ఏనాటి బంధమో యిది
ఈనాటికి వెలసె నిటుల, ఇక ముందే రూ
పాన నలరారగలదో
మానవజనయిత్రి ! యెరుగు మార్గము గలదే?
ఈ పద్యము మా గురుదేవులు వ్రాసిన ‘అంబికా ‘ అను గ్రంథములోనిది. మేము, (మీరాబాయి) అర్కపురిజూచుట ఇదియే ప్రథమము.
లలితాసహస్రనామములలో ‘దయామూర్తి’ అనే నామము ఒకటి గలదు (581). అనగా ఆమె రూపమే
అమ్మకు ఉన్న నామములలో మరియొకటి ‘క్షిప్ర ప్రసాదిని’ (869) అనునది. అనగా శీఘ్రమే అనుగ్రహించునది. విశ్వజనని, జిల్లెళ్ళమూడి అమ్మ – దయామూర్తి, క్షిప్రసాదిని.
పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ గారితో ఫోన్లో “నేను ఎప్పుడూ అర్కపురి చూడలేదు. ఎప్పుడైనా చూసే అవకాశం కల్పించండి” అని అన్నాను. ‘సరే’ అన్నారు.
కొద్దిరోజులలోనే మీరు 27వ తేదీన అర్కపురికి రావలసినదిగా కోరుతున్నాము” కోటి లలితాసహస్రనామ పారాయణ” కు ప్రారంభోత్సవం చేయండి” అని కోరిరి. అమ్మ దయ ఇంత శీఘ్రమే ఉంటుందని నేను అనుకోలేదు. ఆమె క్షిప్రప్రసాదిని గదా!
విశ్వజనని అమ్మ
అణువణువున విశ్వమున గోచరించు చైతన్య మంతయు భావనలో ఒక మహారాశిగా రూపొందించు కొన్నచో ఆ చైతన్యశక్తియే అర్కపురి అమ్మ. ఆమెయే శ్రీమాత. అమ్మ ఆకారంలో సర్వదేవతాశక్తులు ఇమిడి యున్నవి.
అమ్మ అద్భుచారిత్ర ఆమె అనుగ్రహము నాకీవిధముగా గల్గుట, మహాదానందముగా ఉన్నది. ఆమె అవ్యాజకరుణామూర్తి. అమ్మకు సహస్రవందనము లొనర్చి
శ్రీ లలితా సహస్రనామ మహిమను గూర్చి రెండు నిమిషములు – ‘కలౌ నామస్మరణః’ సంసారసాగరమును దాటుటకు, కలిదోష ప్రభావము నుండి రక్షణ పొందుటకు భగవన్నామస్మరణయే మార్గము.
నామతత్త్వము చాలా పవిత్రమైనది. దివ్యమైనది. భగవన్నామంతో విషం కూడా అమృతంగా మారిపోతుంది.
నామపారాయణంచేత మానవత్వాన్ని దైవత్వంగా మార్చుకోవటానికి ప్రయత్నించాలి. నామముకు అర్థము తెలిసికొని, స్పష్టముగా పారాయణచేయుటవల్ల మనస్సు మరింత పవిత్రము జెందును. అమ్మ నామము పలికినపుడు ఆ రూపము గోచరమవ్వాలి.
నామపారాయణ మహిమ
నామపారాయణ చేయుటవలన దురాశను పోగొట్టి తృప్తిని కలిగించును. భగవన్నామ పారాయణ నృసింహావతారము వంటిది. అది మీ హృదయమును చీల్చుకొని రావాలి. ప్రేమైక హృదయంతో ఒక్క పర్యాయము పిలిచిన తక్షణమే ‘ఓ’ అని భగవంతుడు తప్పక సాక్షాత్కరిస్తాడు.
నామమును నోట బలుకుచున్న దాని గుణమునది ఇచ్చును. నామమునకు, మంత్రమునకు ఎక్కువ భేదము లేదు. ప్రియురాలిని పిలుచుటకు ప్రియుడెట్లు సాంకేతికమైన గుర్తు పెట్టుకొనునో, యటులనే నామమునకు సాంకేతికమైనదే మంత్రము.
నామపారాయణవల్ల దేహతాపములు తీరి పోతాయి. రాగద్వేషములు నశించును. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖములు నామపారాయణవల్ల దూరమగును.
రాజస, తామస గుణములు నశించి, సత్త్వగుణము అభివృద్ధి జెందును. నామపారాయణవల్ల మనస్సు చంచలత్వము తగ్గును. అజ్ఞానము నశించును.
నామపారాయణము చేయునపుడు ఒకవిధమైన రుచిగలిగి వదలబుద్దికాదు. ఈ రుచి కల్గుటకు దినమునకు కనీసము 2 గంటలు చొప్పున 6 మాసముల సాధన చేయవలయును. ఆ రుచి అనుభవించియే రామదాసు రామా నీనామ మెంతో రుచిరా ! ఎంతో రుచి, ఎంతో రుచి ఎంతో రుచిరా’ -అని అన్నాడు. నామ పారాయణ చేత గల్గు ధ్వని వలన మనస్సు లయించును. దేహము మఱపునకు వచ్చి, దేహాత్మభావము నశించును. జ్ఞానశక్తి, దివ్యదృష్టి కలుగును.
నామసంకీర్తన వలన గ్రంథులు విడిపోవును. నామసంక్తీరన వలన ప్రాణమయకోశము శుద్ధియగును. మూలాధారములో నున్న కుండలినీశక్తి మేల్కొనును. సంకీర్తన వల్ల భావ సమాధి కల్గును.
నామపారాయణ వలన ధైర్య, స్థైర్యములు కలుగును. శ్రీ లలితాసహస్రనామములలో ఆ పరాశక్తి ప్రభావము, అనంతవ్యాపకత్వమహిమ, శరీర లావణ్య వైభవము, దుష్టరాక్షస సంహారకశక్తి, భక్తరక్షణ దాక్షిణ్యము మంత్ర, యంత్ర, తంత్ర రూపాత్మకమైన రహస్య తత్త్వ వివరణము, ఉపాసనా విధానము వివరింపబడ్డాయి.
ఇట్టి మహత్తరమైన కోటి లలితాసహస్రనామ పారాయణ వల్ల లోకమునందు శాంతి కల్గును. ఈతిబాధ లుండవు. సమస్త జనులు సుఖముగా ఉందురు, అమ్మ దయతో నామపారాయణ యజ్ఞము దిగ్విజయమగును. సందేహము లేదు.