బాల్యం:
గత సంచికలో:
పురోహితుడు రంగాచార్యులు అమ్మవారికి పూజ చేసినట్లుగా మానసికంగా అమ్మకు పూజ చేస్తారు. “ఎవరో రంగాచార్యులకు ఉద్యోగము తీసివేసారుట. చాలా మంచివాడు, యోగ్యుడు, ఆ గుడికి వాడిచేత అర్చన జరిగే యోగ్యత లేదు” అంటుంది అమ్మ. రంగారావుగారు పెచ్చు జీతంతో తిరిగి రంగాచార్యులుకి ఉద్యోగము ఇస్తారు.
ఇంక ముందుకు సాగండి …
– సంపాదకులు
15
సాయంత్రం 6 గంటలవుతుంది.
రైలు సాయంకాలం కోచీ.
రైలు దిగి నడిచి వచ్చేవారంతా స్టేషను దగ్గరే వున్నట్టు వుంటారు. పాదములు వంక చూస్తూ వుంటే ఒక పాదము ముందు, ఒక పాదము వెనుక వేసినట్లు వుంటుంది. ‘ఈ హెచ్చు తగ్గులేనా నడక అంటే. యిది నడక, నడతకూడా యింతేనా! నడకకు నడతకు తేడా యేమిటి’? అని అమ్మ ప్రశ్న వేసుకొంటుంది. నడక అంటే నడవటమే. అంటే నడకను నడిపించేది (అంటే మనస్సు సంబంధము). ప్రొద్దు గూకింది. ఒక పోలీసు బజారున పోతూ వుంటాడు. అమ్మ అక్కడనుంచి లేచి యూనియన్ ఆఫీసు దగ్గర ఒక మఱిచెట్టు క్రింద కూచోగా ఆ పోలీసువాడు అమ్మతో గూడా వస్తాడు.
‘యే అమ్మాయ్ నీ పేరేమిటి?’
అమ్మ పలుకదు పదిసార్లు పిలిచి, పదకొండవసారి పెద్దగా ‘యే అమ్మాయ్’ అంటాడు.
అమ్మ : అతని ముఖము వంక చూస్తుంది.
పోలీసు : (ముఖము వంక చూచి) నీ పేరేంటి ? అంటాడు.
అమ్మ : పిలిచావుగా ! అదే నా పేరు (అని) అబ్బాయ్ అని అంటుంది.
పోలీసు : అబ్బాయి యేమిటి ? అమ్మ : అమ్మాయి ఏమిటి ?
పోలీసు : నీవు అమ్మాయివి గనుక.
అమ్మ : నీవు అబ్బాయి గనుక (మనస్సులో నేను అమ్మాయిని గనుక)
పోలీసు : ఏయ్ నేను పోలీసుని అమ్మ : ఏయ్ నేను అనసూయను.
పోలీసు : ఏయ్ జాగ్రత్త, నిన్ను జైలులో పెడతా.
అమ్మ: జైలు కొడతావా నాకు. అమ్మ మాట అర్థం కాక పోలీసు ‘ఆ’ అంటాడు. అమ్మ వెంటనే మెల్లిగా ‘ఈ’ అంటుంది.
పోలీసు : యేమిటి అంటున్నావు. ‘ఈ’ అంటావేం. ‘అమ్మ: నీవు ‘అ’ అంటేను దాని తరువాత ‘ఈ’ కదా అని అన్నా.
పోలీసు : ఆ తరువాత ‘ఈ’ అని నీకెవరు చెప్పారు ?
అమ్మ : యెవరూ చెప్పలా ! శబ్దములు పుట్టినది పలకటానికే, యెవరైనా చెప్పినా అర్థం చేసుకొంటేగా ! తనంతట తను పలికినా యెవరైనా చెప్పితే పలికినా వీటినన్నింటినీ గ్రహించే శక్తి ఒకటే.
పోలీసు: ఒకటేనా చూద్దాం ఆ ఒకటేమిటో అంటూ అమ్మ చేయి పట్టుకుని మెడలో వున్న పులిగోరు గట్టిగా లాగుతాడు. చెయ్యి నెప్పి పుట్టినా రాదు.
అమ్మ : నీ చెయ్యి నెప్పి పుట్టుతుంది, నేను ఇస్తాలే! నేను ఒక సంగతి అడుగుతాను
పోలీసు : ఆ చెప్తా. ఇస్తానంటే చెప్తా..
అమ్మ : యెందుకివ్వను! మాట అంటే యేమిటో యెపుడన్నా విన్నావా, అర్థం తెలుసునా. మాట అంటే మారు మాట లేని మాట. ఆ మాటనే మంటారంటే మంత్రమంటారు. ఉత్తములకు మంత్రం మామూలు. వారికి మారు మాటలేని మాటకు సంఘంలో యేతంటా లేదు. చాలా తంటాలు పడుతున్నామంటారే నీలాంటి మారు మాట గలవారే. ఇంతకు చెప్తావా? (అని పులిగోరు తీసి చేతిలో పట్టుకుని) యిక చెప్పు.
పోలీసు : అడుగు.
అమ్మ : చెయ్యిపట్టు.
పోలీసు : చెయ్యి పడతాడు.
అమ్మ : అరిచేతిలో పులిగోరు పెట్టి, పులిగోరు మీద అమ్మ చెయ్యి పెట్టి ప్రమాణ పూర్తిగా చెప్పు. ప్రమాణమంటే భయము లేదులె ప్రమాణాలకు చాలా అర్థాలున్నాయి. ప్రస్తుతం ఇక్కడ మనస్ఫూర్తిగా అని నీకు ప్రమాణం నేనేలే’ అని పోలీసు వంక చూడగా పోలీసు అమ్మ ముఖము వంక చూస్తూ ఆ ముఖములో వుండే మార్పులు గుర్తిస్తూ అడుగమ్మా అంటాడు. ‘అసలు నీ వుద్యోగమేమిటి. అది వివరించి చెప్తావా నాయనా??
పోలీసు : ఆ! యెవరు యే లోపాలు చేసినా కనిపెట్టి వారిని పట్టుకుని జైలులో పెట్టడం.
అమ్మ : లోపమంటే ?
పోలీసు : దొంగతనం చేసినా, యెవరినైనా చంపినా యింకా నీకర్థం కావు చాలా వున్నయి !
అమ్మ: ఇపుడు నీవు చేసినదేమిటి, యిది దొంగతనం కాదా ? మీకు తప్పులేదా.. నిన్నెవరు పట్టుకుంటారు, ఇంకొక పోలీసు పట్టుకుంటాడా లేక అందరూ ఇంతే చేస్తారా? ఒకరి నొకరు మీలో మీరు అరెస్టు చేయరా ? మీకు తప్పులేదని చెప్పిందా గవర్నమెంటు అని పెద్దగా అంటూ పోలీసు ముఖము వంక చూడగా ఆ పోలీసునకు అమ్మ ముఖము వంక చూడగా ఆ పోలీసునకు అమ్మ ముఖములో అరుణోదయమైన కాంతి గోచరించి అమ్మ ముఖము కనుపించకుండాపోయి ఆకాంతే నిలబడును, 15 నిముషాల పాటు తన చేతిలోని పులిగోరు అమ్మ మెడలో వేసి సమాధానము చెప్పక అమ్మను యెత్తుకుని తన లైనుకు తీసుకుని వెళతాడు. (పోలీసులిళ్లకు) ఆ రాత్రి కొంతమంది పోలీసులు చేరి అమ్మను దగ్గర కూర్చో పెట్టుకుని అమ్మకు తెలియకుండా ఉర్దూ భాషలో అమ్మకు, అతనికి జరిగిన సంభాషణ పోలీసువారికి చెపుతాడు. ఆ చెప్పే దానిలో ఒక మాట తప్పు చెపుతాడు. అమ్మ అందుకుని ‘నేనదేనా అన్నది? అబద్ధమాడతావేం? ఉన్నది వున్నట్లు చెప్పు. కాదు కాదు వున్నది చెప్పలేవు కూడా. జరిగింది జరిగినట్లు చెప్పు’. అమ్మను చూచి అందరూ బిత్తర పోతారు. అందులో ఒక పోలీసు చూచి ‘యిదేదో ఒక మహత్తరమయిన శక్తిలా వుంది. జరిగింది నీవు చెప్పమ్మా’ అంటాడు.
అమ్మ అన్నీ వివరించి చెప్పగా ఆ పోలీసు విని కొన్ని మాటలు గుర్తు రాసుకుంటాడు. రాత్రి 12 గంటలకు అమ్మను తిరిగి యింటికి తీసుకొచ్చి యిద్దరు పోలీసులు దిగిడ్చి పోతారు. అమ్మ అరుగుల మీద పడుకొని తెల్లవారి యింట్లోకి వెళుతుంది. యెవరూ పలుకరించరు. యెవరి పనులమీద వారు వుంటారు. తాతగారు మరిడమ్మగారు వూళ్లో లేరు. అమ్మ మామూలుగా నిత్య కృత్యములు తీర్చుకుని నిన్న జరిగిన సంగతి అనగా పిల్లవాని బైలికి విషయం ఆలోచనకు వచ్చి మేడమీదకు వెళ్లి కూర్చొని ‘నిన్న మ్రింగిన గుడ్డ యింత వరకు బయటకు రాలేదు. లోపల యేమయిన వుంటుందో, జీర్ణము కాలేదేమో ? జీర్ణము కాకపోయినా బాధయేమీ లేదే!’ అని కొంచెం దీర్ఘంగా ఆలోచించగా లోపల వున్న పేగులు, నరములు, కోశములు అన్నీ ఒక్కసారిగా చెప్పటానికి వీలులేనంత కాంతితో పై దేహము కనిపించినట్టుగా తేటతెల్లముగా కనపడును. లోపలకు పోయిన గుడ్డ జీర్ణకోశములో క్రింది. భాగమున చుట్టిన వుండ విడబడి పోయ్యి మీద నీళ్లు తెర్లుతుండగా అందులో వేసిన పదార్థము తెర్లినట్టుగా, లాలాజాలంలో పడి తెర్లుతూ వుంటుంది. ‘యింత వరకు గుడ్డ కరుగుదలకు రాలేదు. నిన్న సాయంత్రము 6 గంటలకు మింగిన గుడ్డ యింతవరకు కరుగుదలకు రాలేదు’ అని కళ్లు మూసుకోగా విరోచనమునకు వెళ్లవలసి నట్లుండును. బయటకు వెళ్లగా మామూలు గుడ్డపీలిక వున్నట్లుగానే వుండును. ‘అన్ని పదార్ధముల లాగా గుడ్డును జీర్ణము చేయగల శక్తి జీర్ణకోశమునకు లేదు. అరిగిన పదార్థాలు భూమిలోనుంచే పుట్టినవి. గుడ్డపీలికా భూమిలో నుంచి పుట్టినదే. గుడ్డపీలిక యెట్లా పుట్టినదో అడుగుదాం తాతగార్ని’ అని ‘ఆఁ యెందుకులే, పత్తిగింజలేగా ఆధారం’,
చిదంబర్రావుగారు మేడమీదకు వచ్చి, ‘అమ్మా! అనసూయా అన్నం తిందువుగాని రావూ!’ అని అడుగుతారు.
అమ్మ : ఆకలి’ లేదు.
తాతగారు : యే కలి లేదు ?
అమ్మ : యీ ‘కలి’లో నాకా’కలి’ లేదు. తాతగారు : అతి సునిశితం (అనుకుంటూ దిగిపోతారు).
అమ్మ కిటికీవంక చూస్తూ కూర్చుండగా ‘అమ్మా! మధూకరం’ అంటూ బిచ్చగాడు. వస్తాడు.
అమ్మ తనకని పెట్టించుకుని తాతకు పెడదామని వెళ్లి ‘యెవరో ఒక ముసలి తాత మధూకరానికి వచ్చాడు కొంచెం అన్నం పెడతారా రాఘవమ్మగారూ’ అని అడుగుతుంది. రాఘవమ్మ : ఇది బ్రాహ్మణ యిల్లు. బోంచేస్తున్నారు. అటుపోయి రమ్మని చెప్పు. అంటుంది.
అమ్మ : : పోనీ నాకు పెడతారా ?
భోజనాల గదిలో కూర్చుని భోంచేస్తున్న తాతగారు ‘యేమిటి అమ్మాయి అంటున్నది’ అని అంటారు. “నాకు కాస్త అన్నం పెడతారా’ అని అడుగుతున్నది అని అంటుంది రాఘవమ్మగారు.
తాతగారు : యిప్పుడు ఆకలిలేదు అనేనే ! రాఘవమ్మ : యెవరో వచ్చాడంట ముసలివాడు వాడికోసరం వంక పెట్టినట్టుంది..
తాతగారు : (చెయ్యి కడుక్కోబోతూ) వంక యెందుకు? ఒక ఆకులో పెట్టి యివ్వండి. రాఘవమ్మ : రోజూ అంతే చేస్తుంది. పెట్టిన అన్నము తీసుకొనిపోయి కుక్కలకు, కాకులకు పెడుతుంది.
చెయ్యి కడుక్కొని ఆమాట వినిపించుకోకుండా వెళ్లిపోతారు తాతగారు.
దర్వాజా పట్టుకుని అమ్మ నిలబడే వుంటుంది. రాఘవమ్మగారు అన్నం పెట్టి యివ్వదు.
అమ్మ ఒక గంటసేపు చూచి వాకిట్లోకి వచ్చి చూస్తుంది. ముసలివాడు వుండడు. వాడిని వెతుకుతూ బజారునకు వెళుతుంది. యీలోగా పది యిళ్లు తిరిగినా ఆనాడు అన్నమే. దొరకలేదు. అమ్మ అతనిని బజారుకు తీసుకుని వెళ్లి మెళ్లో వున్న బంగారపు తాడు, సిగ్గు బిళ్ల యిచ్చి అమ్మ కూడ వుండి బ్యాంక్లో పెట్టించి (అమ్మ కూడా వుండగా ముసలివాడే బ్యాంకె లో పెట్టును) డబ్బు తీసుకుని అతనికి కావలసిన పదార్థములు యిప్పించు చుండును. యింతలో ముసలివాడు పోమాకమ్మా అని ‘సరే’ నీవు యింటికి వెళ్లు నేను కొనుక్కుంటాలే!’ అంటాడు.
అమ్మ : ఆ డబ్బు యిచ్చి వెనుకకు తిరిగి వస్తూ ఆ డబ్బు యెందుకూ ఖర్చు పెట్టవద్దు బియ్యం కొనుక్కొని మూడు కలిపిన కూర చేసుకుని యెన్నాళ్లయినా తినవచ్చు”.
బిచ్చగాడు: ‘యేముందమ్మా యేం డబ్బిచ్చారు కొద్దిగా?’ అంటాడు.
అమ్మ: నీవు చెప్పకపోయినా బ్యాంకావాళ్ళు చెపుతారు. సత్యంగా యిచ్చిన డబ్బంతా పెట్టి బియ్యము, పప్పు, మిరపకాయ, చింతపండు, కట్టెలు కొనుక్కో, నీకు చేసి పెట్టటానికెవరయినా వున్నారా?
బిచ్చగాడు : యెవరూ లేరమ్మా, నేనేదో వేదాంతములో పడిపోయి పిల్లలను, భార్యను వదిలేసి ఒక గురువుగారిని ఆశ్రయించాను.
అమ్మ : సరే అన్నీ రేపు చెపుదువుగానిలే ! నీకిచ్చిన డబ్బుతో అబద్ధమాడకుండా. || అవసరమయిన వరకు వాడుకో. మరల నేనేమీ తీసుకోనులే, నీవద్ద నుండి. అని యింటికి వచ్చి కాసేపు (5 నిమిషములు) మేడమీద కూర్చుని మళ్లీ మర్రిచెట్టు క్రిందకు వెళ్లుచుండగా రైలు అవతల వున్న కొబ్బరితోటలో నుంచి తాతగారు వస్తూ అమ్మను ‘యెక్కడికమ్మా పోతున్నావ’ ని అడుగుతారు.
అమ్మ : ఐలూరు కాంతమ్మ గారి యింటికి.
తాతగారు తొందరగా రామ్మా! మీనాన్న మన్నవ నుంచి యీ బండికి యేమైనా దిగాడా ?
అమ్మ : దిగలేదు.
తాతగారు : నీ కోసరము నేను వచ్చేదా ? నీవే వస్తావా ?
అమ్మ : నాకోసరము నీవేమీ మానుకోవద్దు. నా కాలయితే నేనే వస్తా అంటూ కట్టుకుపోయిన జుట్టుతో అమ్మ మర్రిచెట్టు క్రిందకు వెళుతుంది.
(సశేషం)