అమ్మ తనదైన శైలిలో సామాన్య జన భాషలో సాధన గురించి తెలియ జేసిన సందర్భాలెన్నో ఉన్నాయి. సంప్రదాయ బద్ధంగా శాస్త్రీయంగా సాధన అంటే మనకున్న అవగాహనకు అమ్మ ప్రవచించిన సాధనా మార్గాలు భిన్నమైనవి. అవి అతి సాధారణంగా క్లిష్టత లేకుండా ఆచరణ యోగ్యంగా ఉంటాయి. సాధకునిలో ఆచరణ తత్త్యాన్ని పాదుకొల్పే మార్గాన్ని అమ్మ చెపుతుంది. అవి విలక్షణంగాను శాస్త్రాతిరిక్తంగానూ, కనిపిస్తాయి. కాస్త లోతుగా పరిశీలిస్తే ఆ పద్ధతులు శాస్త్రం నుంచి వేరయినవి కావని తెలుస్తుంది. ఆధ్యాత్మిక సాధనలకు కొత్త అర్థాన్ని ప్రేరణను యిచ్చింది. బహికాముష్మిక జీవన సమన్వయం చేసింది. ఒక దేవతా విగ్రహం ముందు శ్లోకాలు, మంత్రాలు పఠించటం, షోడశోపచారాలతో అర్చన చెయ్యటం ఇత్యాదులు ఆధ్యాత్మిక కార్యకలాపాలని, జీవిక కోసం చేసే ఉద్యోగ వ్యాపారాదులు ప్రాపంచికమైనవని అనుకుంటాం. దాన్ని అమ్మ సరిదిద్ది. అవి నాణేనికి బొమ్మా బొరుసు లాంటివి, ఆముష్మిక జీవితం గడపటానికి అవసరమైనవన్నీ ఐహిక జీవితానికీ అవసరమే అని స్పష్టం చేసింది. పైగా తన జీవితాంతం ఆచరణ చేసి చూపుతూనే గడిపింది.
అద్భుత వాగ్వైభవంతో విలసిల్లే అమ్మ నాక్యాలు సూచనలు ఉన్నదానికి, ఉండవలసిన దానికి జరిగిన దానికి, జరుగుతున్న, జరుగబోయే దానికి మధ్యగల కార్యకారణ సంబంధం తెలియ చేసే సువర్ణ సూత్రాలు. ఆ తెలియ చేసే పద్ధతి సందర్భాన్నిబట్టి, సమయాన్ని బట్టి, వ్యక్తి (స్థాయి) ని బట్టి భిన్న భిన్నంగా ఉంటుంది. ఒకోసారి నవ నవోన్మేషంగా, ఒకోసారి గతానుగతికంగా ఒకోసారి పురాతన భావనకే మెరుగులద్దినట్టు ఉంటుంది. ఒకే సందర్భానికి ఒకే ప్రశ్నకు వేర్వేరుగా చెప్పినట్టు కనిపించవచ్చు. అన్ని వంటలూ అందరికీ జీర్ణం కావు. ఎవరికేది సులువుగా జీర్ణం అవుతుందో ఆ వంటకం వడ్డించింది అమ్మ. అమ్మ నాక్యాలు ఎంతో సులువుగా ఉన్నట్లు అనిపిస్తాయి. అది మన భ్రమ. వాటికి వివరణ ఉంటే గాని అర్ధం కావు. ఈ నేపథ్యంలో సాధన గురించి అమ్మ ఏమన్నదో విచారణ చేద్దాం.
“నేను గురువును కాను మీరు శిష్యులు కారు” అంటూనే అపూర్వమైన తన అనుభవ జ్ఞానంతో ఎందరికో సందేహ నివృత్తి, సమస్యా పరిష్కారమూ చేసింది. అలా అపుడపుడూ సంభాషణల సందర్భంలో చెప్పినవే అమ్మ నాక్యాలనే ఆణి ముత్యాలు.
సాధన గురించి అమ్మ ఏం చెప్పిందనగానే మనకు స్ఫురించే మాట “సాధ్యమైనదే సాధన. ఒకరు చెప్పిందీ కాదు, నువ్వు చేద్దామనుకున్నదీ కాదు – నువ్వు చెయ్య గలిగింది నీచేత ఆ శక్తి చేయించినదే సాధన, సాధన అని అంటున్నది వాస్తవానికి లేదు. చెయ్యగల అవకాశాన్ని గుర్తు పెట్టుకోవటమే సాధన” అన్నది అమ్మ. సాధనలు చెప్పేవి వినేవే కాని చేసేవి అవలేవు.
మనకు ఆధ్యాత్మిక సాధనా మార్గాలు అనేకం ఉన్నాయి. అందులో జ్ఞాన భక్తి, కర్మ మార్గాలు ముఖ్యమైనవి. అందులో ఏది సులువైనది? అంటే మనకు నచ్చిన విధానాన్ని మనం అనుసరించటమే అన్నిటికన్నా సులువైనది. ఎన్ని మార్గాలున్నా అన్నిటిలో సాధారణీకరణ విషయం ఏమిటంటే వ్యక్తిత్వ స్పృహను అధిగమించటం. చేసేది జరిపించేదీ అంతా మనిషే. అయినా నేను చేస్తున్నాను, నా వల్ల ఇదంతా జరుగుతోంది అనే స్పృహకు అతీతంగా పనులు జరగటమే ఆధ్యాత్మిక జీవనం. ఏది జరిగినా ఎవరు ఏది చేసినా మనం కాదు చేసేది, మనను నడిపించే శక్తి మరొకటి ఉన్నదనుకోవటమే. ఎవరు చేసే పనులకు వాళ్ళు కర్తలు కారు – అని కర్తృత్వ రాహిత్యాన్ని వివరిస్తుంది అమ్మ. “సంసార బాధ్యతలే ఆధ్యాత్మిక సాధన” అన్నది ఒకరి ప్రశ్నకు జవాబుగా. లలితా సహస్ర నామ పారాయణ వంటివి ఎలా చెయ్య గలిగితే, ఎలా సాధ్యమైతే అలా చెయ్యి అన్నది. పాలు త్రాగి అయినా, అల్పాహారం తీసుకుని అయినా, యింకా ఉండ లేకపోతే భోజనం చేసి కూడా చెయ్యవచ్చు అని అన్నది. ఒక వైపు క్షుత్ పిపాసలు ఇబ్బంది పెడుతూ ఉంటే చేసే పని మీద ఏకాగ్రత ఎలా కుదురుతుంది? మడీ తడీ ఆచారము లాంటివి ఆచరణ కన్నా ఏకాగ్రత కన్నా ఎక్కువ కాదు. “సాధన చెయ్యటం కూడా మన చేతిలో లేదు. ఒడ్డున కూర్చుని కబుర్లు చెప్పటానికేం, ఇది చెయ్యండి. అది చెయ్యండి అని. ఏదీ మన చేతిలో లేదు. నేను మీరు కోరినట్లు ఏదైనా మంత్రం చెపితే దానిలో మనస్సు నిలవటానికి మీకు సాధ్యం కావద్దూ? ఏదీ మనవల్ల కాదు. తరుణం వచ్చినపుడు అదే అవుతుంది.
ప్రయత్నం చెయ్యమంటే ఎలా చేస్తాడు? సాధ్యమయిన దానినే సాధించటం జరుగుతుంది. కానీ సాధన చేసి సాధిస్తారన్నది జరిగేది కాదు. ప్రేరణ లేనిదే ప్రయత్నం ఎక్కడ నుండి వస్తుంది? ” ఇలాంటి సూచనలన్నీ నిష్క్రియా పరత్వాన్ని ప్రోత్సహిస్తాయా? అన్న అనుమానం కలగవచ్చు. అందుకే అమ్మ “నీకేది చెయ్యాలనిపిస్తే అది చెయ్యమంటాను. తోచిందేదో చెయ్యి, తోపింప చేసేవాడు వాడేగా. స్నానం చేస్తున్నది మొదలు ప్రతీదీ సాధనే అంటాను. చేద్దాము అనుకున్నది
ప్రేరణ, చేసింది క్రియ. క్రియ మనదిగా కనిపిస్తుంది. కర్త ఎవరో తెలియటం లేదు. కర్త ఎవరో క్రియ వారిదే అనిపిస్తుంది నాకు” అంటారు అమ్మ. నీ సాధన ఏమిటి? అని ఒకరడిగితే ‘సర్వసాధారణమైనదే సాధన’ అని చెప్పింది. ఏం లేదు నాన్నా బిడ్డల్ని కనటమే అని మరొకరికి చెప్పింది. ఏది చెయ్యాలి? అని ఒకరి ప్రశ్న. ఏదైనా ఒకటే. దానిమీద ధ్యాస పూర్తిగా ఉంచితే చాలు.
ఒకసారి కొందరు అమ్మ దగ్గర కూర్చున్నప్పుడు అందరికి సులభ సాధ్యమైన. సాధన ఏదైనా చెప్పమని కోరారు. అమ్మ ఎంతకు ఏమీ మాట్లాడలేదు. చివరకు – ‘పోనీ అమ్మా… అందరికీ ఏ సాధనా చెప్పక పోతే మానె, నిన్ను నమ్ముకుని నీ సన్నిధికి చేరుకున్నాం. మాకు ఏ ఉపదేశమా చేయకపోతివి. ఏ సాధనా చేయటం లేదాయె, కాలం గతించి పోతున్నది మరి ఎట్లాగూ? అని అడిగారు. అప్పుడు అమ్మ నవ్వుతూ “అయితే సరే, మీకు నేను పెట్టిందేదో తిని హాయిగా ఉండండి, నేను ఇచ్చిందేదో పది మందికీ ఆదరణతో సంతోషంగా పెట్టండి, ఇదే మీకు సాధన,”
ఇదే కదా మనకు మిగిలిన మనకు సాధ్యమైన మనకు యోగ్యమైన సాధన!!