1956 నుంచి నాకు జిల్లెళ్ళమూడి బాగా గుర్తు ఉంది. అప్పటికి నాకు పదేళ్ళు. అమ్మ, నాన్నగారు, హైమ, సుబ్బారావు అన్నయ్య, నేను ఉండేవాళ్ళం. రోజూ ఉదయం ఎలిమెంటరీ స్కూలుకు వెళ్ళేవాణ్ని. మధ్యలో వచ్చి అన్నం తిని అమ్మను వదిలి మళ్ళీ వెళ్ళాలంటే దిగులుగా ఉండేది. బలవంతంగా తీసుకు వెళ్ళేవారు.
ఒక రోజున కాఫీ కప్పు పరిమాణం బియ్యంతో అమ్మ అన్నం వండింది. ఆ రోజు అమ్మను చూడటానికి 16 మంది వచ్చి ఉన్నారు. “అమ్మా ! ఇది నాకే సరిపోడు. వీళ్ళందరికీ ఎలా?’ అని అడిగాను. “నీకు కావలసింది నువ్వు తినరా. నీకెందుకు?” అని నవ్వుతూ భుజం తట్టింది. ఆ అన్నం అందరికీ సరిపోయింది. అది అద్భుతం అని ఆ రోజుల్లో నాకు తెలియదు.
ఆ రోజుల్లో అమ్మ దగ్గరికి వచ్చేవాళ్లకి ప్రసాదంగా ఇవ్వటానికి ఏమీ ఉండేదికాదు. అక్కడ ఉన్న మట్టి తీసి అమ్మ ప్రసాదంగా ఇచ్చేది. కానీ ఆ మట్టి అద్భుతమైన సువాసనల నిచ్చేది. నాకు అనుమానం వచ్చింది. ఏమైనా సాంబ్రాణి కడ్డీ కలిపారేమోనని. చిన్నవాణ్ని కాబట్టి అరమరికలు లేకుండా “అమ్మా ! ఇందులో సాంబ్రాణి కడ్డీలు కలిపావా?” అని అడిగాను. అమ్మ నవ్వేసి ఊరుకున్నది. ఎక్కడో పారవేసిన గాళ్ళన్నీ ఏరుకు వచ్చి “ఈ వాసన దీనికి తెప్పించు చూద్దాం” అన్నాను. అమ్మ నవ్వుతూ వాటిని తాకి ఇచ్చింది. అవి సువాసనలు వెదజల్లాయి. అలా అద్భుతాలు జరిగాయని నాకు అప్పట్లో తెలియదు. నేను అమ్మతో ఆడుకున్నాను; అమ్మ నాతో ఆడుకున్నది.
క్రమేణా జనం పెరిగారు. మొదట్లో చీరాల నుంచి 20 మంది వారం వారం వచ్చేవారు. ఏవో సంభాషణలు చేసేవాళ్లు. వాళ్ళకి అమ్మే వంట చేసి పెట్టేది. అమ్మకి – ఓపిక లేకపోతే ప్రభావతి అక్కయ్య చేసిపెట్టేది. ఒకరోజున చీరాల నుంచి పోట్లూరి సుబ్బారావుగారు వచ్చారు. ఒక స్త్రీకి నమస్కారం చేయటమేమిటి? నేను చేయను అని నిశ్చయించుకొని రెండు చేతుల్ని గట్టిగా జేబులో పెట్టి గట్టిగా బిగబట్టి లోపలికి వచ్చారు. వస్తూనే కాళ్ళు, చేతులు వణికాయి. అప్రయత్నంగా చేతులు అమ్మ పాదాలపై పెట్టి పడిపోయారు. తర్వాత వారే స్వయంగా వారి అనుభవం నాకు చెప్పారు.
తర్వాత కాలంలో 20 మంది, 30 మంది అలా వందలు, వేలు రావటం మొదలైంది. ఆ రోజుల్లో జిల్లెళ్ళమూడికి రోడ్డు లేదు. వాహనాల రాకపోకలు లేవు. ప్రతి ఏటా వర్షాకాలంలో వరదలు వచ్చేవి. అమ్మ ఉండేది పూరిపాక. అయినా వాళ్ళంతా కష్టాల కోర్చి వచ్చేవాళ్ళు. అమ్మను చూసి దుఃఖించేవాళ్ళు. వాళ్ళు విడిచి వెడుతూంటే మాకు దుఃఖం వచ్చేది. వాళ్ళకోసం బెంగ, రాకపోతే దుః వచ్చేది. వాళ్ళు ఎవరో తెలియదు. కానీ వాళ్ళతో అనుబంధం అలా ఉండేది.
నాడు జిల్లెళ్ళమూడిలో ‘అంతా వ్యవసాయం కూలీలే; పేదలే. ధనికులు, రైతులు లేరు. ‘ఇంటింటా పిడికెడు బియ్యం’ పధకాన్ని పేద ప్రజలకు అనుకూలంగా అమ్మ ప్రవేశపెట్టింది. అన్నం వండుకునే ముందు ప్రతి ఇంటా గుప్పెడు బియ్యం తీసి ప్రక్కనపెట్టి అలా కూడబెట్టిన బియ్యాన్ని లేనివాళ్ళకి, కష్టాల్లో ఉన్నవాళ్ళకీ ఇచ్చి ఆదుకునేవాళ్లు. ఒక కోఆపరేటివ్ సిస్టమ్ గా నడిచింది.
అమ్మ దగ్గరికి కమ్యూనిష్టులు, నాస్తికులు, తీవ్రవాదులు సైతం అనేక రకాల, వాళ్ళు వచ్చేవారు. ఒకసారి చివుకుల శేషశాస్త్రి గారనే ఒక కమ్యూనిష్టు నాయకులు అమ్మ వద్ద 20 రోజులు తలదాచుకున్నారు. ఆ రోజుల్లో కమ్యూనిష్టుల్ని కనిపిస్తే కాల్చి చంపేవారు. ‘అమ్మ నన్ను ఆప్యాయంగా చూస్తోంది. నా సిద్ధాంతం, నా ధర్మం నాకున్నవి. నేను ఇలా ఉండకూడదు. వెళ్ళిపోవాలి’ అని అన్నారు. ఇంకో నాలుగు రోజులు ఉండమని అమ్మ కోరింది. అమ్మ మాట వినకుండా వారు వెళ్ళిపోయారు. పెదనందిపాడు చేరేసరికి వారిని కాల్చి చంపారు. వారి స్మారక విగ్రహం ఇప్పటికీ బాపట్లలో ఉన్నది.
అమ్మ తత్త్వచింతనకి శ్రీకారం అమ్మ బాల్యంలోనే చుట్టబడింది. నేటికి ఫలించింది. కొన్ని ఉదాహరణలు. గుంటూరులో గుండేలురావు గారని ఉండేవారు. వారికి పక్షవాతం 25 ఏళ్ళుగా మంచానపడి బాధపడుతున్నారు. అమ్మ 15 రోజులు స్వయంగా వారికి సపర్యలు చేసింది. అపుడు అమ్మ వయస్సు 5 ఏళ్ళు. అమ్మలో వారు తన ఇష్టదైవం శ్రీరామచంద్రుని దర్శించి పులకించారు. ఆ సంగతే వారి అన్నగారితో, అనసూయ మామూలు పిల్లకాదు. నా రఘురాముడే. ఈ తల్లిని నువ్వు నమ్ముకో. పూజించు. నేను బ్రతికి ఉంటే ఈ సత్యాన్ని వేనోళ్ళ చాటీ వాడిని’ అని విన్నవించుకున్నారు. నేడు మనం నిర్వహించుకునే సదస్సు, అమ్మ సందేశ ప్రచారానికి ఆనాడే సంకల్పించారు. ఇప్పటికి సఫలీకృతం అయింది.
అంకదాసు, మస్తాన్, అమ్మలో బాల్యంలోనే అలౌకికతని దర్శించారు. “ఆకారమే వికారంతో వచ్చింది; అనుకున్నది జరగదు, తనకున్నది తప్పదు” వంటి వాక్యాలు విన్న చిదంబరరావు తాతగారు ఆశ్చర్యచకితులైనారు. ‘కాళి’ అనీ, ‘శబ్దమంజరి’ అని కీర్తించారు. శ్రీ రాజరాజేశ్వరీ శతకాన్ని రచించారు. వారింట పనిమనిషి నల్లి క్రైస్తవ మతస్థురాలు. ‘నువ్వు పాపాయివి కాదు. ఏసయ్యవు. నువ్వు తండ్రిని కన్న తల్లివి, మరియమ్మవు’ అని తన దర్శనాన్ని వివరించింది.
వ్యక్తిగతంగా ఏనాడో అనేకులు అమ్మ తత్త్వ చింతన చేశారు. పదిమందికీ చెప్పాలని తహతహలాడారు. వారి సంకల్ప బలం నేటికి క్రియారూపం ధరించింది. తర్వాత రాజుబావ వచ్చారు. అమ్మ తత్త్వాన్ని కీర్తిస్తూ అద్భుతమైన పాటలు వ్రాశారు. తర్వాత శ్రీ గంగరాజు వేంకటేశ్వరరావు గారు, శ్రీ పాదగోపాలకృష్ణమూర్తిగారు, ఆచార్య ఎక్కిరాల భరద్వాజ, డాక్టర్ ప్రసాదరాయకులపతి, శ్రీ పూర్ణానంద స్వామీజీ, శ్రీ లక్ష్మణ యతీంద్రులు, శ్రీ రఘువరదాసుగారు ఎందరో మహాత్ములు వచ్చారు. అధ్యయన పరిషత్తులు, అనేక గ్రంథాలు, అసంఖ్యాక రచనలు, అమ్మ సినిమా వచ్చాయి.
లోగడ హైదరాబాద్లో అమ్మ తత్త్వచింతన సదస్సు మొదటిసారిగ పెద్దస్థాయిలో నిర్వహించబడింది. 25 ఏళ్ళ తర్వాత విస్తృతస్థాయిలో మరల సెమినార్ నిర్వహించ ఇక్కడ అందరింటి సభ్యునిగా విజయవాడ, విశాఖపట్టణం, హైదరాబాద్ వంటి నగరాల్లో పలుప్రాంతాల్లో ఈ రీతిగా అమ్మతత్త్వచింతన సదస్సులు, తద్వారా అమ్మ సందేశవ్యాప్తి జరగాలి అని కోరు కుంటున్నాను. అది మనందరికి ఆనందదాయకం. మన ధర్మం.