నా పేరు అంజనీదేవి, మేము మధురభారతి, శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తిగారి ఇంటి ఎదురుగా ఉన్న ఫ్లాట్లో నివసించుచున్నాము. శ్రీ మూర్తిగారు, వారి అర్ధాంగి శ్రీమతి వల్లిగారు అమ్మవారికి పరమభక్తులు. వారితో జరుగు సంభాషణలలో ఆ దంపతులు తరచుగా అమ్మ వైభవం గురించి చెపుతూ ఉంటారు. ఆ విశేషములు నాకు చాలా సంతోషమును కలిగించుతూ ఉంటాయి. ఇటీవల నాకు -ఒక చిత్రమైన అనుభవం కలిగింది.
ఒకరోజున మేము గుంటూరు వెళ్ళవలసి ఉన్నది. ఇంటి వద్ద ఒక చిన్న పని ముగించుకుని, ఉదయం ఏ తొమ్మిది గంటలకో బయలుదేరి కుటుంబముగా జిల్లెళ్ళమూడి వెళ్ళవలెనని భావించితిమి. అమ్మ దర్శనమును పొంది, అమ్మ. ప్రసాదమును స్వీకరించి, ఆ తరువాత సాయంత్రమునకు గుంటూరు చేరవలెనని సంకల్పించినాము. అందుకే మా ఇంటిలో వంట ప్రయత్నము కూడా చేయలేదు.
కాని కారణాంతరముల వలన ఆ రోజు అనుకున్న సమయానికి బయలుదేరలేకపోయాము. మేము ఎంత ప్రయత్నించినా మధ్యాహ్నం 3 గంటల వరకు బయలుదేరటం సాధ్యపడలేదు. అందువల్ల జిల్లెళ్ళమూడి ప్రయాణం చేయలేకపోయాము. అమ్మ దర్శనం చేసుకునే అవకాశం కలుగలేదు. కానీ, ఆ రోజున అమ్మ ఆశీర్వ దించినట్లుగా జిల్లెళ్లమూడి అమ్మప్రసాదం మాకు లభించింది. శ్రీమతి శ్రీవల్లిగారు ఆశ్చర్యకరముగా మా కుటుంబసభ్యులందరికీ స్వయముగా వండి వడ్డించినారు. అంతకు మునుపు ఎన్నడూ మేము వారి ఇంట భోజనము చేయలేదు. ఆ రోజు కూడా అక్కడ భోజనం చేద్దామనే ఆలోచన మాకు లేదు. కాని, అనుకోని విధముగా అమ్మ ప్రసాదము స్వీకరించగలిగాము. వేళగాని వేళలో మా.. కుటుంబ సభ్యులందరమూ శ్రీ మూర్తిగారి ఇంట భోజనము చేయటం జరిగింది. ఆ రోజున శ్రీవల్లిగారి రూపములో అమ్మే మాకు వండి వడ్డించిన అనుభూతికి మేమందరమూ లోనైనాము.
జిల్లెళ్ళమూడి వెళ్ళాలని, అమ్మను దర్శించాలని అనుకున్న మా ఆశ నెరవేరలేదు. అయినా అమ్మ ఇక్కడే తన ప్రసాదం అనుగ్రహించినట్లు అనిపించింది. ఇది అమ్మ సంకల్పము. మాత్రమే అనే నమ్మకము నాలో బలపడింది. అమ్మ పట్ల సంపూర్ణ విశ్వాసమును కలిగించినది ఈ సంఘటన.
త్వరలో జిల్లెళ్ళమూడి వెళ్ళవలెనని, అమ్మ దర్శనము చేసికొనవలెనని గాఢముగా అనిపించింది. ఆ దర్శనము మాకు అమ్మ ఎప్పుడు అనుగ్రహిస్తుందో అని ఆనాటి నుండి మరింత తీవ్రముగా ఎదురు చూస్తున్నాము.
ఆ రోజు నుంచి మా దంపతుల ఆలోచనలలో .. తరచుగా అమ్మ ప్రస్తావన కలుగుతోంది. ఆనాటి నుంచి శ్రీమూర్తిగారి దంపతులను ‘ఆంటీ, అంకుల్’ అని కాక అమ్మా నాన్నగా మనసా వాచా కర్మణా భావించుచున్నాను. నాకు 20 ఏళ్ళయినా నిండకమునుపే నేను నా తల్లిదండ్రులను కోల్పోయాను. అమ్మా, నాన్నలు దూరమైన నాకు వీరి రూపంలో అమ్మా నాన్నల ప్రేమను జిల్లెళ్ళమూడి అమ్మే అనుగ్రహించిందని అనిపిస్తోంది. ఇదంతా అమ్మ దయే. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే