(16.5.2021 ఈనాడు సంపాదకీయం సౌజన్యంతో)
శ్రీ నాధుడి కాశీఖండంలో యజ్ఞదత్తుడి కొడుకు – పేరుకు గుణనిధి. అన్ని అవలక్షణాలకు ఆలవాలం అతడి బుద్ధి. అయినా తల్లి అతణ్ని అనుక్షణం వెనకేసుకొచ్చేది. తండ్రి అడిగితే ‘స్నానమాడెను, వార్చెను సంధ్య, అగ్నిహోత్రమొనరించె తనయుడు’ అంటూ తేలిగ్గా అబద్ధాలాడేది. కొడుకు మీద ఈగైనా వాలనిచ్చేది కాదు. బుద్ధి గడ్డితినే బిడ్డ మీదే తల్లికి అంత ఉంటే ముద్దులు మూటగట్టే చిన్నికృష్ణుడి మీద యశోదమ్మకు ఇంకెంత ఉండాలి! గోపాంగనలు తన ఇంటిమీద పడి, అన్నెం పున్నెం ఎరుగని పసివాణ్ని పట్టుకొని ‘ఓయమ్మ! నీ కుమారుడు మా ఇండ్లను పాలు, పెరుగు మననీడమ్మా’ అని చాడీలు చెబితే మరి ఊరుకుంటుందా? ‘ఎన్నడు పొరుగిండ్ల త్రోవలెరుగడు. నేడున్ కన్నులు తెరవని మా ఈ చిన్ని కుమారకుని రవ్వ సేయందగునే?’ అని దులిపేసింది. యశోదమ్మే కాదు, ప్రతి అమ్మా అంతే! వెన్నెలకు వెలితి, అమ్మ ప్రేమకు పరిమితి లేవన్నారందుకే. నిజానికి ఈ తరహా మమకారం తల్లులకే పరిమితం కాదు. బ్రహ్మర్షి అంతటివాడు స్వయంగా వచ్చి ‘నీ కొడుకును నాతో పంపించు’ అని అడిగితే, ‘వాణ్ని విడిచి క్షణం బతకలేను… న రామం నేతుమర్హసి… వాణ్ని వదిలెయ్యి’ అని పుత్ర ప్రేమతో విలవిల్లాడాడు. ఒక మహారాజు. కన్న కూతురు కూడా కాదు, పెంచుకొన్న శకుంతలను కాపురానికి పంపిస్తూ ‘హరిణ సతులార మీయక్క ఏగుచుండె’ అంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడొక మహర్షి కురుక్షేత్రంలో కొడుకు మరణవార్త వింటూనే హతాశుడైపోయాడొక ఆచార్యుడు. తల్లిదనాన్ని తమలో జీర్ణించుకొన్న తండ్రులు వీరంతా. ‘నీ సందేశం ఏమిటమ్మా’ అని అడిగితే, ‘అమ్మగా ఉండటమే నా సందేశం నాన్నా’ అంది జిల్లెళ్లమూడి అమ్మ. అమ్మానాన్నలు అమ్మదనానికి బొమ్మా బొరుసూను! –