ఆప్తవాక్యాలు అంటే ఉద్ధరించేవి; వేద వాక్యాలు. ఇహపర సమస్యలకి. పరిష్కారాల్ని, కోరికలకు సిద్ధిని కలిగించేవి. ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధకాములు, జ్ఞానులు అనే నాలుగు రకాల ఆశ్రితులకు మార్గదర్శనం చేసేవి, జ్ఞాననేత్రాన్ని తెరిపించేవి.
‘సందిగ్ధ వేద శాస్త్రార్ధ సిద్ధాంతాయిత భాషిత’ అమ్మ. వేదాల్లో శాస్త్రాల్లో సందేహాలు కలిగితే అమ్మవాక్యాలే వాటిని నివృత్తి చేసి సిద్ధాంతీకరిస్తాయి. కానీ అమ్మ ప్రాథమిక పాఠశాలకు కూడా వెళ్ళలేదు.
ఎన్నో నిగూఢ వేదాంత సత్యాల్ని తత్త్వజ్ఞానాన్ని ప్రత్యక్షంగా వినిపించింది, వివరించింది అమ్మ. అందుకోగలిగిన వారు అందుకోగలిగినంత అందుకున్నారు. మరెందరో నేటికీ ప్రయత్నిస్తున్నారు. జ్ఞాన సర్వస్వంగా, జ్ఞానస్వరూపంగా అమ్మ సమున్నత సముచిత సింహాసనంపై దేదీప్యమానంగా విరాజిల్లుతోంది. దుర్నిరీక్ష్య అమ్మ.
వాస్తవం ఏమంటే – అమ్మని మనం తెలుసుకోవటం కాదు; తానుగా అమ్మ తెలియబడటమే. కొన్ని సందర్భాల్లో వేదవాక్యాల్ని, శాస్త్ర పాఠాల్ని యధాతథంగా వినిపించింది అమ్మ. అందుకు కొన్ని ఉదాహరణలు:
ఒకసారి సో॥ శ్రీ పన్నాల రాధాకృష్ణశర్మగారు అమ్మ శ్రీచరణ సన్నిధిలో ఆసీనులై ఉన్నారు. అమ్మ మంచంమీద కూర్చుని ఉన్నది: కళ్ళు మూసుకుని ప్రసన్న గంభీరంగా ఉంది. అశరీరవాణిలా పలుకులు వినవచ్చాయి. ‘సంకల్పరహితో సంకల్పజాతః’ అన్నట్లు వినిపించింది. సంకల్పరహితుడైన వాడు సంకల్పంతో ఆవిర్భవించెను – అని. ఆ క్షణంలో శర్మగార్కి ఆ వాక్యం అర్ధవంతం అనిపించలేదు. ‘అమ్మ ఇలా అంటున్నదేమిటో!’ అని అనుకున్నారు. కొన్ని క్షణాల్లో వారి మనోఫలకంపై ఒక ఆలోచన తళుక్కుమన్నది. అమ్మ పలుకులు ‘సంకల్పరహితః అసంకల్పజాతః’ అని వారికి అవగతమైనాయ్. అమ్మ ఉచ్ఛారణలో తేడాలేదు. ‘సంకల్పరహితో సంకల్పజాతః’ అనీ అన్నది అమ్మ. అందుకార ప్రశ్లేష సువిదితమైంది. సంకల్ప రహితుడు సంకల్పరహితునిగానే ఆవిర్భవించెను అని. ఈ సృష్టి రచన, కదలికలు, స్థితి, లయాలు… వీటికి కారణం ఏమిటి? అనే ప్రశ్నకి సమాధానం “అకారణమే కారణం” అనే అమ్మ వాక్యం.
రెండవ ఉదాహరణ: శ్రీ చంద్రమౌళి చిదంబరరావుగారు అమ్మ చినతాతగారు. వారు వృత్తిరీత్యా న్యాయవాది; సత్యాన్వేషి, కవి, పండితులు, ఆర్ద్ర హృదయులు, అమ్మ బాల్యంలోనే దివ్యత్వాన్ని దర్శించిన తపస్వి.
ఒక సందర్భంలో అమ్మతో, “అమ్మా! నువ్వు సకల కార్యాలకూ కారణమై అకారణంగా సకల కార్యాలనూ నడిపే సగుణ మూర్తివి” అని తన దర్శనాన్ని ప్రకటించారు. అపుడు అమ్మ వయస్సు ఐదు సం॥లు. ఆ రోజుల్లోనే మరొక సందర్భంలో ‘నువ్వు ఎట్లా చేస్తే అట్లా అవుతుందమ్మా’ అని అన్నారు. అమ్మ సర్వశక్తిమత్వంలో వారికిగల విశ్వాసాన్ని వెలిబుచ్చారు. అందుకు అమ్మ “ఇదొక వాడుక పదం. అభ్యాసయోగయుక్తేన” అని చటాలున ఆపింది. ‘ఇదెక్కడ విన్నావమ్మా!’ అంటూ చిదంబరరావుగారు ఆశ్చర్య చకితులయ్యారు. అది భగవద్గీత 8వ అధ్యాయంలో – 8వ శ్లోకం: ‘అభ్యాసయోగయుక్తేనః చేతసానా న్యగామినా । పరమం పురుషం దివ్యం యాతిపార్ధాను చింతయన్॥’. (అభ్యాసము అనే యోగముతో కూడినది, అన్యాయత్తము కానిది అయిన చిత్తము పరమపురుషుని ధ్యానిస్తూ ఆ పరమ పురుషుని పొందును అని
‘నువ్వు ఎట్లా చేస్తే అట్లా అవుతుంది’, ‘అంతా అదే (దైవం) చేయిస్తున్నది’ అనేవి మాటలుగా కాకుండా ఒక వాడుక పదం (CLICHE)లా కాకుండా ఆరూఢత కలిగిన దృఢచిత్తం ఉంటే మాటల అవసరమే లేదు.
ముచ్చటగా మూడవ ఉదాహరణ.
1976లో ఒకసారి సో॥ శ్రీ బి. రామబ్రహ్మంగారు ఏలూరు నుంచి జిల్లెళ్ళమూడి వచ్చారు. అమ్మ దర్శనం చేసుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అవి కంటికి కనిపించేవి. వస్తుతః ప్రసాదం కనిపించదు; ఒక పదార్ధం కాదు కనుక.
నాటి సాయంత్రం అమ్మ ఆరుబయట మంచం మీద పడుకుని ఉన్నది. తనకితాను తనలోతాను అనుకున్నట్లుగా ‘యదృచ్ఛాలాభ సంతుష్టో’ అని అన్నది. ఆ సమయంలో అమ్మ సన్నిధిలో రామబ్రహ్మం అన్నయ్య మాత్రమే ఉన్నారు.
మరునాటి ఉదయం ప్రయాణమై బొట్టుపెట్టించుకుని సెలవు తీసుకుందామని అన్నయ్య అమ్మ దరి చేరారు. అమ్మ మంచం మీద కూర్చుని ఉన్నది. ఈసారి కూడా అమ్మ వద్ద అన్నయ్య మాత్రమే ఉన్నారు. అమ్మ రెండవసారిగ బిగ్గరగ ‘యదృచ్ఛాలాభసంతుష్టా’ అన్నది. అమ్మది తోలు నోరు కాదు కదా తాలుమాట రావటానికి. ఆ విధంగా అమ్మ తనకి ఏదో సందేశాన్నిస్తోంది; ఏదో ఉపదేశిస్తోంది అని విశ్వసించారు. ప్రయాణ సమయంలో దారి పొడవున ‘యదృచ్ఛాలాభ సంతుష్టో’ అన్న అమ్మ పలుకులను మననం చేసుకుంటూ ఏలూరు చేరుకున్నారు. ఇంటికి రాగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా పుస్తకాల బీరువా తెరచి భగవద్గీతను అందుకుని అమ్మ పలుకుల కోసం అన్వేషించారు. 4వ అధ్యాయంలో 2వ శ్లోకం:
‘యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః |
సమ స్పిద్ధావసిద్ధా చ కృత్వా న నిబధ్యతే ॥’
దర్శనం ఇచ్చింది. (దాని అర్ధం – ఎవడు తానుగా కోరకనే దానంతట అదే లభించిన వస్తువుతో ఎల్లపుడు తృప్తి చెంది ఉండునో, ఎవనిలో ఈర్ష్యా భావం సమూలంగా నశించిందో, ఎవడు హర్షశోకాది ద్వంద్వాలకు అతీతుడో, సిద్ధియందు అసిద్ధియందు ఎవడు సమముగా ఉండునో అట్టికర్మయోగి కర్మలనాచరించు చున్ననూ వానిచే బంధింపబడడు – అని)
ఈ లోగా ఆయన ధర్మపత్ని వచ్చి ఇంటికి రాగానే రీజనల్ మేనేజర్గారు తనతో మాట్లాడమని చెప్పారనే సమాచారాన్ని అందించారు. వెంటనే అన్నయ్య ఆర్.ఎం.గారితో ఫోన్లో మాట్లాడారు. దాని సారాంశం ‘ రోజ బ్యాంకులో ప్రమోషన్స్ ఇచ్చారని, రామబ్రహ్మం గారికి ప్రమోషన్ రానందులకు తాను విచారిస్తున్నానని, రాకపోవటానికి తాను కారణం కాదని, తనను అపార్థం. చేసుకోవద్దని, consolation గా ఒక ఇంక్రిమెంట్ మంజూరు చేశారు’ – అని. అమ్మ దివ్యోపదేశం ద్వారా మానసిక సంసిద్ధతను నెలకొల్పింది; పరిణతిని ప్రోది చేసింది. కష్టాలు కలుగకుండా, నష్టాలు వాటిల్ల కుండా అమ్మ రక్షరేకులు కట్టదు, అద్భుతాల్ని ప్రదర్శించదు. జీవన సమరంలో వీరోచితంగా పోరాడమని వెన్నుతట్టి పరాక్రమాన్ని నూరిపోస్తుంది, ఆత్మస్థైర్యాన్ని ప్రసాదిస్తుంది.
అమ్మ వాక్యాలు శాస్త్రాల్లో ఉండవు.
కానీ శాస్త్రాలు అమ్మ వాక్యాల్లో ఉంటాయి.
అమ్మ పలుకులు ఆప్తవాక్యాలు.