1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మ నివాసంపై నక్సల్స్ దాడి

అమ్మ నివాసంపై నక్సల్స్ దాడి

K B G Krishna Murty
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 15
Month : September
Issue Number : 2
Year : 2015

అది డిశంబరు 30 అర్ధరాత్రి 12 గం॥ కు జిల్లెళ్ళ మూడిలో అమ్మ నివాసంపై అమ్మా నాన్నగారు వుండే ఇంటికి నేరుగా నక్సలైట్స్ జిందాబాద్ నక్సల్స్ బరీ జిందాబాద్, హేమలతా జిందాబాద్, అమ్మలు, బాబాలు నశించాలి. అంటూ నినాదాలు చేస్తున్నారు. అమ్మ ఆవరణ అంతా బాంబులు కొట్టుకొంటూ నినాదాలు చేశారు. అందరింటి క్రింద భాగాలన్నీ ఘడియలు వేసి మైకులో ఊరి వారినీ, ఆవరణలో వారినీ ఉద్దేశించి ఎవరూ బయటకు రావద్దు. వస్తే మా చేతిలో చస్తారు. అని బెదిరిస్తూ, భీభత్సాన్ని సృష్టిస్తూ ఊరేగింపుగా లోపలికి రావటం మొదలు పెట్టారు. అప్పుడు ఈ సంస్థమీద నక్సలైట్ దాడి జరుగుతున్నదని గ్రహించి మా తలుపు లన్నియూ మూసివేసి అమ్మను; ఇంకా మిగతా ఆడవారిని ప్రక్కభాగంలోకి పంపి తలుపులు వేశాము. నేను, పి.యస్.ఆర్. మాత్రము ఆ గదిలోపల వుండి మారణా యుధాలతో పగలకొడుతున్న తలుపులను మేమిద్దరం మా భుజములతో మా శక్తి కొలదీ గట్టిగా నిలువరించటానికి విశ్వప్రయత్నము చేశాము. మా ప్రయత్నములన్నీ విఫల మైన కారణాన వారు తలుపులు పగులకొట్టుకుంటూ లోపలికి ప్రవేశించే సమయములో పి.యస్.ఆర్. అన్నయ్యా! ఇంకా మనము వాళ్ళను ఆపలేము. వాళ్ళు త్రోసుకుని వస్తున్నారు. ఇంకా మనము ఇక్కనుండి వెళ్ళిపోవటము మంచిది. మనము వెళదామా? అని అన్నాడు.

ఆ క్షణంలో “నా మనస్సులో” మనము ఇక్కడనుండి పోవచ్చును గానీ మనము ఇక్కడ లేకపోతేవాళ్ళు పక్క గదిలో నున్న “అమ్మ పైకి దూసుకొనిపోయి” అమ్మను ఏదైనా చేసిన తరువాత మనము బ్రతికి ఉండి ఏమి లాభము. దానికంటే నేను చావటమే మేలు అని నా మనసులో ‘ నిర్ణయం తీసుకుని ఆయనతో మీరు పోతేపొండి నేను మాత్రము రాను అని నిష్కర్షగా చెప్పేటప్పటికి ఆయన వెనుక తలుపులు తీసుకొని బయటకు వెళ్లిపోయారు.

నేను నా మనసులో ఆలోచిస్తున్నపుడు, నా మనస్సు నాకు తెలుస్తున్నది. ఈ మనస్సును నేను చూస్తూనే వున్నాను. నేను ఇక్కడే వుండిపోవాలి అనే నిర్ణయం వెనుక ఒక బృహత్తరమైన శక్తి ప్రేరేపణ వుండి ఈ నిర్ణయాన్ని నేను వెలువరించినట్లుగా నాకు అనిపిస్తున్నది.

తరువాత వాళ్ళు నా మీద బరిసెలు మొదలగు మారణాయుధాలతో చుట్టుముట్టారు. అప్పుడు బైటనుండి మైకులో వెయ్యిపోట్లు పొడవాలి – అని. వాళ్ళ లీడర్ మైకులో తెలియపరచాడు. వెంటనే నా చుట్టూ వున్న వారిలో ఒకడు నా మీద బరిసె పెట్టి పొడిచిన తరుణంలో ఆ బరిసె నేరుగా నా గుండె మీదకే గురిపెట్టినట్లు గ్రహించి ఒక్కసారిగా “అమ్మా! అని గట్టిగా నేను కేకవేసినపుడు వాళ్లు నాచేతుల్లో చస్తున్నావని, బరిసె విసిరిన తరువాత నా ప్రాణం పోతున్న చివరి క్షణాలు అనుభవించి నట్లుగనే ఉన్నది. కానీ దైవ విధి వేరుగా వుండుటచే వారు వేసిన బరిసెను అడ్డం పెట్టిన చేయి వేలుమీదనున్న ఉంగరాన్ని తాకుతూ నా అరచేతిని చీల్చుకుంటూ నేను వేసుకున్న చొక్కా మడతలోబడి దానిని చీల్చుకుంటూ క్రిందకు దూసుకుపోయింది. అప్పుడు వారు నన్ను పట్టుకొనిపోయి లోపల కూర్చోపెట్టి బరిసెలతో పొడవబోయే సమయంలో వారిలోని ఒకడు ఈ బీరువా తాళం చెవులను వారికి ఇవ్వమని అడిగినపుడు నా దగ్గరలేవు అని నేను చెప్పుటవలన వాళ్ళు బీరువా మీదనే దాడిచేసి బీరువా తలుపులు వెండి సామానులను దోచుకుపోయారు. ఆ బీరువాలో నున్న అమ్మ బంగారము మొదలగు ఆభరణములుపోయి నేను బ్రతికాను.

తరువాత వాళ్ళు పోయిన తరువాత గదినుండి బయటకు వచ్చి చూస్తే ఆవరణ అంతా నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా వున్నది. ఇంతలో ‘అమ్మ’ ఉన్న గది తలుపులు తీసుకుని డాక్టర్ సత్యం బయటకు వచ్చి నన్ను లోపలికి తీసుకొని వెళ్ళాడు, నేను లోపలికి వెళ్ళగానే “అమ్మ” నాన్నా! నీ కేక వినపడింది. కానీ నేను రాలేకపోయినాను ! ఈ ఆడవాళ్ళంతా నా కాళ్ళు చుట్టుముట్టి నన్ను కదలనివ్వలేదు అన్నది” అమ్మ. “అమ్మా! నీవు రాకపోతే ఏమి నన్ను బ్రతికించావు కదా అన్నాను. కానీ నేను చూస్తూ వుండగానే నీ బంగారు ఆభరణాలన్నీ దోచుకుపోతుంటే నేనేమీ చేయలేక పోయినానమ్మా! అన్నాను. అప్పుడు “అమ్మ అన్నారు. డబ్బు పోతేపోయింది నాకు బిడ్డ మిగిలాడు” అని “జరుగవలసింది జరిగే తీరు ఆనాటికి.

“విధిని తప్పింప ఎవరి తరమూ కాదు”.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!