1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మ జీవితంలో యోగులు -6

అమ్మ జీవితంలో యోగులు -6

Prasad Varma Kamarushi
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : June
Issue Number : 11
Year : 2022

(గత సంచిక తరువాయి)

  • ప్రసాదవర్మ కామఋషి

లోకజనని సన్నిధిలో లోకబంధువు

అది గోదావరి తీరం. స్నాన మాచరించటానికి వచ్చిన భక్తులతో కోలాహలంగా ఉంది. అందులో పదహారు పదిహేడు సంవత్సరాల యువకుడొకరు స్నానమాచరిస్తున్నాడు. ఉత్తర భారతం నుంచి వచ్చిన యోగి ఒక యువకుణ్ణి పిలిచి కొన్ని ఉపదేశాలు, మంత్రాలు పద్ధతులు బోధించాడు. ఇదంతా నాకే ఎందుకు చెపుతున్నారు? అని అడిగితే నీ ద్వారా దేశానికి కొంత మేలు జరగ వలసి ఉన్నది. దీన్ని శ్రమ అనుకోక, దేశోద్ధరణకు నీవు చేయవలసిన పని అని చెప్పి వెళ్ళిపోయాడా యోగి. ఆ యువకునకు అనతి కాలంలోనే మంత్ర సిద్ధి కలిగింది. వారే సద్గురు శివానంద మూర్తి గారు.

పరమేశ్వరుడే ఉర్లాం సంస్థానంలో శివాంశగా అవతరించాడు. కలియుగంలో పరమాత్మ గురువుగా వస్తాడు కానీ, దేవుడుగా కాదు అన్న పెద్దల మాట ఇచట స్మరించ దగినది. జగమెరిగిన బ్రహ్మ జ్ఞాని, ముద్దకట్టిన మహా మనీషి, అవ్యాజమైన దైవ భక్తి, అపారమైన దేశ భక్తి, అంతరంగాన అనంత కరుణ, నిరాడంబరతకు నిలువెత్తు రూపం అదీ పూజ్య శివశ్రీ సద్గురు శివానంద మూర్తి అంటే. వారు శాస్త్ర వేత్త, సాహితీ వేత్త, తత్త్వవేత్త, సాధనా సంపన్నులైన మంత్ర వేత్త. అన్నిటి కన్న మిన్నగా మానవతా వాది.

శ్రీ కాకుళం జిల్లా లోని ప్రసిద్ధ సంస్థానం ఉర్లాం. నాటి మద్రాస్ ప్రసిడెన్సీ లో భాగ్యవంతమైన జమీందారీ అది. దానధర్మాలకు, కవి పండిత పోషణకు పేరుగాంచినది. దానికి వీరే ఆఖరి వారసులు. ఈ గ్రామ వాస్తవ్యులైన వీరబసవ రాజు, సర్వ మంగళ పుణ్య దంపతులకు 1928 డిసెంబరు 21 న రాజమహేంద్రిలో జన్మించారు శివానందులు. తలిదండ్రులు వీరికి సార్థకమైన పేరు పెట్టేరనిపిస్తుంది. వారిలో శివత్వమూ ఆనందమూ మూర్తీభవించి ఉన్నాయి. బసవరాజు గారికి దాయాదులతో ఆస్థి వివాదాలు తలెత్తాయి. ఈ తగాదాలు లండన్ ప్రీవీ కౌన్సిల్ వరకు వెళ్లాయి. చివరకు ఈ వివాదాలకు స్వస్తి పలికి కొవ్వూరు ఆంధ్ర గీర్వాణ నిర్వహణలో స్థిర పడ్డారు. శివానందుల వారు బెజవాడ SRR & CRR కళాశాల, విజయనగరం మహారాజా కళాశాలల్లో చదువుకొని బి.ఎస్.సి డిగ్రీ పూర్తి చేశారు. ఉపనయన సంస్కారానంతరం శాంభవ దీక్ష గైకొని శివ మంత్రానుష్ఠానం చేస్తూనే ఆంగ్ల విద్య కొనసాగించారు. శ్రీమతి గంగాదేవితో వివాహం జరిగింది. జామీన్దారీ వారసత్వం వద్దనుకుని, స్వతంత్ర జీవితం గడపాలన్న తీవ్రఇఛ్చతో ఇంట్లో కేవలం 100 రూ. మాత్రం తీసుకుని బయలు దేరారు. వరంగల్ చేరుకొని పోలీస్ శాఖలో చిన్న ఉద్యోగంలో చేరి 30 సం. లు పనిచేశారు. Secretary to DGP, personnel & planning విభాగంలో ముఖ్యమైన విధులు నిర్వర్తిస్తున్నపుడే స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అప్పటికి ఇంకా 5 సం.ల ఉద్యోగకాలం ఉంది. వీరికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు కలిగారు. ఉద్యోగ విరమణ తర్వాత భార్య గంగాదేవి దివంగతు లయ్యారు. అంతకు పూర్వమే విశాఖపట్టణ సమీప భీమునిపట్నంలో కొన్న మామిడి తోటలో చిన్న యిల్లు నిర్మించుకుని ప్రశాంత జీవనం సాగించాలని వెళ్లిపోయారు. పదవీ విరమణ అనంతరం ధార్మిక సాంస్కృతిక ఆధ్యాత్మిక సామాజిక సేవా రంగాలలో విస్తృత సేవలందించాలని సంకల్పించారు.

వారు 1975 లోనే అమ్మను దర్శించా లనుకుని ప్రయాణానికి అంతా సిద్ధం చేసుకున్నారు. కానీ ఉద్యోగ రీత్యా ఎదో అర్జంట్ పనిపడి వెళ్లలేక పోయారు. శ్రీమతి గంగాదేవిని పంపించారు. ఆమె జిల్లెళ్ళమూడి వచ్చి ఒకరోజు ఉన్నారు. కాల చక్రంలో 30 ఏళ్ళు గడచి పోయాయి. అమ్మ దేహ త్యాగం చేసిన జ్యేష్ఠ బ. దశమి రోజున 2005 జూన్ లో వచ్చి అనంతోత్సవాలలో పాల్గొన్నారు. మనం అనుకున్న ప్రకారం జరగటం కాక దైవేచ్ఛ ప్రకారమే జరుగుతాయి. 30 యేళ్లు ఆలస్యంగా రా గలిగే ను. ఈ రోజు రావాలన్నది బహుశా అమ్మ సంకల్పం కావచ్చు, అమ్మ వెళ్లిపోయిన పన్నెండు పదమూడు గంటల తర్వాత నా ధర్మపత్ని గంగ కూడా వెళ్ళిపోయింది అన్నారు. అమ్మ సిద్ధి పొందిన పుణ్య తిథి నాడు ఈ క్షేత్ర దర్శనంతో నాకు మరింత శ్రద్ధ, ఆసక్తి, శాంతి కలిగేయి అని చెప్పుకున్నారు.

అమ్మ గురించి : ‘అమ్మ కాళీ స్వరూపం, కాల స్వరూపం కూడా. కాళిక, కాలాలకు అభేదం చెప్పబడింది. శాస్త్రంలో. కాళీ అంశలో ఒక లక్షణం ఉన్నది. జీవులను తనలో విలీనం చేసుకోవడం. అదే వాళ్లకి ముక్తి హేతువు. శుద్ధ చైతన్య స్వరూపిణి అయిన పరా శక్తియే తల్లిగా మన దగ్గరకు వచ్చింది. అదీ తనంతట తాను వచ్చింది గాని – కర్మ వశాత్తూ పుట్టిన జీవి కాదు. నన్ను తల్లిగా చూడండిరా, మీకు ఇంకేమీ అవసరం లేదు. అమ్మా అమ్మా అని పిలవండి మీకు ఏది ముఖ్యమో అది ఇస్తాను అని మౌనంగా చెప్పింది. ఇతః పూర్వం అమ్మ వంటి వ్యక్తి ఎక్కడా వచ్చినట్టు రికార్డ్ లేదు. అపూర్వమైన స్థితి ఆమెది. అనుగ్రహించమని అమ్మను వేడుకో. శ్రీ మాత్రే నమః అదే మహా మంత్రం’ అంటారు.

అమ్మ పెట్టే గుప్పెడన్నంలో ఒకొక్క మెతుకు ఒకొక్క జన్మకు సరిపోతుంది. జన్మ పరంపర హ్రస్వ మైపోతుంది. ఆ జన్మలిక ఉండవు. అని అమ్మ చేతి ముద్దకు వీరి వ్యాఖ్యానం. తను ఎవరో ఏ రూపమో ఏ దేవతో చెప్పకుండా కేవలం ‘అమ్మ’ ను అని చెప్పింది. తన దగ్గరకు తీసుకోడానికి వచ్చిన అమ్మ ఆమె. ఇక్కడకు అమ్మ దగ్గరకు వచ్చిన వారందరూ ధన్యులు. అమ్మ మరలా వస్తుందా? ఎప్పుడు వస్తుంది? అంటే జవాబు- అసలు వెళితే కదా రావటానికి. అంతటా వ్యాపించిన తర్వాత నిష్క్రమణ అనేది లేదు. జీవుడిలో ఉండే సంస్కారాలను పూర్తిగా తీసేసుకుంటుంది అమ్మ. సంస్కారములు పోయిన తర్వాత ఉత్తర జన్మకు కారణమే లేదు! అమ్మను ధ్యానించడం చేత మనకు ఆ స్థితి వస్తుంది. ఈ క్షేత్రం ‘లయ’ స్థానం. భావమే బంధన మవుతుంది. ఇక్కడున్నాను కాబట్టీ నా ప్రయాణం అయిపోయింది అనుకున్న వాడు ముక్తుడు.

అమ్మ కోటిమందికి దర్శనమివ్వాలన్న వాత్సల్య యాత్రలో వరంగల్ వచ్చినపుడు శివానందుల వారి యింటికి వెళ్లింది. ఎంతో చనువుగా వారి ఇల్లంతా కలయ తిరిగింది. వారి భార్య గంగాదేవి తో ‘అమ్మా “అతను నీ భర్త అనేది ఒక పాత్ర. నిజానికి అతను ‘లోకబంధువు అలా పిలవండి” అన్నది. గురువుగారు పాలు పళ్ళు అమ్మకు నివేదించి, ఏదో ఒకటైనా తీసుకొండి అన్నారు. అమ్మ వాటిని తాకి “ఒకటేమిటి ? అంతా తీసుకుంటాను” అన్నది. ఆ మాటల అంతరార్థం ఆ తల్లీ బిడ్డలకే తెలియాలి.

తర్వాత అమ్మ అనారోగ్యం వల్ల శ్రీరాజగోపాలాచారి గారింటికి వచ్చినపుడు శివానంద దంపతులిద్దరూ వచ్చారు. అమ్మ వారి చెయ్యి పట్టుకుంది. వారు అమ్మ నాడి చూసి, ఆరోగ్యం ఎలా ఉందమ్మా అని కుశలమడిగారు. అమ్మ నవ్వి ఊరుకుంది. వారు అమ్మతో – ‘ఒక ప్రార్థన’ – మీరుండాలి, ఎంతకాలం వీలవుతుందో? ఎంత శ్రమ అయినా, ఈ శరీరంలో ఉండటం ఎంత బాధాకరమైనా, లోకం పట్ల మీకుండేటటు వంటి దయ ముందు మీ బాధ అంత గొప్పది కాదు. వీలైనంత కాలం ఉండాలి’ అన్నారు. అమ్మ పక్కన ఉన్న డాక్టర్ని చూపిస్తూ వీళ్ళు ఎదో చేస్తున్నారు, నన్ను కాపాడ గలరా ఎవరైనా? నేనుండా లనుకుంటే ఉంటాను, వెళ్లాలనుకుంటే వెళ్ళిపోతాను అని, “నాన్నా నేను కొంత కాలం ఉండాలంటున్నావు, ఉంటే అపసవ్యా లేవైనా జరిగితే ఫర్వాలేదా?” అని అడిగింది. వెంటనే శివానందుల వారు ‘అమ్మా నీకు సవ్యం లేదు అపసవ్యం లేదు, ఎవరి ముందువెనుకలు ఎక్కడ జరిగినా నీ దగ్గరికే వస్తారు, ఇంకొక చోటుకి పోరు, కాబట్టీ ఉండండి’ అని వివరణ ఇచ్చారు.

ఆ తర్వాత వారు కళాశాల హాస్టల్ పునాదులు వేసిన సందర్భంలోను, భవన ప్రారంభోత్సవానికి రెండుసార్లు జిల్లెళ్ళమూడి వచ్చారు. అప్పటివరకు అమ్మకు జరుగుతూ ఉన్న నిత్య జలాభిషేకం బదులు అన్నాభిషేకం చెయ్యండి, మీరు వెనుదిరిగి చూడవలసిన పని ఉండదు అని చెప్పేరు. నాటి నుండీ తదాచరణ జరుగుతూ ఉన్నది. శ్రీ రావూరి ప్రసాద్ గారు ‘అమ్మతో అనుభవాలు’ ప్రాజెక్ట్ లో భాగంగా శివానందుల వారిని ఇంటర్ వ్యూ చేయటానికి 2014 లో వారి ఆశ్రమానికి వెళితే, వారు తీవ్ర అస్వస్థతో ఉన్నారని, 5నిముషాల పాటు దర్శనం మాత్రం చేసుకోవచ్చునని అన్నారు. కనీసం వారి రూపాన్నయినా చిత్రీకరిద్దామని వారి దర్శనం చేసుకొంటే- అంత నీరస స్థితిలోనూ అమ్మ యెడల గల అవ్యాజ ఆత్మాను బంధంతో పది నిముషాలు, అమ్మ వారింటికొచ్చిన జ్ఞాపకాలు, అమ్మ యొక్క జగన్మాతృ తత్త్వం గురించి, అన్న వితరణ కొనసాగించమని ఆత్మీయంగా మాట్లాడి, అమ్మ పట్ల గల భక్తి ప్రపత్తులు తెలియచేసారు.

మిరకిల్స్ : తన మహత్తు ఇతరుల కంట పడకుండా మరుగు పరచి సాదాసీదా గృహస్తుగా జీవితం గడిపిన పురుషార్థ సాధకులు వారు. సద్గురువుల అనుగ్రహం వల్ల కష్టాలనుంచి గట్టెక్కిన వారిలో ప్రధానమంత్రి పి. వి. నరసింహారావు నుంచి అతి సాధారణుల వరకు అందరూ అన్ని స్థాయిల వారూ ఉండేవారు. ఎవరికేది అవసరమైతే అది గురువుల ఆశీస్సులతో లభించేది. ఇంత విభూతో తీర్థమో ఇచ్చేవారు. నేను మిరకిల్స్ ఏమీ చేయ లేదు. అవి జరిగాయి. నేను ఈశ్వరుని ప్రార్థించాను. ఆయన కోరినవి యిచ్చాడు. మిరకిల్స్ అంటూ ఉంటే అయన చేసినవే! మనకు అర్థం కానిదాన్ని సూపర్ నేచురల్ అంటాం. మన చుట్టూ అనేక మిరకిల్స్ రోజూ జరుగుతూ ఉంటాయి. మనకవి అలవాటయి పోయిన కారణంగా సహజంగా అనిపిస్తాయి. సూర్యోదయం, అస్తమయం, ఋతుచక్ర గతి ఇత్యాది. ఆర్తులకు అర్థులకు సూచనలు సహాయాలు కాక హెూమియో వైద్యం ద్వారా  కూడా ఉపశమనం కలిగించే వారు. వారిని ఎందరో దర్శించు కుంటారు. ఎవరి కారణం వారిది. వారికి కలిగిన లౌకిక లాభమో, అలౌకిక అనుభవమో చెపుతూ ఉంటారు. అవన్నీ గురువుల దయ వల్ల అంటారు. “మన దారిన మనం వెళుతూ ఉంటాం. జరిగేవి జరుగుతూ ఉంటాయి. మనకు వాటితో ఏం పని?” అని అంటారు గురుదేవులు. అది వారి సహజ స్వభావం.

అమ్మ భావజాలంతో సారూప్యత: ఆయుష్షు, జ్ఞానం యోగం, తపశ్శక్తి వంటి వన్నీ అల్పంగా ఉన్న అల్పజీవులం, కాలానుగుణమైన మన అశక్తతకు సరిపడే ఒక మార్గాన్ని సూచించటం ఈశ్వర సంకల్పం. ఎంత అశక్తుడైతే అంత సులభ మార్గం ఇవ్వబడుతుంది. యథాశక్తి దానం చేశానని అనవద్దు. అలా అంటే జేబులో ఉన్నదంతా ఇచ్చి వేయాలి. మరి అలా ఇవ్వడం లేదుకదా. అంచేత ‘యథాబుద్ధి’ అంటే నా బుద్ధి అంగీకరించినంత మటుకు ఇస్తున్నాను అనే భావంతో ఇవ్వాలి. లేదంటే అసత్య దోషం వస్తుంది.

అర్థించిన వారికి ఈశ్వరుడే మనవద్దకు పంపించాడని భావించి సాయం చెయ్యాలి. అతడు చెప్పే కారణాల నిర్ధారణ అనవసరం. ఆ నిజానిజాలు ఎలా ఉన్నా అతడి పేదరికం అబద్ధం కాదు కదా అని చెపుతారు. మతము, సంప్రదాయాల విషయంలో ఎంతో కాలానుగుణమైన విశాల దృక్పథం కనపరచే వారు.. ఇలా ఎన్నెన్నో విషయాల పైన, మహత్యాలు అంటూ లేవని చెప్పటం లోను వీరి భావాలు అమ్మ భావాలతో సారూప్యత కలిగి ఉండటం గమనార్హం.

రచనలు: వీరు ఆంధ్ర ఆంగ్లాలలో అనేక రచనలు చేశారు. అందులో ముఖ్యమైనవి – శ్రీ కృష్ణ, త్రైలింగ స్వామి చరిత్ర, భీష్మ బోధ అని విష్ణుసహస్ర నామాలపై వ్యాఖ్య, మార్గదర్శకులు మహర్షులు 42 మంది మహర్షుల గురించి వ్యాసాలూ, కర్మయోగి, “కఠయోగ”” కఠోపనిషత్ గురించి, శివానంద లహరి వ్యాసాలూ, మనకథ పేరుతొ ఆంధ్రుల చరిత్ర, ఇది దూరదర్శన్ లో ప్రసారమైంది., అనంత కాలచక్రం (టీటీడీ వారి టీవీ లో ధారావాహిక ) గౌతమ బుద్ధ ( దీన్ని స్క్రిప్ట్ గా మలచి తెలుగు హిందీలలో సినిమా గా వచ్చింది), సువర్ణ భూమి అని ఇండోనేషియా పైన, Educational system అని విద్యావిధానాల పైన ఆంగ్లంలో రచనలు చేశారు. సమకాలీన సాహిత్య ప్రపంచంలో సాంస్కృతిక వైదిక వాఙ్మయాలపై ఆయన చేసినన్ని రచనలు చేసిన తత్త్వవేత్త గాని పీఠాధిపతి గాని మరొకరు కనిపించరు. ఆయన గ్రంథాలు సర్వేపల్లి రాధాకృష్ణ పండితుని గ్రంథాలతో పోల్చదగినవి అంటారు పొత్తూరి వెంకటేశ్వరరావు గారు.

భారతీయ విజ్ఞానం చరిత్రల పరిచయం విశ్లేషణ, మన నగరాల క్షేత్రాల చరిత్ర మున్నగు విషయాలతో “సుపథ ” మాస పత్రిక 1998లో ప్రారంభించారు. గురుదేవులు నెలకొల్పిన ‘సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్’ ప్రతి సం. వివిధ రంగాలలో కృషి చేసిన శాస్త్ర వేత్తలు, విద్యా వేత్తలు, కవిపండితులు, పరిశోధకులు వంటి వారిని అవార్డులతో సత్కరించి ప్రోత్సహిస్తున్నది. ఆంధ్రామ్యూజిక్ అకాడెమీ స్థాపించి సంగీతోత్సవాలు, వాగ్గేయ కారోత్సవాలు జరుపుతున్నారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (2005లో), గీతం యూనివర్సిటీ (2011లో) గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతి వారి మహామహోూ పాధ్యాయ, కంచి పీఠం వారి దేశికోత్తమ, వరల్డ్ టీచర్ ట్రస్ట్ వారి మాస్టర్ సి. వి.వి. అవార్డ్, రాజ్యలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు ఇలా ఎన్నో ప్రతిష్ఠాత్మక గౌరవాలు వరించాయి.

మీ జీవిత చరిత్ర రాస్తాను అనుమతివ్వండి అని ప్రముఖ పాత్రికేయులు ఒకరు అడిగితె- నా కంటే గొప్పవారెందరో ఉన్నారు. నా గురించి రాయడమెందుకని అంగీకరించని వినయ విభూషణులు. భీమిలీలో ఆనందవనం, వరంగల్ లో శ్రీసప్తగిరి ధామం, కృష్ణాజిల్లా బలుసుపాడులో శ్రీగురు ధామం ముఖ్య కేంద్రాలుగా ఆయన ఆధ్యాత్మిక, సాహిత్య, సామాజిక వరివస్య సాగింది. వర్తమానకాలం లో దేశభక్తి మానవీయ విలువలు, సనాతన ధర్మోద్ధరణ, భారతీయత ప్రతిబింబించాలని తపించిన తపస్వి! కళ్ళు మూస్తే దైవాన్ని స్మరించు, కళ్ళు తెరిస్తే సమాజాన్ని సేవించు అన్న నవ్య నినాదాన్ని ఆచరణాత్మకం చేసి చూపిన మార్గదర్శి.

సద్గురువొక ఆదర్శ పుత్రుడు, ఆదర్శ భర్త, ఆదర్శ పౌరుడు, ఆదర్శ పాలకుడు, అని అంటూ ఉంటారు. అలాగే వారు అమ్మ ఆదరాభిమానాలు చూరగొన్న ఆదర్శ భక్తుడు, బిడ్డ అనవచ్చు. తమ 87వ ఏట వరంగల్ గురుధామ్ లో 2015 జూన్ 10 నాడు శివ స్వరూపిణి అమ్మ ఒడి చేరుకున్నారు. సద్గురువులు శివసాయుజ్యంతో భారత ఆధ్యాత్మిక చరిత్రలో ఒక ప్రముఖ ప్రకరణం ముగిసింది.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!