బాల్యం:
గత సంచికలో: అమ్మకు ముద్దకుడుముల వేడుక వైభవంగా జేసి, అమ్మను ఆ రాత్రి గొల్ల నాగమ్మను పిలిచి, ఆ రోజు మంచి రోజని, తన యింటికి తీసుకుపోయి రోజూ రెండుసార్లు తీసుకువచ్చి అమ్మాయికి (అమ్మమ్మకి చూపించమని తాతమ్మగారు చెప్తారు. అమ్మ నాగమ్మ యింట్లో కులాసాగా, యింటికి వస్తూ, పోతూ, 14 మాసముల వఱకు పెరుగును.
తరువాత……
– సంపాదకులు
7
అమ్మకు పదిహేనో నెల.
గొల్ల నాగమ్మ అమ్మను యింటికి తీసుకొస్తూ వుండగా మన్నవ మునసబు గారి భార్య పులిపాక సీతమ్మగారు; ఆమె “ఆ బిడ్డను యిటు తీసుకురాదే నేను చూస్తాను” అంటుంది. దగ్గరకు తీసుకురాగానే చేతికి తీసుకుని యింట్లోకి తీసుకువెళ్లి మంచమువేసి పడుకోన బెట్టుకుని కాసేపు అమ్మతో ఆనందంగా కాలం గడుపుతుంది. నాగమ్మతో “రోజూ యిటు వెళ్లేటప్పుడల్లా నాకు చూపించు. నేనూ కాసేపు అట్టే పెట్టుకుని పంపిస్తా మెతుకు కూడా నువ్వేనా ఏమిటి పెట్టటం ఖర్మ !”
నాగమ్మ : లేదమ్మా పాలయినా యిస్తేనే తాగుతుంది. అనిచెప్పి అమ్మను తీసుకు వెళ్లుతుంది. రోజూ యిట్లాగే జరుగుతూ వుంటుంది.
తరువాత మరిడమ్మగారు ఊరు నుంచి వచ్చి, నాగమ్మతో ‘నేను వచ్చానుగా అమ్మను నేను అట్టే పెట్టుకుంటాను మరికొంచెము సేపు నీవు వుండి వెళుతూ వుంటే సరిపోతుంది’ అమ్మ యింటికి తీసుకొని వస్తారు.
ప్రతిరోజూ నాగమ్మ యింటివద్ద కూడ అమ్మ కొంతసేపు ఉంటూనే వుంటుంది. అమ్మకు యిప్పటికి 17 నెలల 15 రోజులు.
అమ్మ యిప్పటికి ఒకసారి తనంతట తాను అన్నమును నోటిలో పెట్టుకున్నది. మరొకసారి తెనాలిలో అమ్మ మేనమామ శ్రీ చంద్రమౌళి సీతారామయ్యగారు అమ్మకు అన్నము పెట్టారు. యింత వరకు యీ రెండుసారులే.
మరిడమ్మగారు యింటిలో యెప్పుడూ సత్కాలక్షేపము చేస్తూ వుండేది. అమ్మకు ప్రతీదీ అర్ధము అవుతూనే వుండేది. ఒకరోజున అమ్మ యేదో ఆలోచిస్తున్నట్లుగా తలకింద చెయ్యి పెట్టుకుని గుండెమీద చెయ్యి వేసుకొని వెల్లకిలా పడుకుంటుంది. బాపట్ల నుంచి అదే సమయములో చంద్రమౌళి చిదంబర్రావుగారు (అమ్మకు చిన తాత, పెంచినవారు) వచ్చి అమ్మను చూచి, ‘ఏమి యీమె దీర్ఘాలోచనా నిమగ్నురాలై వున్నదే! అని అమ్మను పైకెత్తుకుని ముద్దు పెట్టుకుని ‘చాలా ప్రశాంతం, చల్లనిమూర్తి మంచి యోచన’ అని యంటారు. ‘అయినా యెందుకు నేను యెత్తుకోవటం, లక్ష్మిని యెత్తుకునే చాల విచారపడ్డాను. యెవరినీ అలవాటు చేసుకోకూడదు’. (లక్ష్మి అనగా అమ్మకు గతించిపోయిన అక్కగారు. అమ్మకు రాఘవరావు అనే అన్నగారు గలరు). చిదంబర్రావుగారు అమ్మను ముద్దుపెట్టుకుని దించివేస్తారు.
అమ్మకు 19 నెలల వయస్సు.
ఒక రోజు సాయంకాలము గం. 5.30 లకు యింటికి యెదురుగా వున్న రాజమ్మగారి యింటికి చిట్టి చిట్టి అడుగులు వేస్తూ వెళ్లి దానిమ్మ చెట్టుకింద కూర్చుని నల్లగుడ్డు పైకి పోనిచ్చి అరమోడ్పు కన్నుతో పద్మాసనము వేసి కూర్చొనెను. యింతలో బావినీళ్లకు వెళ్లిన రాజమ్మగారు వచ్చి అమ్మ పద్మాసనము చూడక ముఖము వంక చూచి అమ్మో చిన్న బిడ్డ నెప్పి వచ్చినదని అమ్మపైన బిందెడు నీళ్లు కుమ్మరించును. అయినను అమ్మ కదలదు. వెంటనే బింది క్రింద పారవైచి రాజమ్మగారు నోరు నోరు కొట్టుకొని సమాధి స్థితిలో వున్న అమ్మను భుజముమీద వేసుకుని అమ్మ యింటికి తీసుకుని వెళ్లును. పద్మాసన మటులనే యుండును. యిది చూచి యింట్లోవారు వైద్యుల కోసము పరుగెత్తుదురు. మన్నవ కృష్ణశర్మగారు (వైద్యులు) వచ్చి ఆయనయు అమ్మకు జబ్బుగా భావించి ఉల్లిపాయలు, జిల్లేడు రసము ముక్కులలో పోయుట, యెగుర వేయుట మొదలగు చికిత్సలు చేయుదురు. చికిత్సలు చేసినప్పుడు జాగ్రత్త రాక తరువాత అరగంటకు అమ్మకు జాగ్రత్త వచ్చును. యిది వైద్య ప్రభావమని అందరు అనుకొందురు. రెండు రోజులు అయిన తర్వాత అమ్మమ్మ, అమ్మ తెనాలి వెళతారు. అక్కడ ఒక దానిమ్మ చెట్టుక్రింద నల్లగుడ్డు పైకి పోనిచ్చి అరమోడ్పు కన్నుతో చేపనిద్ర మాదిరిగా యెడమ కాలును చాచి కుడికాలును వెనక్కు పోనిచ్చి దానిమ్మ పువ్వును చేతిలో పట్టుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసలాగిపోయి కూర్చుని వున్న అమ్మను, అమ్మ పెదతల్లి అన్నపూర్ణమ్మ అమ్మ లేవబోయే సమయమునకు వచ్చి ‘ఎందుకమ్మా అట్లా కూర్చున్నావు’ అనగా “శాంభవీ ముద్రలే” అంటుంది అమ్మ. ‘నీకెవరు చెప్పారమ్మా!’ అని అన్న పూర్ణమ్మగారు అడుగుతుంది.
అమ్మ : మరిడమ్మ తాతమ్మ చెప్పిందిలే.
అన్నపూర్ణమ్మ : చెప్పిందా ? చేస్తుంటే చూచావా !
అమ్మ : చేస్తుంటే చూచాను. అడగ్గా చెప్పింది. (అంటుంది అమ్మ)
అన్నపూర్ణమ్మగారు అమ్మను పిలిచి ‘రంగమ్మ తల్లీ పోయిన పిల్లలు పోయినా, యింతవరకు అదృష్టవంతురాలవమ్మా ! యీ బిడ్డ చాలు !’
– (సశేషం)