శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానంద భారతీస్వామి
ఒక యువ దంపతుల జంట జిల్లెళ్ళమూడికి బయలుదేరి వెళుతున్నారు. అది వర్షాకాలం కావటం వల్ల విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. దారంతా వరద నీటితో నిండి పోయింది. ఆ ఇల్లాలు నడవ లేక పోతున్నది. ఆజానుబాహువు, దృఢకాయుడు అయిన భర్త అది గమనించి ఆమెను ఎత్తుకొని జిల్లెళ్ళమూడి చేరాడు.
సరస్వతీ కంఠాభరణ, అవధాని శేఖర, కవితా సుధాకర, సాహితీ సార్వభౌమ, రూపక సమ్రాట్, ఇత్యాది బిరుదులు ఆ యువకుని పట్ల సహజోక్తులే! పదహారు సంవత్సరాల ప్రాయంలోనే తొలి అష్టావధానం చేసిన ఈ యువకుడు దాదాపు 12 సంవత్సరాలు వందలాది అవధానాలు చేశాడు. ఒకసారి అవధానంలో విశ్వనాథ వారు కొన్ని ప్రశ్నలు యిచ్చారు. ప్రశ్న పూర్తి కాకుండానే జవాబుగా పద్యాల వర్షం కురిపించాడా అవధాని. భవిష్యత్లో సాహిత్యాకాశంలో చండ మార్తాండునిగా ప్రకాశిస్తావని ప్రశంసించారు విశ్వనాథ. తరువాత గురువులు పింగళి లక్ష్మీ కాంతంగారు అవధానాలు మానివేసి శాశ్వతమైన గ్రంథ రచన మీద దృష్టి పెట్టమని సలహా యిస్తే అవధానాలు మాని వేశారు.
ఆయనే ప్రసాదరాయ కులపతిగా ప్రసిద్ధులైన పోతరాజు వెంకట లక్ష్మీవరప్రసాదరావు. భావి కుర్తాళ పీఠాధిపతి. వీరు 1961 లో పొత్తూరి వేంకటేశ్వర రావు, కృష్ణ భిక్షు (ఓరుగంటి వెంకట కృష్ణయ్య), మిన్నికంటి గురునాథ శర్మ, విద్యాసాగర శర్మ వంటి మిత్రులతో కలసి అమ్మను చూడాలని జిల్లెళ్ళమూడి వెళ్లారు. మొదటిసారి అమ్మ దర్శనమయింది. భోజనాలకు పిలిచారు, అందరూ రెండు వరసల్లో కూర్చున్నారు. అంతమందిలోనూ అమ్మ కులపతి గారి వద్దకు వచ్చి అన్నం కలిపి ముద్దలు నోటికి అందించింది. ఆ సంఘటనతో అమ్మ ప్రేమ వాత్సల్యం మనసుకి హత్తుకు పోయింది. ఆ దివ్య దర్శనానుభూతికి లోనై అమరీ త్రిశతి అని 300 శ్లోకాలు రాశారు. ఆ తరువాత ఆంధ్రీ సప్తశతి పేరున 700 పద్యాలు రాశారు. ఈ రెండూ కలిపి ‘అంబికా సాహస్ర’ పేరుతో వెలువరించారు.
1962 సంక్రాంతి రోజున అంబికాసాహస్ర ఆవిష్కరణ అమ్మ సమక్షంలో జరిగింది. దీనితో పాటు మి.గురునాథశర్మ గారి ‘అమ్మ’, వాడరేవు సుబ్బారావు గారి ‘మాతృశ్రీ అనసూయా దేవి’ గ్రంథాల ఆవిష్కరణ కూడా జరిగింది.
ఆ రోజుల్లో అంటే సాధన ప్రారంభ దినాల్లో మంత్ర జప దీక్షలు, రోజుకి 15- 16 గంటలు జపం చెయ్యటం దీని వల్ల మంత్ర అధిష్ఠానదేవత దర్శనాలు అవుతూ ఉండేవి. అమ్మ కూడా స్వప్నం లోనో ధ్యానంలోనో కనపడుతూ ఉండేది. ఒక దర్శన సందర్భంలో శాక్తేయమైన ఒక మంత్రం ఉపదేశించింది. మొత్తం మీద అమ్మ ఒక దివ్య శక్తి, మహనీయ వ్యక్తి అని విశ్వాసం కలిగి, అది అంబికాసాహస్ర రచనకు ప్రాతిపదిక అయింది. కులపతి గారికి ముందునుంచీ సాధనా మార్గంలో గడపాలని ఉండేది. అందుకు వివాహం అడ్డంకి కాగలదనే ఆలోచనలో ఉండేవారు. అమ్మ గృహిణిగా ఉంటూనే పలువురకు మార్గదర్శనం చేస్తూ ఉండటం, కర్తృత్వ రాహిత్యస్థితిలో ఉండటం చూసి, గృహస్థ జీవితం సాధనకు ప్రతి బంధకం కాదని గ్రహించి ప్రేరణ పొందేరు.
“భృగు మహర్షి వలె వీర తపస్వులై విరాజిల్లిన” వారూ, “మహనీయతర సిద్ధమంత్ర విద్యా ప్రభుత వెలిగిన” వారూ అయిన పోతరాజు వంశజులు వీరు. ప్రకాశం జిల్లా ఏల్చూరు స్వగ్రామం. కొప్పరపు వారి ఆడపడుచు స్వరాజ్యలక్ష్మి, పురుషోత్తమరావు జననీ జనకులు. 1937 జనవరి 23 ఏల్చూరులో జననం. గుంటూరు హిందూ కాలేజ్లో బి.ఏ. వరకు విద్యాభ్యాసం, తదుపరి తిరుపతి వేంకటేశ్వరా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ., మరియు పి.హెచ్.డి. పట్టాలు సాధించారు. 1964 లో వావిలాల అద్వైత పరబ్రహ్మ శాస్త్రి గారి కుమార్తె దుర్గా త్రిపుర సుందరీదేవితో వివాహం. ఒక కుమార్తె ఇద్దరు కుమారులు కలిగారు. 1956 లో హిందూ కాలేజీలో ఉద్యోగం ప్రారంభించి 1998 లో పదవీ విరమణ చేశారు.
కర్నూలు జిల్లా రామాపురంలో పసుమాముల సుబ్బరాయ శాస్త్రి గారనే మహెూపాసకుల వద్ద దత్తాత్రేయ, నాగాస్తాది మంత్రోపదేశాలు పొందేరు. శాస్త్రి గారు వీరిచే ఎన్నో మంత్ర సాధనలు చేయించారు. ముఖ్యంగా నాగమంత్రం అద్భుతంగా సిద్ధించిందని చెప్పేరు. సాధనా క్రమంలో నాగజాతితో, నాగదేవతలతో వేల సంవత్సరాలుగా ఉన్న అనుబంధాలు అనుభూతమైనట్లు చెప్పుకున్నారు. 5 వేల ఏళ్ల క్రితం సిద్ధనాగుడు అనే పేరుతో మానవ-నాగ ద్విరూప ధారణ శక్తి గల నాగజాతి పురుషునిగా ఉండేవాడిని అని బృందావన యోగులు అనే గ్రంథంలో తెలిపేరు. 2004 లో శ్రీలంక గాయత్రి పీఠాధిపతి స్వామి మురుగేష్ గారి ఆహ్వానం పై శ్రీలంక వెళ్లి వారి ఆశ్రమంలో విష్ణు దేవతా ప్రతిష్ఠ చేశారు. అక్కడ నాగమంత్రం చదువుతూ ఉంటే ఆశ్రమం ప్రక్క నదిలోంచి ఎన్నో పాములు వచ్చి కాసేపు ఉండి వెనుదిరిగి పోయాయని తెలియచేశారు. అమ్మ జీవితంలో చిన్ననాటి నుంచీ “నాగా”నుబంధం విస్తృతంగా ఉండటం, అమ్మ ఆదరణకు పాత్రుడైన అనుంగు బిడ్డ కులపతి గారు నాగ దేవతలతో అనుబంధం కలిగి ఉండటం కేవలం యాదృచ్చికం అనలేం. జననాంతర సౌహృద మేదో ఉండి ఉండవచ్చు.
దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనం దైవతం అని అనేక మంత్ర జపాలు లక్షల కోట్ల సంఖ్యలో చేసిన తీవ్ర సాధకులు. హఠయోగ, రాజయోగ, మంత్ర యోగాలలో విశేష కృషి సలిపేరు. కావ్యకంఠ గణపతి ముని రచనా ప్రభావం, సాధనా ప్రభావం వీరిపై ఎంతగానో ఉన్నది. రసయోగి రాధికా ప్రసాద్ మహారాజ్ వారి (రాళ్లబండి వీరభద్రరావు) స్నేహంతో రాధాసాధనపై మనసు మళ్ళింది. ఆ సాధనా క్రమంలో రాధాదేవి సాక్షాత్కరించి “రాధా అష్టాక్షరీ ” మంత్రాన్ని స్వయంగా ఉపదేశించింది. కాళీ – భైరవ – రాధా దేవతా త్రయ సాధనలో నిష్ణాతులయ్యారు. అద్భుతమైన సిద్ధ శక్తులు సాధించి వేలాది మందికి వారివారి సమస్యల పరిష్కారానికి తగిన సాధనా మార్గాలు చెపుతూ, మంత్రోపదేశం చేస్తూ, ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా అభీష్ట ప్రాప్తి కలుగుతుందని నిరూపణ చేస్తున్నారు. కర్మను అనుభవించక తప్పదు, ఏం చెయ్యగలం అని నిరాశ చెంద పనిలేదు. మంత్రానుష్ఠానం వల్ల కర్మఫల తీవ్రత తగ్గించవచ్చు, కర్మను జయించవచ్చు అని అనేక మంది జీవితాల్లో నిరూపించారు.
వివాహ పూర్వమే సన్యసించాలన్న నిర్ణయాని కొచ్చారు. అవివాహితుడైతే తలిదండ్రుల అనుమతి, గృహస్థుడైతే భార్య అనుమతి సన్యాస స్వీకారానికి తప్పనిసరి అని శాస్త్ర వచనం. ఇంటికి పెద్ద కొడుకు సన్యసిస్తే ఎలా? అని తలిదండ్రులు అంగీకరించ లేదు. పైగా జిల్లెళ్ళమూడి వెళ్లి “మా జ్యేష్ఠ పుత్రుడు సన్యసిస్తానంటున్నాడు, మాకు సుతరామూ ఇష్టం లేదు. నీకు భక్తుడు కదా, ఎలాగైనా నచ్చ చెప్పమ్మా” అని అమ్మను ప్రార్థించారు. “మీరెందుకు దిగులు పడతారు, ఆ అవసరం లేదు. ఎప్పుడేది జరగాలో అప్పుడది జరుగుతుంది” అని అభయ మిచ్చింది అమ్మ. ఇక్కడ గమనించవలసినదేమంటే సన్యసించడు అని గాని, సన్యాస యోగం లేదని గాని అనలేదు. భవిష్యత్ లో కులపతి గారు మౌనస్వామి పీఠానికి వెళ్లక తప్పదనే సంకల్పమేదో అమ్మకు ఉన్నదేమో అనిపిస్తుంది.
తదనంతర కాలంలో వివాహితుడై, గృహస్థాశ్రమ బాధ్యతలు పూర్తి చేసుకుని, అర్థాంగి అనుమతితో 2002 లో శ్రీ శివచిదానంద భారతీస్వామివారి వద్ద సన్యాస దీక్ష తీసుకున్నారు, సిద్ధేశ్వరానంద భారతీస్వామి అన్న దీక్షా నామంతో. అయితే కుర్తాళ పీఠబాధ్యతలు వద్దు, బృందావనం వెళ్లి, అక్కడ తపస్సు చేసుకుంటూ శేష జీవితం గడపాలను కుంటున్నాను అని శ్రీశివచిదానందుల వారికి విన్నవించారు. “మీరు బృందావనేశ్వరి అనుగ్రహ పాత్రులు కదా, ఈరోజు రాత్రి ఆమెతో మాట్లాడండి, తదనుసారం చెయ్య వచ్చు, ఈ మాటలు నావి కాదు, మౌనస్వామి నాచే పలికించినవి”. అని అన్నారు స్వామి. ఆ రాత్రి బృందావనేశ్వరిని ఆవాహన చేస్తే ఆ దేవత దర్శన మిచ్చి – పీఠ బాధ్యతలు స్వీకరించు, అది నా సంకల్పమే, అంగీకరించు అని ఆదేశమిచ్చింది.
“నేను అమ్మతో చర్చించే వాడిని కాదు. ఏవైనా కొన్ని సందేహాలు ప్రశ్నలు అడగటం ఆమె క్లుప్తంగా సుబోధకంగా చెప్పటం, మంచిదే నాయనా అంటూ ఉండేది. అమ్మ శరీరంతో ఉన్నప్పటి కంటే తర్వాతే సాధనల గురించి అడిగింది ఎక్కువ” అన్నారు. ఒకసారి స్వామి వారు గుంటూరులో వారి ధ్యాన మందిరంలో కూర్చుని అమ్మను ఆవాహన చేసి మాట్లాడుతున్నారు. ఇంతలో వారి తమ్ముని కుమార్తె ఆరునెలల పాప మేడ దిగి వచ్చి అమ్మకు నమస్కారం చేసింది. నువ్వెందుకొచ్చావు? అన్నారు స్వామి. నేను పూర్వజన్మలో అమ్మ భక్తురాలిని, ఇప్పుడు ఇక్కడ పుట్టేను. అమ్మ వచ్చిన సంగతి ఎలాగో తెలిసి నమస్కారం చేసుకోవాలని వచ్చాను అన్నది. ఆ పిల్ల భౌతికంగా వచ్చినట్టు కాదు, ఆమె సూక్ష్మ శరీరం (Astral body) దిగి వచ్చిందని వివరించారు. ఒకసారి నా సాధన ఎలా వెళుతూ ఉన్నది? ఇంకా తపస్సు ఎట్లా చెయ్యాలి? అని అడిగితే “నాయనా రోజూ పదిమందికి అన్నం పెట్టు”అని చెప్పింది. అన్నం పెట్టటానికీ తపస్సుకి ఏమిటి సంబంధం తపస్సంటే ధ్యానమూ, కఠోర దీక్షలు వంటివి ఉంటాయి కదా? అన్నం పెట్టమంటా వేమిటి? అంటే అలా చెయ్యి నాయనా, దానివల్ల కూడా తప్పక వస్తుంది అన్నది అమ్మ. అమ్మ మాట శిరోధార్యంగా కుర్తాళపీఠంలో ఆశ్రమాలలో వీలైనంత ఎక్కువగా అన్నదానం చెయ్యటం జరిపిస్తున్నారు స్వామి.
ఆర్ష సంస్కృతీ సంప్రదాయాలకు ఋషులు మహత్వానికి ఆధునిక యుగంలో నిలువుటద్దమైన నిలచిన, ఆదర్శ యతీశ్వరులు.
ఇప్పటికీ అమ్మను ఆత్మావాహన విద్య ద్వారా దర్శించుకుంటూ జిల్లెళ్ళమూడితో అనుబంధాన్ని
కొనసాగిస్తున్న యతి శ్రేష్ఠులు శ్రీసిద్ధేశ్వరానంద భారతీ స్వామి.
(సశేషం)