మాతృశ్రీ, విశ్వజనని, జిల్లెళ్ళమూడి అమ్మ అని బహుధా ప్రసిద్ధి పొందిన శ్రీమతి బ్రహ్మాండం అనసూయాదేవి (1923-1985) తరువాత తరాల వారికి అనుసరించి తీరవలసిన ఆదర్శమూర్తి. ఆమె తరువాత తరాల వారికి ఇరవయ్యవ శతాబ్దం ఇచ్చిన వరం, ప్రసాదించిన కానుక, చూపించిన రోల్ మోడల్.
ఆమె తనను తాను అమ్మనే అనీ, అమ్మగా ఉండడానికి మాత్రమే నిర్ణయించబడ్డానని చెప్పుకొన్నారు. తను గురువు కాదని, తనకు శిష్యులు ఎవరూ లేరు అని కూడా చెప్పారు. ఇరవయ్యవ శతాబ్దంలో ప్రేమ వృక్షానికి నీరు పోసి పెంచి అందరికీ సుగతి ఖరారు చేసిన అమ్మ ఏ రకంగా రోల్ మోడల్ అని చెప్పాలి?
రోల్ మోడల్
సాధకులు అనుకొనేవారు, జిజ్ఞాస కలవారు, అధ్యాత్మ మార్గంలో తరుణోపాయం వెతుక్కోవాలనుకొనేవారు, అమ్మనే అల్టిమేట్ అని నమ్మిన వారు, అమ్మ కూడా ఒక మానవి గదా అని ధిక్కరించిన వారు, తృణీకరించినవారు అందరికీ అమ్మ ఒక రోల్ మోడల్. సాధనలో, అన్వేషణలో, స్వేచ్ఛాసాధనలో, అనుభవం ఇవ్వని శాస్త్రాలను, ద్వంద్వ ప్రకృతి గల దేవతలను నిరాకరించడంలో అమ్మ మాత్రమే రోల్ మోడల్ అనే పదానికి అర్హత కలిగిన వారు.
శుద్ధి – సిద్ధి
ఎవరు ఏ రంగంలో ఉన్నా, ఏ మార్గాన్ని అనుసరించినా, ఏ సిద్ధాంతం పట్ల ఆసక్తి చూపినా, ఏరకమైన అనుష్ఠానం అనుసరించినా ఉండవలసినవి శుద్ధి, సిద్ధి. అభ్యాసము వల్ల, యమనియమములవల్ల, వ్రతాచరణవల్ల, యోగమార్గము వల్ల, శుద్ధి పొందవచ్చు. ఆ తర్వాత పొందే అనుభవమే సిద్ధి. శుద్ధి చెట్టు వంటిది, సిద్ధి పండువంటిది.
త్రికరణ శుద్ధి
శుద్ధి అనగానే అందరికీ గుర్తొచ్చేది త్రికరణ శుద్ధి అనే పదం. మనస్సు, వాక్కు, శరీరం అనే వానినే త్రికరణములు అంటారు.
మనస్సు
మనం తినే ఆహారంలో మూడవవంతు మనస్సుగా మారుతుంది. అమ్మ మనస్సును గూర్చి ఎంతో విచారించారు. మనస్సుకు రూపం లేదు. అటువంటి రూపం లేని మనస్సు జ్ఞానేంద్రియాలు చూపే ప్రతి రూపాన్ని తానే తీసుకొంటుంది.
ఆకారము, వికారము, నిరాకారము వంటి పదాలన్నీ మనస్సు వల్ల వచ్చినవే. “మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః”.. మానవుడు నేను బంధింపబడి ఉన్నాను అని అనుకోవడానికి, నాకు మోక్షం కావాలి అని అనుకోవడానికి కూడా కారణం మనస్సు. అందరూ మనస్సు శుచిగా ఉండాలని అనుకుంటారు కానీ అది సాధ్యమైనప్పుడే అని అమ్మ అంటారు. మార్గదర్శకులమని చెప్పుకొనే గురువులు, ఒక బంధంతో బతుకుతున్నామనుకొనే భార్యా భర్తలు కూడా మనస్సు తెలుసుకోలేరు. మనస్సు తెలిసినప్పుడు బోధతో పనిలేదు అని ఖచ్చితంగా అమ్మ చెప్పారు. అందరి మనస్సు తెలిసిన అమ్మ అందుకే ఎవరికీ ఏ బోధ చేయలేదు.
వాక్కు
నోరు అనే కర్మేంద్రియం ద్వారా వచ్చేది వాక్కు, పర,పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే నాలుగు స్థితులలో వాక్కు ఉంటుంది. అమ్మ తనది తోలు నోరు కాదు కనుక తాలు మాట రాదు అన్నారు. అమ్మ ఏది దర్శిస్తుందో, దాన్నే స్ఫురణగా కలిగి ఉంటారు. ఏది స్ఫురిస్తుందో అదే మాట్లాడతారు. అమ్మ వాక్కు అక్షరం. శబ్దము బ్రహ్మము ఐతే, నిశ్శబ్దమూ బ్రహ్మమే అన్నారు అమ్మ. సత్సంగత్వే నిస్సంగత్వం అన్నట్లు, నటరాజ తాండవంలోని ఆ శృతిలయలలో అమ్మ నిశ్శబ్దాన్నే చూసారు. దానినే వ్రతంగా, నియమంగా అనుసరించారు. వారి అమ్మమ్మ జానకమ్మ గారు మాటలు ముందు పుట్టి తర్వాత నీవు పుట్టావు అంటారు. అటువంటి అమ్మ కుర్తాళం సిద్ధేశ్వరీపీఠం స్థాపించిన మౌనస్వామిని చీరాలలో నూనె పానకాలు తోటలో కలిసినప్పుడు, నీవు బాలా మంత్రం ఇచ్చిన వారందరికీ నేను అజప చెప్తాను అన్నారు. వాట్నియమం అమ్మ గొప్ప శైలి. వారి భర్త 1935 ఫిబ్రవరి లో ఎక్కువ మాట్లాడవద్దు అంటే, 1947 వరకు, ఊ, సరే అని మాత్రమే సమాధానం చెప్పేవారు. 1958 నుండి భక్తుల దాడి పెరిగిన కొద్దీ అమ్మ ప్రశ్న అడిగినవారి ప్రశ్నలోనే తన సమాధానం చెప్పేవారు.
శరీరం
శరీరంతో చేసే కర్మను కాయిక కర్మ అంటారు. పూర్వ మీమాంస వాదులు కర్మకు పెద్ద స్థానం ఇచ్చారు. ఉత్తర మీమాంస వాది యైన శంకరుడు బురదతో కడిగితే బురద పోతుందా, అలాగే సత్కర్మ చేసినంత మాత్రాన దుష్కర్మ పోతుందా అని మహావాక్య దర్పణంలో అన్నారు. ప్రపంచంలో అన్ని మతాలకు చెందిన వారు కర్మ సిద్ధాంతం నమ్మారు. నీవు ఏది చేస్తే అదే పొందుతావు అని ఖచ్చితంగా నమ్మారు. అమ్మ భగవంతునికే అంటని కర్మ, భగవంతుని చే సృష్టించబడిన జీవరాసులకు ఏమి అంటుతుంది? అన్నారు.
సంకల్పము, కర్మ,బంధము, మోక్షము అనే నాలుగింటి సంబంధాన్ని అమ్మ కొత్త డైమెన్షన్ చూశారు. నీవు కర్తవు, భోక్తవు కానప్పుడు నీవు చేసేందుకు ఏమీ లేదు, అనుభవించడానికి కూడా ఏమీ లేదు అన్నారు.
ఏ రకమైన కర్మ ఐనా సంకల్పం నుంచి వచ్చినదే. ప్రతి సంకల్పం కరుణవల్ల, కాలం వల్ల వచ్చినదే. ప్రతి కరుణ, కాలం చైతన్యం వల్ల వచ్చినదే. చైతన్యం అంతా అసలు వల్ల వచ్చినదే. ఆ అసలు స్పందన వల్ల వచ్చినదే. ఆ స్పందన మరుగు నుండి వచ్చినదే. ఈ రకంగా మరుగు, స్పందన, అసలు, చైతన్యం, కాలం, కరుణ, కర్మలను అమ్మ వివరించారు.
సాంఖ్యము-తారకము-అమనస్కము
చెప్పేది సాంఖ్యము, చేసేది తారకము, చూసేది అమనస్కం అన్నారు. ఈ కనబడే, వినబడే,పరిగణింపబడే ప్రతీదీ సాంఖ్యమే. ఇది బ్రహ్మాండం స్థూల రూపం. చేసేది సూక్ష్మము. పైకి కర్మేంద్రియాలు ఐన వాక్కు, పాదము, పాణి, పాయువు, ఉపస్థులు చేస్తున్నట్లు కన్పించినా, చేసేది, చేయించేది వేరు అని కేనోపనిషత్తుసారం చెప్పారు. అదే తారకం. రూపము, పేరు అనే ఉపాధులు దాటినదే అమనస్కం. అమనస్కం అంటే మనస్సు లేక పోవడమో, ఆలోచనలు ఆపుకోవడానికి ప్రయత్నించడమో కాదు.
ఇవన్నీ స్పందన పౌనః పున్యమే అని గుర్తించాలి. అప్పుడు ప్రతి వ్యక్తికీ ఉపాధి గత చైతన్యానికి, ఉపాధి అతీతమైన చైతన్యానికి తేడా తెలుస్తుంది.ద్రవ్యరాశి ఆధారంగా గలది ఉపాధి గల చైతన్యం. అదే అమ్మ చెప్పిన నాగేంద్ర తత్త్వం. కేవల పురుషోత్తమ స్థితి మరుగు. అక్కడ చైతన్యం ఉంటుంది. కానీ గుణాల ప్రతిప్రసవం ఉండదు. దీన్నే పతంజలి యోగ సూత్రాలు 4:34 లో ఎక్కడ పురుషార్థాలు ఉండవో, ఎక్కడ పురుషుడు చిత్ శక్తి లోనే ప్రతిష్ఠితుడౌతాడో, అదే కైవల్యం అన్నారు. అమ్మ దాన్ని సుగతి అన్నారు.
ఎవరు సుగతి నెరిగి మరుగును గుర్తించి
కాలకర్మలందు కరుణతెలిసి
ప్రేమపంచి తాను తనయంత పెరుగునో
వాడు పురుషుడైన సజ్జనుండు.
కాబట్టి అమ్మ రోల్ మోడల్ గా మనను ఎలాగ గైడ్ చేశారో, చేస్తున్నారో అది అర్థం చేసుకొని జీవించడమే త్రికరణ శుధ్ధి.