సుప్రసిద్ధ ఆధ్యాత్మిక మాసపత్రిక ‘దర్శనం’ ఇప్పటికే అమ్మతత్త్వానికి దర్పణం పెట్టే వ్యాసపరంపరని ప్రచురించి, తమ వంతు సేవ చేసింది.
అదే బాటలో నేడు మరొక ముందడుగు వేస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక వాఙ్మయ రచయిత, తపస్వి, బ్రహ్మశ్రీ మల్లాది వెంకటకృష్ణమూర్తిగారు హృదయంగమంగా మధురాతిమధురమైన స్వీయశైలిలో “అమ్మజీవితచరిత్ర”ను రచిస్తున్నారు. దాన్ని ‘దర్శనం’ మాసపత్రిక అక్టోబరు, 2011 సంచికతో ఆరంభించి ధారావాహికంగా ప్రచురిస్తుంది.
‘వేదవేద్యే పరే పుంసి జాతే దశరధాత్మజే ||
వేదః ప్రాచేతసాదాసీ త్సాక్షాద్రామాయణాత్మనా॥
ఆదిపురుషుడు వేదవేద్యుడు అయిన శ్రీ మహావిష్ణువు రామునిగా అవతరిస్తే, వేదములే శ్రీమద్రామాయణంగా రూపుధరించాయి అన్నారు వాల్మీకి మహర్షి.
ఆద్యంతరహిత, మూలప్రకృతి అయిన శక్తి “మాతృశ్రీ అనసూయాదేవి” (అమ్మ)గా అవతరిస్తే, “అమ్మ జీవితచరిత్ర” సృష్టిక్రమానికి, సృష్టి రహస్యాలకి, సృష్టి కర్త స్వరూప స్వభావాలకి, ఆదిశక్తి అవతారలక్ష్యానికి దర్పణం పడుతుంది.
శ్రీమద్రామాయణాన్ని వాల్మీకి మహర్షి ఆంజనేయస్వామి, కాళిదాసు, శ్రీ విశ్వనాధ సత్యనారాయణ, మొల్ల మొదలుగాగల అసంఖ్యాకులు రచించారు.
అమ్మ స్వీయచరిత్రని భాస్కరరావు అన్నయ్య, అమ్మ జీవితచరిత్రని రామకృష్ణ అన్నయ్య, కుసుమక్కయ్య, ఎందరో రచించారు; ఇంకా ఎందరో సహస్రకోణాలు దర్శించి సహస్రాధికంగా వర్ణించాల్సి ఉంది – అది తపస్సు వలననే సాధ్యం. (తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ).
ఈ రూపేణా మరొక సాహిత్యరూప అనర్ఘ సౌగంధిక కుసుమం ‘మల్లాది’ వారి కలల నుండి జాలువారి అమ్మ శ్రీ చరణాలను చేరబోతున్నది. అమ్మ అనుగ్రహరూపమైన ఈ కృతి ఇహపర సౌఖ్యప్రదాయకం, స్వస్వరూప అనుసంధాన కారకం.
‘దర్శనం’ మాసపత్రిక సంవత్సరం చందా రూ. 200/ -లు. పత్రిక పొందగోరువారు చందా పంపవలసిన చిరునామా:
సంపాదకులు : శ్రీరామసిద్ధాంతిభవనం,
డోర్ నెం. 29-105/4/1, న్యూవిద్యానగర్ కాలనీ,
నేరేడ్మెట్, సికిందరాబాద్ – 56
ఫోన్: 040-27220401
“దేనికి పనికివచ్చేవాళ్ళు దానికి పనికివస్తారు. ఎవరు ఎందుకు ఉపయోగపడాలో అందుకు ఉపయోగపడతారు. వీడు ఇందుకు పనికి వస్తే, వాడు మరొకదానికి పనికివస్తాడు. మన శరీరంలో ఉన్న అవయవాలు ఒకటి చేస్తున్న పని మరొకటి చేస్తుందా ? ఇందులో అన్నీ మనకవసరమే” – అమ్మ
“సర్వం తెలుసుకున్నవాడు స్థితప్రజ్ఞుడు” – అమ్మ
విధి వర్షం లాంటిది. కొందరికి అనుకూలం, కొందరికి ప్రతికూలం” – అమ్మ
“కర్తవ్యమే భగవంతుడు” – అమ్మ
“సర్వకాల సర్వావస్థల యందు నడిచే ఉచ్ఛ్వాస నిశ్వాసాలైనప్పటికీ అది మంత్రరూపంగా నడపటం, – జరిగే విధానాలను బట్టి కుంభిస్తే ప్రాణాయామం. శ్వాసపైకి పోయినప్పుడు, క్రిందికి వచ్చినప్పుడు నోటిలో అక్షరాలు ఉచ్ఛరిస్తే మంత్రధారణ, ఊరికి జరుగుతున్న శ్వాసను మనస్సుతో గుర్తిస్తే అజపాగాయత్రి, మనస్సును లీనం చేసేది తపస్సు” – అమ్మ