1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మ తత్త్వాచరణస్పూర్తి – శ్రీ వఝప్రసాద్ అన్నయ్యగారు

అమ్మ తత్త్వాచరణస్పూర్తి – శ్రీ వఝప్రసాద్ అన్నయ్యగారు

A V R Subramanyam
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : February
Issue Number : 7
Year : 2022

‘నీ పాద కమల సేవయు

నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం

తాపార భూత దయయును

తాపసమందార నాకు దయసేయగదే’

అది మాలాకారుడైన సుదాముడు అనే భాగవత శ్రేష్ఠుడు శ్రీకృష్ణపరమాత్మకు చేసుకున్న అభ్యర్థన. అందుకు నేటి ఆచరణ రూపం శ్రీ వఝప్రసాదరావు అన్నయ్య.

శ్రీ ప్రసాద్ అన్నయ్య రెండవ తరం అమ్మ భక్తులు. వారి తండ్రి శ్రీ వఝ శివరామకృష్ణగారూ అమ్మని ఆరాధించిన వారే. అదృష్టం 3వ తరం ప్రసాద్ అన్నయ్య గారి కుటుంబసభ్యులు అమ్మసేవలో తరిస్తున్నారు. శ్రీశివరామకృష్ణగారు తమ పెద్దకుమారుడైన ప్రసాద్ గారికి తన మేనకోడలు అరుణతో వివాహం జిల్లెళ్ళమూడిలో పరమేశ్వరి అమ్మ చేతుల మీదుగా జరిపించుకున్నారు.

వృత్తిరీత్యా ప్రసాద్ అన్నయ్య Deputy Commissioner for Govt. Exams గా పనిచేసి పదవీ విరమణ చేశారు.

వారిపై అమ్మ అపార అనుగ్రహానికి ఒక ఉదాహరణ. 1973 మార్చి నెలలో వారికి అకస్మాత్తుగా శ్వాస ఆగిపోయింది. B.P.65/40కి పడిపోయింది. వైద్యులు భయపడ్డారు; మందులు విఫలమైనాయి. ఆ విషమపరిస్థితిని అమ్మకు నివేదించారు. వెంటనే అమ్మ వారి సోదరుడు మల్లుగారితో పాదతీర్థాన్ని పంపింది. అది అమృతమే. స్వీకరించిన తక్షణం ఆరోగ్యం కుదుటపడింది; మాతృశ్రీ స్వర్ణోత్సవాల్లో ఒక గాడిపొయ్యివద్ద వంట – వడ్డన బాధ్యతను స్వీకరించి జయప్రదంగా నిర్వహించారు. గండం గడిచినా దానిని తలచుకొని ప్రసాద్ అన్నయ్య భయపడుతుంటే అమ్మ “ఎందుకురా అట్లా భయపడతావు? నీ వెన్నంటి నేను లేనూ?” అంటూ వీపు మీద తట్టింది. అంతే. వారికి భయం శాశ్వతంగా పోయింది. ఆ విధంగా వారికి అమ్మ ప్రాణదానం, అభయప్రదానం చేసింది. నిరంతరం అమ్మ సేవయే శ్వాసగా జీవించారు.

అందుకు ఉదాహరణలు కోకొల్లలు.

  • అమ్మ చలనచిత్ర ప్రదర్శనకి విశేష కృషి చేశారు.
  • మాతృశ్రీ ఓరియంటర్ కళాశాల, సంస్కృత పాఠశాల, మాతృశ్రీ మెడికల్సెంటర్, మాతృశ్రీ గోశాల మున్నగు అమ్మ సేవాసంస్థల నిర్వహణకి భూరి విరాళాలతో పాటు సహాయ సహకారాల్ని అందించారు.
  • హైదరాబాద్లో నాంపల్లిలో ఏటా ‘All India Industrial Exhibition’ లో అమ్మ స్టాలు నెలకొల్పి సందర్శకులకు అమ్మ సాహిత్యాన్ని, తీర్థప్రసాదాల్ని అందించారు; 80 ఏండ్ల వయోభారంతో One man army గా ఊపిరి ఉన్నన్నాళ్ళూ శ్రమించారు.

2011 నుండి జిల్లెళ్ళమూడి అమ్మసేవాసమితి అధ్యక్షులుగా హైదరాబాదులో చేపట్టిన కొన్ని కార్యక్రమాలు:

  • భాగ్యనగరంలో అమ్మ ఆలయనిర్మాణం నిమిత్తం కొనుగోలు చేసిన స్థలానికి పట్టాలు రాబట్టి, Fencing వేసి భద్రపరిచారు.
  • ఏటా అమ్మ జన్మదినోత్సవం, కళ్యాణ దినోత్సవాలను నిర్వహించారు.
  • నెల నెల అమ్మపూజలు, అమ్మతత్త్వ ప్రచారం నిర్వహించారు.
  • ‘మాతృగీత’ సి.డి. ఆవిష్కరణ, ‘మహస్సు’ గ్రంథావిష్కరణ వంటి కార్యక్రమాలకి సహాయ సహాకారాల్ని అందించారు.
  • 450 మంది కుష్ఠువ్యాధి పీడితులకు అమ్మ అన్నప్రసాదాల్ని అందించారు.
  • 250 మంది వికలాంగులకు వస్త్రవితరణ చేశారు.
  • అగ్నిప్రమాద బాధిత 500 మంది అభాగ్యులకు చీరెలు, చొక్కాలు, లాగులు పంచారు.
  • ‘ప్రేమార్చన’ పేరిట నెలకి 20 పైగా వివిధ కేంద్రాలలో అనాధలు, వృద్ధులు, వికలాంగుల శరణాలయాల్లో అన్నవస్త్ర వితరణ గావించారు.
  • వృద్ధులైన (Senior Citizens) అమ్మబిడ్డలను ఆదరించి నూతన వస్త్రాలతో సన్మానించారు.
  • ఫుట్పాత్ల పై శీతాకాలం చలిలో వణుకుతూ నిద్రించు అభాగ్యులకు రగ్గులు కప్పి మానవసేవలోనే మాధవసేవ చేశారు.

సుమారు ఏడాది క్రితం heart సమస్యతో stent వేయించుకున్నారు. అమ్మను తన హృదయపీఠంపై సుప్రతిష్ఠిత చేసికొని, పదిమంది కోసం పదిమందితో కృషిచేయడమే తపస్సుగా జీవిస్తున్నారు. ఇటీవల శ్రీ కె నరసింహమూర్తిగారు ‘అమ్మశతజయంతి ఉత్సవ నిర్వహణ’ సందర్భంగా ఒక సమాలోచన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందు శ్రీ ప్రసాద్ అన్నయ్య ఉత్సాహంగా పాల్గొని ‘Fundraising Committee’ కార్యదర్శి బాధ్యతలు స్వీకరించారు. ఆయన సమావేశానికి రిక్తహస్తాలతో రాలేదు. 5 లక్షల రూపాయల చెక్కును తెచ్చి S.V.J.P.కి సమర్పించారు. విరాళాల సేకరణ గురించి శతవిధాల శ్రమించారు.

అందరింటి ప్రియతమ సోదరులు ఆదర్శమూర్తి, అమ్మతత్త్వాచరణస్ఫూర్తి అయిన శ్రీ వి.యస్.ఆర్. ప్రసాదరావు అన్నయ్య హృద్రోగం కారణంగా హైదరాబాదులో 4-1-2023 రాత్రి తుదిశ్వాస విడిచి అమ్మలో ఐక్యమైనారు.

 

అన్నయ్యగారికిదే ఆత్మీయ సాశ్రు నివాళి.

సంపాదకమండలి

(రచన : ఎ.వి.ఆర్.సుబ్రహ్మణ్యం)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!