లీలా మానుష రూపిణి, అనంత శక్తి స్వరూపిణి మాతృశ్రీ అనసూయా దేవి యెడల భక్తితో ఆసక్తితో వేల, లక్షలమంది ఆమెను దర్శించుకున్నారు. అందులో అన్ని తరగతులవారూ ఉన్నారు. పండితులు, పామరులు, మాన్యులు, సామాన్యులే గాక ఆధ్యాత్మిక సంపన్నులు, తత్త్వవేత్తలు, వయోవృద్ధులు జ్ఞానవృద్ధులు కూడా ఉన్నారు. వీరిలో అమ్మతో ఆధ్యాత్మిక, తాత్త్విక, భౌతిక విషయాలు చర్చించిన వారున్నారు. ‘యే యధామాం ప్రపద్యంతే తాం స్తథైవ భజామ్యహం’ అన్నట్టు తమ తమ ఉపాసనా దేవతను దర్శించిన వారున్నారు. ఎదో ఉద్ధరించాలని ఉపదేశం చెయ్యాలని వచ్చి పాత్రలు తారుమారై ఉపదేశ మార్గదర్శనాలు పొందినవారూ ఉన్నారు. అమ్మ ఎవరిని ఎందుకు ఎప్పుడు రప్పించుకుంటుందో మనకు తెలియదు. తారతమ్యా లెంచక అందరినీ తరింప చేసింది. విచక్షణ లేని వీక్షణం కదా అమ్మది.
అమ్మ ఈ ఆధ్యాత్మిక యాత్రికులలోని అహాన్ని తొలగించింది, వారి చిక్కులు విడదీసింది, ఇతరేతర మార్గాలలో సాగే వారిని తన దారికి తెచ్చుకుంది. దేవీ సాక్షాత్కారానుభూతిలో లీనమై ఉన్న రామకృష్ణ పరమహంసను చూసిన తోతాపురి మహాశయుడు “తరవాతి దశకు నీకు దారి చూపుతా” అన్నట్లు అమ్మ ఎందరికో దారి చూపి సాధనా మార్గాన్ని సరి చేసింది. వైవిధ్య భరితమైన అమ్మ అనుగ్రహం అనంత విధాలు. ఇలా దర్శించుకున్న వారిలో అమ్మను కలసిన వారిలో మౌనస్వామి, కల్యాణానంద భారతి, వాసుదాస స్వామి, లక్ష్మీకాంతానంద యోగి, అవధూతేంద్ర సరస్వతి, లక్ష్మణయతీంద్రులు, శివానందమూర్తి, విశ్వంజీ వంటి సుప్రసిద్ధ యోగులు తత్త్వవేత్తలు ఉన్నారు. ఇంకా అంతగా ప్రజానీకానికి తెలియని సుబ్బాయమ్మ, సీతాయమ్మ, మల్లెల రత్తమ్మ, రాజమ్మ వంటి యోగినులూ ఉన్నారు.
వీరు గాక రహి, మంత్రాయి, మౌలాలీ, చాకలి బుచ్చమ్మ, శ్యామల వంటి ఊహకందని మార్మిక పాత్రధారులూ కానవస్తారు.
మామూలుగా సాంసారిక బాధ్యతలు నిర్వర్తించుకుంటూ అమ్మ సేవలో తరించినవారు, అమ్మకు జీవితాన్ని అంకితం చేసుకున్న వారు ఎందరో కనిపిస్తారు. అట్టి వారిలో కొండముది రామకృష్ణ, తంగిరాల కేశవశర్మ, అధరాపురపు శేషగిరిరావు, శ్రీపాద, ఎక్కిరాల భరద్వాజ, పన్నాల రా. కృ.శర్మ, రాజు బావ, కులపతిగారు, పొత్తూరి వెంకటేశ్వరరావు, డా. పొట్లూరి సుబ్బారావు, పి.ఎస్.ఆర్. ఆంజనేయ రా. కృ. రెడ్డి, ప్రసాద్, యార్లగడ్డ భాస్కరరావు, కాసు రా. భద్రాద్రి రామశాస్త్రి, చిదంబరరావుగారు, మరిడమ్మ తాతమ్మ, గజేంద్రమ్మ, సింగుపాలెం జానకి, అన్నంరాజు, రావూరి, జొన్నాభట్ల, తంగిరాల కుటుంబీకులు ఇలా ఎందరెందరో (ఈ జాబితా చాలా పెద్దది, క్షంతవ్యుడను) ప్రముఖంగా కనిపిస్తారు. అమ్మ సేవే పరమావధిగా, జీవిత లక్ష్యంగా జీవనం సాగించిన వీరందరూ యోగులు” అనటానికి సందేహించ పనిలేదు. అందరింటి పునాది రాళ్లలో వీరి పేర్లు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. వీరిలో కొందరి గురించి విబుధజనుల వలన విన్నంత కన్నంత తెలియ వచ్చినంత, అమ్మ అనుగ్రహించినంత తెలియ చేసే విశ్వజన ప్రయత్నం ఇది (ముఖ్యంగా నేటి యువతరాన్ని దృష్టిలో పెట్టుకుని).
పూర్ణానంద స్వామి :
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మధురై నివాసులు సుబ్రహ్మణ్యశాస్త్రి, పర్వతవర్ధని దంపతుల కుమారుడు ఈ స్వామి. 1939 సం. నవంబరు 7న జన్మించిన వీరికి కామేశ్వరన్ అని పేరు పెట్టుకున్నారు. చిన్నతనం నుండి ఆధ్యాత్మిక జిజ్ఞాసాపరులు. తమిళనాడులోని బాణతీర్థం, పొదుగై పర్వత సీమ లోని వరుణ గుహ లోను తరచూ తపస్సు చేస్తూ ఉండేవారు. ఆ ప్రాంతంలోనే తిరుగాడే రాఖడీ బాబా అనే సన్యాసి వీరి తపోభినివేశాన్ని గమనించి పూర్ణానందస్వామి అన్న దీక్షానామంతో సన్యాసదీక్ష ప్రసాదించారు. తరువాత పాపనాశనం శివాలయంలోను, శ్రీశైలంలోని హఠకేశ్వర సమీప ఆశ్రమంలోను తపోదీక్షలో లీనమయ్యారు. పంచాగ్ని మధ్యంలో తపస్సు చేస్తున్న వీరికి జగజ్జనని సాక్షాత్కార మైనదని చెపుతారు. కాషాయాంబర ధారియై జటాజూటము నుదుట విభూతి రేఖలతో తేజస్సంపన్నులై ఉండే వారు.
ఒకనాడు శ్రీశైలం సత్రం వరండాలో కౌపీన ధారియై ఉన్న స్వామిని అన్నంరాజు రామకృష్ణరావు గారు చూచి తన గదికి రమ్మని ఆహ్వానించారు. అక్కడ స్వామి అన్నంరాజు వారికి భువనేశ్వరీ మంత్రం ప్రసాదించారు. అమ్మ జన్మదిన సందర్భంగా ఇండియన్ ఎక్స్ ప్రెస్ దినపత్రికలో ఎక్కిరాల భరద్వాజ గారు రాసిన వ్యాసం వచ్చింది . ఆ వ్యాసం విశేషాలు చెప్పి దానితో పాటు ప్రచురించిన అమ్మ ఫోటో చూపించారు స్వామికి. అమ్మ ఫోటో చూడగానే “ఎవరోకాదు రాజరాజేశ్వరి, తప్పక దర్శించు” అని చెప్పారు. కొంతకాలానికి అన్నంరాజు వారి కుటుంబము, ఈ గురు శిష్యులిద్దరూ అమ్మను దర్శించుకున్నారు. అమ్మ సహజ వాత్సల్యంతో ఆదరించి గోరు ముద్దలు తినిపించి బట్టలు పెట్టి ఆదరించింది. స్వామి ఆహారంలో కారం వర్ణించారు. అందుకని అమ్మ ఇడ్లి పంచదారలో అద్ది తినిపించింది! సంపూర్ణత్వం అంటే అమ్మే, అమ్మంటే సంపూర్ణత్వం, She is none other than భువనేశ్వరి అని సంభావించి తన్మయులయ్యారు. తరువాత రెండుమూడు సార్లు జిల్లెళ్ళమూడి వచ్చారు. అమ్మ ఆదేశంతో తమిళనాడు స్వగ్రామంలో అనారోగ్యంతో ఉన్న తల్లి పర్వతవర్ధనమ్మను జిల్లెళ్ళమూడి తీసుకు వచ్చారు. అమ్మను దర్శించుకున్న ఆమె ఎంతగానో పరవశించింది. ఒకసారి నాన్నగారు నుండిపెంటలోని స్వామి ఆశ్రమానికి వెళితే వారికి భక్తితో పూజోప చారాలు చెయ్యటం చూసి అక్కడి జనం ఆశ్చర్య పడ్డారు. సున్నిపెంట ఆశ్రమంలో అమ్మ నిలువెత్తు ఛాయాచిత్రాన్ని ప్రతిష్ఠించారు. అమ్మను ఆదర్శంగా తీసుకుని అన్నపూర్ణాలయం నెలకొల్పి భక్తులకు ఉచిత భోజన సదుపాయం కల్పించారు. కొంతకాలం జిల్లెళ్ళమూడిలో ఉండి స్వామివారు పాల్వంచలో ఒక శిష్యుని యింటికి తల్లితో సహా వెళ్లిపోయారు.
1991లో జిల్లెళ్ళమూడి వచ్చి అందరిని ప్రేమగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ‘అందరిల్లు’ అంతా కలయ తిరిగి S.V.J.P. కార్యకర్తల ఆరాధనలు పూజలు స్వీకరించారు. ప్రతి సంవత్సరం ఒక పక్షం రోజులు జిల్లెళ్ళమూడి లో గడిపి హెూమాలు పూజలు జరపటానికి అంగీకరించారు. కానీ స్వామి ఆరోగ్యం రోజురోజుకీ దిగజారి, మధుమేహ వ్యాధి ప్రకోపించింది. చివరకు 2000 సం. ఏప్రిల్ 4 న బ్రహ్మీ భూతులయ్యారు.
అమ్మ వాత్సల్యాన్ని ఆదరాన్ని ఆశీస్సులను పొందిన ధన్యజీవి శ్రీ పూర్ణానందస్వామి.
(సశేషం)