1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మ తినిపించిన అరటిపండు

అమ్మ తినిపించిన అరటిపండు

Srimathi taluku U S A
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 10
Month : May
Issue Number : 10
Year : 2011

నేను అమ్మ దగ్గర 1984-85లలో ఒక సంవత్సరం పాటు జిల్లెళ్ళమూడిలో ఉండే అదృష్టం అమ్మ కల్పించింది. అక్కడ విద్యాలయంలో ఉపాధ్యాయినిగా పనిచేశాను. ఆ సంవత్సరం నా జీవితంలో మరువలేని కాలం. అక్కడ ఎన్నో సంఘటనలు, ఉన్నో ఉత్సవాలు, పండుగలు జరిగినాయి. అన్నీ మరువలేని మధురస్మృతులే.

ఒకరోజు మధ్యాహ్నం అమ్మగదిలోకి వెళ్ళేసరికి వైదేహి అక్కయ్య అన్నది, “ఇప్పటివరకు అమ్మ వీణ వాయించింది. నువ్వు మిస్ అయిపోయావు అని. నాకు చిన్నప్పటి నుంచీ సంగీతం అంటే చాలా ఇష్టం. 2 సంవత్సరాల వీణ కూడా నేర్చుకున్నాను. అయితే దురదృష్టవశాత్తు ఆ గరువుగారు పోవటం వల్ల సంగీతం ఆగిపోయింది. అందుచేత అమ్మ వీణ పట్టుకున్న సరస్వతీ స్వరూపం చూడలేకపోయెనే, చూచినా నాకెప్పుడైనా కొంచెం సంగీతం వచ్చేదేమో అని మనసులో అనుకున్నాను. వెంటనే అమ్మ నన్ను దగ్గరకు పిలచి, ఒక అరటిపండు తినిపించింది. తనే స్వయంగా నోట్లో పెట్టింది. అది తింటూ మనసులో అనుకున్నాను. “ఈ జన్మలో నాకు సంగీతం లేకపోయినా, నా పిల్లలకి సంగీతం వస్తుందేమో” అని. ఇది 1984-85 సంవత్సరం జరిగిన సంఘటన.

తరువాత నాకు పెళ్ళి అయి, యుయస్ఎ రావటం ఇక్కడ స్థిరపడటం జరిగింది. 1992లో మా అమ్మాయి గాయత్రి పుట్టింది. పుట్టిన దగ్గర్నుంచీ మా నాన్నగారు ఇంట్లో దీనికి సంగీతం సిడీలు టేపులు పెట్టి వినిపించేవారు. దాంతో అది మాటలు వచ్చిన దగ్గర్నుంచి పాటలు పాడటం మొదలుపెట్టింది.

ఒకసారి స్వర సమ్రాట్ ఆలి అక్బర్భన్ గారి సిడి కొనటం జరిగింది. ఆ సి.డి. గాయత్రికి చాలా నచ్చి, రోజూ వినేది. మేమ దాంతో సరదాగా, ఆయన కాలిఫోర్నియాలో ఉంటారు, సంగీతం నేర్పుతారు అని చెప్పాము. 3 సంవత్సరముల పిల్ల “నేను ఆయన దగ్గర సంగీతం నేర్చుకుంటాను” అనేది. తరువాత మేము 96లో కాలిఫోర్నియాకు ఉద్యోగరీత్యా బదిలీ అయి వెళ్ళవలసి వచ్చింది. 96 జూన్లో అలీ అక్బర్భన్ గారి సంగీత కళాశాలకి వెళ్ళటం, వారిని వేడుకొనగా, గాయత్రికి మొదటి పాఠం ఆయన చెప్పటం జరిగింది. అంత పెద్ద గురువుగారు 4 సంవత్సరాల పిల్లని, తాను దగ్గరే ఉంచుకుంటానని, తనే స్వయంగా పాఠం చెప్పేవారు. 13 సంవత్సరాల పాటు ఆయన పాదాలదగ్గర కూర్చుని గాయత్రి సంగీతం నేర్చుకుంది. ఆయన కూడా తన స్వంత కూతురిలాగా గాయత్రిని చూసేవారు. 2009, జూన్ 17న ఆయన పోయారు. పోయే ముందు రోజు 17న కూడా గాయత్రిని కూర్చోబెట్టి పాఠం చెప్పారు.

ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే, ఆయన కాళీమాత, మెహర్ బాబా, శారదాదేవి భక్తుడు. ఎక్కడ దేవీ మందిరాలున్నా, అన్నీ వెళ్ళి చూసేవారు. అతని గది నిండా అన్ని దేవుళ్ళ పటాలు ఉండేవి. అక్కడ కూర్చుంటే అమ్మవారు తాండవం ఆడుతున్నట్టు ఉండేది.

మా అబ్బాయికి గురువుగారు స్వయంగా తన గదిలో కూర్చోబెట్టి తబలా మొదటి పాఠం చెప్పారు. మా అబ్బాయి రాము కూడా తబలా శ్రద్ధగా 8సంవత్సరాలు పూర్తిగా నేర్చుకున్నాడు. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాడు. ఇద్దరి పిల్లలకి సంగీతం అంటే ఇష్టమేకాక, ఇద్దరికీ అందులో మంచి జ్ఞానము, ప్రతిభ కూడా ఉన్నాయి.

ఆ రోజు అమ్మ తినిపించిన అరటిపండు ఫలితం ఈ రోజు మా ఇద్దరి పిల్లలకి కలిగిన సంగీతజ్ఞానం. అమ్మ గురువులను కూడా వెతికి పెట్టి ఇద్దరినీ ఒక మహానుభావుని చెంత చేర్చింది. గురుశిష్యుల మధ్య ఒక గొప్ప సంబంధం, అనురాగం ఏర్పరచింది.

ఆ కరుణకి ప్రతిఫలంగా ఏమివ్వగలము ? అమ్మనామం వివిధ రాగాలలో పాడటం కంటే ? అందుకనే పిల్లలచేత అమ్మనామం 2 సి.డిలు తయారుచేయించి, ఆ గురువుగారి సంగీతం అమ్మకి సమర్పించాము. ఇంకొక ముఖ్య విశేషం ఏమిటంటే, గురువుగారి పుట్టినరోజు ఏప్రియల్ 14. ఈ సంవత్సరం అమ్మ పుట్టినరోజు, గురువుగారి పుట్టినరోజు ఒకేరోజు కావడం, ఆ రోజే ఆ సి.డి.లు ప్రచురణ కావటం అంతా అమ్మ దయే.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!