జిల్లెళ్ళమూడిలో నవంబరు 18, 19, 20 తేదీల్లో “అమ్మ తత్త్వచింతన మహాసదస్సు” అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ విశ్వజననీపరిషత్ నిర్వహణాకార్యదర్శి శ్రీ యస్.మోహన కృష్ణగారి ప్రతిపాదన మేరకు ఈ సదస్సును నిర్వహించాలని పరిషత్ నిర్ణయించింది.
చారిత్రాత్మకమైన సదస్సు ఆలోచనకు ‘విశ్వజనని’ మాసపత్రిక సంపాదకులు శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయ ప్రసాద్ గారు ప్రణాళికను రూపొందించారు. శ్రీ విశ్వజననీ పరిషత్, మాతృశ్రీ విద్యాపరిషత్ కార్యవర్గ సభ్యులైన సోదరీ సోదరులు అందరూ ఈ సదస్సు విజయవంతం కావడానికి విశేషకృషి చేసి, అమ్మ అనుగ్రహానికి పాత్రులయ్యారు.
18 తేదీ ఉదయం 10 గంటలకు సదస్సు ప్రారంభమైంది. కుర్తాళం పీఠాధిపతులు, జగద్గురువులు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానందభారతీస్వామివారు జ్యోతిని వెలిగించి, సదస్సుకు శుభారంభం పలికారు. అవతారమూర్తి అయిన అమ్మసన్నిధిలో ఉంటున్నందుకు అమ్మతత్త్వాన్ని చింతన చేయడం వల్లనే సార్థకత లభిస్తుందని స్వామివారు తమ అనుగ్రహభాషణంలో పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన శ్రీ విశ్వజననీపరిషత్ అధ్యక్షులు శ్రీ ఎం. దినకర్ గారు తత్త్వచింతన మనకు ఎంతైనా అవసరమని, అలాంటి చింతన ఒక్కరుగా కాక, ఇలా సామూహికంగా సదస్సుల ద్వారా జరగడం విశేష ప్రయోజనం కలిగిస్తుందని చెప్పారు. శ్రీ విశ్వజననీపరిషత్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు మాట్లాడుతూ, అమ్మలోని విశ్వమాతృత్వాన్ని, దివ్యత్వాన్ని తొలినాళ్ళలోనే కొందరు సోదరులు గుర్తించారని, ఒక విధంగా చూస్తే తత్త్వచింతన ఆనాడే ప్రారంభమైందని వివరిస్తూ, శ్రీ గుండెలురావు గారి వృత్తాంతాన్ని గుర్తుచేశారు. రూపశిల్పి శ్రీ యస్.మోహనకృష్ణ గారు తమ ప్రసంగంలో ఈ సదస్సు నిర్వహించడంలోని ఆంతర్యాన్ని వివరించారు. మతాన్ని ఉద్ధరించడానికి కాక, మానవత్వాన్ని ఉద్ధరించడానికే వచ్చానని ప్రకటించిన అమ్మతత్త్వాన్ని అధ్యయనం చేయడమే ఈ సదస్సు లక్ష్యమని పేర్కొన్నారు. కీలకోపన్యాసం అందిస్తూ, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు – అమ్మ తత్త్వాన్ని అధ్యయనం చేయడం అంటే ఆత్మ తత్త్వ విచారణమేనని, అదే అమ్మకు అసలైన అర్చన అని వివరించారు. గౌరవ అతిధిగా పాల్గొన్న సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త, చెన్నై సోదరులు శ్రీ బి.రఘురామయ్యగారు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానందభారతీ స్వామివారు అమ్మ అమ్మవాక్యాలు” గ్రంథాన్ని ఆవిష్కరించి ఆశీస్సులు అందించారు. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల అధ్యాపకులు శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తిగారు గ్రంథప్రశస్తిని వివరించారు. బిడ్డకు తల్లి తొలి గురువని, తల్లిని మించిన దైవం లేదని, తల్లి, గురువు అయిన అమ్మ తన బిడ్డలకిచ్చే సందేశం. సూ, సూక్తి సుందరంగా ఈ వాక్యాల్లో కన్పిస్తుందని పేర్కొన్నారు. వివిధ సందర్భాలలో ప్రసంగవశాన అమ్మ నోట వెలువడిన ఈ ఆణిముత్యాలను సంకలనం చేసిన డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారికి మనమంతా ఋణపడి ఉంటామని అన్నారు. సదస్సులో తొలి పత్రం సమర్పించిన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల తెలుగు శాఖాధ్యక్షులు డాక్టర్ బి.యల్.సుగుణగారు “వివాహ వ్యవస్థ”ను గూర్చి అమ్మ యిచ్చిన వివరణలు, ఆచరణాత్మకంగా అమ్మ అందించిన సందేశాలు ఆధారంగా చక్కని ప్రసంగం చేశారు.
ఆనాటి మధ్యాహ్నం మాతృశ్రీ అధ్యయన పరిషత్ అభివృద్ధి సంఘాధ్యక్షులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మంగారు సభకు అధ్యక్షత వహించారు. వేదాలే వివరించ లేకపోయిన అమ్మ తత్త్వాన్ని అమ్మ దయవల్లనే మనం ఎంతో కొంత తెలుసుకోగలుగుతున్నామన్నారు. అంతా ఆత్మగా తోచడమే ఆత్మ సాక్షాత్కారం అని చెప్పిన అమ్మ సన్నిధిలో ఆ ప్రేమతత్త్వ ఆధారంగా మనం సాధన చేయాలని వివరించారు.
డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి ఆధ్యాత్మిక సేవాపురస్కారాన్ని తిరుపతి వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ఆచార్య సన్నిధానం సుదర్శనశర్మగారికి శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానందభారతీ స్వామివారు ప్రదానం చేశారు. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.సుబ్రహ్మణ్యేశ్వరశాస్త్రి గారు ప్రశంసాపత్రాన్ని అందించగా, ఆచార్య సుదర్శన శర్మగారు సముచితంగా సమాధానం చెప్పారు. అమ్మ భౌతిక దేహం భావించిన తరువాత కూడా సంస్థ యధాతధంగా పురోగమించడమే అమ్మ సంకల్పబలానికి సజీవ సాక్ష్యం – అన్నారు.
హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ యస్. రఘురామశర్మ గారు అమ్మకు కవితానీరాజనం సమర్పించారు.
పొన్నూరు అమ్మ సేవా నిలయం వ్యవస్థాపకులు శ్రీ పి.ఆంధోనిస్వామిగారు శ్రీ అధరాపురపు శేషగిరిరావు ఆధ్యాత్మిక సేవాపురస్కారం సభాధ్యక్షులు చేతి మీదుగా అందుకున్నారు. శ్రీ స్వామిగారు తాము నమ్మి ఆచరిస్తున్న సేవాకార్యక్రమాలను వివరించి, ప్రేమమూర్తి అమ్మ సన్నిధిలో సత్కరించిన పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. శ్రీ విశ్వజననీపరిషత్ ప్రధానకార్యదర్శి శ్రీ వై.వి. శ్రీరామ మూర్తిగారు ప్రశంసాపత్రం సమర్పించారు.
“అమ్మచరిత్రలో అద్భుతఘట్టాల”ను వివరిస్తూ డాక్టర్ టి.యస్.శాస్త్రిగారు, “నేను నేనైన నేను” తెలుగులో అమ్మ యిచ్చిన మహావాక్యంలోని ఆంతర్యాన్ని విశదీకరిస్తూ శ్రీ బి.యల్. సత్యనారాయణశాస్త్రిగారు పత్రాలను సమర్పించారు. “ఆత్మానుభవానికి అమ్మ చూపిన సాధన మార్గా”న్ని శ్రీ టి.టి.అప్పారావుగారు తమ పత్రంలో వివరించారు.
19వ తేది శనివారం ఉదయం సమావేశం డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావుగారి అధ్యక్షతన జరిగింది. తనను చేరవచ్చిన వారి మనస్తత్వాల లోని వైవిధ్యాలను గుర్తించిన అమ్మ అందరికీ ఒకే విధంగా ఉపదేశాలు చేయలేదని అందుకే అందరూ ఒక చోట చేరి ఆ ఉపదేశసారాన్ని కలబోసుకోవడం ప్రయోజనకరమని సభాధ్యక్షులు వివరించారు. ఈ సందర్భంగా “శ్రీ కొండముది రామకృష్ణ ఆధ్యాత్మిక సేవాపురస్కారం అందుకున్న ‘దర్శనం’ మాసపత్రిక సంపాదకులు శ్రీ యం. వెంకటరమణశర్మ గారు అమ్మ సన్నిధిలో తమ అనుభూతికి అక్షరరూపం కల్పించి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ విశ్వజననీపరిషత్ స్థానిక కార్యదర్శి శ్రీ వి. రమేష్బాబుగారు ప్రశంసాపత్రం సమర్పించారు. డాక్టర్ శ్రీపాదవారు రచించిన “అమ్మ-మహర్షి” గ్రంథానికి కీ॥శే॥ ఇందుముఖి శేషగిరి రావుగారు చేసిన ఆంగ్లానువాద గ్రంథాన్ని సభాధ్యక్షులు ఆవిష్కరించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ వి. యస్.ఆర్. మూర్తిగారు గ్రంథసమీక్ష చేస్తూ అమ్మకు, మహర్షికి ఉన్న సామ్యాలను చక్కగా విశ్లేషించారు.
సదస్సులో శ్రీమతి బ్రహ్మాండం వసుంధర అక్కయ్య “అమ్మ-మహోపదేశం” అనే అంశంపై పత్రాన్ని సమర్పించారు. “సకలజీవకోటికీ అమ్మ” గా అమ్మలోని విశ్వమాతృత్వం వ్యక్తమైన తీరును శ్రీ ఐ. రామకృష్ణగారు తమ పత్రంలో వ్యక్తం చేయగా, “భక్తిశ్రద్ధలతో సాధన”ను అమ్మ మనకు ఎలా నేర్పిందో శ్రీ బి.జి.కె. శాస్త్రిగారు తెలియచేశారు. అమ్మ మాటలలోని ఆధ్యాత్మిక సౌరభాన్ని శ్రీ వై. హెచ్. రామకృష్ణగారు వివరించారు.
నాటి మధ్యాహ్నం సభకు శ్రీ విశ్వజననీపరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ కె.బి.జి. కృష్ణమూర్తిగారు అధ్యక్షత వహించారు. 1973లో స్వర్ణోత్సవంలో లక్షమంది ఒకే పంక్తిలో భోజనం చేయాలని ఆశించిన అమ్మ ప్రేమను, ఆ లక్ష్యం ఆచరణకు వచ్చేలా అనుగ్రహించిన అమ్మ దివ్యత్వాన్ని సభాధ్యక్షులు వివరించి, ఆచార్య ఎం. శివ రామకృష్ణగారు రచించిన “Meditations on the Mother” గ్రంథాన్ని ఆవిష్కరించారు. గ్రంథ సమీక్షచేస్తూ శ్రీ ఎం.దినకర్ గారు అమ్మ అందించే అన్నంలోనే మనలో పరివర్తన కలిగించే లక్షణం ఉన్నదని వివరించారు.
“మాతృస్వభావం – మారని భావం” అనే అంశంపై శ్రీమతి ఎ. కుసుమాచక్రవర్తిగారు, “దీనబాంధవి అమ్మ”ను గురించి శ్రీ గోళ్ళ రామలింగేశ్వరరావుగారు, “మంచిని మించిన మహిమలు లేవ”ని వివరిస్తూ డాక్టర్ పి. ఝాన్సీ లక్ష్మీబాయిగారు, తన అనుభవాల ద్వారా ‘అమ్మ’ తత్త్వాన్ని తాను గ్రహించిన సన్నివేశాలకు తలచుకుంటూ శ్రీ మన్నవ బుచ్చిరాజు శర్మగారు, “అష్టమ ముక్తిక్షేత్రమైన జిల్లెళ్ళమూడి” మహిమను వివరిస్తూ శ్రీ ఐ.హనుమబాబుగారు ప్రసంగించారు.
20వతేది ఆదివారం ఉదయం సభ డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావుగారి అధ్యక్షతలో జరిగింది. ఈ సభలో శ్రీ తంగిరాల కేశవశర్మ ఆధ్యాత్మిక సేవాపురస్కారాన్ని ఆచార్య కొల్లూరు అవతారశర్మగారికి, శ్రీ వల్లూరి పాండురంగారావు ఆధ్యాత్మిక సేవాపురస్కారాన్ని శ్రీ పి.శ్రీరామారికి ప్రదానం చేశారు. కార్యవర్గసభ్యులు శ్రీ నాదెండ్ల లక్ష్మణరావుగారు, ప్రధానోపాధ్యాయులు శ్రీ కె. ప్రేమకుమార్ గారు ప్రశంసాపత్రాలు సమర్పించారు. అమ్మలోని దివ్యత్వాన్ని, అనంత ప్రేమతత్త్వాన్ని తలచుకుంటూ సత్కార గ్రహీతలు తమ స్పందనను వెల్లడించారు. కళాశాల తెలుగు లెక్చరర్ శ్రీ కె.ఫణిరామ లింగేశ్వర శర్మగారు కవితా నీరాజనం సమర్పించారు. మైసూరు దత్త పీఠం ఆస్థాన పండితులు శ్రీ కుప్పా వెంకటకృష్ణమూర్తిగారు గౌరవఅతిధిగా పాల్గొని ఓంకార స్వరూపిణి అయిన అమ్మ వైభవాన్ని ఆవిష్కరించారు.
శ్రీ పి. విద్యాసాగర్ శర్మగారు “అమ్మప్రేమ”కు వివరించగా, అమ్మలోని “విశ్వమాతృత్వాన్ని” నిరూపిస్తూ శ్రీ మన్నవ దత్తాత్రేయశర్మగారు మాట్లాడారు. అమ్మను “మహామానవతామూర్తి”గా దర్శింపచేస్తూ శ్రీ ఎం.యస్. శరచ్చంద్రకుమార్ గారు ప్రసంగించగా, “వ్యక్తిత్వ నిర్మాణానికి అమ్మ బోధలు ఎలా సహకరిస్తాయో డాక్టర్ యు. వరలక్ష్మిగారు సోదాహరణంగా నిరూపించారు. అమ్మమాటలు అమ్మ నడవడి చూస్తే సకలోపనిషత్తులూ అమ్మరూపంలో అవతరించినట్లు తెలుస్తుందని శ్రీ వి.యస్.ఆర్. మూర్తి గారు వెల్లడించారు.
విశ్వజననీపరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ వి. ధర్మసూరి గారి అధ్యక్షతలో జరిగింది. అమ్మను దైవంగా ఆరాధించినప్పుడే అమ్మ తత్త్వం మనకు తెలుస్తుందని, అమ్మను ఆరాధించడానికి నామం చక్కగా సహకరిస్తుందని అధ్యక్షులు వివరించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న క్రోసూరి మురళీకృష్ణారావుగారు, గౌరవ అతిధిగా విచ్చేసిన శ్రీ ప్రసాదశర్మగారు అమ్మలోని ఆధ్యాత్మిక వైభవాన్ని విశదీకరించారు.
శ్రీమతి కృష్ణవేణి అక్కయ్య ఆధ్యాత్మిక సేవా పురస్కారాన్ని సేవా శిరోమణి, జ్ఞాననిధి శ్రీమతి గద్దె రామతులసమ్మగారికి ప్రదానం చేశారు. డాక్టర్ యు. వరలక్ష్మిగారు ప్రశంసాపత్రం సమర్పించగా, విశ్వజనని కోడళ్ళు శ్రీమతి శేషు, వైదేహిగార్లు స్వయంగా తమ చేతుల మీదుగా పురస్కారాన్ని శ్రీమతి తులసమ్మగారికి అందించారు. ఆధ్యాత్మిక నేపథ్యంగా సేవాధర్మాన్ని కలిగి ఉండటంలోని విశిష్టతను తమ స్పందనలో శ్రీమతి రామతులసమ్మగారు వెల్లడించారు.
సమారోపన సందేశాన్ని అందిస్తూ, ముముక్షు జనపీఠాధిపతి శ్రీ సీతారాం గారు అమ్మ సకల దేవదేవీ స్వరూపిణి అని, ఆమెను ఆరాధించి, ఆ తత్త్వాన్ని అవగాహనకు తెచ్చుకుని, ఆ సందేశాన్ని ఆచరించి, తరింఛాలని వివరించారు.
నిత్యజీవితంలో లౌకికంగా, ఆధ్యాత్మికంగా మనకు కలిగే అన్ని సందేహాలనూ అమ్మ పటాపంచలు చేస్తుందని శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణగారు వివరించగా, అమ్మకు వైద్యసేవలు అందించిన డాక్టర్ ఇనజ కుమారి గారు మాట్లాడుతూ, “అమ్మ విజ్ఞాన శాస్త్ర ఖని” అని పేర్కొన్నారు. సదస్సు నంతటినీ సమీక్షిస్తూ శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు ప్రసంగించారు. ఫ్రాన్సు నుండి శ్రీ సోనీగిరి, అమెరికా నుండి శ్రీ గార్డన్ వెస్టర్ వెండ్, హైదరాబాద్ శ్రీ కె.నరసింహమూర్తి, డాక్టర్ ఆనాటి సా॥ జరిగిన ముగింపు సమావేశం శ్రీ పి. వెంకట నారాయణగార్లు సదస్సు జయప్రదం కావాలని సందేశాలు పంపించారు.
ఈ మూడు రోజుల సదస్సులో అమ్మకు సరిగమల సమర్చనం అందించి శ్రీ రావూరి ప్రసాద్ గారు, శ్రీమతి విజయశ్రీ గారు అందరికీ ఆనందం పంచారు.
‘విశ్వజనని’ మాసపత్రిక సంపాదకులు శ్రీ పి.యస్. ఆంజనేయప్రసాద్ గారు సదస్సును సమర్థంగా, సర్వాంగ సుందరంగా నిర్వహించారు.
కళాశాల పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు సేవా కార్యక్రమాలను క్రమశిక్షణతో నిర్వహించి, సదస్సు జయప్రదం కావడానికి కారకులయ్యారు.
కళాశాల, పాఠశాలల అధ్యాపకులు, కార్యక్రమాలను పర్యవేక్షించారు.
అమ్మ దివ్యానుగ్రహానికి నిదర్శనంగా మూడు రోజుల ముచ్చటైన సదస్సు అందరి హృదయాల్లో అనుభూతి ముద్రవేసింది.