1962లో అమ్మ మదరాసు పర్యటనను గావించారు. అమ్మ ఆరోగ్యం అనే మిషతో. అప్పుడు చాలామంది సినిమా యాక్టర్సు, ప్రొడ్యూనర్సు మొదలగువారు. చాలామంది ఇండ్లకు అమ్మను తీసికొని వెళ్ళి పూజలు కూడా చేసుకొన్నారు. అట్టివారిలో లక్ష్మీరాజ్యం, సావిత్రి వాహినీ పిక్చర్సు అధినేత నాగిరెడ్డి, ఘంటసాల మొదలగువారు. లక్ష్మీరాజ్యం పిక్చర్సు వారు నర్తనశాల సినిమా తీస్తూ ‘జననీ శివకామినీ’ అనే పాటను అమ్మ సమక్షంలో సీనియర్, సముద్రాల చేత వ్రాయించి సుసర్ల దక్షిణామూర్తిగారి చేత సంగీతబాణి ఏర్పరచారు. ఆ నర్తనశాలకు, ప్రత్యేకంగా ఈ పాటకు రాష్ట్రపతి అవార్డు వచ్చింది.
లక్ష్మీరాజ్యం, శ్రీధర్ వారింటిలో అమ్మకు పూజ చేసుకొన్నప్పుడు అధరాపురపు శేషగిరిరావు అన్నయ్య ఆధ్వర్యంలో అమ్మను కిరీటధారిణిని చేసి పూజ చేసుకొనే అదృష్టం వార్కి కలిగింది. వారికి అవార్డు వచ్చింతర్వాత కిరీటధారిణి అయిన అమ్మ ఫోటోతో ఉంగరం రాళ్ళు, లాకెట్సు తయారు చేయించి అందరికీ పంచి, వారు జిల్లెళ్ళమూడి వచ్చినప్పుడు 2 చిన్న ఉంగరపు రాళ్ళు, 1 పెద్ద లాకెట్టు అమ్మకు యిచ్చారు. అమ్మ రుక్మిణమ్మ అక్కయ్యకు ఇచ్చింది. రుక్మిణమ్మ అక్కయ్య వాటిని ఆక్షన్ వేస్తే నేను 2 ఉంగరపు రాళ్ళు కొన్నాను. 1 పెద్ద లాకేటు రాయి అడవుల దీవి మధు తీసుకొన్నారు. ఆ ఉంగరపు రాళ్ళతో ఒకదానిని నేను ఉంగరం చేయించుకొన్నాను. రెండవరాయి నేను రామకృష్ణకు ఇస్తే వాడు అప్పికట్లలో వాళ్ళ పందిరి మంచంమీద వేసాడుట. తర్వాత అది కనపడలేదు.
ఆ ఉంగరం మీద ఉన్న అమ్మ కిరీటం బంగారంతో పొదగబడినట్లుగా మెరుస్తూ ఉండేది. దానిమీద నున్న రాళ్ళతో సహా, ఆ ఉంగరానికి అనేకసార్లు అభిషేకాలు చేయించాను. అమ్మకు చేసే ప్రతి అభిషేకంలోను ఈ ఉంగరం కూడా ఆ అభిషేకంలో పెట్టుతూ ఉండేవాడిని. అదేమిటో ఆ ఉంగరానికి తెగదెబ్బలు తగులుతో ఉండేవి. అమ్మ ముఖం మీద కంటి దగ్గర నల్లటి మచ్చలు వున్నాయి. ఒకరోజు అమ్మతో ఈ విషయం చెప్పాను. అమ్మ తన కండ్ల వద్ద నున్న సన్నటి సూదులతో పొడిచిన మచ్చలు చూపించింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. అమ్మ నాతో నా ఫోటోలకు కూడా ఈ దెబ్బలు దినటం అలవాటైపోయింది కాబోలు అన్నది. బంగారంకు కూడా సమ్మెట పోటులు తప్పలేదు అన్నట్లుగా.
తర్వాత నక్సలైట్, ఎటాక్ లో ఆ నక్సలైట్లు నన్ను బల్లెంతో పొడచినప్పుడు నేను పెట్టుకొన్నది ఈ ఉంగరమే. ఆ బల్లెం ఆ ఉంగరం మీదుగా పడి జారిపోయింది. నాకు చాలా మైనర్గాయాలే తగిలాయి. అమ్మ నన్ను కాపాడింది. ఆ ఉంగరం ద్వారానే దాని ఆకర్షణలోనే పడి నన్ను చంపకుండా అమ్మ బంగారాన్ని వెండిని దోచుకొని వెళ్ళారు ఆ ఉంగరం తో సహా.
ఒక రోజు బాపట్ల వెళుతున్నాను. ఇంకా 7వమైలుకు ఒక ఫర్లాంగు ఉన్నదనగా బస్సు వచ్చింది. ఆ బస్సుకోసం పరిగెత్తి బయలుదేరిన బస్సు ఎక్కాను. ఒక్క కాలు మాత్రమే ఫుట్ బోర్డు మీద పడ్డది. రెండవ కాలు క్రిందనే ఉన్నది. ఆ బస్సు తలుపుకు ఒక రాడ్ పైకి వచ్చి ఉన్నది. ఈ ఉంగరం వెళ్ళి ఆ రాడ్కు పట్టింది. ఆ ఉంగరం strength మీదనే నేను నిల్చున్నాను. లేకపోతే బస్సు క్రింద పడిపోవలసిందే. బస్సులో అంతా అయ్యొ, అయ్యొ అంటున్నారు. ఇంతలో తేరుకొని బస్సులోకి ఎక్కాను. రెండు కాళ్ళు పెట్టాను. బస్సు తలుపు వేశారు. ఆ బస్సు కండక్టరును అందరు తిట్టారు. ఆ ఆయన అట్లా పరిగెడుతుంటే కాసేపు ఆపకూడదా అని. కాని అది అమ్మనిర్ణయం. అన్నీ అమ్మ నిర్ణయంలో భాగాలే.