1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మ తలుచుకుంటే…

అమ్మ తలుచుకుంటే…

Vaddadhi Satyanarayana Murty
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : March
Issue Number : 8
Year : 2014

ఆ మధ్య ఒకసారి గుంటూరులో మెడికల్ చెకప్ చేయించుకుందామని ఒక కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళాను. ఆ హాస్పటల్ చాల ఎత్తులో ఉంది. సుమారు 15 మెట్లు ఎక్కి వెళ్ళాలి. రోడ్డుమీద నుంచి చూస్తే ఎత్తులో విజిటర్స్ లాంజ్ కనబడుతోంది. చాలమంది విజిటర్స్ (పేషెంట్స్) కుర్చీలో కూచుని వున్నారు.

నేను తలవంచుకుని మెట్లు ఎక్కి వెళ్ళి హాలుముందు వరండాలోకి చేరి ఒక్క అడుగు ముందుగు వేయగానే నుదుటికి ‘ఠాప్’ మని ఒక మందపాటి గ్లాస్ డోరు గుద్దుకున్నది. (ఆ లాంజ్ ముందున్న గ్లాస్ ని నేను గమనించలేదు.) అంతే…. ఒక్కసారిగా కళ్ళు బైర్లు కమ్మి వరండాలోంచి వెనుకనుంచి మెట్లు వైపునకు తూలి, మెట్ల మీద నుంచి క్రిందకు పడబోయాను.

` అయితే అదే సమయంలో ఒక అపరిచితుని అభయహస్తం నా వెనుకగా వచ్చి చటుక్కున నా వీపు మీద చేయి వేసి అడ్డుకున్నది. వెనుక నుండి ఆవ్యకి వచ్చి పడకుండా నన్ను ఆపి వుండకపోతే నేను అన్ని మెట్ల నుంచి దొర్లుకుంటూ క్రిందకు పడిపోయేవాడిని. నా శరీరం ముక్కలు చెక్కలై వుండేది.

నాకు తగిలిన దెబ్బకన్నా నాకు తప్పిన ప్రమాదం గుర్తుకు వచ్చి శరీరం భయంతో వణికిపోయింది. పాపం! ఆ వ్యక్తి నన్ను పొదివి పట్టుకుని లోపలకు తీసుకువెళ్ళి కుర్చీలో కూచోబెట్టి సేద దీర్చాడు.

నాకు అప్పుడనిపించింది. సాక్షాత్తు ‘అమ్మే’ ఆ అపరిచితుని రూపంలో వచ్చి నన్నాదుకున్నదని. అసలు ఆ దెబ్బలు కాస్త క్రిందికి తగిలితే, నా కళ్ళజోడు పగిలి కన్ను కూడా దెబ్బతినేది.

ఆ విధంగా నన్నాదుకున్న ఆ వ్యక్తికి, అతని రూపంలో వచ్చి ఆదుకున్న ‘అమ్మ’కు కృతజ్ఞతలు చెప్పుకొని మెడికల్ చెకప్ చేయించుకోకుండానే ఆ హాస్పిటల్ నుండి బయటకు వచ్చేశాను. ఆ తరువాత రెండు రోజుల పాటు ముఖమంతా వాచిపోయి రక్తం గడ్డకట్టడం వలన నల్లగా మాడి పోయింది. కన్ను ఏ మాత్రం దెబ్బతినలేదని డాక్టర్ పరీక్ష చేసి చెప్పాడు.

అదీ అమ్మదయే ! ఇది జరిగే చాలాకాలమైనా ఇప్పుడు ఎందుకు తెలుపుతున్నానంటే –

నా మొదటి అనుభవాన్ని – అదే, ఒకసారి చీకటిరాత్రిలో 7వ మైలు నుంచి నడచి వస్తుంటే అనుకోకుండా ఇద్దరు వ్యక్తులు వూళ్ళో వరకు సాయంగా వచ్చిన సందర్భాన్ని గురించి.

జిల్లెళ్ళమూడిలో చాలా కాలం అమ్మ సన్నిధిలో గడిపి ఎన్నో దివ్యానుభవాల్ని పొందిన ఒక సోదరునికి చెబితే, ఆయన దానిని తేలిగ్గా తీసుకున్నాడు. పైపెచ్చు – “ఈ మధ్య కొందరు ఇటువంటి అనుభవాలే చెబుతున్నారు. ఇవన్నీ ఇక్కడ అందరికీ సహజంగా జరిగేవే.” అని నవ్వి

“బాపట్ల వెళ్ళి అంగట్లో మిఠాయి కొనుక్కుని తిన్నాను. తియ్యగా వుంది. అదంతా అమ్మదయే. అన్నట్లుగా వుంది మీరు చెప్పింది” అని హేళనగా మాట్లాడాడు.

అది వినగానే నా మనస్సు చివుక్కుమన్నది. ఈయనతో ఆ విషయాన్ని ఎందుకు చెప్పానా అని బాధపడ్డాను. అప్పటి నుంచి నా అనుభవాలను ఆయనకు చెప్పడం మానివేశాను. తరువాత నా బాధను ఆశ్రమంలోనే గల ఒక సోదరి ముందు వెళ్ళబోస్తే – “అది ఆలోచన రహితంగా ఆయన అన్నమాట – అయితే ‘అమ్మ’ తలచుకుంటే ఆ తీపి మిఠాయి కూడా చేదుగా మారుతుందని ఆయనకు చెప్పలేకపోయారా?” అన్నది.

నిజమే…. ‘అమ్మ’ కంటే – విషం అమృతంగానూ, అమృతం విషంగానూ మారగలదు. అయితే ఆమె ఎప్పుడూ అమృతాన్ని విషంగా మార్చదు. ఒక వేళ మార్చినా ఆ విషాన్ని తనే తీసుకుంటుంది గాని తన బిడ్డలకివ్వదు. ఎందుకంటే ఆమె ‘అమ్మ’ కదా! జిల్లెళ్ళమూడి ‘జీవగర్ర!’

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!