అమ్మ వంటి అవతారమూర్తులను గురించి వ్రాసేటప్పుడు అక్బర్ గురించో, అశోకుని గురించో వ్రాసినట్లు, అమ్మ పరిపాలనా విధానం అని వ్రాయడం అసాంప్రదాయికంగా కనిపించవచ్చు.
కానీ అర్కపురి తన కేంద్రంగా చేసుకుని, విశ్వప్రేమైకసామ్రాజ్యాన్ని పాలించిన మహారాణి, విశ్వజనని గా పేరొందిన బ్రహ్మాండం అనసూయాదేవి. ‘నేను కరణాన్ని అనిపించుకోనుగాని, కరణీకం చేస్తాను’, అని ఐదు ఏళ్ళు మాత్రమే నిండిన అమ్మ నల్లఖానంతో నిడుబ్రోలులో చెప్తారు. భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ మరణవార్త రేడియోలో విని వెంటనే ఓంకారనదికి వెళ్లి, తర్పణం చేసిన అమ్మ, ఎటువంటి పరిపాలకురాలో మనం అర్థం చేసుకోవచ్చు.
అమ్మను శ్రీమత్ సింహాసనేశ్వరి అనే పదంతో సూచిస్తారు. శ్రీమత్ అనేదాన్ని శ్రీమతాం గేహే, అనే ప్రయోగంలో భగవద్గీతలో యోగభ్రష్టుని తరువాత జన్మ గురించి చెప్పబడింది. శ్రీమత్ అంటే అని అర్థం. సింహాసనం, ఈశ్వరి అనే పదాలలో సింహాసన అనేదానికి హఠయోగ ప్రదీపిక లో చెప్పిన నాలుగు ప్రధానాసనాలలో ఒకటైన సింహాసనం అని అర్థం చెప్పవచ్చు. ఈశ్వరి అనేది ఈశ్వర శబ్దానికి ఇణిచ్ ప్రత్యయం కలవడం వల్ల ఏర్పడి, కర్త, కర్మ,క్రియా రహితస్థితి సూచింప బడుతుంది. శ్రీమత్ సింహాసనేశ్వరి అనగా తానే ఇచ్ఛాశక్తిగా ఉంటూ, కర్తృకర్మ క్రియా రహితస్థితిలో శ్రేష్టమైన స్థితి కలది.
ఇటువంటి అమ్మకు పరిపాలనా విధానం తప్పక ఉంటుంది. పరిపాలనా త్రిపుటి అమ్మ పరిపాలనా విధానం మూడు భుజాలు గల పట్టకం వంటిది. మొదటిది ఆరాధన. ఆరాధన అనగా శక్తిని ఉపయోగించడం. రెండవది కరుణ. అనగా కాలానుగుణమైన కష్టసుఖాలను కలిగించడం. మూడవది లౌక్యం. అనగా సునిశితంగా లోకాన్ని, జీవితాన్ని పరిశీలించడం. సునిశితంగా లోకాన్ని జీవితాన్ని పరిశీలిస్తూ, తన శక్తి నంతా వినియోగిస్తూ, సర్వజీవజాతులకు తరుణం రాగానే కష్టసుఖాలను కలిగించడం. ఇదే అమ్మ పరిపాలనా విధానం.
జీవస్వామ్యం
అమ్మ దృష్టిలో అన్ని జీవులు ఒక్కటే. ప్రతి జీవికి జ్ఞానం పొందే హక్కు ఉంది. అమ్మ అందరికీ సుగతి అన్నారు. అంతేకాకుండా బ్రహ్మమే చీమగా, దోమగా, నల్లిగా ఉంది అన్నారు.
అన్ని జీవుల్లో పురుషతత్త్వమైన రూపం, స్త్రీ తత్త్వం అయిన శక్తి ఉన్నాయి. ఇవి రెండూ కలిసే స్థితి శ్రీవిద్య. అటువంటి శ్రీవిద్యామూర్తి అయిన అమ్మ అన్ని జీవులకు సుగతి, స్వేచ్ఛ కోరారు. ప్రతి జీవికి సుగతి, స్వేచ్ఛ హక్కుగా ఉండడమే జీవస్వామ్యం. ఇది జీవరాశి ప్రకృతి నుండి పొందిన హక్కు, వరం.
అందరికీ తల్లి అయి, అందరింటి పాలకురాలయి, ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఏపనికి నియమించాలో, ఎవరి ద్వారా ఏమేమి విజయవంతంగా సాధించవచ్చో కచ్చితంగా తెలిసిన అమ్మ వంటి వివేక వైరాగ్యాలు కలిగిన పాలకులు ఈ యుగంలో ఎవరూ లేరు.
అందుకే అమ్మ జీవస్వామ్యం సూత్రంగా,సుగతి, కరుణ ప్రసాదించిన శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇదే అమ్మ పరిపాలనా విధానం.