బ్రహ్మవల్లి అనే ఉపనిషత్ ‘రసోవైసః’ (అత్యంత రుచికరమైనది దైవం) అని నిర్వచిస్తోంది.
‘పిబరే రామరసం, రసనే! పిబరే రామరసం అనీ
“చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు?
చాలదా హితవైన చవులెల్ల నొసగ?” – అనీ
‘దధిమధురం, మధుమధురం, ద్రాక్షాపిమధురం,
సితాపిమధురైన, మధురాదపి తన్మధురం
మధురానాధస్య నామయద్గీతం’ – అనీ
ఇదే సారాన్ని కవులు, వాగ్గేయకారులు గానం చేశారు. అమ్మ పరిపూర్ణమూర్తి. కావున ఈ న్యాయాన్ని తిరగవేసి “నేను మీకు లడ్డు. మీరు నాకు లడ్లు” – అన్నది. ఆ వాక్యాలు సంపూర్ణత్వానికి, వాస్తవానికి, విశ్వమాతృత్వానికి దర్పణం పడుతున్నాయి.
అమ్మ నిఖిల సృష్టిని తన సంతానం గానే కాక తన అవయవాలుగా, తనకు, అభిన్నంగా దర్శించింది, ప్రేమించింది. జగన్మాత అమ్మ సన్నిధిలో మనం అవ్యక్తమధురమైన ఆనందాన్ని పొందాం. అవాజ్మానసగోచరమైన అమ్మ దైవత్వాన్ని తత్త్వతః మనం వీక్షించనేలేదు. మన ప్రయాణం మధ్యలోనే ఆగినట్లు అయింది.
ఒకసారి సరస్వతీ పుత్ర శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులుగారు జిల్లెళ్ళమూడి వచ్చారు. కొద్ది రోజులు ఉన్నారు. ప్రతిరోజూ అమ్మ శ్రీచరణ సన్నిధిలో ప్రసంగించేవారు. సాయంకాలం వారు, సోదరులు విఠాల శ్రీరామచంద్ర మూర్తిగారు, నేను కలిసి మాట్లాడుకునే వాళ్ళం. ‘విప్లవాత్మక ప్రవచనం’ అని నేను సంభావన చేసే అమ్మ వాక్యాలు : శరీరం ఆత్మకాకపోలేదు. నా దృష్టిలో జడమేమీ లేదు, అంతా చైతన్యమే, సజీవమే. మానవుని నడకకి ఆధారం నవగ్రహాలు కాదు, రాగ ద్వేషాలు వంటివి వారితో చర్చించాను. వారు శాస్త్రాన్ని ఉటంకించి, అంగీకరించ లేదు. ఆ విషయాన్ని నేను అమ్మతో ప్రస్తావించాను. వెంటనే అమ్మ “నాన్నా! ఇవన్నీ మాటలే కదా! మాటలు కాకుండా ఉంటే ఎంతైనా ఉన్నది”. అన్నది. ‘యతో వాచో నివర్తంతే’ – ఆప్తవాక్యాల్ని గుర్తింప చేసింది.
మాటలు కాకుండా ఉండే దానిని ఒక అలౌకిక స్థితి అన్నా, శక్తి అన్నా, అన్నా….. అందులో సృష్ఠివైచిత్ర్యం, శివసంకల్పం, వైష్ణవ మాయ ఇమిడి లీల ఉన్నాయి. దాన్ని తెల్సుకోవడం మనిషికి అసాధ్యమే అనవచ్చు. దీనినే గీతాచార్యులు ‘మనుష్యాణాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః (వేల కొలది మానవులలో ఒకానొకడు మాత్రమే పరతత్త్వాన్ని దర్శించాలని తపిస్తాడు. అట్టి వారిలో ఏ ఒక్కడో మాత్రమే వాస్తవంగా నన్ను దర్శించగల్గుచున్నాడు) అని వివరిస్తారు.
ఇంద్రియాల వల్ల పొందే సుఖం దుఃఖహేతువు అవుతోంది. కళ్ళు ఉన్న గ్రుడ్డి వాళ్ళుగా తయారు చేస్తోంది ఈశ్వర మాయ. విశ్వనాటకమంతా రసాభాస, రస + ఆభాస అయినట్లయింది. రసం (అవిచ్చిన్నమైన ఆనందం) ఎండమావియే. ఈ సత్యాన్నే అమ్మ,” చింతకు కారణం నా స్వంతం అనుకోవటమే కదా! స్వంతం అనుకోకపోతే సౌఖ్యానికి దారి లేదు. సౌఖ్యం కలదారిగా కనిపిస్తూ దుఃఖాన్ని ఋజువు చేస్తుంది నాది అనేది” అని వివరించింది. యదార్థమైన ఆనందం ఏది అని మానవాళి శతాబ్దాలు పరితపించింది. అది సత్యం, శివం, సుందరం అని తెల్సుకుంది. ఏదైతే సత్యమైనదో అది శివం (మంగళకారకం), అదే సుందరం (ఆనందస్వరూపం). ఉదాహరణకి సూర్యుని ప్రకాశం, అమ్మ విశ్వజనీన మమకారం సత్యం శివం, సుందరం.
నేడు జిల్లెళ్లమూడిలో విరాజిల్లుతూ అందరికీ అందుబాటులో ఉన్న దేవ్యాలయం, అన్నపూర్ణాలయం, విద్యాలయం, వైద్యాలయం, ఆదరణాలయాలు అమ్మ అనంతవాత్సల్యానికి సాకార రూపాలు, మహిమాన్విత సౌధాలు. కనుకనే అమ్మ అంటుంది “నాకు అధరం మధురం కాదు. ఉదరం మధురం’ అని అమ్మకు కడుపు తీపి ఎక్కువ. ప్రేమ రూపిణి, ప్రేమ భాషిణి, ప్రేమవర్షిణి అమ్మ.. అమ్మ ప్రేమతత్వానికి ఒక వివరణ.
God gives and forgives,
Man gets and forgets
అమ్మ వరాల్ని ఇస్తుంది. మనం లబ్ధిని పొందుతాం, మరిచిపోతాం.
తల్లీ బిడ్డల స్వభావాన్ని వివరిస్తూ అమ్మ. “ఎంత పోట్లాడినా పెట్టేది అమ్మ, ఎంత పెట్టినా పోట్లాడేది బిడ్డ” – అని నిర్వచించింది. ‘బ్రహ్మత్వసిద్ధి ఏం చేస్తే వస్తుంది’ అని ప్రశ్నిస్తే “ఏం చేసినా రాదు. వాడు (దైవం) ఇస్తే వస్తుంది” అని సిర్ద్వంద్వంగా చాటింది. ‘ఈశ్వరానుగ్రహా దేవ పుంసాం అద్వైత వాసనా’ అనే శంకర వాణిని మృదు మధురంగా వినిపించింది.
లడ్డు అవటం కంటే, లడ్డు తినటం హాయి” అనే యదార్థాన్ని గుర్తించమన్నది. అది ముమ్మాటికి నిజం. జగజ్జనని అమ్మ అమ్మగా ఉండి, అమ్మ ఒడిలో బిడ్డలుగా ఉంటేనే మనకు శాంతి, విశ్రాంతి;
అమ్మ రక్షణలో ఉన్నామనుకుంటే ఎంతో హాయి;
పసిపిల్లల మాదిరి అమ్మ చేతులు పట్టుకుని వేదవీధుల్లో చిట్టి చిట్టి అడుగులు వేయడం ఆనందం;
తన కాళ్ళపై పడుకో బెట్టుకుని, బుగ్గపై చిటికె వేసి నిగమాగమసారాన్ని ఉగ్గుపాలతో రంగరించి పోయటమే మురిపెం; అమ్మ పిలుపు, అమ్మ తలపు మన జీవనామృతం. అందరికీ సుగతే నన్న అమ్మ హామీ అలిగిన పిల్లలకి అమ్మ పంచే పంచదార పలుకులు. యోగ్యులకు, అయోగ్యులకు.. అందరికీ అమ్మ పంచదార లడ్డు; వరలక్ష్మి.