(గత సంచిక తరువాయి)
అమ్మ సన్నిధిలో అలివేలు మంగమ్మ: ఈమె తలితండ్రులు శ్రీమన్నవ బాలకృష్ణ శర్మ, శ్రీమతి రంగనాయకమ్మ అమ్మ స్వగ్రామమైన మన్నవలోనే ఉండేవారు. జిల్లెళ్ళమూడి అమ్మ యెడల కుటుంబమంతా భక్తిప్రపత్తులు కలవారు. అమ్మకు ఆత్మీయుడు, ఆత్మబంధువు, అమ్మపై ఎన్నో పాటలు రాసిన వాగ్గేయకారుడు, రాజుబావగా ప్రసిద్ధుడు అయిన మన్నవ బుచ్చిరాజుశర్మ వీరి కుమారుడే. శర్మ గారు రామనామ ప్రియులు, కుటుంబం వారంతా తరచూ జిల్లెళ్ళమూడి వెళ్లి అమ్మను దర్శించుకుంటూ ఉండేవారు. అమ్మ గురించి విశేషాలు తరచూ మాట్లాడుకుంటూ ఉండటం వల్ల మంగమ్మకు అమ్మ పట్ల భక్తి ఏర్పడింది.
మంగమ్మకు 18 యేళ్ళ వయసప్పుడు కుటుంబమంతా జిల్లెళ్ళమూడి వెళ్లి నాలుగు రోజులుండి తిరుగు ప్రయాణ మయ్యారు. కానీ మంగమ్మ మాత్రం అమ్మ సన్నిధిలోనే ఉంటానని చెప్పి అక్కడే ఉండి పోయింది. రెండు నెలల అనంతరం బిడ్డపై బెంగతో తల్లి యింటికి తీసుకు రమ్మని భర్తను పంపింది. తాను రానని అమ్మ సేవలోనే ఉంటానని అనటంతో విధి లేక తండ్రి తిరిగి వెళ్ళిపోయాడు. ఇలా చాలా సార్లు జరిగింది. కొంత కాలానికి తండ్రి దివంగతుడయ్యాడు. ఆ వార్తతో బంధువులు వస్తే, ఎంతగానో దుఃఖించింది. బంధువులు అలా దుఃఖ పడితే నాన్నగారి ఆత్మ శాంతించదు, నిగ్రహించుకోవాలని చెప్పారు. అపుడు మంగమ్మ “నేను నాన్న మరణం గురించి దుఃఖించటం లేదు. నాన్న ఎక్కడికీ పోలేదు, వారి ఆత్మ అమ్మ పాదాల చెంతకే చేరి ఉంటుంది. అమ్మ సన్నిధి విడిచి ఉండలేను” అని చెప్పింది. అమ్మ కలగ చేసుకుని ఓదార్పుగా – “నీ తండ్రి ఇక ఎన్నటికీ కనిపించరు. కనుక ఆయన్ను చివరి సారిగా దర్శించుకో, అంతిమ సంస్కారా లయ్యాక తిరిగి వచ్చెయ్” అని చెప్పి పంపింది.
జిల్లెళ్ళమూడిలో ఉన్నపుడు ఆమె భజన కీర్తనలు, భక్తి గీతాలు పాడుతూ ఉండేది. ఒకసారి భజన సమయంలో నాన్నగారు అందరూ కలసి భజన చేస్తున్నా “మంగ కంఠ స్వరం ప్రత్యేకంగా శ్రావ్యంగా వినిపిస్తుంది. ఆ స్వరంలో ఎంతో మాధుర్యముంది” అని ప్రశంసించారు. ఈమె అమ్మ దగ్గర 6 సం. లు. గడిపింది. మంగమ్మ జిల్లెళ్ళమూడిలో చేసిన సేవ అనుపమానం, అమ్మసేవ అంటే ఏ పనికైనా సిద్ధ పడేది. భుజాన నీళ్ల బిందెతో చెరువునుంచి నీళ్లు తేవటం, పొలం పనులు, గృహ నిర్మాణం పనులు, భక్తుల సదుపాయాలు చూడటం, వడ్డన ఇలా అనేక పనులు చేసింది.
శక్తికి మించి చేసిన శ్రమ వల్లనో ఏమో గాని సున్నితమైన శరీరం శుష్కించి పోయింది. శరీర ఛాయ నల్లబడి పోయింది. అలివేలు మంగకు యింటి వద్ద లభించే సౌకర్యాలు, ఆహార విహారాలు, ప్రేమానురాగాలు ఇవేవీ అమ్మ సన్నిధికి సరి కాలేక పోయాయి. ఆ వయసులో యువతులకుండే శరీరాలంకరణ, వివాహానురక్తి ఏమాత్రం ఉండేవి కాదు. అందచందాలు నశించి శరీరం శుష్కించింది, వికృతంగా అయింది. ఆరోగ్యం క్షీణించింది. ఏమాత్రం పట్టించుకోలేదు. అమ్మ సేవే సర్వస్వమైంది. ఇది సామాన్య విషయం కాదు. భక్తి జ్ఞాన వైరాగ్యాలను పరిపూర్ణంగా పొంది శరీర భ్రాంతిని వీడిన స్థితిగా చెప్పవచ్చు. అలివేలు మంగమ్మ భరద్వాజ గార్ల వివాహం బనగాన పల్లెలో 1975 మార్చి 6వ తేదీన వైభవంగా జరిగింది. వివాహానంతరం విద్యానగరం వెళ్ళిపోయారు దంపతులు. మునుపటిలాగే సత్సంగాలు, గంటల తరబడి ఆధ్యాత్మిక చర్చలు సాగుతూ ఉండేవి.
మంగమ్మ గారి మహా ప్రస్థానం : 1945 అక్టోబర్ 1 న జన్మించిన మంగమ్మ గారు, 2021 జూన్ 3వ తేదీన మహాసమాధి చెందారు.
వారి యోగజీవిత వైభవాన్ని ‘విశ్వజనని’ పాఠకులకు తెలియజేయాలనిపించింది. అమ్మ అనుగ్రహపాత్రులైన ఈ పుణ్యదంపతులు ధన్యులు.