1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మ నమ్మలేని అమ్మా?

అమ్మ నమ్మలేని అమ్మా?

A V R Subramanyam
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : April
Issue Number : 9
Year : 2022

అమ్మ ఐదేళ్ళప్రాయంలో ప్రసంగవశాన శ్రీ చిదంబరరావు తాతగారిని “నమ్మలేని అమ్మనా? అమ్మలేని అమ్మనా?” అని ప్రశ్నించింది. ఆ రెండు మాటలూ సత్యములే. నాకు అందినంతవరకు వివరిస్తా.

  1. అమ్మ లేని అమ్మ: కృపతో అమ్మ నిజ స్వరూపాన్ని నిజతత్వాన్ని అనేక సందర్భాల్లో నిర్వచించింది. “తల్లి అంటే తొలి” అనే సూత్రంలో అమ్మ ఆది మూలము అని స్పష్టమవుతోంది. ఈ సత్యాన్ని వివరిస్తూ పూజాకీ పూర్ణానందస్వామి Mother means the origin’ అని అన్నారు. “అమ్మా! నువ్వు లలితాదేవిని, రాజరాజేశ్వరివి” అని అంటే, “నాన్నా! ‘నువ్వు రాజరాజేశ్వరిని చూశావా? హాయిగా అమ్మ అనుకో” అన్నది. కంటికి కనిపించని ఆ పరతత్త్వమే అమ్మ అయినపుడు ఇక దీనికోసం అన్వేషించాలి? ”అంటే అదీ అంతమూ లేనిదీ, అన్నిటికీ ఆధారమైనది. అని స్పష్టం చేసింది. అంతటి మహత్తత్వం ఆవాజ్మానసగోచరం కదా!

లోతుగా ఆలోచిస్తే ‘అమ్మ’ అనే పదంలో సకల దేవతా సమూహం ఉన్నది. లక్ష్మీ సరస్వతులు, గజముఖ షణ్ముఖులు, అన్నపూర్ణాదేవి తన బిడ్డలని అమ్మ సంభావించినపుడు అమ్మ దేవతలకు దేవత అని తేటతెల్లం అవుతుంది. అంతేకాదు. మన కళ్ళముందు హైమ శరీరత్యాగం చేసినపుడు ప్రాణంపోసి, దైవత్వాన్నిచ్చి ఆలయప్రవేశం చేయించింది. దైవత్వాన్నిచ్చే శక్తి, అధికారం ఎవరికి ఉంటాయి – మూలకారణశక్తికే కదా!

  1. నమ్మలేని అమ్మ: ‘అన ర్బహిశ్చ తత్సర్వం వ్యాష్య’ అని శ్రుతి ప్రబోధించినట్టుగా విరాజిల్లే విశ్వాంతరాత్మ పరిమితరూపంలో ఒక సామాన్య గృహిణిగా కన్నులముందు నడయాడుతుంటే అది సత్యం అని నమ్మటం ఎలా? నమ్మజాలము. పరిమితమైన దృష్టి, శక్తి, ఉనికి, చేతలు గల మర్త్యులకు పంచభూతాలకు అతీతమైన అనంత శక్తి ఎలా గోచరిస్తుంది?

ఆ విరాట్స్వరూపదర్శన భాగ్యం పొందాలంటే ‘దివ్యదృష్టి’ ఉండాలి. శ్రీకృష్ణపరమాత్మ దివ్యదృష్టిని ప్రసాదించే యశోద, అర్జునుడు, ధృతరాష్ట్రుడు మున్నగు వారికి విశ్వరూపసందర్శన భాగ్యాన్ని అనుగ్రహించాడు. అదే విధంగా అమ్మ ఒకనాడు గోపాలన్నయ్యకీ ప్రసాదించింది. ‘నాకేమి అర్హత ఉన్నది? నాకెందుకు ఇచ్చావు?’ అని అడిగితే, నిస్సంకోచంగా నిర్ద్వంద్వంగా అమ్మ ‘నాకు ఇవ్వాలని అనిపించింది. ఇచ్చాను” అన్నది; “పరిమితంగా ఉన్న అమ్మను అపరిమితంగా అనీ వివరించింది.

‘ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై 

ఎవ్వనియందు డిందు వరమేశ్వరుడెవ్వడు 

మూలకారణం బెవ్వడు…’ అనే గజేంద్రుని ప్రశ్నలకు సమాధానం, సాకారరూపం అమ్మ అనే తాత్పర్యంతో ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారు –

‘జిల్లెళ్లమూడి నాశ్రితుల సేవలు గైకొనుచుం బ్రశాంతి సం

 ధిల్లగ జేయ లోకమున దివ్యశుభాకృతి దాల్చి నీవు రం

 జిల్లుచు నుండ రూప గుణ చేష్టలు లింగము లేకయే విరా 

జిల్లును బ్రహ్మమంచును వచించెదరేటికో! పండితోత్తములో

 అని వివరించారు.

అనంతశక్తి పరిమితరూపంలో వస్తే ఎలా ఉంటుంది? సంకల్పరహితుడు సంకల్ప సహితునిగ వస్తే ఎలా ఉంటాడు? రూపం లేనిది రూపం ధరిస్తే ఎలా గోచరిస్తుంది? నిన్న మొన్నటివరకూ కన్నతండ్రిలా కఠోరంగా శాసించిన సృష్టి సంచాలక శక్తి నేడు కారుణ్యరసాధిదేవతగా అవతరిస్తే ఆ మాతృమూర్తి ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలకి సమాధానం అమ్మ.

అమ్మ శరీరం, అమ్మ దృష్టి, అమ్మ శక్తి, అమ్మ సంకల్పం, అమ్మ మాట, అమ్మ అనురాగం, అమ్మ త్యాగం … ఏ ఒక్క లక్షణం తీసుకున్నా అమ్మకీ మనకీ ఏ పోలికా లేదు. కాగా, తరచుగా ‘అమ్మ ముగ్గురు బిడ్డల తల్లి, సామాన్య గృహిణి, మనలాంటిదే’ అని భ్రమపడుతుంటాం.

అమ్మ తన శిరస్సుపై కిరీటాన్ని, హస్తాల్లో శంఖ చక్ర త్రిశూలాది ఆయుధాల్ని ధరించిన సమయంలోనే అమ్మ దేవత అని సంభావిస్తాం. కళ్ళని మాయపొర కప్పేస్తుంది. ఇది నమ్మలేని అక్షరసత్యం కాదా? మరికొన్ని సందర్భాల్ని వివరిస్తా –

అమ్మ శారీరకంగా జిల్లెళ్ళమూడిలో ఉంటూనే పండరీపురంలో రెడ్డి అన్నయ్యకి, గుంటూరు శ్రీమతి రామరాజు జయమ్మ గారికి, తిరుపతిలో చంద్రన్ కి ఒక ముత్తైదువుగా దర్శనం ఇచ్చింది, ఎన్నో చమత్కారాలు చేసింది, మనస్సులో చెరగని ముద్ర వేసింది. శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి అమ్మమ్మ గారు తీవ్రమైన పార్శ్వపోటు భరించలేక అమ్మకు విన్నవించుకున్నారు. ‘శరీరం అన్నతర్వాత బాధలు తప్పవమ్మా!’ అని ఆమెను అమ్మ ఓదార్చింది. అమ్మ మాటల మనిషికాదు. ఆశ్చర్యం. ఒక పల్లెపడుచు రూపంలో యాజలి వెళ్ళి ఆమెకు పసరవైద్యం చేసి ఆ బాధను నిర్మూలించింది. కేవలం అనుగ్రహప్రసారం, సంకల్ప మాత్రంచేతనే గండాల నుంచి అనేకుల్ని గట్టెక్కించిన సందర్భాలూ అనేకం. వీటిని అమ్మలీల అనండి, అమ్మ అలౌకికశక్తి అనండి, మనకి అర్థంకాని సంఘటనలు మహిమలు (Miracles) అనండి. అవన్నీ చరిత్రబద్ధమైన వాస్తవాలు. అయినా ‘అమ్మ మనలాంటిదే’ అని భ్రమపడతాం.

జె.యఫ్.నీలాండ్ హాలెండు దేశస్థుడు. జీవితానికి అర్థం ఏమిటి? సార్థకత ఏమిటి? -అని అన్వేషిస్తూ 1974 లో భారతదేశానికి వచ్చి ఆచార్య ఎక్కిరాల భరద్వాజ సహకారంతో కొన్ని ఆశ్రమాల్ని కొందరు గురువుల్ని సందర్శించారు. చివరకు పూజ్యశ్రీ పూర్ణానందస్వామి వారి ఆశీస్సులతో వారి ఆశ్రమ సమీపంలో తపశ్చర్యనారంభించారు.

తీవ్ర అనారోగ్యానికి గురై శ్రీ రాజగోపాలాచారి గారి చొరవతో హైదరాబాద్లో పెద్ద ఆస్పత్రిలో చేరి, కోమాలోకి వెళ్ళిపోయారు. నీలాండ్ అనారోగ్యపరిస్థితిని ఎప్పటికప్పుడు చారిగారి సతీమణి శ్రీమతి లలిత ఫోన్ ద్వారా అమ్మకి చెబుతూ ఉంది. టైఫాయిడ్, ఇతర వ్యాధులని వైద్యులు చికిత్స చేస్తున్నారు. శరీరంలో రక్తం గడ్డకట్టి నీలిరంగు చిహ్నాలు కనిపిస్తున్నాయి. చికిత్స వృథా అయింది. గుండె బలహీనపడి అస్తవ్యస్తంగా పనిచేస్తోంది.

‘ఇక వైద్యులు ఆశ వదులుకోమన్నారు’ అన్నమాట లలిత అక్కయ్య అమ్మ చెవిన వేసింది. అంతే. మనకి అంతుపట్టనిదేదో సంభవించింది. నీలాండ్ మృత్యుముఖంలో ఉన్నాడన్నమాట అమ్మ వినగానే అమ్మకి స్మృతి తప్పింది – ఒక అరగంటసేపు. అది అపస్మారమా? అతీంద్రియావస్థా? మానవాతీతమైన మహాశక్తి రంగప్రవేశం చేసిందా? ఏమో!

అరగంట తర్వాత, మానవ పరిభాషలో, అమ్మ తెలివిలోకి వచ్చింది. రెండు నిముషాల్లో హైదరాబాద్నుండి ఫోన్ ‘నీలాండ్కి ప్రమాదం తప్పింది, కోలుకుంటున్నాడు’ – అని. నీలాండ్ ఈ లోకంలోకి వస్తూనే ‘జయహో మాతా శ్రీ అనసూయా రాజ రాజేశ్వరి శ్రీ పరాత్పరి’ అంటూ అప్రయత్నంగా అమ్మ నామాన్ని జపిస్తున్నాడు. తదుపరి నీలాండ్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సమయంలో వాత్సల్యయాత్రలో భాగంగా అమ్మ హైదరాబాద్ వెళ్ళి నీలాంట్ని పరామర్శించింది. నీలాండ్ కృతజ్ఞతా ప్రపూర్ణ ఆనందబాష్పాలతో అమ్మను అభిషేకించాడు. ఎన్ని విన్నా ఎన్నిచూసినా ఎన్ని అనుభవించినా కథ కంచికి మనం ఇంటికి; అమ్మ మనలాంటిదే అనిపిస్తుంది; నమ్మలేని అమ్మగానే మిగిలిపోతుంది. అయినా మేరువుని గులకరాయి ఏమని అర్థం చేసుకుంటుంది?

“మీరు బురద పూసుకుంటే కడిగి శుభ్రంచేసే బాధ్యత నాదే”అనీ, “మీ భారం నామీద వెయ్యండి. మోస్తాను. అయితే భారం అని అనుకోను” అనీ సముద్ధరణే తన అవతార లక్షణం లక్ష్యం అని ప్రకటించింది, హామీనిచ్చింది అమ్మ. మనల్ని సంరక్షించే, గట్టెక్కించే ‘అమ్మ’ నుకాక ఇంక ఎవరిని నమ్మగలం?

అయితే విశ్వాసం కలగటం అంత తేలికైనది కాదని వేదం ఒక పరమపావన సత్యాన్ని ప్రబోధిస్తోంది ‘అగ్నేనయసుపథారాయే అస్మాన్ … భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ’ (ఓ అగ్నిదేవా! మమ్మల్ని మంచి మార్గంలో నడిపించు. కాగా, కేవలం మాటలలోనే నీకు నమస్కారం అంటున్నాను – త్రికరణశుద్ధిగా కాదు’) అని.

కావున పరమపావని అమ్మ ఎడల అచంచల విశ్వాసం కలగాలని అమ్మ శ్రీ చరణాలనే ఆశ్రయిద్దాం. 

ఉపయుక్త గ్రంథావళి:

  1. ‘మాతృశ్రీ జీవిత మహాదధిలో తరంగాలు’, రహి, S.V.J.P. ప్రచురణ.
  2. జె.యఫ్.నీలాండ్ వ్యాసం, ‘Past, present and future’, Matrusri Monthly, November ’78, S.V.J.P. ప్రచురణ

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!