అవును. అమ్మ హైమను ఆమె దేహ త్యాగానంతరం తిరిగి ప్రాణం పోసి, దైవత్వం ఇచ్చి మన ఇలవేల్పుగా హైమాలయంలో నెలకొల్పింది. అమ్మ పరాత్పరి! శ్రేష్ఠులకే శ్రేష్ఠ అయిన భగవతి ! అటువంటి భగవతిచే పూజలందుకున్న మన హైమ పరాత్పరుని కన్న మిన్నేకదా !
అలనాడు పార్వతీదేవి తలంటుకుంటూ తాను తయారు చేసిన పిండి బొమ్మకే ప్రాణం పోసి దైవాన్ని చేసి లోకులందరి చేత ఆ దైవం ప్రథమ పూజలందుకునేట్టు చేసింది. అలాగే అమ్మ కూడా హైమను నవమాసాలు మోసి, తన రక్త మాంసాలను ఇచ్చి కని, పెంచి, విధివశాన నిర్యాణం చెందిన హైమకు తిరిగి ప్రాణం పోసి, దైవత్వాన్ని ఇచ్చి, ఆలయంలో ప్రతిష్ఠ చేసి ముందుగా తాను పూజించిన పిదప లోకులందరి చేత పూజలందుకునేట్టు చేసింది. అంతేకాదు. మీకేం కావాలన్నా నన్నడక్కండి హైమనడగండి” అని చెప్పి చిట్టితల్లి హైమను కోర్కెల నీడేర్చే కామితార్థ ప్రదాయినిగా, వరాలను కురిపించే వరదాయినిగా భక్తులకు అండగా, ఆసరానిచ్చే అభయహస్తంగా హైమాలయంలో నిలబెట్టింది.
అందుకే హైమను మనమేదైనా కోరుకుంటే చాలు, “సిరికింజెప్పడు” అన్నట్టుగా మనముందుకు వచ్చి వ్రాలి పోతుంది. ఆమెను నిత్యం తలుచుకుని కొలుచుకునే బాధా తప్తుల కయితే వారేమీ కోరకపోయినా, ఆమె ముందుగా వారి ఎదుట ప్రత్యక్షమై వారి బాధల నీడేర్చే ఆర్త త్రాణ పరాయణగా నిలుస్తుంది..
ఇందుకు ఉదాహరణ ఆ మధ్య నాకు కలిగిన ప్రత్యక్షానుభవమే. అప్పట్లో నేను అనారోగ్యం పాలయి బాధపడుతున్న ప్రారంభ దినాల్లో ముందుగా అమ్మను, హైమను ఏమీ కోరలేదు. “నా ప్రారబ్ధ కర్మను అమ్మ ఈ విధంగా తీర్చుతున్నది” అని సరిపెట్టుకున్నాను. తర్వాత డాక్టరుగారి ట్రీట్మెంట్ మొదలైన రాత్రే ననుకుంటా పరికిణీ జాకెట్టు వేసుకున్న ఒక ఏడెనిమిదేళ్ళ చిన్నపిల్ల నాకు కలలో కనబడి, నా ఎదురుగా నుంచుని నావైపు చూస్తూ “ఫో… ఫో… వెంటనే వెళ్ళిపో…..” అంటూ అరిచింది. అదేమిటో నాకు అర్థంకాలేదు.
“ఆ పిల్ల ఎవరు? నన్ను పొమ్మంటున్నారెందుకు? నేనెక్కడికి పోవాలి?” అనుకున్నాను. అంతలో కల చెదరి పోయింది.
ఆ మరునాడే పౌర్ణమి. ఆ రోజు హైమనామ ఏకాహం. ఆ పౌర్ణమి నుంచి ప్రతీ పౌర్ణమి నాడు జిల్లెళ్ళమూడిలో నేను ఉండే హైమగర్భగుడి చుట్టూ 111 సార్లు ప్రదక్షిణ చేస్తున్నాను. అది వరకల్లా అటువంటి ప్రదక్షిణలు నా బిడ్డల కోసం మాత్రమే చేసేవాడిని. అవి వెంటనే నెరవేర్చేది హైమ. ఇప్పుడు మాత్రం నా చిన్నమనుమని చదువును నిరంతరాయంగా కొనసాగించే అవకాశం కల్పించమని, దానితోబాటుగా నాకు కలిగిన ఈ అనారోగ్యాన్ని వీలయినంత త్వరలో నయం చేయమని ప్రార్థిస్తూ నా ప్రదక్షిణను మొదలు పెట్టాను.
అందుకు ఆశ్చర్యంగా ఆ మరుసటి వారమే నా మనుమనికి కాలేజీలో సీటు వచ్చి వాడి చదువు కొనసాగటం, ఆ తరువాత మొదటి నెలలోనే నా అనారోగ్యం సగం వరకూ నయమవటం, ఆ మరుసటి నెలలో పూర్తిగా నయమవటం జరిగింది. అప్పుడు కాని తెలియలేదు – ఆ రోజుకలలో కనబడిన ఆ పిల్ల పొమ్మన్నది నన్ను కాదు, నాలోని అనారోగ్యాన్నని.
అప్పుడనిపించింది. – ఆ రోజు కలలో నాకు కనబడిన ఆ చిట్టి తల్లి ఎవరో కాదు. నేను చెల్లెలిగా భావిస్తున్న నా చిన్నితల్లి హైమేనని.
ఈ సందర్భంలోనే ఇంకొక విషయం ప్రస్తావించాలి. నేను అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడే బాధననుభవించలేక లేచి కూచుని నన్నా బాధ నుండి విముక్తుడ్ని చెయ్యమని అమ్మనూ హైమనూ ప్రార్థించి తరువాత వెంకటేశ్వర సుప్రభాతాన్ని మననం చేసుకుంటున్నాను. ఇంతలో ఎవరో నా ప్రక్కన వచ్చి నుంచుని మెల్లగా అనునయంగా నా భుజం మీద తట్టినట్టయి, కళ్ళు విప్పి చూస్తే ఎవరూ లేదు. తర్వాత అనిపించింది. అలా తట్టింది అమ్మయో, = హైమయో, లేదా నేనా సమయానికి స్మరించుకుంటున్న వేంకటేశ్వర స్వామియోనని.
ఎందుకంటే నా దృష్టిలో అమ్మకూ, హైమకూ, వేంకటేశ్వర్వర స్వామికీ తేడా లేదు.
జయహోమాత ! ఓం హైమ ! నమో వేంకటేశాయ !