(గత సంచిక తరువాయి)
అమ్మ లో రాముణ్ణి దర్శించిన ఆంధ్ర వాల్మీకి
అమ్మ వద్దకు ఎందరెందరో దర్శనం కోసమో, మార్గదర్శనం కోసమో, ఇష్టకామ్యసిద్ధిని ఆశించో, కుటుంబ సమస్యల పరిష్కారం కోసమో వస్తూ ఉండేవారన్న సంగతి విదితమే. అయితే అమ్మే స్వయంగా కొందరిని దర్శించిన సందర్భాలుకూడా ఉన్నాయి. మౌనస్వామి, కల్యాణానంద భారతి, రెడ్డిపాలెం కాంతయ్య యోగి వంటి మహనీయులను దర్శించింది. ఆ పరంపరలో వాసుదాసస్వామి (వావిలికొలను సుబ్బారావు) ఒక
వాసుదాసస్వామివారు బ్రాహ్మణ కోడూరులో విడిదిచేసి ఉన్నారు. తాతమ్మ, అమ్మ మన్నవ ప్రయాణమవుతుండగా కొందరు మన్నవ నుంచి బ్రాహ్మణ కోడూరు స్వామి వారిని చూడటానికి వెళుతూ తాతమ్మను కూడా రమ్మని అడుగుతారు. నే రాలేను అమ్మాయిని తీసుకువెళ్ళండి అంటుంది. అమ్మ పినతండ్రి మన్నవ రామబ్రహ్మం గారు సరే పంపు పిల్లల నైనా ఎత్తుకుంటుంది అని తీసుకు వెళతారు.
భద్రాచలంలో ఆలయం నిర్మించి భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలచి పోయారు రామదాసు గారు. అదే తరహాలో ఒంటిమిట్ట కోదండ రాముని ఆలయ జీర్ణోద్ధరణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మరో రామదాసు శ్రీ వాసుదాసస్వామివారు. ఆంధ్రవాల్మీకిగా పేరుగడించిన వావిలికొలను సుబ్బారావు గారు ఒంటిమిట్ట ఆలయ జీర్ణోద్ధరణకు విశేష కృషి చేశారు.
ఈయన జనవరి 23, 1863న కడప జిల్లా జమ్మలమడుగులో జన్మించారు. తండ్రి రామచంద్రరావు, తల్లి కనకమాంబ, భార్య రంగనాయకమ్మ. 1883లో ప్రొద్దుటూరు తాలుకా ఆఫీసులో గుమస్తాగా చేరి రెవిన్యూ ఇన్స్పెక్టర్గా 1896 వరకు పనిచేశారు. తరువాత ఏక్టింగ్ తహసీల్దార్ పదోన్నతి పొంది 1900 వరకు పనిచేసి, పదవీ విరమణ చేశారు. అనంతరం 1904 లో మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజిలో తెలుగు పండితునిగా చేరేరు.
వాల్మీకి సంస్కృత రామాయణాన్ని 24 వేల ఛందోభరిత పద్యాలుగా తెలుగులో వ్రాసి ఒంటిమిట్ట శ్రీరామునికి అంకితం ఇచ్చారు. అప్పుడు బళ్లారి రాఘవ అధ్యక్షతన జరిగిన సభలో మహాపండితులు వావిలికొలను సుబ్బారావుకు ‘ఆంధ్రవాల్మీకి’ అని బిరుదు ప్రదానం చేశారు.
1920లో పదవీ విరమణ చేశాక, జీర్ణదశకు చేరిన ఈ రామాలయాన్ని ఉద్ధరించటానికి వావిలికొలను కంకణం కట్టుకున్నారు. టెంకాయచిప్పను బిక్షాపాత్రగా చేతపట్టుకొని ఆంధ్రదేశంలో ఊరురా తిరిగి బిచ్చమెత్తారు. ఆ ధనంతో రామాలయాన్ని పునరుద్ధరించి, పునర్వైభవం తీసుకు వచ్చారు. మద్రాస్లో పని చేస్తున్న కాలంలోనే ధర్మపత్ని మరణంతో ఆధ్యాత్మిక చింతన, భక్తి యోగ సాధన ద్విగుణీ కృతమయింది. 1920లో ‘వాసుదాస స్వామి’ అన్న యోగపట్ట నామంతో సన్యాస దీక్ష స్వీకరించారు. తదాది ఆంధ్ర దేశమంతటా విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారం చేస్తూ పర్యటనలు చేశారు.
బ్రాహ్మణ కోడూరు నుండి తిరిగి వెళ్ళే రోజున అందరూ స్వామి వారికి నమస్కారం చేస్తారు. అందరూ అయిన తర్వాత రామబ్రహ్మం గారు అమ్మను నమస్కారం చెయ్యమంటారు. అమ్మ నమస్కరించి స్వామి కాళ్ళ మీద పడి వది నిముషాలు ఉండి పోతుంది. అమ్మ ఇంత సేపు అలా ఉండి పోవటం ఒక అరుదైన సంఘటన. స్వామి? ‘ఎవరీ అమ్మాయి’ అంటూ తల మీద చెయ్యి వేసి ముఖం వంక చూస్తారు. మా అన్నగారి కుమార్తె, తల్లి లేని పిల్ల అని చెపుతారు పినతండ్రి.
‘అయ్యో పాపం’ అని లేవదీసి, తల తన గుండెల కానించి, “ఏవమ్మా నీకు అమ్మ లేదుకదా, అందరికీ నీ మీద ప్రేమ ఉండేలా ఆశీర్వదించనా?’ అంటారు. ‘నా మీద ఎవరికీ వద్దు, నాకు అందరి మీదా ఉండేటట్టు ఆశీర్వదించండి అంటుంది అమ్మ. ‘ఎందుకమ్మా అలా అంటున్నావు?’ అని స్వామి అడిగితే, – ప్రేమంటే ఏమిటో తెలియాలంటే నాకు ఉంటేగా తెలిసేది, ఇతరులకు ఉంటే నాకేమి తెలుస్తుంది’ అని అమ్మ సమాధానం! ‘పోనీ నీకేమి కావాలో చెప్పు’ అంటే “యేమన్నా కావాలనేది అక్కర్లేకుండా ఉండేది కావాలి” అంటుంది. ఈ పండ్లు తీసుకో, అన్ని పండ్లూ తింటావా? అని స్వామి పండ్లు ఇవ్వబోతారు. ఏ పండూ వద్దు గాని అందరి పళ్ళు తింటాను, అని చెపుతుంది అమ్మ. ఏమిటీ మాట తీరు అని అశ్చర్య వడి, యెదురుగా వచ్చి నిలబడమని కన్నార్పకుండా అయిదు నిముషాలు చూసి, కళ్ళు పెద్దవి చేసి, నాభిస్థానం నుంచి షడ్జమస్థాయిలో “రామబ్రహ్మం” అని కేక పెడతారు. వారి ఉపాసనా దైవం దర్శన మయ్యే సరికి ఆనందం పెల్లుబికిన చర్య అది. ఆ పిలుపు విని పినతండ్రి వస్తాడు. నిన్ను కాదు నాయనా, మన రామబ్రహ్మాన్ని అంటూ మెడలోని బిళ్ళ చూపిస్తారు.
రామబ్రహ్మం గారు అమ్మాయిని చూడగానే కేక వేసారెందుకు? అని అడిగితే- అది నే చెప్పేది కాదు, మీరు వినేది కాదు, ముందు ముందు మీకే తెలుస్తుంది- అని వివరిస్తారు స్వామి. అమ్మను ఒళ్ళో కూర్చో పెట్టుకుని నొసటిపై ముద్దు పెట్టుకుంటారు. అమ్మనే వెళ్ళొస్తా అంటే నాలుగు రోజులుండ రాదు అంటారు. మా బాబాయి నడిగి, వారుంటే నేనూ ఉంటా అంటుంది. ఆ బాబాయి గారు అమ్మను మరచి పోయి వెళ్లి. పోతారు. అమ్మ నాయనా వెళ్ళొస్తా, వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోయినారు, ఎలాగో అలా వెళతా లెండి అని పరుగెత్తి వెళ్ళిపోతుంది. ఆ పరుగు చూడు రాముడే బాలుడై వచ్చినట్టుంది, అని అనుకుంటూ కళ్ళతో నమస్కారం చేస్తారు స్వామి.
స్వామి వారి శిష్యులు, నడిగడ్డ పాలెం వాస్తవ్యులు అయిన శ్రీమాన్ వెంకటప్పయ్య, సుబ్బదాసు వీరిని నడిగడ్డ పాలెం రమ్మని, రెండు ఎకరాల నిమ్మ తోట దాన మిచ్చారు. అందులోనే ఒక ఆశ్రమం నిర్మించుకొని. తపస్సే ధ్యేయంగా గడిపారు. నేటికీ నిత్యాన్నదాన కార్యక్రమం నిరాఘాటంగా జరుగుతూ ఉండటం, దివారాత్రాలు అఖండ నామ సంకీర్తన జరుగుతూ ఉండటం ప్రముఖ కార్యక్రమాలిక్కడ. అంతర్లీనంగా అమ్మ ఇవి గమనించి ఆనందించి ఉండవచ్చు అనిపిస్తుంది.
1986 ఆగస్టు 1నాడు మద్రాసులో వాసుదాసస్వామి పరమపదించారు. వారి స్వగృహాన్ని ఒంటిమిట్ట రామాలయానికి సమర్పించారు. అనన్యసామాన్యమైన పాండిత్యంతో, భాషాభిమానంతో అనేక భక్తి రచనలు చేసి, తాను తరించి, ఇతరులను తరింప చేసిన ధన్యజీవి, పరమ భాగవతోత్తముడు శ్రీ వావిలికొలను సుబ్బారావు గారు.