వ్రత భంగం చేసుకున్న యతీశ్వరులు మౌనస్వామి
దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి పొందిన కుర్తాళం సిద్ధేశ్వరీ పీఠం అనగానే గుర్తుకు వచ్చే పీఠవ్యవస్థాపకులు మౌన స్వామి. వీరు చీరాల సమీప గ్రామం నూనెవారిపాలెంలో నివాసముంటున్న అచ్యుతుని బాపనయ్య సీతమ్మ దంపతులకు తృతీయ సంతానంగా 1868 వైశాఖ శుద్ధ చతుర్దశినాడు జన్మించారు. పిచ్చయ్య అని పేరు పెట్టుకున్నారు. కొంతకాలానికి బంధువులైన అచ్యుతుని లక్ష్మీ నరసయ్య సుందరమ్మ లు వీరిని దత్తత తీసుకున్నారు. ఈ దత్తుడికి శివయ్య అని పేరు మార్చుకున్నారు. చదువు చెప్పించి, యుక్త వయస్సు రాగానే కామేశ్వరమ్మ అనే ఆమెతో వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు.
శివయ్యకు చిన్నతనం నుంచీ ఆధ్యాత్మిక చింతన, దేవీ ఉపాసనాదుల పట్ల మక్కువ ఉండేది. రాజమండ్రిలో ఏవో చిన్నా చితకా ఉద్యోగాలు చేశారు. జన్మాంతర సంస్కారం చేత మహనీయులు, యోగులు, భక్తులు ఎక్కడ ఉన్నా వెళ్లి దర్శించుకునేవారు. ఈ నేపథ్యంలో అక్కడ ఒక బైరాగి తో పరిచయమైయింది. శివయ్య మనసు రోజురోజుకూ వైరాగ్యం వైపు మళ్ళింది. కుమార్తెలకు వివాహం కుమారునికి ఉపనయనం చేశాడు. ఈ సంసార బంధనాల నుండి బయట పడాలని నిశ్చయించుకుని హిమాలయాలకు పయనమయ్యాడు. ముందుగా నైమిశారణ్యం చేరుకున్నాడు. అక్కడ వేంకటాచలం పంతులు అనే ఆంధ్ర యోగీశ్వరునితో పరిచయం అయింది. పొట్టిగా బలిష్టంగా శరీరమంతా రోమాలతో విచిత్రంగా ఉండేవాడీ వృద్ధ యోగి. ఆయన వెంట కొని నెలలు ఉండి గురు సపర్యలు చేసి మెప్పించాడు. శిష్యుని సేవా తత్పరతకు మెచ్చి ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించాడు. దీని వల్ల ఆకలి దప్పులు, విషజంతువుల వల్ల బాధలు ఉండవు, ఈ మంత్ర జపం చేసి సిద్ధత్వాన్ని పొందు అని ఆశీర్వదించాడా యోగి. నా మరణా నంతరం అంత్యక్రియలు చేసి ముందుకు సాగిపో. నీ భవిష్యత్తును దేవతలు నిర్ణయిస్తారు అని చెప్పి ఆలవోకగా ప్రాణ త్యాగం చేశాడు.
హిమాలయాలకు చేరుకున్న శివయ్యకు దత్త సంప్రదాయానికి చెందిన అచ్యుతానంద సరస్వతి అనే మహాయోగి సన్యాస దీక్ష యిచ్చి “శివ చిదానంద సరస్వతి” అన్న యోగ పట్టా అనుగ్రహించాడు. తదాది దేశ సంచారం చేస్తూ టెంబే స్వామిని కలవటం, వారనేక యోగ రహస్యాలు చెప్పి సిద్ధ పురుషునిగా చెయ్యటం జరిగింది. ఏ లోహాన్నయినా బంగారంగా మార్చటం, దీర్ఘ వ్యాధులను నయం చెయ్యటం, యోగ శక్తులతో మూలికా వైద్యం చేసి, మౌనిగానే మానవ సేవ చేస్తూ ఉండేవారు. ఏళ్ల తరబడి మౌన వ్రతానికి కట్టుబడి నోరు విప్పింది లేదు. మౌనస్వామి అని పిలుస్తూ ఉండేవారు.
సంచార వశాత్తు ఆంధ్ర దేశం వచ్చి, చీరాలలో నూనెపానకాలు అనే అసామి తోటలో విడిది చేశారు. అమ్మ మరిడమ్మ తాతమ్మతో మౌన స్వామి వారిని చూడటానికి వెళ్లింది. అప్పుడు అమ్మకు 7 సంవత్సరాల వయసు. వారి చుట్టూ చాలామంది కూర్చుని ఉన్నారు. తాతమ్మ కూడా ఓ పది నిముషాలు ఉండి వచ్చేస్తారు. అమ్మకు మరుసటి రోజు వెళ్లాలని పించి, ఒక్కతే వారి వద్దకు వెళ్ళింది. పిన్నా పెద్దలతో ఆవరణంతా హడావిడిగా ఉంది. అందరూ భోజనాలకు వెళ్లిన అదను చూసుకొని అమ్మ దొడ్డివాకిలి గుండా స్వామి దగ్గరకు వెళ్లింది. అమ్మను చూడగానే రా అమ్మా వాకిట్లో ఎవరూ లేరా, దగ్గరకు రా తల్లి అని స్వామి పిలిచారు. అమ్మ మౌనమంటే ఏమిటి? అనడిగింది. అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఉండటానికీ మౌనం ఆధారం అన్నారు. మన్నవ గుడిలో వేసింది రాజరాజేశ్వరి యంత్రమా ? రాజ్యలక్ష్మి -యంత్రమా? అని ప్రశ్నించింది. వారు రాజరాజేశ్వరి యంత్రమని చెప్పేరు. అసలు మీరు మాట్లాడతారో లేదో అనుకుంటూ వచ్చాను అంటే, స్వామి నిన్ను చూడగానే మాట్లాడాలనిపించిందమ్మా అన్నారు. మీరు బాలా మంత్రం యిస్తూ ఉంటారా? అనడిగింది. స్వామి – నీ రాక గోప్యంగా ఉంచుతానమ్మా, నీతో మాట్లాడినట్టు తెలిస్తే వీరంతా ప్రాణాలు తీస్తారు. కొన్ని అవసరాల వల్ల మౌనం పాటించవలసి వచ్చింది. ఆదొక సాధనగా పెట్టుకో లేదు అని అన్నారు. అమ్మ మీరు బాల చెప్పిన వాళ్లకు నేను అజపం చెపుతా అంటే, చకితుడైన స్వామి ధన్యోస్మి ధన్యోస్మి, అజపం అంటే ఏమిటమ్మా అన్నారు. నోటితో ఉచ్చరించనిది అన్నది. మరి అటువంటి దాన్ని ఎట్లా చెపుతావు? అన్నారు. చెప్పేటప్పుడు మాటలతో చెప్పినా చేసేటపుడు మాటలు లేకుండా చేసేది. చెప్పటమంటూ వచ్చినపుడు మాటలు లేకుండా ఎట్లా? అని చెప్పింది అమ్మ. ఇంతలో ఎవరో వస్తూన్న అలికిడి అయింది. వెళ్ళమ్మా వెళ్ళు అన్నారు స్వామి. ఎందుకు వెళ్ళాలి? నన్నేమయినా అంటారా? నిన్నేమయినా అంటారా? అమ్మ ప్రశ్న. ఎవరేమనరు గాని నా నిష్ఠకు భంగం కలుగుతుంది. నిష్ఠ అంటే ఏమిటి స్వామి, అంటే – అది నీకేమి తెలుస్తుంది ? స్వామి సందేహం. మీరు – చెప్పనన్నా చెప్పాలి. నేను చెప్పిందన్నా ఒప్పుకోవాలి అన్నది అమ్మ. నిష్ఠ అంటే అనుష్ఠానం అన్నారు. మౌనస్వామి. అమ్మ యింకా సంభాషణ కొనసాగించాలను కున్నది గాని, ఇంతలో ఎవరో తలుపు తట్టిన చప్పుడు అయింది. అమ్మ మరొక వైపునుండి బయటి కొచ్చేసి, యింటి ముఖం పడుతుంది.
స్వామి మౌనస్వామిగా మారటానికి వారి కాశ్మీరు పర్యటన సందర్భంలో అచటి పండితులతో జరిగిన విద్వద్ గోష్టిలో వీరి వాద ధాటికి అసూయ పడిన వారు దూషించి ద్వేషం పెంచుకున్నారు. ఈ సంగతి తెలిసిన వీరి గురువులు – నీవసలే నృసిం హెూ పాసకుడవు, నీ చూపులో వాక్కులో భీషణ శక్తి కాన వస్తున్నది. నీవు సంకల్పించక పోయినా ప్రత్యర్థికి ఏదో ప్రమాదం జరుగవచ్చు. వాదనల జోలికి పోవద్దు. మౌనంలో ఉన్న అనంతశక్తి నీకు తెలుసు కదా అన్నారు. గురుదేవా మీ సంకల్పం అవగతం అయింది. నేటి నుండి వాదములే కాదు, అసలు మాట్లాడటమే మాని వేస్తాను. మౌనినై మానవ సేవ చేస్తాను అని ప్రతిన పూనారట. అటువంటి స్వామి అమ్మను చూసి మౌన వ్రతాన్ని పక్కన పెట్టి సంభాషించారు!
ఏడేళ్ల పిల్ల అజపం, నిష్ఠ, అనుష్ఠానం వంటి విషయాల గురించి అరువదేళ్ళ ఆధ్యాత్మిక సిద్ధునితో తర్కించటం అమ్మ కారణ జన్ము రాలనటానికి నిదర్శనంగా నిలచే మహత్తర సన్నివేశం! ఆ రోజులలో బాపట్ల రాజమండ్రి చీరాల ఇత్యాది ప్రాంతాలలో సంచరించి, కొన్ని గ్రామాలలో దేవతా ప్రతిష్ఠలు చేసినట్టు చెప్పుకుంటారు.
(సశేషం)