జిల్లెళ్ళమూడిలో శ్రీ విశ్వజననీపరిషత్ 2011 నవంబరు 19, 20 తేదీలలో అమ్మ తత్త్వ చింతన మహా సదస్సును నిర్వహించాలనుకోవటం ఎంతో ఆనందాయకం.
శరీరంతో ఉన్నపుడు నాడూ, ఆలయంలో ఉన్న నేడూ అమ్మ దివ్యదర్శనం, సాన్నిధ్యమే మహోపదేశం, జ్ఞానబోధ.
జ్ఞానప్రసూనాంబ అమ్మజ్ఞానభిక్షపెట్ట సంకల్పిస్తే నాడూ, నేడూ మాటలతో పనిలేదు. మౌనం ద్వారానే మనుష్యులకు, పశుపక్ష్యాదులకూ సృష్టిలోని అణువణువుకు అమ్మ తన సందేశాన్ని వినిపించింది, వినిపిస్తోంది. వినిపిస్తుంది.
కాగా అమ్మ వాక్యాల్ని, అమ్మతో సంభాషణల్ని, అమ్మ చరిత్రని భావితరాల వారి వికాసం కోసం భద్రపరచల్సిన బాధ్యత మనకున్నది. ‘అమ్మ మాట్లాడుతుందా?’ అని కొందరు అడుగుతారు. కన్నవారికి నిజం తెలుసు. అమ్మ ప్రేమరూపిణి, ప్రేమభాషిణి, ప్రేమవర్షిణి, ప్రేమోన్మాదిని అనే తత్వం ఎంత సత్యమో, అమ్మ మాట్లాడుతుంది అనే అంశం కూడా అంతే సత్యం. అయితే ఎవరైనా ప్రశ్నిస్తేనే అమ్మ సమాధానం ఫలిస్తుంది. ఇస్తుంది. అమ్మ వాక్యం ఎపుడూ ఒంటరిగా కనిపించదు, వినిపించదు. తల్లిప్రక్కలోనే పసిబిడ్డ ఉన్నట్లు, ప్రశ్నను అనుకునే సమాధానం ఉంటుంది. కనుకనే అమ్మ వాక్యాన్ని చెప్పదలిస్తే పృచ్ఛకుని ప్రశ్నను కూడా తప్పనిసరిగా పేర్కొనాలి.
అడిగేవారి మానసిక వాస్తవ స్థితి అమ్మకే ఎరుక. అందుకు దీటుగా సూటిగా స్పష్టంగా ఉంటుంది అమ్మ సమాధానం. ఆ సమాధానం పదిమందికి సందేహాన్ని వృత్తి చేయొచ్చు. ఒకే ప్రశ్నకి అమ్మ వేర్వేరు సమాధానాలు ఇచ్చింది. అందుకు కారణం వ్యక్తి స్థాయి, సందర్భం. కూజాలో గ్లాసెడు నీళ్ళు పోయగలం గానీ, గ్లాసులో కూజా నీళ్ళు పోయలేం. సాధారణంగా అమ్మ పాదాల దగ్గర కూర్చుంటే మన సందేహాలు వాటంతట అవే పటాపంచలయ్యేవి. అసలు ఏమీ అడగాలని అనిపించేదికాదు.
శంకరాచార్యులు, వివేకానందుడు వంటి ఆధ్యాత్మిక తేజః సంపన్నులు ప్రశ్నిస్తే అమ్మ మనల్ని మరింతగా తత్త్వజలధి లోతుల్లోకి తీసికొని వెళ్ళేదేమోననే సందేహాన్ని వెలిబుచ్చినపుడు అమ్మ, “నాన్నా! మీకు అందకుండా నేనేమీ
దాచలేదు” అన్నది. సో॥ శ్రీపాదగోపాలకృష్ణమూర్తి గారు అన్నారు, ‘అమ్మ అసలు ముక్క చెప్పదు. పెట్లో పెట్టి తాళం వేసి, చెవిబొడ్లో పెట్టుకుంటుంది’ అని అంటే “తాళం అసలు ఉంటేగా!” అంటూ నవ్వింది అమ్మ. అమ్మ వద్ద దాపరికం లేదు; లౌక్యం తెలియదు. పారదర్శకతకి అమ్మకి అమ్మే సాటి.
అమ్మను గురించి మాట్లాడటం, అమ్మను గురించి వ్రాయటం దుస్సాహసం. అమ్మ స్థాయి ఎవరికున్నది? స్థాయి కాదు కదా 10N అంశ కూడా లేదు. అయినా పత్రికాముఖంగా, సభలు – సత్సంగాలూ, మీడియా ద్వారా, సాహిత్యరూపంగా అమ్మను గురించి మాట్లాడాలి, వ్రాయాలి – భావితరాల వారి సౌలభ్యం కోసం.
సో॥డా॥ రాధాకృష్ణశర్మగారు విశదీకరించినట్లు ‘అమ్మ అనల్పత్వంముందు మన అల్పత్వాన్ని చాటు కోవడంలో వినయం, విధేయత, అర్పణ, భక్తి, ప్రపత్తి, సాధన, ఆనందం వెల్లివిరుస్తాయి. ఆ ప్రక్రియ మనల్ని ఉద్ధరిస్తుంది. పవిత్రీకృతం చేస్తుంది. మానవ జీవనవనం చిగురిస్తుంది. పుష్పిస్తుంది,
తత్త్వతః ఈ రెండు కళ్ళతో అమ్మను చూడలేము; ఉగ్గుగిన్నె పరిమాణం గల మనస్సుతో సాగర సదృశ అమ్మ విశ్వజనీన తత్త్వాన్ని కొలవలేం.
‘అమ్మా! నువ్వు రాజరాజేశ్వరివి” అని అంటే, ఒక సందర్భంలో అమ్మ. “మీరు కానిది నేనేదీ కాదు” అన్నది. ‘జగన్మాత అంటే జగత్తే’, ‘సృష్టే దైవం’ నిశ్చితాభిప్రాయం, ప్రవచనసారం. అనేది అమ్మ
మరొక సందర్భంలో “నాన్నా! నువ్యు రాజరాజేశ్వరిని చూశావా?” అని అడిగింది. “హాయిగా అమ్మ అనుకో” అని రాజమార్గాన్ని సూచించింది.
ఒక గృహిణి సంతానం పరిమితం. కానీ సకలాచరాచర సృష్టికి మాతృమూర్తి “అమ్మ”. అమ్మ అంటే తొలి. ఆద్యంతరహిత. ఆశ్చర్యకర వాత్సల్యాంబుధి. అకారణ కారుణ్యవారాశి. ప్రేమామృతరాశి. అసలైన అమ్మ ‘అనసూయమ్మ’. అట్టి మమకార గర్భాలయ “అమ్మ” కంటే ఏవిధంగా ‘వరాత్పరి’, ‘రాజరాజేశ్వరి’, ‘ప్రవక్త’, ‘అవతారమూర్తి’, ‘దేవత’ అనే పదాలూ, రూపాలూ, తత్త్వాలూ. గొప్పవి ? “మంచిని మించిన మహిమలు లేవు” అని విశ్వసిస్తే అమ్మను పోలిన మహిమాన్విత శక్తిలేనే లేదు. కంటికి కనిపించే ఆపద్బాంధవి, అవ్యాజ కరుణాంతరంగ తరంగ, ‘తరింప చేసే తల్లి’ అడగకుండానే అవసరాన్ని గమనించి పెట్టేది ‘అమ్మ’. ఆ మూర్తి మన కంటికి కనిపించని ఒక అజ్ఞాతశక్తి. వేరొకరి దర్శనం కంటే మిన్న. అదృష్టం ఉంటే అమ్మ పాదాల్ని స్పృశిస్తే దైవం అంటే ఏమిటో అర్థంఅవుతుంది.
సారాంశం ఏమంటే అమ్మను ఏ శక్తితోనూ ఏ తత్త్వం తోనూ పోల్చలేము. ఈ సందర్భంగా మనం గమనించాల్సిన ఒకటి ఉంది.
అమ్మ వాక్యాల్లో శాస్త్రాలుంటాయి. కానీ శాస్త్రాల్లో అమ్మ వాక్యాలు ఉండవు. అమ్మ వాక్యాలు వేదశాస్త్ర పురాణేతిహాస హితోక్తులు. మతప్రవక్తల ప్రవచనాలతో సరిపోలినట్లు కనిపించవచ్చు. ఒక్కొక్కసారి అంతకు మించి పరిపూర్ణంగా సమగ్రంగా విలక్షణంగా ఒకడుగు ముందుకు వేసినట్లు కనిపించవచ్చు.
కావున వాటిని ఉటంకించేటప్పుడు బహు జాగరూకత అవసరం. కొన్ని సున్నిత హృదయాలు వాటిని కించపరిచనట్లు నొచ్చుకోవచ్చు. వాస్తవానికి అమ్మ వాక్యాలు ఏ గ్రంధరాజాల్లోనూ కన్పించవు – అని అనిపిస్తుంది. అసలు మనం వందలు, వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి జిల్లెళ్ళమూడి రావటం మనధ్యేయమూర్తి అమ్మను, అమ్మతత్త్వాన్ని సందర్శించటం కోసం.
“సృష్టే దైవం”, “మిధ్యఏమీ లేదు, కనిపించేదంతా సత్యమే”. “అజ్ఞానం, అంధకారం… బ్రహ్మే”, “భర్త అంటే శరీరంకాదు, భావన”, “సాధ్యమైనదే సాధన,” “అందరికీ సుగతే” వంటి అమ్మవాక్యాలు అమ్మ అనుగ్రహ విశేషంతోనే అర్థం అవుతాయి. పునర్జన్మ లేదని చెపుతూ, “మీరు మళ్ళీ పుట్టరు, పుడతామని భయపడవద్దు. మంచిపనులే చెయ్యండి”
అనే అమ్మ హామీ, అమ్మ వేదన, అమ్మ సత్యశోధన… యుగయుగాలుగా సంప్రదాయ భావనల రక్తంలో జీర్ణమైన నేపధ్యంలో అగ్రాహ్యములే.
కాగా “సర్వసమ్మతమే నామతం” అని అంటుంది జగన్మాతృహృదయం. అమ్మ అన్ని సిద్ధాంతాల్నీ సరిపెట్టుకుంటుంది, ఆదరిస్తుంది, వెనకేసుకు వస్తుంది. తల్లి కదా! ‘ప్రయోజకుడు అప్రయోజకుడు’ అనే భేదభావం అమ్మకి తెలియదు.
అమ్మతత్త్వాన్ని అర్థం చేసుకోవాలంటే అమ్మచరిత్ర, అమ్మతో సంభాషణలు, అమ్మ ఆచరణ, అమ్మతో ప్రత్యక్ష అనుభవాలు… ఆధారం; మరి మరోమార్గం లేదు. ఈ దిశగా ‘అమ్మతత్త్వచింతన మహాసదస్సు’ ఫలప్రదం కావాలని అమ్మ శ్రీచరణాలకు శతసహస్రాధిక నమస్సుమాంజలలు సమర్పిస్తున్నాను.