అమ్మ జన్మదినం చైత్రశుద్ధ ఏకాదశి, 1923, మార్చి 28వ తేదీ. 2022 చైత్రశుద్ధ ఏకాదశి అమ్మ 100 వ జన్మదినోత్సవం. 2023 చైత్రశుద్ధ ఏకాదశి వరకు అమ్మ శతజయంతి ఉత్సవాలు జరుగుతాయి.
అమ్మ శతజయంతి సందర్భంగా ఉత్సవాలు ప్రారంభ మయ్యాయి. జూన్ 12, 2014 నాడు మధ్యాహ్నం 11.50 నుండి, 12.11 వరకు అందరింటి వాసులు అమ్మ నామ పారాయణ దీక్ష స్వీకరించారు. ఈ 9 సంవత్సరాలలో అమ్మ నామం 100 కోట్లు జపం చెయ్యాలన్నది అమ్మ బిడ్డల ఆకాంక్ష. “జయహోమాతా శ్రీ అనసూయ, రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి” అన్నది అమ్మ నామం. ఎవరింట్లో వారు ఆబాలగోపాలమూ, ఉదయంగానీ, సాయంత్రం గానీ, వారి వీలును బట్టి, వీలైననన్నిసార్లు అమ్మ నామం చెయ్యవచ్చు. స్నానం చేసి, దీపారాధన చేసే అలవాటు ఉన్నవారు, శుచిగా, శుభ్రంగా తులసిమాలు తీసుకుని పారాయణ చేసి, రోజువారీ సంఖ్య నమోదు చేస్తే మనం ఎంత పారాయణ చేశాము అన్నది తెలుస్తుంది. మూడు నెలలకి ఒకసారి పారాయణ సంఖ్య జిల్లెళ్ళమూడికి తెలియచెయ్యవచ్చు.
అమ్మ గర్భవాసాన జన్మించిన వారిలో మన మధ్య భౌతికంగా తిరుగుతున్నది ఒక్క రవి అన్నయ్యే. నామానికి మించిన ఆస్తి లేదు, నామం తొలగించలేని కష్టమూ లేదు. నామం ప్రసాదించని ఐశ్వర్యమూ లేదు. నామానికి మించినది లేదని అమ్మే చెప్పింది. అనేకమంది సోదర సోదరీమణులు 12వ తేదీ రవి అన్నయ్య చేతుల మీంచి, భాస్కరరావు అన్నయ్య వద్దనుంచి, తులసిమాలలు స్వీకరించి దీక్ష తీసుకున్నారు.
మనం చాలామంది అమ్మ నామం చేస్తూనే ఉన్నాం. మరి ఈ దీక్షవల్ల ఉపయోగం ఏమిటి అంటే, విశాఖపట్నం సోదరులు కవిరాయని కామేశ్వర శర్మగారు చక్కగా చెప్పారు. “ఎప్పుడైనా గుర్తు వచ్చినప్పుడు నామం చేస్తాం. ఇంత సేపనీ, ఇంత సంఖ్యనీ, నియమం ఉండదు. ఇట్లా దీక్ష పెట్టుకుంటే రోజూ 3 నూట ఎనిమిదిలో, 5 నూట ఎనిమిదిలో చేస్తాం. మంచి సాధన ఔతుంది” అన్నారు. మరికొందరు, మన మాట ఎట్లా ఉన్నా, మనమలూ, మనమరాళ్లూ అమ్మ నామం వలన మంచి మార్గంలో పడతారు. ఈ దీక్ష కుటుంబంలో అందరికీ శ్రేయోదాయకం అన్నారు.
రామబ్రహ్మంగారూ, త్రిలోక అప్పారావుగారూ, మోహన కృష్ణగారి సతీమణి రుక్మిణిగారూ, బి.జి.కె. శాస్త్రి గారు మరెందరో అక్షర లక్షలు పారాయణ ఉత్సాహంగా చేస్తున్నారు. నేనూ వాళ్ల మార్గదర్శకత్వంలో నడుస్తున్నాను. చేస్తే మంత్రసిద్ధి కలుగుతుంది అంటారు. “జయహోమాత” నామ మంత్రం 21 అక్షరాలు. వచ్చే 9 సంవత్సరాలలో, అక్షర లక్షలు నామం చెయ్యగలిగితే అది ఎంత గొప్పసాధన! అన్ని గ్రామాలలో, అన్ని పట్టణాలలో, అన్ని నగరాల్లో, దేశ విదేశాలో అమ్మ నామం సాగితే ఎంత బాగుంటుంది! పాములూ, పశువులూ కూడా సంగీతాన్ని విని ఆనందిసాతయి అన్నారు. అమ్మ ఉండగా రాధన్నయ్య ఒడిలో కూర్చుని కుక్కనామం చేసింది. ఈ దశాబ్ది కాలం జరిగే నామపారాయణ, సకలజీవరాశులకీ, ఆనందాన్ని ప్రసాదిస్తుంది.
రండి. అందరం కలిసి అమ్మ నామ పారాయణలోని ఆనందాన్ని అనుభవిద్దాం.