1. Home
  2. Articles
  3. Mother of All
  4. అమ్మ దృష్టిలో సాధన

అమ్మ దృష్టిలో సాధన

Prasad Varma Kamarushi
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 16
Month : April
Issue Number : 2
Year : 2017

సాధారణంగా సాధన అంటే ఏవో జపతపాలు ఆచరించటం, ధ్యానం చెయ్యటం, యోగాసనాలు వెయ్యటం, నామ సంకీర్తనలు భజనల్లో పాల్గొనటం, లేదా వేదాంత గ్రంథాలు అధ్యయనం చేసి జ్ఞాన మార్గంలో భగవదన్వేషణ…. ఇలా సాగుతాయి మన ఆలోచనలు. అది పరంపరాగత సంప్రదాయ పద్ధతి. అది లోక రీతి. కాని అమ్మ నడిచిన దారి వేరు. నడవమన్న దారి వేరు. చెప్పిన మాట వేరు. అమ్మ సాధన చేసిందా? ఆమె అనుసపరించిన సాధనా మార్గాలు యేమిటి? ఆ మార్గాలు తెలిస్తే మనం ఆ మార్గంలో ప్రయాణించ గలమా?

“అమ్మ జీవితంలో సాధన దశ లేదు. అమ్మది సహజ స్థితి. రమణమహర్షి సాధన చేసి ఆ స్థితిని చేరుకున్నారు. జీవితంలో ఒక్క క్షణంలో నైనా ఆత్మస్థితి నుండి ఏమరుపాటు ఎరుగని వ్యక్తి అమ్మ.” – శ్రీపాద.

శ్రీపాదవారి వ్యాఖ్యను నిర్ధారణ చేసిందా అన్నట్లు “ఆ ముద్ర అనీ ఈ ముద్ర అనీ మరిడమ్మగారు తెల్లవార్లూ తపస్సు చేస్తూ ఉండేది. వాళ్ళకు ఎంతో ప్రయత్నంతో వచ్చేది నాకు సునాయాసంగా వచ్చేది.” అని అమ్మ అన్నది ఒకసారి.

19 నెలల వయసులో పద్మాసనం వేసి కూచుని నల్లగుడ్డు పైకి పోనిచ్చి అరమోడ్పు కనులతో ధ్యాన నిమగ్న అయింది. మరి కొన్నాళ్ళకు తెనాలిలో ఒక దానిమ్మ చెట్టు కింద ఎడమకాలు ముందుకు చాపి, కుడి కాలు వెనక్కు మడిచి, దానిమ్మపువ్వు చేత్తో పట్టుకుని శ్వాస ఆపి, కన్నులరమోడ్చి కూర్చున్న సంఘటన ఒకటున్నది. ఎవరో అడిగితే ఇది శాంభవీ ముద్రలే అన్నది. రాజమ్మ గారి దగ్గర ఓంకారం పట్టి తెలివి తప్పింది. ఇటువంటి ప్రక్రియలు అమ్మ చేసిన సాధన క్రిందికి వస్తాయా? “ఇట్టివి లోచూపు అని వర్ణించబడే అంతరయోగం” అంటారు శ్రీపాద.

అమ్మ తనదైన శైలిలో సామన్యజన భాషలోను, సంజ్ఞలతోను ‘సాధన’ యేమిటో తెలియచెప్పిన సందర్భాలెన్నో ఉన్నాయి. సంప్రదాయ బద్ధంగా, శాస్త్రజ్ఞాన నేపథ్యంతో సాధన అంటే మనకున్న అవగాహనకు అమ్మ ప్రవచించిన సాధనా మార్గాలు చాలా విభిన్నమైనవి, విలక్షణమైనవి. అవి అతి సాధారణంగా క్లిష్టతలేకుండా ఆచరణ సాధ్యంగా ఉంటాయి. క్లిష్టంగా ఉండే పద్ధతులను, చైతన్య రహిత నిర్జీవ పద్ధతులను అమ్మ ఎన్నడూ చెప్పలేదు, ప్రోత్సహించనూ లేదు.

Childbirth is complete sadhana in itself which includes all Yama and Niyama. At the time of birth the mother is faced with the two extremities of pain and pleasure, which ultimately lead her to experience the greatest wonder of creation. అన్నది యోగుల మాట. దీన్ని అతి సరళం చేసింది అమ్మ. ఒకాయన యేమిటి నీ సాధన అని అడిగితే “ఏంలేదు నాన్నా బిడ్డల్ని కనటమే” అని చెప్పింది. ఇదే ప్రశ్నకు ఇంకొకరికి “సర్వ సాధారణమైనదే సాధన” అన్నది. సాధ్యమైనదే సాధన గాని, సాధన చెయ్యాలంటే చెయ్యలేము. ఒడ్డున కూచుని కబుర్లు చెప్పటానికేం, ఇది చెయ్యండి, అది చెయ్యండి అని. ఏదీ మనచేతిలో లేదు. చెప్పేవాడికి అది (చెప్పటం) సాధ్యం. వినే వాడికి ఇది (వినటం) సాధ్యం అయింది. ఏదీ మనవల్ల కాదు. తరుణం వస్తే అదే అవుతుంది. ఒక సాధన గొప్పదని, ఒక సాధన తక్కువనీ నాకు లేదు. “అన్నిటినీ చేయించేదేదో మనకు తెలియదు కాబట్టి మనం చేస్తున్నాం అని అనుకుంటున్నాం. సాధ్యమయిన దానినే మనం చేస్తున్నాం. ఇది తెలిసేటంత వరకు సాధన చేస్తున్నాం అనుకుంటాం. మనంగా యేమీ చేయలేమనేది నా అనుభవం నాన్నా” ఇలా సాగుతుంది సాధన మీద అమ్మ తాత్వికత. అవకాశాన్ని గమనించటమూ సాధనే అని, నా దృష్టిలో సాధకులే లేరు అని, సాధన అనేది నీకు తెలియకుండానే జరుగుతుంది అని అన్నది వివిధ సందర్భాలలో..

అమ్మకు చిన్నతనం నుంచి సర్వసృష్టితో ఒక విధమైన తాదాత్మ్యత, అద్వైత స్థితి వంటిది ఉండి ఉండవలె – అనిపిస్తుంది. అందువల్లనేమో పనిగట్టుకుని సాధన చెయ్యటం, తద్వారా యేదో సాధించటం వంటివి అమ్మకు లేవు. ఆ అవసరమూ లేదు. సర్వ సృష్టికీ ఆదీ అంతమూ అమ్మే! కాని అమ్మకు ఆది అంతమూ ఉన్నాయా? చెట్టూ చేమా పిల్లీ కుక్కా, చీమా దోమా ఆఖరికి కురుపులో సూక్ష్మజీవులూ నా బిడ్డలే అనగలిగినది. జిల్లెళ్ళమూడి గ్రామాన్ని వరదనీరు ముంచెత్తితే ఆ వరద నీరూ బిడ్డే అని సంభావించి, నిదానంగా అమ్మాయికి పసుపూ కుంకుమా చీరా పెట్టమన్నది. అద్వైత స్థితికి రావటానికి సాధన కాని “ఆది అద్వైతికి” సాధన యేమిటి?

లౌకిక ఆధ్యాత్మిక సాధనలను కలగలిపి, అభేదం చేసి సాధనకు ఒక కొత్త అర్థాన్ని, ప్రేరణను ఇచ్చింది. ఈ విశ్వమంతా భగవత్ సృష్టి అని గాక సృష్టియే భగవంతుడని చాటి చెప్పింది. మనచుట్టూ కనపడే మనుషులు, పశుపక్ష్యాదులు, చెట్టు చేమలు క్రిమికీటకాదులు జీవ నిర్జీవ సంచయం అంతా సృష్టి పరిధిలోకి వచ్చేవే. ఇట్టి సృష్టిలో మనమూ అనివార్య భాగం. అంటే మనం భగవంతునిలో భాగం కాకుండా ఉండలేం అని అమ్మ నిర్ధారణ. ఈ విశ్వమంతా భగవల్లీలగా ఆ పరమాత్ముని ఉనికిని చాటిచెప్పేదని అంగీకరిస్తే, ఈ ప్రపంచంలో భగవతేతరమైనది యేదీలేదు. ఈ విషయాన్ని మన దైనందిన జీవితంలో అన్వయించుకుంటే ఐహిక ఆముష్మిక సమన్వయం సులభమవుతుంది. ఒక దేవతా విగ్రహం ముందు తెలిసీతెలియని శ్లోకాల పఠనము, మంత్రజపము వంటివి మాత్రమే ఆధ్యాత్మిక కార్యకలాపాలని, జీవిక కోసమో మరేదో ఆశించో చేసే ఉద్యోగ వ్యాపారాలు వట్టి ప్రాపంచికమైనవని అనుకుంటూ ఉంటాం.. అది సరికాదు. ఈ రెండు మార్గాలు వేరైనవి కావు. అవి నాణేనికి బొమ్మ బొరుసూ లాంటివి. ఆముష్మిక జీవితంగడపటానికి అవసరమైనవన్నీ ఐహిక జీవితానికీ అవసరమే అని స్పష్టం చేసింది. అమ్మ. పైగా తన జీవితాంతం ఈ సత్యాన్ని ఆచరణ రూపంలో చూపుతూనే గడిపింది.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!