సమస్త సృష్టికీ మూలమైన, సర్వానికీ ఆధారమైన, అంతటా అన్నింటా వ్యాపించి యుండి, అది తప్ప తక్కినది కించిన్మాత్రము లేనట్టి తత్త్వము, సాక్షాత్ పరబ్రహ్మస్వరూపము ఏదైతే ఉన్నదో, ఆ పరతత్త్వము ఒక ఆకారాన్ని ధరించి, అందునా స్త్రీ ఉపాధిని స్వీకరించి, అమితమైన మాతృత్వాన్ని, అనంతమైన వాత్సల్యాన్ని, అపారమైన ప్రేమ, కరుణలను, అవ్యాజమైన అనురాగ, ఆప్యాయతలను, ఎనలేని ఆదరణను సకల మానవులపై, సర్వ జీవరాశిపై ప్రసరింపచేసేందుకు ఈ పుడమిపై అవతరించింది. ఆ ప్రేమైకమూర్తియే మాతృశ్రీ అనసూయాదేవి.
భూమాత కున్నంత సహనాన్ని తనలో నింపుకున్న ఆ సహనశ్రీ, జిల్లెళ్ళమూడి అమ్మగా ప్రసిద్ధి గాంచింది. ఈ దివ్యజనని మన్నవ గ్రామంలో పుట్టినప్పటికి, అనంతర కాలంలో, జిల్లెళ్ళమూడి గ్రామాన్ని తన అవతార కార్యక్షేత్రంగా ఎంచుకున్నది. ఆ తల్లి తన దైవీ ప్రణాళికలో భాగంగా చేపట్టదలచుకున్న కార్యాలన్నీ అధికభాగం ఈ జిల్లెళ్ళమూడి గడ్డపై నుంచే నిర్వహించడం జరిగింది. ఆ రకంగా ఈ ప్రదేశం ఆ తల్లి పాదధూళిని అణువణువునా నిక్షిప్తం చేసుకుంది. తత్ఫలితంగా ఎంతో పవిత్రతను సంతరించుకుంది.
ఆలయ ప్రవేశానంతరం కూడా ‘సర్వమంగళ’ అయిన అమ్మ స్పర్శను ఈ నేలపై అణువణువునా అనుభూతి చెందుతూ, ఇక్కడి అన్నయ్యలు అక్కయ్యలు ఎందరెందరో కలిసి, అనుదినమూ ప్రాతఃకాల వేళ, సూర్యోదయాత్ పూర్వము అమ్మ దివ్యనామాన్ని హృదయపూర్వకంగా స్మరిస్తూ, నోరారా జపిస్తూ, గానం చేస్తూ, కంజీరాది నాదములను మ్రోగిస్తూ, బృందంగా ఏర్పడి, అమ్మకు ప్రతిరూపంగా అమ్మ చిత్రపటాన్ని చేతబూని ఇక్కడి ఆలయాల చుట్టూ, అందరిల్లు చుట్టూ, శ్రీవిశ్వజననీ పరిషత్ సంస్థ ఆవరణ చుట్టూ, జిల్లెళ్ళమూడి గ్రామ ప్రధాన వీధుల గుండాను, అప్పుడప్పుడు గ్రామ వీధులలోనూ, ముఖ్యదినములలో గ్రామ దేవత అయిన పోలేరమ్మ వద్దకు వెళ్ళి, అమ్మ నడయాడిన ఇచ్చోట, ఆ తల్లితో కలిసి, అనుదినమూ గ్రామ సందర్శన గావిస్తూ, ఆ తల్లి నామం అయిన “జయహోూమాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీపరాత్పరి” అని నోరారా ముక్తకంఠంతో పల్కుతూ, గ్రామంలో ప్రతి చోట అమ్మనామం తాలూకూ వైబ్రేషన్స్ నిండేలా, తత్ఫలంగా శాంతి సౌభ్రాతృత్వ భావనలు సమస్త లోకాల్లోనూ పరిఢవిల్లేలాగున, అమ్మ శతజయంతి ఉత్సవాల సందర్భంగా సరిగ్గా సంవత్సరం పాటు, ఎండ, వాన, చలి వంటి ప్రకృతి పరీక్షలను సైతం తితీక్షతో వినయ విధేయతలతో, దీక్షాదక్షతలతో ఎదుర్కొంటూ, అమ్మ కైంకర్యంగా అలుపెరుగక, ఏ ఒక్కనాడు విరామ మీయక సాగించిన ఘనమైన అమ్మసేవయే “అమ్మ నగర సంకీర్తన”.
అమ్మ కూడా తన బాల్యంలో ‘నగర సంకీర్తన’ కార్యక్రమంలో పాల్గొనినట్లు జీవిత మహోదధిలో సాక్ష్యం ఉన్నది. అంతే కాదు. ఎందరో వ్యక్తులకు ఎన్నెన్నో దివ్యానుభవాలు ఈ నగర సంకీర్తన కార్యక్రమం వలన కలిగాయి. కేవలం దగ్గర ఉన్నవారు మాత్రమే కాక దూరంగా ఉన్నట్టి వారు కూడా దృశ్యశ్రవణ మాధ్యమాల ద్వారా ఈ నగరసంకీర్తన కార్యక్రమాన్ని అనునిత్యం వీక్షించడం అనేది వారి వారి దినచర్యలో ఒక భాగం అయిపోయింది.
శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ వారు ఈ కార్యక్రమానికి ఏ ముహూర్తంలో శ్రీకారం చుట్టారో కాని, అమ్మ దయతో నిర్విఘ్నంగా జరిగిన ఈ మహత్కార్యాన్ని అమ్మే ప్రేమతో జరిపించుకుందనటంలో ఎంతమాత్రమూ అతిశయోక్తి లేదు.
ఎంచేతనంటే… ఎంతో కుంభవృష్టి కురవడం సరిగ్గా నగర సంకీర్తన సమయానికి వాన కురవడం ఆ కాసేపు ఆగడం తరువాత, నగర సంకీర్తన అయిన వెంటనే మరలా వాన మరలా కురవడం ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు.
ఎందరో భక్తులు, అమ్మ బిడ్డలు జిల్లెళ్ళమూడిలో జరుగుతున్న ఈ నగర సంకీర్తనలో పాల్గొనే నిమిత్తంగాను తమ ప్రయాణ షెడ్యూల్స్ మార్చుకుని రావడం కూడా మనం గమనించవచ్చు. భిన్నత్వంలో ఏకత్వం అనబడే భారతీయ జీవనాడిని ఈ నగర సంకీర్తన ప్రతిబింబింప చేసింది. అలానే అమ్మ ఏనాడో అన్నట్లుగా ఈ నగర సంకీర్తనలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి అనుదినం సూర్యోదయాత్ పూర్వమే అమ్మ, హైమమ్మల ధూళి దర్శనం లభించేది. ఇది ఎంతో ఆనందదాయకమైన, దైవానుగ్రహం నిండిన అంశం.
ఒక శోభాయాత్రలో భాగంగా రేటూరు నుంచి అమ్మ సన్నిధికి చేరిన ఒక కాలభైరవుడనే గ్రామసింహం నగరసంకీర్తన ప్రారంభంలో తనదైన నమస్కార సూచకాన్ని ప్రదర్శిస్తూ, ఆ కార్యక్రమం ఆసాంతం తనూ నగర సంకీర్తనలో సంవత్సరం పొడుగునా పాల్గొనడం, ఆమధ్య కాలంలో తనతో పాటు మరికొన్ని జాగిలాలను కూడా నగర సంకీర్తనలో పాల్గొనేట్లు చేయడం మరో విశేషం. అమ్మ కేవలం మానవోపాధిలోని వారికే కాక, సకల ఉపాధులలో ఉన్న జీవులకు అమ్మ దేవుడే అనేందుకు ఇది ప్రత్యక్ష నిదర్శనం.
కాగా “ఇది నగరమూ కాదు, ఆ నలుగు రైదుగురు చేసేది సంకీర్తనా కాదు” అని పలువురు పెదవి విరిచిన సందర్భాలు లేకపోలేదు. కానీ, కాలమే సమాధానంగా నిలుస్తూ, నగర సంకీర్తన ముగింపు సమయంలో 7వ మైలు వరకు జరిగిన నగర సంకీర్తన చూసినా, చివరి రోజున అమ్మ నూరవ అవతరణ దినోత్సవం నాడు చూసినా, తండోపతండాలుగా అమ్మ బిడ్డలు అమ్మ నామం చెప్పుకుంటూ కదిలి వస్తుంటే, ఆ దృశ్యం చూసేందుకు ఎంతో మనోహరంగా ఉంది. బహుశః అమ్మ అనుకుంటేనే తప్ప అలా జరుగదేమో అనిపించింది.
అమ్మ శతజయంతి ఉత్సవాలలో ట్రస్ట్ వారు ఎంతగా ప్రయత్నించినప్పటికీ, అమ్మ అన్న ప్రసాదాన్ని స్వీకరించే నిమిత్తం చుట్టు ప్రక్కల ఊర్ల నుంచి, వివిధ వాహనాల్లో తరలి వచ్చిన అమ్మభక్తులతో 7వ మైలు రోడ్డులో పలుమార్లు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటం చాలా మందికి విదితమే. ఎంతో ప్రశాంత సుందరంగా అనునిత్యం కనిపించే 7వ మైలు రోడ్డులో ట్రాఫిక్ జామ్ అనేది ఒక మెట్రోపాలిటన్ నగరాన్ని కూడా తలపింపచేసింది, సమీప భవిష్యత్ ఇలా ఉంటుందనే భావనలను కలిగించింది ఆ తరుణంలో.
నిజానికి ‘నగద’ అనే ‘డ్రమ్’ వంటి వాద్య సహకారంతో భగవన్నామాన్ని బాహాటంగా పలుకుతూ గుంపుగా ముందుకు సాగుతూ జరిపే సంకీర్తనా ప్రక్రియను నగదసంకీర్తన అంటారు. కాలక్రమంలో అదే నగర సంకీర్తన అయ్యింది. ఇస్కాన్ వంటి సంస్థలు ఇప్పటికే హరేరామ హరేకృష్ణ మంత్రాన్ని విశ్వవ్యాప్తంగా ఎంతగానో ప్రచారం చేస్తున్నాయి. అట్లానే మనం అమ్మ నడయాడిన ఈ పవిత్ర క్షేత్రంలో అమ్మ దివ్యనామస్మరణను ప్రేమపూర్వకంగా చేస్తూ వచ్చాం. అయితే ఇక్కడ గమనించవలసినది ఏమంటే, ‘భగవదారాధనను ఏ గుణంతో చేస్తే, ఆ గుణం వృద్ధి చెందుతుంది’ అని పెద్దలు అంటారు. అందుచేత మనం నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమైన అమ్మనే పరమ ధ్యేయంగా లక్షిస్తూ, ముందు సత్వగుణాన్ని పెంపొందించుకుంటూ రజోగుణ తమోగుణ మాలిన్యాలను దూరం చేసుకోవాలి. పిదప శుద్ధ సత్వగుణాన్ని, ఆపై గుణాతీత స్థితిని పొందే నిమిత్తం దృష్టి సారించాలి. అలా మనం చేసే ప్రతి కైంకర్యంలోనూ మన హృదయంతో అమ్మానుసంధానం జరిగేలా జాగ్రత్త వహించాలి. మనం అమ్మానుభూతిని పొందేందుకై అహరహమూ ప్రయత్నించాలి. ఇటువంటి ఎన్నెన్నో అంశాలు మనకు అమ్మ నగర సంకీర్తన అందించింది, అందిస్తుంది.
చివరగా – త్రికరణ శుద్ధిగా అమ్మనామం చెప్పుకుంటూ ఆరుబయట నడచినా అది అంతర్ముఖత్వానికే దారి తీస్తుంది. “అంత ర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః” నారాయణ స్వరూపమైన అమ్మ మనల్ని లోనికి తిరిగేలా చేసి, మన అంతరంగాన్ని పరిశుద్ధం చేసి, ‘నేను నేనైన నేను’ అనే అమ్మత్వం సిద్ధింపచేసేలా చేస్తుంది.
ఈ సంవత్సర కాలంలో జరిగిన ఎన్నో రోజుల తాలూకు ‘నగర సంకీర్తన’ దృశ్యరూపికలు అంతర్జాలం
ద్వారా అందరికీ అందుబాటులో నిక్షిప్తమై, ఈ క్రింది లింక్ ద్వారా ఎల్లవేళలా లభ్యమౌతాయి. అమ్మ స్మరణ చేయాలని మనసుకు తట్టిన ప్రతీమారు ఈ క్రింది లింక్ ద్వారా పాత నగర సంకీర్తనలను వీక్షించే వీలు కలదని మనవి చేస్తూ
https://www.youtube.com/@viswajanani /videos ఈ ఏడాదిపాటు జరిగిన నగర సంకీర్తనా స్రవంతిలో పాల్గొన్న అన్నయ్యలకు, అక్కయ్యలకు పేరుపేరునా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, అంతర్జాలంలో వీక్షిస్తూ ప్రోత్సహించిన అన్నయ్యలకు, అక్కయ్యలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ… ‘అమ్మా ! అందరిపై నీ చల్లని చూపులను ప్రసరింపజేయి తల్లీ అని వేడుకుంటూ’.. జయహెూమాతా!!