గతసంచిక తరువాయి భాగం)
అమ్మ మనుమరాలు హైమ, మధు అన్నయ్య కూతురు శైలజ, లలితాంబక్కయ్య మనమరాలు అనసూయ జమ్ములపాలెం నుంచి కొద్ది మంది స్టూడెంట్స్తో కాన్వెంట్ స్కూలు మొదలైంది. మెల్లగా పిల్లలతో అలవాటయింది. క్లాసెస్ మొదలైనవి. అప్పుడప్పుడు అమ్మ దగ్గరకెళ్ళే వాళ్ళం. హాస్టల్లో వండిన పదార్థాలు అమ్మకు నివేదనకు తీసుకెళ్ళేవాళ్ళం.
అమ్మ హైమ ఆలయానికి వచ్చింది. మాకిచ్చిన instruction ప్రకారం మేమంతా పూలపళ్ళాలతో ‘అమ్మ’ వచ్చే దారిలో నుంచుని ‘అమ్మకి’ పూలు వేసాము పాదాలమీద. వేదమంత్రాల మధ్య ‘అమ్మ’ లోపలికి వచ్చారు. ఎక్కడి వాళ్ళక్కడ కూర్చున్నాము. ‘అమ్మ’ కూర్చున్న సింహాసనానికి ఎదురుగా నేను కూర్చున్నాను. ఓం, ఐం, క్లీం, హ్రీం, శ్రీం అని బీజాక్షరాలు మేము చదువుతూంటే లలిత సహస్రం చేశారు లోపల. అమ్మ నన్ను గమనిస్తున్నట్టు. నాకనిపించింది. నేను ‘అమ్మ’ వైపు చూస్తూ బీజాక్షరాలు చదివాను. మన జీవితంలో మార్పులు రావటానిక్కానీ, మలుపులు తిరగటానికి కానీ ఒక్క క్షణం చాలు. నా జీవితాన్ని అమ్మ మార్చి వేసింది అనే అనుకున్నాను నేను.
చాలా regular గా అమ్మకు నివేదనల పేరుతో అమ్మ దగ్గరకు దాదాపు రోజుకు 4 సార్లు వెళ్ళేవాళ్ళము. నేను మటుకు అవకాశాన్ని వదులుకునే దాన్ని కాను. ఆ సమయంలో చెన్నైలో Children Garden School Chairman శర్మగారు అమ్మ దగ్గరకు వచ్చేవారు. అక్కడ స్కూలులో టీచర్కు మాంటోస్సోరి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ మన విద్యాలయం నుంచి ఇద్దరు టీచర్స్ని పంపించాలనుకున్నారు. 3నెలల కోర్సు. నాగమణి వాళ్ళ అన్నయ్య, బావగారు వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. అందుకని తనని పంపించారు. నామటుకు నాకు ‘అమ్మ’ నన్ను తన దగ్గర ఉంచేసుకుంది అనిపించింది.