విశ్వయోగి విశ్వంజీ మహారాజ్
1962 లో శ్రీప్రసాదరాయ కులపతి గారు, విద్యాసాగర శర్మ గారు ఇంకా కొందరు సాహితీ వేత్తలు అమ్మ దర్శనార్థం బయలు దేరారు. వారితో యోగ సాధకుడు ఒకాయన కూడా వెళ్లారు. ప్రణామాలు పలకరింపులు అయ్యాక మామూలుగా అమ్మ అన్నం పెట్టే కార్యక్రమం మొదలయింది.
అమ్మ ఈ యోగి శిరసు నుంచి వెన్నుపూస అంతా నిమిరి, అన్నం కలిపి మూడు ముద్దలు “ఆప్యాయంగా తినిపించింది. ఆ సంఘటన ఎప్పటికీ మరచి పోలేని అమృతమయమైన ఘటనగా, ఆ ఘడియలు అమృతమయమైన ఘడియలుగా నిలిచి పోయాయి ఆ యోగి జీవితంలో! విశ్వజనని అమ్మ ఇచ్ఛాశక్తి, జ్ఞాన శక్తి, క్రియా శక్తులను శరీరంలోకి ప్రవహింప చేసి త్రిగ్రంథుల విచ్ఛేదనానికి బీజం వేసింది. “హృదయంలో హృద్గ్రంధి, బ్రెయిన్లో జ్ఞానశక్తి, వెన్నుపూసలో రుద్రగ్రంథి ఈ మూడిటి విచ్ఛేదనానికి దోహదం చేసిన శుభ ముహూర్తం అది. దివ్య ప్రేరణతో నా శరీరంలోకి అమ్మ శరీరం నుండి వచ్చిన శక్తి ప్రవేశించినది” అని చెప్పుకున్నాడా యోగి వర్యుడు.
‘సర్వసమానం’ అనే మాటని నేడు రాజకీయంగా సాంఘికంగా నాయకులు చెపుతున్న దాన్ని ఆచరణలో పెట్టి, ఒక ఆదర్శ ప్రాయమైన సందేశాన్ని అందించిన దివ్య ప్రేమమూర్తి అమ్మ- అని వీరి విశ్లేషణ. అమ్మ స్ఫూర్తిని అమ్మ సందేశాన్ని ఆ ప్రణాళికను మనం అర్థం చేసుకుని ఐక్యంగా ముందుకు సాగి అమ్మ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా, జిల్లెళ్ళమూడి ఒక అంతర్జాతీయ ప్రఖ్యాతి చెందిన పుణ్యస్థలిగా మార్చుకోవలసిన బాధ్యత మనందరి మీదా ఉన్నదని పలుమార్లు చెపుతూ ఉంటారు. ఈ సందేశాన్ని తాను వెళ్లిన ప్రతి చోటా దేశవిదేశాల్లోనూ చెపుతూ ఉంటారు. మేమూ అమ్మ భక్తులమే, అమ్మ మాకు స్ఫూర్తి అని ఆత్మీయంగా అంటారు. వారే విశ్వయోగిగా ప్రసిద్ధి చెందిన విశ్వయోగి విశ్వంజీ.
వీరు 1944 సంవత్సరంలో మార్చి 5న గుంటూరులో శ్రీ గుర్రప్పడియ ఆంజనేయులు, వరలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. శ్రీ వత్సస గోత్రం, వాజసనేయ శాఖ. గుంటూరు జిల్లా చమళ్ళమూడి స్వగ్రామం. అత్యంత నిష్టాగరిష్ఠులైన ఆధ్యాత్మిక వేత్త తండ్రిగారు. వీరికి పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ దేవకీనందన స్వామివారు దత్తాత్రేయ రూపాన దర్శన మిచ్చి తారక మంత్రోపదేశం చేశారు. సాహిత్యానురక్తి ఉన్న కవిగా కూడా ప్రసిద్ధులు. ఒక సందర్భంలో కొన్ని రోజులు వారణాసిలో ఉండవలసి వచ్చింది. ఒకనాటి రాత్రి ఆయనకు జ్యోతిర్లింగ రూపంలో ఉన్న విశ్వనాథుని విగ్రహం నుండి కాంతిపుంజం వెలువడటం కనపడింది. అదే సమయానికి గుంటూరులో ఉన్న భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది . ఆ పిల్లవానికి విశ్వనాథ శాస్త్రి అని పేరు పెట్టుకున్నారు. చిన్నతనాన అందరూ విశ్వం అని పిలిచే వారు.
విశ్వం ఆంగ్లము గణితము అంశాలతో బి.ఏ. డిగ్రీ చదివారు. అనంతరం బి.ఎడ్ లో కూడా ఉత్తీర్ణులై, ఉపాధ్యాయవృత్తిలో ప్రవేశించారు. ఆనతికాలంలోనే గణిత ఆంగ్లబోధనలో మంచి ఉపాధ్యాయునిగా పేరు గడించి, ఇటు విద్యార్థుల అటు అధికారుల మన్ననలు పొందేరు. 1965 లో శ్రీ దత్తాత్రేయ వాడేకర్ మహారాజ్ వద్ద మంత్రోపదేశం పొందేరు. రామకృష్ణ పరమహంస తన శక్తిని వివేకానందునికి ధారపోసినట్లు, వాడేకర్ మహారాజ్ వారు మంత్రోపదేశంతో పాటూ ఎన్నో నిగూఢ శక్తులను విశ్వంజీ వారికి అనుగ్రహించారు. నాటి నుండి 21 సం. ల పాటు బ్రహ్మచర్య, శరీరశోషణాది ప్రక్రియలకు లోబడి తీవ్ర తపస్సు చేశారు. తద్వారా అంతశ్చేతన జాగృతి కలిగి సిద్ధత్వాన్ని పొందేరు. నాటి నుండి “విశ్వయోగి” అయినారు. కంచి పరమాచార్యుల వారు విశ్వంజీ సాధించిన ఆధ్యాత్మిక శక్తులకు అబ్బురపడి, ఆనందించి, అభినందించి ఒక పెద్ద రుద్రాక్ష మాలను బహూకరించారు.
1988 నవంబర్లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. నాటి నుండి సంపూర్ణంగా సమాజ సేవకు అంకితమైన జీవితం ప్రారంభమయ్యింది. ఏకాంత వాసంలో తన తపస్సాధనలో తానుండుట కాక సాటి మానవునికి సహాయపడాలన్న గొప్ప కార్యక్రమం ప్రారంభించారు. అది కూడా గుంటూరు రైలుపేటలో చిన్న అద్దె గది నుంచి అది అంచలంచెలుగా వృద్ధి చెంది గుంటూరు సమీప విశ్వనగరంలో పెద్ద ఆశ్రమముగా అందులో ప్రధాన భాగమైన ‘విశ్వమందిరం’గా రూపు దిద్దుకున్నది. “శరీరమే దేవాలయం, హృదయమే అర్చనా పీఠం.” అన్న మాట విశ్వమందిరానికి ఆదర్శవాక్యం.
సంఘంలో కుటుంబమే మౌలిక విభాగం. మాతా శిశువులు కుటుంబ వ్యవస్థలో వెన్నెముక వంటి వారు. వారి సంరక్షణ పట్ల శ్రద్ధ, గౌరవాదరణలు చూపితే సుస్థిర ఆరోగ్యకర సమాజ స్థాపన జరుగుతుంది అన్న సంకల్పంతో మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి 2008 ఏప్రిల్లో ప్రారంభించారు.
శ్రీ అబ్దుల్ కలాం గారి కరకమలములతో ప్రారంభం జరిగింది.
విశ్వమానవ సౌభ్రాత్రం కాంక్షించారు. “ప్రపంచమంతా ఒకే కుటుంబం. సర్వ సృష్టి లోనూ దైవత్వం ఉంది. అదే భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించటం. ఒకే కులం ఉంది. అది మానవ కులం. ఒకే భాష ఉంది అది హృదయ భాష. ఒకే మతం ఉంది అది ప్రేమ మతం.
ఆహారం, బట్ట, విద్య, ఆరోగ్యం, ఇల్లు ఈ అయిదు అత్యవసరాలని అమ్మ గ్రహించి, వీటి కోసం ఒక ప్రణాళిక ఏర్పరచుకున్నది. సర్వం ఇచ్చే భగవంతునికి నువ్వు ఇవ్వ వలసిన పనేమిటి? ఆయనకు ఇస్తున్నా అనుకుని ఆయన సంతాన మైన సమాజానికి ఇవ్వాలి” – విశ్వంజీ గారి ఇటువంటి ఆలోచనా సరళి అమ్మ తాత్వికతకు, మాటలకు అతి దగ్గరగా కనిపిస్తుంది.
విశ్వ మానవ కళ్యాణం కోసం భారత దేశం వేల సంవత్సరాలుగా పాటుపడుతున్నది. సనాతన ధర్మం గతంలో విశ్వవ్యాప్తంగా వెలుగొందింది. అన్ని దేశాలను ఒకే తాటి పైకి తెచ్చి విశ్వశాంతికి మార్గదర్శనం చెయ్య గలిగినది భారతదేశం ఒక్కటే అని వీరి విశ్వాసం. ఈ లక్ష్య సాధనకు యోగులు ఋషులు దైవాంశ సంభూతులు పాటుపడుతున్నారు. భూమి, నీరు, ఆకాశం, అగ్ని, వాయువు అనే పంచభూతాల పరిరక్షణ బాధ్యత ప్రపంచ దేశాలన్నిటి పైనా ఉంది అని హెచ్చరిస్తారు. పంచభూతాలతో కూడుకున్న మన దేహాన్ని శుచిగా శుద్ధిగా ఉంచుకోవాలి. మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూర, అనాహత, విశుద్ధి అనేవి మన దేహంలో పంచభూతాలకు కేంద్రాలు.
“తనలో తనని, అందరిలో తననే చూసుకొంటూ తాను తప్ప ఇతర మేమీ లేదన్న మానసిక స్థితి అత్యున్నత యోగ సిద్ధికి తార్కాణం. ఏ మతమూ వద్దన లేదు. మతం కన్న మానవత్వం గొప్పదని చెప్పటం కాక ఆచరణ లో చూపింది అమ్మ. అమ్మ మార్గం ప్రేమ పూరిత వాత్సల్య మార్గం. హద్దులు లేని అనిర్వచనీయ వాత్సల్యఝరి అమ్మ . కమనీయ పుణ్యస్థలి అమ్మ ఒడి. అమ్మ తత్వమే నాకు స్ఫూర్తి. ఎడ్యు కేట్ చెయ్యటమే అమ్మ విధానం, ప్రతిదీ దైవ సంకల్పమే అన్న అమ్మ మాటలో పొల్లు ఏమీ లేదు” – అనే వీరు శరీరమనే దేవాలయానికి అర్చన అన్నం ద్వారా జరుగుతున్నది. జిల్లెళ్ళమూడిలో అంటారు. తన ఆశయాలు అన్నం ద్వారా రక్తం లోకి, రక్తం నుండి ఆలోచనలోకి, ఆలోచన నుండి ఆచరణలోకి, ఆచరణ ద్వారా ఫల ప్రాప్తి – ఇదీ అమ్మ భోజన ప్రణాళిక అని వీరి నిశ్ఛతాభిప్రాయం.
అమ్మ దేహం చాలించిన తర్వాత కూడా అందరింటి సోదరులకు పలు సందర్భాలలో సలహా సంప్రదింపులు అందించి అమ్మ సేవ కొనసాగిస్తూ ఆదర్శంగా నిలిచినవారు శ్రీవిశ్వంజీ.
(సశేషం)