రామకృష్ణ అన్నయ్య అంటాడు.
“అమ్మ దర్శనం. అంతా అదే – నని.
” ఎంత వెదికినా నాకు అది (సత్ లేక దైవం) కానిది కనుపించడం లేదని అమ్మ ఘంటాపథంగా చెప్పింది.”అని.
నిజమే. అమ్మది అభేదస్థితి. ఆధ్యాత్మికంగా లౌకికంగా కూడా అమ్మకు భేదభావం లేదు.
‘గుణభేదమే లేని నాకు కులభేదమేమిటి ?’ అని బాల్యంలోనే ప్రశ్నించింది. ‘ఆ భేదమే ఉంటే నేను ఇక్కడ ఉండను’ అని కూడా అన్నది. అది ఏదో బంధువుల గురించి అన్నట్లు పైకి కనిపించినా నిజానికి ఇక్కడ అంటే ఈ భూమిమీద అనే. ఆ రకంగా అమ్మ తన అవతారస్థితిని పరమార్థాన్ని తెలియజేసింది.
అమ్మ చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని చమత్కారంగా కూడా చెప్పింది. ఒకసారి ఒక సోదరి తన కొడుకును అమ్మ దగ్గరకు తీసుకు వచ్చింది. ఆ అబ్బాయికి మానసిక స్థితి సరిగా ఉండటం లేదని అమ్మకు విన్నవించుకున్నది. అమ్మ శ్రద్ధగా వివరాలు అడిగింది. ‘అందరినీ కొడతాడమ్మా! ఆ తల్లి చాలా బాధగా చెప్పింది. ‘ఎవరెవరిని కొడతాడు?’ అమ్మ ప్రశ్న సంధించింది.
ఆమె చెబుతూ “ఇంట్లో వాళ్ళనే కొడతాడమ్మా. బయట వాళ్ళను కొట్టడమ్మా” అమ్మ వెంటనే నవ్వుతూ “నాకంటే వాడే నయం. వాడికి ఇంటా బయటా తేడా తెలుస్తున్నది. నా సంగతి చూడు. నాకు ఇంటా బయటా భేదం తెలియడం లేదు. అంతా ఒకటిగా ఉంది” అని చమత్కారంగా తన అపూర్వమైన అభేదస్థితిని తెలియజేసింది.
మరొకసారి ఒక సోదరుడు అమ్మ వద్దకు వచ్చాడు. అతడు అంతకు ముందు తన ఇద్దరు స్నేహితులతో కలసి వచ్చాడట. మరలా ఇప్పుడు వచ్చాడు.
అతనికి మనశ్శాంతి కరువైందట. దానికోసం దేశంలోని దేవాలయాలన్నీ తిరిగాడట. అతనికి ఏమీ తేడా కనిపించలేదట. ‘అంతా ఒకే రకంగా కనిపించిందమ్మా’ అన్నాడు. నాకు ఏ దేవుడులోనూ విశేషం కనిపించలేదు అని అతని భావం.
కానీ అమ్మ చమత్కారంగా “ఇంకేం నాన్నా! అంతా ఒకే రకంగా కనపడటం గొప్ప యోగస్థితికదా! ఇక నీకు మనశ్శాంతికేమి కరువు” అని అతని వైపు లాలనగా చూసింది. అమ్మ ఈ సమదృష్టి అనుగ్రహాగ్రహాలకు కూడా వర్తింపజేసింది.
నాటకరచయితకు నాయకునిపాత్రపై, సేవకునిపాత్రపై అభిమానం సమానమే కావచ్చును. కానీ పాత్రధారి నాయకుని పాత్రనే కోరుకుంటాడు సహజంగా, ప్రతిపాత్రధారీ ప్రేక్షకుల ప్రేమనూ, సానుభూతినీ సంపాదించగల పాత్రనే కాంక్షిస్తాడు.
అంటే – ప్రతివాడూ జీవితంలో సుఖశాంతులనూ, కార్యరంగంలో విజయాన్నీ, లోకంలో గౌరవాన్నీ మాత్రమే పొందాలని అభిలషిస్తాడు.
కానీ అమ్మ ‘ఆగ్రహం కూడా అనుగ్రహమే’ అంటుంది. ‘అపజయాలు భగవంతుని ప్రసాదాలే అంటుంది. సామాన్యంగా ఏ దెబ్బా తగలకపోవడంలో భగవదనుగ్రహం ఉంది అనుకుంటాం. కానీ ‘ఎదురు దెబ్బలూ ఆయన ఇచ్చినవే’ అంటుంది అమ్మ. భగవంతుని ముందు మనం ఏమిచ్చినా ఒడిపట్టవలసిందే.
ఈ సమభావం కలిగితే కష్టసుఖాలకు తేడా ఏముంది? ఇదే మన కష్టాలు పోగొట్టటానికి అమ్మ ఇచ్చే మహామంత్రం. పైన వివరించినట్లు అంతా నాటకం అనుకోగలిగితే, అందుకే జగన్మిధ్య అన్నారేమో. మనం అనందంలో ఉన్నప్పుడు జగత్ సత్యం అనుకోవాలి. మనం దుఃఖంలో ఉన్నప్పుడు జగత్ మిధ్య అనుకోవాలి. ఒకసారి జిల్లెళ్ళమూడి అందరింటి అగ్రసోదరి గజేంద్రమ్మ అక్కయ్యకు చేయి విరిగింది. అక్కయ్య నిష్ఠురంగా అన్నది – “అమ్మా! మా బంధువులంతా నిన్ను ఆక్షేపిస్తున్నారమ్మా. ఇన్నాళ్ళు నేను చేసిన నీ సేవకు ఇదా ప్రతిఫలం? అంటున్నారు. ‘అమ్మ గారికి నీ పై కటాక్షం ఇదేనా?’ అని నిన్ను నానా మాటలు అంటుంటే మనసుకు చాలా కష్టంగా ఉంది” అని.
అమ్మ నిర్ద్వంద్వంగా సెలవిచ్చింది. “ఔను. ఇది నా కటాక్షమే!”
“ఏది? నా చేయి విరగటమా?” అక్కయ్య. అమ్మ మరలా ధృవీకరించింది. శుభాశుభాలు రెండూ కటాక్షమే.
ఒకసారి రఘనాథ్ అనే విద్యార్థి వాటర్ ట్యాంకు కడిగి వస్తూ పైనుండి కింద పడ్డాడు. రామకృష్ణ అన్నయ్య ప్రభృతులు పరుగులు తీశారు. అతనికి ఏమీ కాలేదు. అంతా అమ్మ దయ అన్నారు. అమ్మ మాత్రం క్రింద పడటమూ అమ్మ దయే అన్నది.
ఎవరి విషయంలోనో కాదు. తనకు ఏ తల్లికీ రాకూడని గర్భశోకం వస్తే ‘హైమను నేనే కన్నాను. నేనే పెంచాను. నేనే చంపుకున్నాను.” అని దైవలీలలో భాగంగానే తీసుకుని సమదర్శనంలో భాగం చేసింది.
ఈ రకంగా కష్టం కూడా భగవత్ప్రసాదంగా సమదర్శనంలో భాగంగా భావిస్తే వాడు ఆ కష్టాన్ని జయించినట్లే. ఇక మిగిలింది నిరంతర సుఖమేగా! నిరంతరం సుఖం పొందాడు అంటే వాడు సుగతి పొందినట్లే!!