జిల్లెళ్ళమూడి పవిత్ర క్షేత్రానికి వచ్చి అవతారమూర్తి అమ్మను ఆశ్రయిస్తే, అమ్మ మనలో అనూహ్యంగా అజ్ఞాతంగా సహజంగా ఒక పరివర్తన (Transfiguration), ఆధ్యాత్మికరూపాంతరం (Spiritual Metamorphosis) తెస్తుంది. అదే నిజమైన పరిణతి, వికాసము. ఏ శాస్త్రజన్యజ్ఞానం వలన గానీ ఆదర్శాలను వల్లె వేయుటవలన గానీ పురాణశ్రవణం వల్ల గానీ ఏ విధంగానూ ఆ భాగ్యం అబ్బదు. అందుకు కొన్ని స్వీయ అనుభవాలు.
1970లో నేను పట్టభద్రుడనైనాను. Original Degree తెచ్చి అమ్మ చేతుల్లో ఉంచాను. అమ్మ తాకితే శివకరం అని. దానిని తెరిచి చూడగానే అమ్మ “నాన్నా! నువ్వు B.Sc. నా? / B.A. అనుకున్నాను రా” అన్నది. ఆ పట్టా ఆంగ్లభాషలో ఉంది. అమ్మకి English వచ్చు అని తేలింది. (‘ఆంగ్లభాషపై అమ్మకు అధికారం’ అనే శీర్షికతో ధారావాహికంగా లోగడ కొన్ని వ్యాసాలు వ్రాసుకున్నాను. Mother of Allలో ప్రచురితమైనాయి). అది వేరే సంగతి. అసలు సంగతి ఏమంటే విధి-విధానాన్ననుసరించి నేను B.Sc., చదవాలి, చదివాను. కానీ అమ్మ నా తలరాతను ‘Literature’ అని తిరగవ్రాసింది. అమ్మ మాట నిజమైంది. రెండు మూడు సంస్కృత కావ్యాలను చదివాను, ఒకించుక ఆర్షవిజ్ఞానాన్ని సముపార్జించాను. ఆంధ్ర ఆంగ్లభాషలలో అమ్మపై రచనలు చేస్తూ వచ్చాను. నా అదృష్టం- తొలుత నేను వ్రాసిన వ్యాసాలను అమ్మకి ప్రత్యక్షంగా చదివి వినిపించాను. అమ్మ విని, కొన్ని సవరణలను చేసేది; కొన్ని సూచనల నిచ్చేది. అమ్మయే నాకు Editor.
B.Sc. ఉత్తీర్ణుడను కాగానే University కి వెళ్ళి M.Sc. (Nuclear Physics) చదవాలనే నా కోరికను మా నాన్నగారికి చెప్పాను. అందుకు వారు నిరాకరించి B.Ed., చేసి ఉపాధ్యాయవృత్తిని చేపట్టమని తేల్చి చెప్పారు. అందుకు భిన్నమనస్కుడనై నేను జిల్లెళ్ళమూడి వచ్చి, రెండు మూడు నెలలు ఉండిపోయాను. అమ్మ సన్నిధి ఒక నిధి, నిధానము కదా!
ఒకనాడు అమ్మకు వచ్చే టపా (ఉత్తరాలు వగైరా) తెచ్చి అమ్మకు చదివి వినిపించే duty నాకు దక్కింది. ఆ సమయంలో అమ్మ మెలకువగా ఉన్నా సరే, నిద్రపోతున్నా సరే. (అమ్మకు ఏనాడూ నిద్ర అన్నదే లేదు.) అది వేరే సంగతి. అమ్మ నిద్రలేచి ఆ ఉత్తరాల్ని చూడకుండానే కొందరికి ప్రసాదాలు పంపమని, కొందరికి రామకృష్ణ అన్నయ్య చేత సమాధానాలు వ్రాసి పంపమని చెప్పేది.
ఆరోజు ఆ ఉత్తరాల్లో ఒకటి నా కంటపడింది. అది మా నాన్నగారు అమ్మకి వ్రాసినది. ‘మా అబ్బాయి M.Sc. చదువుతానని పట్టుబడుతున్నాడు. B.Ed. చదవమని చెబితే వినడం లేదు. నేను, ఇద్దరు అమ్మాయిలకి వివాహాలు చెయ్యాలి. నువ్వు చెబితే వింటాడు’ అని. అది ఒక రకంగా అమ్మకి అభ్యర్థన, మరొకరకంగా నా మీద Complaint.
ఆ ఉత్తరాన్ని అమ్మకి చదివి వినిపించలేదు; దానిని అమ్మ ఆదేశంగా భావించాను. కనుకనే ‘నేను M.Sc. చదవను, B.Ed. చదువుతా. రాజమండ్రి నుంచి దరఖాస్తు తెప్పించండి’ అని సమాధానం వ్రాశాను.
ఈ సందర్భంగా ఒక ముక్క చెప్పుకోవాలి – మా అన్నయ్యని M.B.B.S. చదివించాలని విశ్వప్రయత్నం చేశారు. నేను M.Sc., చదువుతానంటే ససేమిరా వద్దన్నారు. అందుకు నేనేమీ బాధపడలేదు. అది అమ్మ ఇచ్చిన సంస్కారం. నేను అమ్మ అనుగ్రహ వలయంలో ఉన్నాను. ఒక సందర్భంలో అమ్మ నా తలమీద తన కుడిచేయి ఉంచి, “వీడు నా పిల్లాడు. నేను ఎలా చెబితే అలా వింటాడు” అన్నది. B.Ed., చదివి 22 ఏళ్ళు Teacherగా పనిచేశా. అదంతా విధి-విధానమే. కానీ అంతతో అమ్మ ఊరుకోలేదు. M.A. (English) చదివించి పదోన్నతి మీద 16 ఏళ్ళు Lecturer గా పనిచేయించింది.
కథ ఇంకా కంచికి పోలేదు.
1972 జనవరి 17వ తేదీన ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాను. ఆనెల 15 రోజులకు గాను నాకు (మొదటి జీతం) రు.116లు ఇచ్చారు. ముచ్చటగా ఆ సొమ్ము తీసికొని మా నివాస పట్టణం నరసాపురం వచ్చాను. రాత్రి గం.8.00ల సమయం. బస్సు దిగగానే ఊరి వెలుపల సంతపేట అందులో ఉండే కుష్ఠురోగులు గుర్తుకు వచ్చారు. గోదావరితీరం చలికాలం. అక్కడికి వెళ్ళి లెక్కపెట్టాను, 6 గురు ఉన్నారు.
బజారు వెళ్ళి 6 దుప్పట్లు, 6 బాదుషాలు, 6 గ్లాసులతో నీళ్ళు తీసికొని వచ్చా. ఒక్కొక్కరి నోటికి స్వీట్ అందించి, మంచినీళ్ళ గ్లాసు చేతికిచ్చి, దుప్పటి కప్పాను. “ఇదంతా ఏమిటి? ఎందుకు మాకు ఇలా?” అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నారు. అప్రయత్నంగా నేను “మీరు, నేను నమ్మినా నమ్మకపోయినా మనందరం ఒకే తల్లిపిల్లలం” అంటూ వారికి నమస్కరించాను. అది నా గొప్పతనం కాదు.
“సిద్ధ్యన్తి కర్మసు మహత్స్వపి యన్నియోజ్యాః సంభావనా గుణమవేహి తమీశ్వరాణాం” అన్నారు కాళిదాస మహాకవి.
గొంగళీపురుగుని సీతాకోకచిలుకగా రూపుదిద్దే జగత్కర్త – జగద్భర్త అయిన అమ్మ మనలో ప్రోది చేసే సంస్కార విశేషం అది. అమ్మపలుకులు, చేతలు, సంకల్పం సర్వదా అజ్ఞాతంగా అగ్రాహ్యంగా ఉంటాయి.