1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మ పెట్టిన గోరుముద్దలు

అమ్మ పెట్టిన గోరుముద్దలు

Mannava Bucchiraju Sarma
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 10
Month : March
Issue Number : 8
Year : 2011

శ్రీ కొండముది బాలగోపాలకృష్ణమూర్తి – ఈ పేరుతో ఎవ్వరూ పిలవరు. చాలమందికి ఈ పేరు చెపితే, కొంచెం ఆలోచించి గోపాలన్నయ్య కదూ ! అంటారు. అవును ఇది నిజం. ఆ పేరుతోనే ఆయన ప్రసిద్ధుడైనాడు. ఆయన ఆగష్టు, 15, 1960వ సంవత్సరం అమ్మదగ్గరకు జిల్లెళ్ళమూడి వచ్చాడు. తర్వాత అప్పుడప్పుడు వచ్చాడు. తర్వాత జిల్లెళ్ళమూడిలోనే స్థిరంగా ఉన్నాడు. ఉన్నాడు అనే బదులు అమ్మ రప్పించుకొంది, దగ్గరే ఉండటానికి అవకాశాన్ని అనుగ్రహించింది అంటే బాగుంటుంది.

అమ్మకు ఆయన మీద ఎందుకింత వాత్సల్యం? అమ్మకు చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. గోపా లన్నయ్యకూ అంతే. అమ్మ పినతల్లి అనురాగంలో పెరిగింది. గోపాలన్నయ్యకు అంతే. అపవాదులు, నీలాపనిందులు అమ్మ అనుభవించినట్లే. గోపాలన్నయ్య కూడా అను భవించాడు. అన్నింటికి మించి అమ్మకు ఉన్నది సహజ సహనమైతే, గోపాలన్నయ్యకు కూడా సహనం పాలు ఎక్కువే! ఇన్ని పోలికలు ఉన్న అన్నయ్య అమ్మ దగ్గర ఉండటం ఆశ్చర్యమేముంది.

అయితే ఏమిటి ? అని మీరు అడగవచ్చు. ఆ విషయానికే వస్తున్నా. ఈయన ఒక పుస్తకం వ్రాశాడు. “అమ్మ సన్నిధిలో నా అనుభవాలు – జ్ఞాపకాలు” ఈయన ‘విశ్వజనని’ మాసపత్రికలో ప్రచురించిన వ్యాసాలు ప్రస్తుతానికి 72 అనుభవాలు, జ్ఞాపకాలు, అన్నింటిని గురి గుచ్చి ఈ పుస్తకరూపంలో వెలుగులోనికి తెచ్చాడు, మిగతా 36 తెచ్చి అష్టోత్తరశతం చేయాలని ఆకాంక్షిస్తున్నాను.

ఇందులో అమ్మ మహిమలు, సర్వజనీనమైన నిత్య సత్యాలు, జిజ్ఞాసులను ఆలోచింపచేసే అమ్మ మాటల

ముత్యాలు, వివరణలు మనకు దర్శనమిస్తాయి. గోపాలన్నయ్య ఎంత అదృష్టవంతుడంటే ఆయనకు అమ్మ కలలో పాలు యిచ్చింది. విచిత్రమేమిటంటే, మెలుకువవచ్చిన తర్వాత ఆయన నోరు అంతా పాల వాసన. అంటే వాస్తవంగా ఇచ్చినట్లు కాదా ? జ్ఞాపకాల విషయంలో గోపాలన్నయ్య ఎన్నో అద్భుతమైన విషయాలు మన ముందు ఉంచుతాడు. హైమ మహాసమాధి అయిన కొద్ది రోజులకు అమ్మ జన్మదినం రావటం, ఆ రోజే ఒక గ్రంథావిష్కరణ కార్యక్రమం జరగటం. అమ్మ ద్వంద్వాతీత స్థితి వివరిస్తాడు”. అమ్మ పెట్టిన “గోరుముద్దలు” వ్యాసంలో, అమ్మ వీరి చేత అన్నం తినిపించిన వివరణ చదివినప్పుడు, అమ్మ 1956లో మూడు పూటలు తినే అన్నం ఒకేసారి నాచే తినిపించిన సంగతి గుర్తుకు తెచ్చి నన్ను ఆరోజుల్లో అమ్మ సన్నిధిలోకి తీసుకు వెళ్ళింది. ఎంత సారూప్య సంఘటన!

ఈ జ్ఞాపకాలు అనుభవాలు ఆయనవి. వాటిని గురించి, ఆయనే ఈ పుస్తకంలో వివరంగా వ్రాశాడు. అందులో ఉన్న వాటి గురించి నేను చెప్పటమేమిటి ? ఇది, అందరు తప్పక చదవాల్సిన పుస్తకం. మీరూ చదవండి. జన్మ ధన్యం అవుతుంది.

ఏమైనా దాదాపు 25 సంవత్సరాలు అమ్మకు దగ్గరగా ఉండి, ఆరాధించి, అమ్మ స్పర్శచేత శరీరాన్ని పునీతం చేసుకొని, అమ్మ వాత్సల్యజలధిలో పుణ్యస్నానాలు చేసిన, అదృష్టమూర్తి, ఈ గోపాలకృష్ణమూర్తి. ఆయనతో నా అనుబంధం కొద్ది కాలమే అయినా, ఎల్ల వేళలా గుర్తుండేదే. వయసులో చిన్నవాడైనందున ఆశీర్వదిస్తున్నా కానీ జ్ఞానంలో పెద్దవాడైనందున వందనీయుడు కూడా.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!