మహాపురుషులలో రెండు రకాల వ్యక్తులున్నారు. ఒకరు జన్మతః పుట్టుకతోనే మహాత్ములుగా పుట్టడం. రెండవవారు సాధనా బలంచేత స్వయంకృషిచేత మహా పురుషులుగా అవతరించడం. జిల్లెళ్ళమూడిలో “అమ్మ”గా ప్రసిద్ధి చెందిన మాతృశ్రీ అనసూయాదేవి మొదటి తరగతికి చెందిన సాధ్వి. ‘నిజానికి గొప్పదనానికి కొలత బద్దలేద”ని ఒక సందర్భంలో నాతోనే అమ్మ అన్నది. అది అంతరంగానికి సంబంధించిన అనుభూతి. అందువల్ల అమ్మ అంతరంగం అర్థం కాదు. ఆమె జీవితం ప్రధానంగా గుహ్యమైనది. కారుణ్యమూర్తి. మాతృత్వానికి ప్రతీకం.
ఒకచోట శ్రీ అరవిందులు అన్నారట. “నా జీవితం ఎవరూ వ్రాయలేరు. అది నా ఉపరితలంపై కనబడేది గాదు” అని అన్నారట. అమ్మ మాతృత్వం చూచి మాతృత్వం అంటే “ఇదా” అని సామాన్యజనం పాఠం నేర్చుకోవలసి వస్తుంది. సామాన్య స్త్రీ మాతృత్వం చాల సంకుచితమైనది; స్వార్థంతో కూడినది. కాని, అమ్మ మాతృత్వం అంటే సమస్త ప్రాణికోటితో తాను తాదాత్మంచెందినట్లుగా కనబడుతుంది. ఒక చోట అమ్మ అన్నది “నీవు నీ శిశువులో ఏమి చూస్తున్నావో ఇరులలో కూడ అదే చూడటం మాతృత్వం’ అన్నది. అమ్మ ఏ చదువుసంధ్యా లేకపోయినా, పూర్వ సంప్రదాయంలో పుట్టి పెరిగినా, అక్షర జ్ఞానం లేకపోయినా ఆమె స్థితి, స్థాయి, భగవద్విభూతి, భగవల్లీల. ఒక చోట అన్నది అమ్మ “నా అంత అదృష్టవంతురాలు ఎవ్వరూ లేరు. “ఎందుచేత నంటే నాకు “ఇది” కావలెననే కోర్కె లేదు” అని. అన్ని కోర్కెలూ జయించిన “తృప్తే ముక్తి” అనే “తురీయం” ఆమెది. అది స్థితికాని స్థితి. ఇంతకన్న జన్మసాఫల్యం మరొకటి ఏముంది ?
ఒకరి గొప్పదనం అర్థం చేసికోవాలి అంటే, అర్థం చేసికొనేవాడు కూడ గొప్పవాడై ఉండాలి. అమ్మ ముఖంలో పర్వదినాలలో ఒక్కొక్కసారి బ్రహ్మవర్చస్సు కొన్ని నిముషాలు ఉండటం గమనించాను. కాని కొంతమంది కాదు.చాలామంది, గొప్పదనాన్ని లీలలు, మహాత్మ్యాలను ప్రదర్శించాలనుకుంటారు. సందర్శకుల స్వార్ధప్రయోజనాలు నెరవేరాలని, వారి భవిష్యత్తు చెప్పాలని, పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలని, అనుకున్న వివాహాలు జరగాలని, అధికారాలు, పదవులు కావాలని, కోర్టు వ్యాజ్యాలలో గెలవాలని మొదలైన స్వార్థమైన కోర్కెలతో వచ్చి ఆశీర్వదించమని అడిగేవారు. ఇవి దురదృష్టకరమైన నీచమైన కోర్కెలు. కాని ఆశీర్వచనమంటే అనుకూలమైనా, ప్రతికూలమైనా ఆశీర్వచనమే. భగవంతుని నిర్ణయమే వర్ధిల్లాలని అనేది ఆశీర్వచనం. “సర్వేజనాస్సుఖినోభవంతు” అని ఆర్యోక్తి. కాని అమ్మ సర్వజనులు మాత్రమే కాదు, “సమస్త జీవకోటిసుఖినోభవంతు” అని ఆమె సంకల్పం.
డాక్టర్ శ్రీపాదగోపాలకృష్ణమూర్తి గారు “అమ్మ సూచించే కొత్తదారి” అని వ్రాశారు. చెప్పే విధానం మాత్రం. కొత్తది. ఒకే సత్యాన్ని అనేకమంది అనేక రకాలుగా చెప్పారు. గాని అమ్మ గొప్పసంఘసంస్కర్తగా కనిపిస్తుంది. ఆమె సంస్కరణ స్థూలమైనది, పాక్షికమైనది గాదు. అది సమూలమైన సంస్కరణ. సంఘసంస్కర్తలకు సంస్కర్త. హేతువాదులకు హేతువాది. వేదాంతులకు వేదాంతి, జ్ఞానులకు మహాజ్ఞాని. తత్త్వవేత్తలకు తత్త్వవేత్త. ఎవరు ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో అమ్మదర్శనం ఇస్తుంది. ఆమె సూక్తులు, మహావాక్యాలు, సుభాషితాలు చదువుతుంటే నిజంగా అమ్మ చెప్పిన వాక్యాలేనా అని దిగ్భ్రాంతి. కలుగుతుంది. ఆమె గొప్ప ఆశుకవిగా, స్వతఃస్ఫురణతో చెప్పిన వాక్యాలలో భావ గాంభీర్యం స్ఫురింస్తుంది.
అమ్మ దర్శనం చేసిన తర్వాత, అమ్మతో సంభా షించిన తర్వాత, అమ్మ వాక్యాలు చదివిన తర్వాత, అమ్మ
జీవితం అధ్యయనం చేసిన తర్వాత మనలో ఒక revolution రావాలి, ఒక పరివర్తన రావాలి. లేకపోతే evolution ఆగిపోతుంది. మన రాకపోకలు యంత్ర ప్రాయంగా, తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదంగాఉండకూడదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండకూడదు. దేవాలయాలలో కొబ్బరికాయలు కొట్టడం, హారతులు ఇవ్వడం, నైవేద్యాలు ఇవ్వడం, అభిషేకాలు చేయడం, తిరుపతి వెళ్ళి మొక్కులు ఇచ్చి గుండుకొట్టించు కోవడం ముఖ్యం కాదు. కీర్తి కండూతి, అరిషడ్వర్గాలు, స్వార్థం, కులమత వైషమ్యాలు, రాగద్వేషాలు, అధికార వ్యామోహాలు, పదవీ కాంక్ష, ధనదాహం, అన్నిటిని విసర్జించాలి. క్షుద్రమైన కోర్కెలకు స్వస్తి చెప్పాలి. అమ్మ ఆశించిన “విశ్వకుటుంబం” మాటలలో కాకుండా అక్షరాలా చేతలలో కనబడాలి. అమ్మ స్థాయికి మనం ఎన్నటికైనా ఎదగగలమా! కనీసం ప్రయత్నమైనా చేయాలి.
అమ్మను కనీసం ఒక డజనుసార్లు దర్శించాను. సంభాషించాను. ఆమె అంతరంగం, ఆమె అనుభూతి, అంతస్థు ఇంతవరకు నాకు అంతుబట్టలేదు. ఆమె రూపం ధరించిన ప్రకృతి మాతగా అనుకుంటున్నాను. ఆమె రాజరాజేశ్వరి అంటారు. రాజరాజేశ్వరి ఎలా ఉంటుందో నాకు తెలిస్తేగా ! కాని, అమ్మ లాంటి వ్యక్తిని భూమండలంలో నేను ప్రత్యక్షంగా ఎక్కడా చూడలేదు. ఆమె ఊహకు అందదు. ఆమె ఒక భగవల్లీల, ఒక “చిత్కళా”. ఆమె చెప్పిన ప్రతి వాక్యానికి భాష్యం అవసరం. అమ్మ భావాల పోలికలు జీసస్ ప్రభువు, షిర్డిసాయిబాబా, జిడ్డు కృష్ణమూర్తి, గౌతమబుద్ధుడు, రమణమహర్షి మొదలైన వారిలో కనిపిస్తాయి ఆమె ఆస్తికురాలు అనలేము. ఆమె Agnostic గా కనిపిస్తుంది. ఆమె సూక్తులలో చమత్కారం; ఆశుకవిత్వం, జ్ఞానం అన్నీ కలిసి ఉంటాయి. ఆమె చెప్పిన విప్లవాత్మకమైన కొన్ని మహావాక్యాలు-
1) నా దృష్టిలో వితంతువులు లేరు; భర్తను మరచిపోవడమే వైధవ్యం. 2) అన్నం పరబ్రహ్మ స్వరూపమైతే అశుద్ధమో 3) శరీరం ఆత్మ కాకపోలేదు. 4) నాల్గు వేదాలు = రోలు రోకలి చీపురు, చాట. 5) పెట్టింది ముహూర్తం
కాదు, జరిగింది ముహూర్తం. 6) దయ్యాలు లేవు; దయ లేని మనస్సే దయ్యం. 7) తిథులు విధిని మార్చలేవు. 8) సర్వసమ్మతమే నామతం – ఇలా విప్లవాత్మకమైన వాక్యాలు అనేకం చెప్పింది అమ్మ. కొందరు అడుగుతారు “అమ్మ. గొప్పదనం ఏమిటి? ఆమె వల్ల మనకు ప్రయోజనం ఏమిటి? ఆమె భవిష్యత్తు ఏమైనా చెప్పుతుందా? మన కోరికలు తీరుతాయా? ఏదైనా జరిగేది జరగనిది చెప్పుతుందా?” అని. ఇవేమీ చెప్పదు. ఏ కోరికలూ నెరవేరవు. నేను అటువంటి కోరికలతో వెళ్లలేదు. కాని ఏదో ఒక విశ్వాసంతో వెళ్లాను. ఆమె ప్రేమ మూర్తి. అందరినీ ఏ విచక్షణ లేకుండా సమభావనతో ఆదరిస్తున్నది. భగవద్గీత రెండవ అధ్యాయంలో పేర్కొన్నట్లుగా “స్థితప్రజ్ఞ” గా కనబడుతుంది. మాతృత్వం కనబడుతుంది. ఆమెకు తెలియని విషయంలేదు. లౌకికము, పారమార్థికము రెండూ అంతే. ఆమె నాకు రెండు విధాలుగా స్ఫురిస్తుంది. “మాతృమూర్తిగా, మహాజ్ఞానిగా” ఆమె అక్షరాలా అనుష్ఠాన అనుభవ వేదాంతి. ఆమె దగ్గర నేర్చుకోవలసినది “జ్ఞానం”. ఆమెతత్వం ఎక్కువగా జీసస్ ప్రభువు, జిడ్డుకృష్ణ మూర్తిలో కనిపిస్తుంది. అమ్మ కాని, జిడ్డుకృష్ణమూర్తి కాని చెప్పేది ఒక్కటే, త్రికాలాలు లేవు. మతాలు, కులాలు లేవు. సంప్రదాయం లేదు. ప్రయత్నం కూడ అక్కరలేదు. అన్నీ విధి ప్రకారమే జరుగుతాయి. ప్రయత్నం వేరు, ప్రేరణవేరు కాదు. ప్రేరణవల్లనే ప్రయత్నం జరుగుతుంది. నీకు ఎలా తోస్తే అలా చేయి. అద్వైత సరిహద్దులకు తగులుతుంది. ఇంతకన్న భావవిప్లవం మరొకటిలేదు. అమ్మ చెప్పే సారాంశం ఒక్కటే – “తృప్తేముక్తి”.
అమ్మ ఆశయం సార్ధకం కావాలంటే జిల్లెళ్ళమూడిని ఒక ఆదర్శగ్రామంగా, ధర్మానికి నిలయంగా, ధర్మరాజ్యంగా తీర్చిదిద్దడం చాల అవసరం. వసుధైక కుటుంబానికి సంకేతంగా రూపొందించడం అవసరం.
పరంపరంగా వస్తున్నటువంటిదాన్ని సంప్రదాయమంటారు. పరంపరంగా వచ్చిన ఆచారమని. కేవలం పదిమంది చెయ్యటం వల్ల మాత్రమే బలం కూర్చుకున్నది సంప్రదాయమేమో!
– అమ్మ