సాయి మాస్టర్ భరద్వాజ, శ్రీమతి అలివేలు మంగమ్మ
1955లో నిష్ఠా గరిష్టులైన ఒక శ్రోత్రియ కుటుంబంలో 16 యేళ్ళ యువకుడికి ఉపనయనం జరుగుతున్నది. బ్రహ్మోపదేశ సుముహూర్త సమయం. సరిగ్గా అదే సమయానికి వటుడి పెద్దన్న గారి కుమారుడు భాస్కరాచార్య మరణించాడు. ఆ సంఘటన గొప్ప మార్పుకి కారణ మయ్యింది. ఇంత వైదిక తతంగం, వేద మంత్ర ఘోష మృత్యువుని ఆపలేక పోయాయన్న చింత మొదలయ్యింది. ఈ విషాద సంఘటన ఆ యువకునిలో గొప్ప మానసిక పరివర్తన తెచ్చింది. ఆత్మ-ఆనాత్మ వంటి తాత్త్విక విషయ విచారణ తీవ్ర స్థాయి నందుకొని కొంత కాలం గడిచింది. చివరకు చిక్కు ముడి వీడి నట్లై ఒక తార్కిక సమాధానం, సమన్వయం లభించింది. చివరి వరకు సమన్వయం సాధించి దైవం యొక్క ఉనికి నిర్ధారణ చేసుకో గలిగారు. ఫలితమే ఒక గొప్ప తత్త్వవేత్త “సాయిమాష్టర్” రూపొందటం.
బాపట్లకు చెందిన వేదపండితులు శ్రీ ఎక్కిరాల అనంతాచార్య బుచ్చమ్మ గారల నాల్గవ సంతానం సాయి మాస్టర్ భరద్వాజ. 1938 అక్టోబర్ 30 న జన్మించారు. వీరు చిన్నప్పటి నుంచి జ్ఞాన పిపాసి. చిన్న తనం నుంచీ మంచి శరీర దారుఢ్యం, మానసికంగా ధైర్య సాహసాలు ఉండేవి. తండ్రి గారి వద్దే యోగాభ్యాసం, చదువు సంధ్యలు సాగాయి. 12 ఏళ్ల వయసులోనే డైరెక్ట్ గా మెట్రిక్యు లేషన్ పరీక్ష పాసయ్యారు వారణాశి నుంచి. చిన్న తనం నుంచి అనేక విషయాల పట్ల జిజ్ఞాస, ప్రశ్నించే తత్త్వం, అసాధారణ ఏకాగ్రత ఉండేవి. 18 సంవత్సరాలకే ఆంగ్ల సాహిత్యంలో ఎమ్. ఏ. పూర్తి చేసి, 19 వ యేట 1960 లో ఒంగోలు లోని శర్మ డిగ్రీ కాలేజ్లో ఉపన్యాసకునిగా చేరేరు. కేవలం 3 నెలల ప్రిపరేషన్ తో యు.పి.ఎస్.సి పరీక్ష పాసయ్యారు. కాని దాని వల్ల లభించే ప్రతిష్ఠాత్మకమైన, ఉద్యోగాన్ని వద్దనుకున్నారు. IAS పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాక హిమాచల్ ప్రదేశ్ లో పోస్టింగ్ వచ్చింది. కానీ దాన్ని వద్దనుకున్నారు. కారణం వ్యక్తిగత లక్ష్యాలు వేరుగా ఉండటమే. 1963లో అన్నగారు వేదవ్యాస్ తో పాటు జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను దర్శించుకున్నారు. రమణమహర్షి, సాయిబాబా తో పాటూ అమ్మ ప్రభావం కూడా ప్రస్ఫుటంగా పడింది. అమ్మ సన్నిధిలో, అమ్మతో సంభాషణలలో, ఇతర భక్తుల అనుభూతులతో ఎంతగానో ప్రభావితుడయ్యారు.
ఒంగోలు కాలేజి విడిచిపెట్టి, హైదరాబాద్ వివేకవర్ధని కళాశాల, బాపట్ల కాలేజి ఉద్యోగాలకు రిజైన్ చేసి జిల్లెళ్ళమూడి అమ్మ చెంతకు చేరేరు. అక్కడ అమ్మ సన్నిధిలో అనేక సం.లు గడిపారు. అమ్మ తాత్వికతను పరిశీలిస్తూ, విశ్లేషణ చేసుకుంటూ అమ్మ వాక్యాలు, అమ్మ సన్నిధిలో జరిగిన ఎన్నో సంఘటనలు గ్రంథస్థం చేశారు. అనేక గ్రంథాలు ఆంధ్ర ఆంగ్ల భాషలలో వెలువరించారు. అందులో Talks with Jillellamudi Amma ప్రసిద్ధమైనది. అమ్మ సాన్నిధ్యం లభించటమే అమ్మ అనుగ్రహంగా పరిగణించాలి అంటారు. అమ్మ భరద్వాజ గారిని అత్యంత ఆదర పాత్రునిగా మన్నన చేసి – యితడు ‘నైష్ఠిక బ్రహ్మచారి, నిజమైన బ్రాహ్మణుడు’ అనేది.
ఆ తర్వాత నెల్లూరులోని విద్యానగర్ కాలేజ్లో చేరారు. సుమారు 15 సం.లు ఉన్నారు. వారు నివసించే యిల్లు “భరద్వాజ తపోవనం” గాను, ‘రెండవ శిరిడీ’ గాను పేరు పడింది. ఆ తపోవనం పలువురు తత్త్వవేత్తలు, సాధు సత్పురుషులు దర్శించిన పుణ్యస్థలిగా ప్రసిద్ధి పొందినది. ఈ గృహంలోనే అనేక భాషల లోకి అనువదింపబడి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన శ్రీగురు చరిత్ర, ఇతర రచనలు చేశారు మాస్టరు గారు.
“ప్రతి విషయాన్ని హేతువాదంతో తార్కికంగా ప్రశ్నించే తత్వం గల నేను మొదట దైవం, ఆధ్యాత్మికతలకు అంత విలువ ఇవ్వలేదు. భగవద్గీత వంటి ఆధ్యాత్మిక గ్రంథాల ప్రయోజనాన్ని, ఉపనయనాది సంస్కారాల ఆవశ్యకతను, మహాత్ముల దర్శన ప్రాముఖ్యాన్నీ శంకించటమే గాక తృణీకరించే వాడిని “- అని వారే చెప్పుకున్నా రొక సందర్భంలో.
శిరిడి నాథుని సమాధి మందిరం ప్రధమ దర్శన సందర్భంలో ఒక దివ్యమైన బ్రహ్మానుభూతి కలిగింది.
1963 ఫిబ్రవరి 9న. శిరిడీ అనుభవం తర్వాత, సాయినాథునిపై ప్రసంగాలు, గ్రంథ రచన వంటి కార్యకలాపాలతో సాయి ధర్మ ప్రచారానికి అంకితమయ్యారు. “నేను దర్శించిన మహాత్ములు” అన్న గ్రంథ పరంపర వెలువరించారు. ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యలకు, ప్రశ్నలకు ఆధ్యాత్మికతే ప్రబలమైన సమాధానమని విశ్వాసంతో బంధు మిత్రులను, నిత్య జీవితావసరాలను, ఇతర వ్యాపకాలను అన్నింటిని త్యజించి ఆధ్యాత్మికంగా జీవించిన ధన్యజీవి.
అమ్మతో భావ సారూప్యత: ఆధ్యాత్మికంగా మనకు జరగవలసిందేదో – మన కర్మను బట్టో నిర్ణయాన్ని బట్టో జరుగుతుంది. మాస్టర్ గారు వాచీ ధరిస్తే అది ఆగి పోయేది. తీసేస్తే మరల తిరగటం మొదలయ్యేది. అప్పటి నుంచి వాచీ ధరించటం మానేశారు. వారిపట్ల కాలం స్తంభించిందా? ” ఆద్యంతాలు వారే అయినపుడు, సృష్టి కర్తా, సృష్టీ తానే అయినపుడు, వారి సన్నిధిలో స్థల కాలాల ప్రసక్తి ఎక్కడ?” అంటారు అనుయాయులు. అమ్మ ఓంకార నదిలో మంత్రోపదేశం చేసినపుడు, ఇంకా అనేక సందర్భాలలో కాలం స్తంభించిన సన్నివేశాలు విదితమే.
మన త్రోవన మనం మనకు తెలిసిన వాటిని చెప్పుకు పోవటమే గాని ఇతరులను విమర్శించటం తగదని, మన వ్యక్తిగత ఆధ్యాత్మికోన్నతికి అది హానికరమని చెపుతూ ఉండేవారు.
అమ్మ వంటి దివ్యమూర్తి సన్నిధిలో ఉంటూ కూడా ఏ సాధనా చెయ్యకుండా దైనందిన కార్యక్రమాలతో కాలం వృధా చేసుకుంటున్నారు అని భావించి, అమ్మనే అడిగారు . ఏ అడవుల్లోకో పారిపోయి అక్కడ ఏకాగ్రత దొరుకు తుందనుకోవటం, సృష్టి సహజమైన స్త్రీపురుష సంబంధాలను నిగ్రహించుకో లేక భంగ పడటం కంటే ఈ ఆవరణలో అమ్మ ప్రేమలో సోదర ప్రేమలో సేవ చేస్తూ నిత్య కార్యక్రమాల్లో లీనమయ్యే ఈ తపస్సు సుగమం, పతనానికి తావు లేనిది. ఈ దృక్కోణంతో చూస్తే సర్వత్రా విజ్ఞానాన్ని పొందవచ్చు అని అమ్మ వివరణ యిచ్చింది. అలాగే అమ్మ మాహాత్మ్యాల గురించి తన కర్తృత్వాన్ని అమ్మ అంగీకరించక పోవటం గురించి అడిగితే – అమ్మ “సరి అయిన నమ్మకం అలాంటి వాటి వల్ల కలగదు, అవి జరగక పోయిన మరుక్షణం ఆ విశ్వాసం సడలి పోతుంది. సరి అయిన నమ్మకం నిర్హేతుకంగా కలుగుతుంది” అని చెప్పింది.
అమ్మ సన్నిధిలో చాలా మంది ఏడుస్తా రెందుకు? ఈ సందేహం కూడా అమ్మ ముందుంచారు పదేపదే. బిడ్డ పుట్టగానే ఎందుకు ఏడుస్తుందో దీనికీ అదే కారణం, నిజానికి అది విచారం కాదు, ఇంతకన్న మంచి పదం దొరక్క ఏడవటం అంటున్నాం అన్నది. –
భరద్వాజకు చిన్నతనంలోనే తల్లి పోయింది. అంతగా దుఃఖించలేదు. తనను బాగా అర్థం చేసుకో గలిగే వ్యక్తి ఇక కనపడదు అని అనుకునేవాడు. ఈ భావనకు అపవాదులా హైమ కనిపించింది. చిన్న పిల్లవాడికి చేసే సేవలన్నీ ఇతడికి చెయ్యాలనుకునేది. నా బిడ్డలా పెంచుకోవటం నీకు కాకపోయినా నాకు అవసరం. ఈ ఆలోచనతో నాలోని ఒంటరి తనం విచారము దూరమవుతాయి. నిన్ను గురించిన ఆలోచనలు లేకుండా ఉండటం సాధ్యం కావటం లేదు అన్నది హైమ. ఆ భావన కాదనలేక పోయాడు. హైమ సాన్నిధ్యంలో మళ్ళీ బాల్యాన్ని చవి చూశాడు. హైమ ఆలయ ప్రవేశం తర్వాత జిల్లెళ్ళమూడి వదలి వెళ్ళారు.
స్థాపించిన సంస్థలు : Shirdi Sai Cultural mission విద్యానగర్ లోను, Sai Baba Mission అని ఒంగోలు లోను ప్రారంభించారు.
ఒంగోలులోని శ్రీ మాష్టర్ యూనివర్సల్ సాయి ట్రస్ట్ & ఆచార్య భరద్వాజ పీస్ ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా వీరి భావ వ్యాప్తి, తాత్వికతల ప్రచారం జరుగుతున్నది. సాయిబాబా అన్న పక్ష పత్రిక ప్రారంభించారు. తదుపరి మాస పత్రికగా మార్చబడి నేటికీ భక్తులకు అందుతున్నది. విశ్వజననీ పరిషత్ వారి ఆంగ్ల పత్రిక సంపాదక మండలిలో కూడా సేవలందించారు.
మహా ప్రస్థానం : 1989 ఏప్రిల్ 12 ఉదయం 7.30 గం.లకు ఒంగోలు నివాసంలో మహాసమాధి చెందేరు. పరిసమాప్తి లేని నిత్య అవతారంగా నిలచిన వారు దత్తాత్రేయ గురుదేవులు. అట్టి దత్త పరంపరకు చెందిన మహనీయులలో శ్రీ భరద్వాజ ఒకరుగా పరిగణిస్తారు. మాష్టర్ గా ఆచార్యులుగా నిలిచి ఎందరో భక్తుల ప్రార్థనలు ఆలకించి పిలిచిన పలికే దైవంగా అనుగ్రహిస్తున్నారు. అమ్మ చరిత్రలో ఒక ఆణిముత్యం గా వెలుగొందిన ముద్దు బిడ్డ, తన రచనలతో అమ్మ సాహిత్యాన్ని పరిపుష్టం చేసి అమ్మ తత్త్వ సందేశ వ్యాప్తికి పాటుపడ్డ ధన్యజీవి!
The real master does not demand surrender, it must be noted. He just conquers the heart silently, by his power and love.
(సశేషం)