మానవజన్మ దుర్లభము. మానవజన్మకు ఏకైక లక్ష్యము మోక్షమును పొందుట. దేని నుండి మోక్షము? అంటే అహంకార, మమకారములనుండి. దానిని సాధించటానికి భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు రెండు ఉపయాలు చెప్పారు. ఒకటి సాంఖ్యయోగము, రెండు కర్మయోగము. ఉపాయములు వేరైనా గమ్యమొకటేనని గీతలో స్పష్టముగా చెప్పబడినది.
కర్మ అంటే ఏమిటి ?
“భూత భావోదవకరో విసర్గః కర్మ సంజ్ఞతః” (అరిశ్లో.3)
భూతకోటి యొక్క సాత్వికాది భావములను ఉత్పన్నము చేసెడిసృష్టి వ్యాపారమే కర్మ అనబడును.
కర్మఫలాపేక్షతో చేస్తే బంధించును. జనన, మరణ చక్రములో మానవుడు బంధింపబడతాడు. అట్లుగాక తదర్ధం కర్మ కౌంతేయ ముక్తసంగ స్సమాచరం॥ దానిని కర్మయోగముగా మార్చుకోగలిగితే, బంధవిముక్తు డవుతాడు. కర్మను కర్మయోగముగా మార్చుకునేది ఎట్లా?
కర్మయోగమునకు నాలుగు ముఖ్యవిషయాలు చెపబడినవి.
1) కర్మ చేయుటయందే మనకు అధికారము. కర్మఫలము లందు జోక్యము యెప్పుడును వద్దు.
2) సకామభావముతో కర్మలను చేయకుము. కర్మలను వదలవలెనను పట్టుదల మనకు అక్కరలేదు.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మఫల హేతుర్భూః మాతే సంగోస్త్వకర్మణి॥ (గీ.2/47)
3) సమత్వమే యోగమనబడును. అట్టి యోగము నాశ్రయించి ఫలాఫలములందు సమభావముంచి ఆసక్తి వదిలి కర్మములను చేయుము.
యోగస్థః కురు కర్మాణి సంగం త్వక్త్వా ధనంజయ॥
సిద్ధ్యసిద్ధ్యే స్సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే ॥
(8.2/48)
ఆసక్తి లేకుండా, ఫలాపేక్ష లేకుండా కర్మను చేస్తే అధి కర్మయోగమవుతుంది. కొన్ని ఉదాహరణలను ఇస్తాను.
ఒకరు యింకొకనిని హత్య చేస్తే అది కర్మ. ఒక సైనికుడు తన బాధ్యతలో భాగముగా యింకొక వ్యక్తిని చంపినా, అది అతనిని బంధించదు.
ఒక న్యాయాధీశుడు ఒక నేరస్థునకు ఉరిశిక్ష విధించినా, అది అతనిని బంధించదు. కాని ఒక సామాన్య పౌరుడు యింకొకనిని చంపమని ప్రోత్సహించితే, అది నేరము. అతనిని ఆ కర్మ బంధించుతుంది.
- కర్తృత్వమును తనపైన వేసికొనక ఈశ్వరార్పణ బుద్ధితో కర్మల నాచరించిన అది మానవుని బంధించదు.
యజ్ఞార్ధా త్కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః।
యితిధార్థం కర్మ కౌన్తేయ ముక్తిసంగా సమాచార
యజ్ఞరూపమగు కర్మములు తప్ప తక్కినవి జనులకు బంధము కల్గించును. ఓ కౌంతేయా ! ఆసక్తిని వదలి యజ్ఞార్థముగ చేయుకర్మ యజ్ఞము. ‘యజ్ఞో వై విషుః అని వేదవాక్యం. అందుచేత ఈశ్వరార్థము చేయుపని యజ్ఞము. అది జనులను బంధించదని గీత చెప్పుచున్నది. ఈ భావమే క్రింది శ్లోకములో కూడ స్పష్టముగ చెప్పబడినది.
యజ్ఞకర్మ అంటే సమిష్టి కోసం, పరహితం కోసం చేయవలసిన కర్మ “యజ్ఞోవై శ్రేష్ఠతమ కర్మదు”లు.
బ్రహ్మణ్యాధ్యాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః
లిప్యతేన స పాపేన పద్మపత్ర మివాంభసా॥ గీ.5/10)
ఈశ్వరార్పణ బుద్ధితో కర్తృత్వ సంగమును, ఫలసంగమును వదిలి కర్మములను చేయువానిని తామరాకున నీటిబిందువువలె, పాపము అంటజాలదు.
అమ్మ ‘గీతలో చెప్పనిది, నేను చెబుతున్నది లేదు. – చెప్పే తీరు వేరు గావచ్చుగానీ’ (అమ్మ వాక్యాలు 1495) అన్నారు.
అమ్మ తనను గురించి చెప్పే సందర్భములో
1) “తెలియనిది తెలియచేయటానికే నా రాక”.
2) “నా జీవితములో మీకేదయినా మంచిదనీ, నలుగురూ అనుసరించదగినది ఉన్నదని అనిపిస్తే దానిని సందేశంగా తీసుకోండి” అని అందరికీ చెప్పారు.
అమ్మ కర్తత్వము తనపైన వేసుకోదు. ఒకసారి శ్రీశైలం నుంచి అన్నదానసత్రం వారు అమ్మ దగ్గరకు వచ్చి, “మేము 200 మందికి రోజూ భోజనాలు పెట్టటానికి యిబ్బంది పడుతున్నాము. మీరు రోజూ వెయ్యిమందికి ఎలా పెట్టగలుగుతున్నారని అమ్మని అడిగారు. అమ్మ ‘ఇక్కడ నేను పెడుతున్నానని అనుకోవటం లేదు. ఎవిర అన్నం వారు తిని వెళుతున్నారని అనుకుంటున్నాను’ అని సమాధానం యిచ్చినారు.
అమ్మ మనకిచ్చిన రెండు సందేశాలను పరిశీలించితే, అమ్మ మనకు కర్మయోగము అని చెప్పకుండా ఎలా చెప్పారో చూడండి.
- నీకున్నది తృప్తిగా తిని, యితరులకు ఆదరంగా పెట్టుకో, అంతా అమ్మే చేస్తున్నది అని అనుకో”.
అమ్మే చేస్తున్నది అని అనుకోవటం వలన మన
కర్తత్వము లేదని భావము. దృఢపరుస్తూ, అహంకార భావం పెరగకుండా చేస్తుంది. అందుచేత అది యజ్ఞంగా మారుతుంది. కర్మయోగమవుతుంది.
- “పదిమందితో కలసి పనిచేయటం, పదిమంది కోసం పనిచేయటం, మమకారాన్ని చంపుకోవటం కాక పెంచుకోవటం పరిమితమైన ప్రేమను, విస్తృతం చేసుకోవటం నేటి మానవధర్మం. ఇదే మానవుడు. మాధవుడుగా మారటానికి మంచిదారి” అని అన్నారు.
పదిమందితో కలిసి పనిచేయాలంటే, ఒకరి పట్ల ఒకరికి సదవగాహన, సహనం, నిగ్రహం పెరగాలి. లేకపోతే కలసి పనిచేయలేం గదా! అందువల్ల మన అహంకారం తగ్గుతుంది.
పదిమంది కోసం పనిచేయటం నిష్కామకర్మ అవుతుంది. మమకారాన్ని పెంచుకోవటం విరాగమవుతుంది. అమ్మే అన్నారు గదా ! సర్వత్రానురాగమే విరాగము అని. అమ్మ “అన్నపూర్ణాలయం, విద్యాలయాలు, వైద్యాలయము, ఆదరణాలయాలు మొదలయిన సంస్థలను స్థాపించినది మనకు కర్మయోగము నేర్పటానికే. మనం చేసే ప్రతి పనీ భగవత్సేవ అనీ, ప్రతిదీ భగవదాజ్ఞాను సారమే జరుగుతుందని అనుకోగలిగితే, అది యజ్ఞమై, కర్మయోగమవుతుంది.
మనం చేసే ప్రతి పనీ సంఘానికి ఉపయోగ పడుతుందని అమ్మ ప్రబోధిస్తారు. ఒక సోదరునికి అమ్మ యిచ్చి సందేశం చూడండి.
“నువ్వు బ్రతుకుతున్నది నా కోసమే. ఉద్యోగం చేస్తున్నది నా కోసమే.. ఇది నీకు తెలియకపోవచ్చు. అంతమాత్రం చేత నష్టం లేదు. నువ్వు ఏం చేసినా, నా కోసమే. అది నాకే చెందుతుంది. ఈవిషయములో దిగులుపడకు. ఈ కనిపించే వన్నీ దైవస్వరూపాలే. దైవంకాని ప్రాణి, వస్తువు – ఏదీ లేదు. నువ్వూ దైవమే. ఈ సృష్టికి ఏ ప్రాణికీ, నీకూ కాకుండా నీ శక్తే, సేవలూ ఎక్కడికి పోతున్నాయ్? ఇందులో ఎవరికి చెందినా, అదిదైవానికి చెందినట్లే. కనుక ఇందులో స్వార్థం అన్న ప్రసక్తే లేదు. అంతా పరమార్థమే.
కనుక “నీ ఉద్యోగంలో నీవు నీతి, నిజాయితీలతో ఉండటమే నీ ధర్మం. దాన్ని సక్రమముగా పాటిస్తే మరింకేమీ అవసరం లేదు”.
ఈ వాక్యాలు “స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః” గుర్తు చేస్తున్నవి. (గీత.18/46)
మనం చేసే ప్రతి పనీ అమ్మ కోసమే చేస్తున్నామనే భావమే. మనలను కర్మబంధాల నుంచి ముక్తి కలిగించుతుంది. అది కర్మయోగమవుతుంది.