నామ మన నేమి ? అమ్మకు ధామ మదియె
అమ్మ నామ సంకీర్తన మహరహమ్ము
తనివితీరగ చేసిన వినిన గాని
హృదయ ముప్పొంగి పోవదే ఎవరి కైన.
విశ్వ జనయిత్రి నామమ్ము శాశ్వతముగ
సకల శుభముల నొసగును జనుల కెల్ల
సిరులు సంపద లనియెడు వరము లిచ్చి
కామితము లిచ్చి రక్షణ కవచ మగును.
అమ్మ నామమ్ములో గల అక్షరములు
దివ్య మంత్రమ్ము లనియెడు తెలివి గలిగి
భక్తితోడుత జపియింప భయము లన్ని
తొలగి పోవును బాధలు దూర మగును.
గడపపై నిల్పు దీపపు కాంతు లెల్ల
ఇంటిలోపల వెలుపల నెసగు నట్లు
పలుకు వేళను శబ్దమ్ము వెలికి వచ్చి
భావ మెల్లను గుండెలో పదిల మగును.
ఇంటి తలుపును తట్టిన ఎవ్వ రైన
పిలుపు వినినంత యజమాని తలుపు తీయు
నామ మంత్రము వినినంత నడచి వచ్చి
ఎదను దాగిన మన అమ్మ ఎదుట నిలుచు.