మహత్యాలుగా అమ్మ అంగీకరించక పోయినా కొన్ని చమత్కారాలు కనిపించేవి. అమ్మ యధాలాపంగానే అవి జరగనిచ్చేది. ఒకసారి ఒక సోదరుడు వచ్చాడు. అతను విజయవాడ నుంచి వచ్చాడు. అమ్మ విజయవాడలో వాత్సల్య యాత్ర చేసినపుడు విజయవాడ పి.డబ్లు.డి. గ్రౌండ్సులో దాదాపు లక్ష మందితో సమావేశం జరిగింది. అమ్మ ఎలాంటి ఉపన్యాసాలు లేకుండా తన వాత్సల్యాన్ని అందరిపై ప్రసరింప చేసింది. ఆ సందర్భం తరువాత ఆ సోదరుడు జిల్లెళ్ళమూడిలో అమ్మను దర్శించవచ్చాడు. అమ్మా! నేను ఆ సమావేశానికి వచ్చానమ్మా! అన్నాడు.
“ఔను నాన్నా! నేను చూశాను. నీవు ఎర్రరంగు చొక్కా వేసుకున్నావు.నీ స్నేహితుల భుజం మీద చేతులు వేసి నుంచున్నావు”. అతను విస్తుపోయి ఔనని ఒప్పుకుంటూ “ఆ లక్షమందిలో నన్ను ఎలా చూశావమ్మా, ఎలా గుర్తుపెట్టుకున్నావమ్మా” అని అన్నాడు.
అమ్మ నవ్వుతూ గొర్రెలకాపరి తన గొర్రెలను ఎక్కడ ఉన్నా గుర్తు పట్టడూ అని తేలికగా తేల్చివేసింది.
జగన్మాతకు తన బిడ్డల ఆనుపానుల విషయం లో స్పష్టత ఉండటంలో విచిత్ర మేముంది? ప్రతి బిడ్డకు అమ్మ ప్రక్కనే ఉంటుందిగా.
అమ్మ తాను అనసూయమ్మగా అవతరించక మునుపు సంగతి కూడా చెప్పిన విషయాలలో ఒకటి గమనించవచ్చు.
ఒకసారి అమ్మ గోవిందరాజులు దత్తు గారితో అన్నది.నేను ఇంతకు ముందే నిన్ను చూశాను. అప్పుడు నీవు ఫలానా రంగు చొక్కా వేసుకుని, మంగళగిరి లో బాలమ్మ గారి అన్నదానంలో వడ్డిస్తున్నావు అని. అతను సంభ్రమాశ్చర్యాలతో అంగీకరించి అప్పటికి నీవు భూమి మీద అవతరించ లేదుగా అన్నాడు. అమ్మ చిరునవ్వు సమాధానంగా ఇచ్చింది. ఔను ఆ శక్తికి భూమి మీద అవతరణకు సంబంధించిన కాలంతో పని ఏముంది. ఎక్కడ ఉన్నా ఈ సమస్త జగత్పరిపాలన ఆ జగన్మాతదేగా! ఆమెకు అన్నికాలాలు వర్తమానమేగా! ఒకసారి సోదరులు అధరాపురపు శేషగిరిరావు గారు అమ్మతో అన్నారు “అమ్మా నేను మద్రాసు మౌంటు రోడ్డులో నడుస్తూ ఉంటే నీకు ఎలా కనిపిస్తానమ్మా?” అప్పుడు అమ్మ “ఏముంది నాన్నా! నా కళ్ళముందు నడుస్తున్నట్లుగా కనిపిస్తావు” అన్నది.
ఔను మరి అమ్మ దేశకాలమాన పరిస్థితులకు అతీతము.. అన్ని కాలాలు అమ్మకు వర్తమానాలే. అన్ని ప్రదేశాలు ఏకకాలంలో దర్శనీయాలే అమ్మకు.
అమ్మ సన్నిధిలో మనం తరచుగా చూసే మరో చమత్కారం ఇది. ఎందరెందరో సోదరసోదరీమణులు తమ సమస్యలు చెప్పుకుని, తమ సమస్యలకు పరిష్కారం పొందాలని అనుకుంటారు. కానీ అమ్మ వారు పెదవి విప్పి చెప్పే పనిలేకుండానే తానే వాటిని ప్రస్తావించేది.
ఆ భక్తులే కాదు చుట్టూ కూర్చున్న బిడ్డలందరూ విస్తుపోయేవారు. ఇది ఎలా జరిగిందో అర్ధం కాక తలలు పట్టుకునే వారు.ఇప్పటికీ అది ఒక అపరిష్కృత విషయమే. అన్ని నేనులు నేనైన నేను అన్నది కదా అమ్మ. అందరిలో అమ్మే ఉన్నప్పుడు, అందరిగా అమ్మే ఉన్నప్పుడు వారి మనసులో భావాలు మరల నోటితో చెప్పకుండా అమ్మకు తెలియటంలో విశేషమేముంది?
అలాగే చాలాసార్లు అమ్మతో వివిధ దేశాల వాళ్ళు, వివిధ రాష్ట్రాల వాళ్ళు వారి వారి మాతృభాషల్లో సంభాషించే వారు. అమ్మ వారితో స్వేచ్ఛగా సంభాషణ కొన సాగించేది ఎలాంటి భాషా సమస్య లేకుండా. వారు వారి భాషలో ప్రసంగించే వారు. అమ్మ చక్కగా తెలుగులో మాట్లాడేది. ఎన్నడూ అనువాద భాష అవసరం రాలేదు.
ఒకసారి అమ్మ ఒరియా అతనితో సంభాషిస్తున్నది. ప్రక్కనే ఉన్న రామకృష్ణ అన్నయ్య అమ్మను అడిగాడు. “అమ్మా నీకు ఒరియా తెలియదు కదా! ఎలా మాట్లాడుతున్నావు” అని.
అమ్మ నవ్వి ఊరుకున్నది.
“నీ మాటలు అతనికెలా అర్థమవుతున్నాయి? అతనికి తెలుగు తెలియదుకదా!”
మరలా అన్నాడు రామకృష్ణ అన్నయ్య. అప్పుడూ అమ్మ నవ్వి ఊరుకున్నది. ఔను. హృదయభాషకు అనువాదం అవసరమా? అన్ని హృదయాలు తనవే అయిన సకల హృదయనేత్రి కదా అమ్మ!