పు కలిగింది. అచటనే ఒక మహనీయుని వద్ద శ్రీరామ మంత్ర దీక్ష. పొందినారు. ఆ గురువులు వీరికి “సియా రఘువరదాస్” అని నామకరణం చేశారు. ఆ పేరుతోనే ఉత్తర భారతంలో అనేక ప్రాంతాలలో ప్రఖ్యాతు లయ్యారు. ఆ సరయూ తీరంలో కొంత కాలం మంత్రానుష్ఠానం జరుపుకొని, అనంతరం ప్రయాగలో ఉన్న ప్రభుదత్త బ్రహ్మచారి గారి సన్నిధికి చేరి, వారి అంతేవాసిగా వారితో అనేక తీర్థయాత్రలలో పాల్గొన్నారు. జన్మభూమి అయిన ఆంధ్రదేశానికి వచ్చి ప్రతి గ్రామంలో అపర చైతన్యుల వలె భక్తి భావ బంధురంగా నామ సంకీర్తన చేస్తూ సంచారం చేశారు. 1950 ప్రాంతాలలో అప్పికట్ల గ్రామంలో రఘువరదాసు గారు సప్తాహాలు నిర్వహిస్తూ ఉండేవారు. వాటికి అమ్మ వస్తూ ఉండేది. ఇట్టి సంకీర్తనా యజ్ఞంలో ఏకాహ, సప్తాహ సంప్రదాయానికి ఆద్యులై ప్రాచుర్యం కలిగించారని చెప్పవచ్చు. అనేక ఆలయాల్లోనే గాక ఇంటింటా నామ సంకీర్తన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన భాగవతోత్తములు. నేడు ఆంధ్ర దేశంలో హనుమాన్ చాలీసా వూరూరా వాడవాడలా పారాయణ జరుగుతున్నదంటే ఈ నామయోగి ప్రభావమే అంటే అతిశయోక్తి కాదు.
1954 లో గుంటూరు జిల్లా మట్టిపూడి గ్రామంలో సప్తాహం జరిపి, జయ నామ సంవత్సర మార్గశిర పౌర్ణమి నాడు శ్రీ మత్పరమహంస సదాశివేంద్రసరస్వతీ స్వామి వారి వద్ద యథావిధిగ సన్యాసాశ్రమ స్వీకారం చేశారు. ఆ రోజు దత్త జయంతి అవటం వల్ల గురువులు ‘అవధూతేంద్ర సరస్వతీ స్వామి’ అని తురీయాశ్రమ నామం అనుగ్రహించారు.
ఆ తర్వాత ఎన్నో మార్లు అమ్మ వద్దకు వచ్చారు. అమ్మ అన్నం కలిపి నోటికి ముద్దలు అందించేది, పళ్ళు తినిపించేది. తన ఖేద మోదాలు అమ్మతో చెప్పుకుని సాంత్వన, ఉపశమనం పొందేవారు. తన అవధూత స్థితిని, వయసునూ అన్నీ పక్కనపెట్టి అమ్మ సన్నిధిలో అమితానందం పొందేవారు.
ఒకసారి శ్రీప్రభుదత్త బ్రహ్మచారి గారు, వారి ప్రముఖ శిష్యులు, శ్రీ రఘువరదాసు గారు శిష్య సమేతులై జిల్లెళ్ళమూడి వచ్చారు. వారిని చూస్తూనే సాదరంగా చేతులు చాపి ఆహ్వానించి తన మంచం మీద చెరి ఒక వైపున కూర్చో పెట్టుకున్నది అమ్మ. ఆప్యాయంగా ఇద్దరినీ నిమిరింది తన అమృత హస్తాలతో. బ్రహ్మచారి గారు జగన్నాథం వెళ్లామా అమ్మా అని అడిగితే అంతా అదే అయినప్పుడు ప్రత్యేకంగా వెళ్ళేదేమిటి? అన్నది. పోనీ బృందావనం వెళ్లామా అనడిగారు. అమ్మ వినీవిననట్టు, రెండు మామిడి పళ్ళు చెరొకటి నోట్లో పెట్టి, వారితో వచ్చిన వారందరికీ మామిడి పళ్లు ఇచ్చింది.
బ్రహ్మచారి గారి చెయ్యి పట్టుకుని జీపు వద్దకు తీసుకు వచ్చింది. అందరూ మఱిపూడి అనుకుని జీపు ఎక్కారు. కాని జీపు ఓంకారనది ఒడ్డున ఆగింది. అక్కడ గడ్డి మేస్తున్న ఆవులు, గేదెలు, వాటిని కాస్తున్న గోపాలకులను చూపించి “బృందావనం వచ్చాం నాన్నా!” అంది. బ్రహ్మచారి గారికి రఘువరదాసు గారికి స్వీట్ తినిపించింది. రఘువరదాసుగారు అమ్మకు మూడు సార్లు తినిపించి ధన్యులయ్యారు. అక్కడకు వచ్చిన వారికి, కాపరులకు అందరకు, ప్రసాదం పంచి తిరుగు ముఖం పట్టేరు. ఇంటికి రాగానే తిరిగి వెళ్ళటానికి అమ్మను అనుజ్ఞ కోరేరు.
మనం నేడు ఓకే, హలో అన్నట్టు వారికి హరేరామ ఊతపదంగా అనటం అలవాటు. అమ్మను చూసినప్పటి నుంచి ‘జై మా జై మా’ అనటం మొదలు పెట్టేరట.
అమ్మ స్థితి అత్యున్నత మైనదని, సమకాలీన సిద్ధపురుషులతో పోల్చటానికి ఇష్టపడే వారు కాదు రఘువరదాసు గారు. రామనామం తప్ప వేరొక నామం చెయ్యని వారు “జయహెూ మాతా శ్రీఅనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి” అంటూ గానం చేశారంటే అమ్మ పట్ల వారి భక్తి ప్రపత్తులు ఎంతటివో తెలుస్తున్నది.
వీరు అత్యంత నిరాడంబరమైన జీవితం గడిపిన వారు. రమణ మహర్షి వలె ఒక చిన్న వస్త్రం నడుముకి కట్టుకునే వారు. ఏమన్నా ప్రత్యేక సందర్భాలుంటే పంచె ఉత్తరీయం ధరించే వారు. వజ్రాసనంలో కూర్చుని నిర్విరామంగా భజన కొనసాగించే వారు. తరచుగా ఉపవాసాలతో, కేవలం మంచినీళ్ళపై గడిపిన రోజులెన్నో ఉన్నాయి. కనీసం చాప, దుప్పటి వంటివి లేకున్నా కేవలం భూశయనం చేసి విశ్రమించేవారట.
హైదరాబాద్ వాస్తవ్యులు, వీరి ఆప్త శిష్యులు శ్రీ కాసోజు సత్యనారాయణ గారి ఇంట 1975 జూన్ 11 నాడు, శ్రీకృష్ణశ్శరణం మమ అన్న ఆఖరు భజన తరువాత సిద్ధి పొందేరు. వీరి కోరిక మేరకు భౌతిక శరీరం అంతిమ సంస్కారంగా కృష్ణానదిలో నిమజ్జనం చేయబడింది.
సర్వమూ త్యజించి వైరాగ్య పరిమళంతో ప్రకాశించిన అవధూతేంద్రులు అమ్మలో రాముణ్ణి దర్శించి అమ్మ సన్నిధిని, ఆదరణను, అమితంగా పొందిన ధన్యజీవి.