పర్ణశాలలో మంచం మీద కూర్చుని అనేక రకాల వారికి అన్ని మతాల వారికి, అన్ని తరగతుల వారికి, అన్ని వృత్తుల వారికి పండితులకు, పామరులకు దేశవిదేశాల నుండీ వచ్చిన వారికి అమ్మ దర్శన మిచ్చేది. పూలపూజలు, పాలాభిషేకాలు, పాదదర్శనం చేసుకుంటూ వేలాది కొబ్బరికాయలు కొడతారు కర్పూరం ముద్దలు ముద్దలు ఆత్మార్పణం చేసుకుంటుంది. అన్ని కాలాలలో నవనవోన్మేషమై నవ్యకాంతులు వెదజల్లే ఆ దివ్య పాదారవిందాలమీద రాసులు రాసులుగా మల్లెలు, గులాబులు, చేమంతులు, బంతులు పరమాత్మలో సంలీనమైన జీవుల మాదిరి తమ జీవితాలకు సార్థకతను సంతరించుకుంటాయి. అరుణారుణ దీప్తివంతములైన ఆ చరణపంకేరుహాల పావన స్పర్శతో కుంకుమ మరింత ఎర్రదనం పులుముకుంటుంది. ఆ మంగళగళసీమను అలరించిన పూలదండల పకపకలతో పరిసరప్రాంతాన్ని ప్రక్షాళిత హృదయాలను పరిమళభరితం చేస్తుంటాయి.
ఆ తేజోమూర్తి దివ్యసందర్శనలో ఎందరి హృదయాలలోనో భగభగమండే ఆవేదనాగ్ని జ్వాలలు చల్లారుతున్నాయి. ఆపాదాలలోని పరుశవేది స్పర్శతో ఎందరో పాపులు పావన చరితులవుతున్నారు. ఆనయనాంచలాల జాలువారే కరుణామయ దృక్కులతో మోడువారిన ఎందరి జీవితాలలోనో వసంతం వెల్లివిరుస్తుంది. ఆ తీయని పలుకులలోని మధురిమతో ఆశోపహతులెందరో పునర్జీవులయి ఉజ్వల పథాల పయనిస్తున్నారు. ఆ అనురాగ స్రవంతిలో దోసెడు జలపానం చేసిన వారి శుష్కజీవితాలలో మమతలు చివుళ్ళు తొడుగుతాయి. తన కేమీ తెలియదని తానేమీ చేయలేనని అంటూనే ఆధ్యాత్మిక సందేశంతోపాటు లౌకిక కామనలకు ఆకారం ఇస్తుంది అమ్మ.
యోగసాధనలో పరాకాష్ట అయిన ఛిన్నమస్తక తనుపొందటాన్ని, శాంభవీ ముద్రతో అమ్మను చూచిన వారికి వేరే సాధనలతో పనిలేదు. భృకుటి నుండీ స్రవించే రుధిరాన్ని విభూతిగా మార్చి ప్రసాదంగా పంచటం, భోజనం చేయకున్నా శరీరపోషణ జరగటమే కాకుండా తేజోభాసితం కావటం గమనించి విస్మితులు అయినవారు, నిద్రలేకున్నా ఈషణ్మాత్రం అలసట గుర్తించక విస్తుపోయినవారు. అమ్మ దర్శనంలో, స్పర్శలో, సంభాషణలో అద్భుత దృశ్యాలు లౌకిక ఆనందానుభూతిని పొందినవారు ఎందరో కలరు. అపార విజ్ఞాన సంపద కనుగొన్న వారు, ఒక్క రోజులో భగవద్గీత యావత్తును, మరొక రోజులో లలితా సహస్రనామస్తోత్రమును అప్పచెప్పగల్గిన శేముషీ వైభవాన్ని చూసి ఆనందించినవారు కలరు. అనేక రకాలుగా అమ్మలో మానవాతీత లక్షణాలు గుర్తించిన అదృష్టవంతులు ఎందరో కలరు. చిన్న తనంలో చంద్రమౌళి చిదంబరరావుగారు అమ్మ మాటలలో, చేతలలోద్యోతకమయ్యే భిన్నత్వంలేని మనస్తత్వం, అత్యద్భుత అద్వైత సిద్ధి, అమ్మ సన్నిధిలో అనేక పర్యాయాలు అపూర్వ అలౌకిక దృశ్యాలచే ప్రభావితులయ్యారు. తమ ఇంట అసాధారణ తత్వం సాధారణమై వెలసిందని, తమని తరింపచేయటానికే అమ్మ వచ్చిందని చెప్పేవారు.
అమ్మ చిన్న తనంలోనే అనేకులకు వారి వారి ఉపాసనలు బట్టీ, మనః స్థితులను బట్టి రాజరాజేశ్వరిగా, గాయత్రిగా, కృష్ణుడిగా, రాముడిగా సత్యనారాయణ స్వామిగా, ఆంజనేయస్వామిగా, సాయిబాబాగా, మహమ్మద్ ప్రవక్తగా, ఏసుక్రీస్తుగా, మేరీ మాతగా అనేక రూపాలలో, అనేక విధాల దర్శన మిచ్చింది. అందుకే అమ్మ “ఎవరు ఎట్లా చేస్తే అట్లా కనపడతాను” అన్నది.
అమ్మ దర్శనం ఇచ్చేప్పుడు అందరినీ పరికించేది. దూరాన ఉన్నవారి మీద కూడా అమ్మ తన దృష్టిని ప్రసరింప చేసేది ప్రతి ఒక్కరికీ అమ్మ తమనే చూస్తోందన్న భావన కలిగేది. అమ్మ యొక్క క్రీగంటి చూపును అమ్మతో పరిచయమున్న ఏ ఒక్కరూ మరిచిపోలేనిది. అమ్మ దృష్టిలో పడగలగటమే మన అదృష్టం.
ఒకామె అమ్మతో “బహిర్భూమికి వెళ్ళినప్పుడు మంత్రం గుర్తుకు వస్తోందమ్మా!” అని అన్నది. దానికి అమ్మ “మలం బయటికి పోతే మంత్రం వచ్చింది. తప్పులేదమ్మా! సర్వకాల సర్వఅవస్థల యందు గుర్తుండటమే మంత్రసిద్ధి. దానిని మర్చేపోకుండా ఉండటానికీ, మంత్రజపం అక్షరలక్షలు చేయమంటారు” అన్నది.
అమ్మ మత ప్రబోధం కొరకో, మతప్రచారం కొరకో రాలేదు. మానవత్వాన్ని పెంపొందించటానికి, మానవత్వపు విలువల్ని తెలియచేయటానికి వాటిని పరిరక్షించటానికి అవతరించిన అమృతమూర్తి అమ్మ.