మన కంటికి కనిపించేదీ మనస్సుకి అనిపించేదీ సత్యం అనుకుంటాం. సహజం. అది వాస్తవం. కాదు. మన దృష్టి, మేధ అనేక పరిమితుల ఇనుప చట్రంలో బంధింపబడి ఉన్నాయి.
ఉదాహరణకి సూర్యోదయం, సూర్యాస్తమయాలు సత్యములా? కాదు. 0°C వద్ద నీరు అంతా గడ్డ కడుతుందా? కాదు. ధృవ ప్రాంతాల్లో 0°C క్రింద 5°C నీరు ప్రవహిస్తూ ఉంటుంది.
మనిషి నడక తన ఇష్టాయిష్టాలపైన ఆధారపడి ఉంది. కాగా, అందుకు కారణం దైవం అని మానవ సహజమైన రాగ ద్వేషాల్ని, పక్షపాతాన్ని దేవునికి ఆపాదిస్తాం. భగవంతుడూ మనిషి చేసిన వాడే (Man made God).
మన కంటికి కనిపించే కాంతి తరంగాలు, చెవులకి వినిపించే ధ్వని తరంగాలు కంటే తక్కువ, ఎక్కువ వేగంతో ప్రయాణించే తరంగాల ఉన్నాయి; అవేవీ కనిపించవు, వినిపించవు.
ఎంతో అభివృద్ధి చెందిన ఆధునికశాస్త్రం (Modern Science) ప్రాణశక్తిని నిర్వచించ లేదు; దాని స్థితి గతుల్ని నిర్ధారించ లేదు. కనుకనే Emerson అంటారు – “It is impossible to conceive that one day a Newton will arise who can explain the origin of even a single blade of grass”
సాధారణంగా ప్రతివ్యక్తి తనని ఎవరూ అర్థం చేసుకోవటం లేదని విచారిస్తాడు, విమర్శిస్తాడు. మానవ మనస్తత్వ శాస్త్రం (Human Psychology) ప్రకారం ఏ వ్యక్తికి తన మనస్తత్త్వం తనకి తెలియదు. భార్యాభర్తలైనా, తల్లీబిడ్డలైనా, గురు శిష్యులైనా, సోదరీ సోదరులైనా ఒకరి మనస్సు మరొకరికి తెలియదు.
ఈ భౌతిక దృష్టి పదార్ధ దృష్టి (Material outlook)కి భిన్నంగా ఆర్షసంస్కృతి పారమార్థిక దృష్టి అంతర్దృష్టి (Spiritual outlook / Insight)) ని ప్రబోధించింది.
భగవాన్ శ్రీ రమణ మహర్షి ఉపదేశించినట్లు – ‘Who am I?’ అని తపించుటద్వారా స్వస్వరూపాను సంధానం కలిగి, ‘అహం బ్రహ్మాస్మి’ ‘సర్వం ఖల్విదం బ్రహ్మ’ అని అనుభూతమవుతుంది. భగవద్దత్తమైన శక్తి, జ్ఞానం, సంపదలను పరహితార్థకామనతో త్యాగం చేయటం అమృతత్వ ప్రాప్తికి రాచబాట అని సనాతనధర్మం సుహృద్యాక్యాన్ని వినిపిస్తుంది. –
సృష్టిస్థితిలయాలు అవాఙ్మనస గోచరమైన అలౌకిక శక్తి అధీనములు. విశ్వసంచాలకము, విశ్వరూపము, విశ్వాంతరాత్మగా దీపిస్తోంది; అంతా అయినది కనుకనే అర్థం కాకుండా ఉన్నది. ఈ రహస్యాన్ని ఒక శాస్త్రవేత్త Laboratory లో నిరూపించలేడు. ఈ సృష్టితో తాదాత్మ్యం చెందే అమ్మ “ఈ సృష్టి అనాది, నాది. ఇందు నేను కానిది నాది కానిది లేదు” అని స్పష్టం చేసింది.
వేదములు దైవ స్వరూపాన్ని లక్షణాల్ని స్తుతిస్తూ – ‘సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ’ అన్నాయి. అట్టి సత్స్వరూపాన్ని సత్యస్వరూపాన్ని విచారణ చేస్తూ అమ్మ రాజు బావగారిని – “నాన్నా! రూపాయ నాణానికి మనం ఒకవైపు బొమ్మని చూస్తాం. అంటే రెండవవైపు బొరుసు ఉన్నదా? దృశ్యమాన ప్రపంచంలో ఈ సృష్టిలో ఈ కన్నులకి కనిపించే ప్రతి వస్తువుకి రెండవవైపు ఏమిటి? ఆ రెండవవైపు ఎవరన్నా చూశారా? కనపడుతుందా? కనపడదా?” – అని ప్రశ్నించింది. సమాధానంగా రాజుబావ ” ఆ రెండవ వైపు ఏమిటో తెలియదమ్మా” అన్నారు.
ఆ సందర్భంలో అమ్మ, ” రెండవవైపు ఏమిటో తెలుసా? తనే. ఇంతటినీ చూచేవాడు తనని తాను చూసుకోలేదు. రెండవవైపు తనే. తనను తాను తెలుసుకున్నవాడు సర్వాన్నీ తెలుసుకుంటాడు” – అని ఒక అచ్చమైన సంపూర్ణ దృష్టిని, లోచూపుని ఆవిష్కరించింది. అంతేకాదు.
అమ్మ భౌతికంగా జిల్లెళ్ళమూడిలో ఉంటూనే దూర సుదూర ప్రాంతాల్లోని సందర్భాలు, సంఘటనలు, సంభాషణలను యథాతథంగానూ, ప్రతీకాత్మకంగానూ విశదపరుస్తూంటే విభ్రాంత చేతస్కులైన సోదరీసోదరులు “అమ్మా! ఇవన్నీ నీకు ఎట్లా తెలుసు?” అని ప్రశ్నించగా అమ్మ “దేనిని తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయో, అది నాకు తెలుసు. అదే నేను” – అని ప్రకటించింది. సత్యస్వరూపిణి, సత్యాన్వేషిణి అయిన అట్టి అమ్మ పవిత్ర పాదారవిందాలకు శతసహస్రాధిక వందనములు.
అమ్మ ప్రబోధించిన మరొక సత్యం
అమ్మ సందేశం “నీ కున్నది తృప్తిగా తిని, ఇతరులకు ఆదరంగా పెట్టుకో” అనేది సువిదితమే. అది పూర్వభాగం; ఉత్తర భాగం ఉన్నది. “అంతా వాడే (ఆశక్తి) చేస్తున్నాడని నమ్ము” – అనేది ఉత్తర భాగం. అందరం భగవచ్ఛక్తియందు విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకు అని అంటే- “సర్వకాల సర్వావస్థలలో నీ వెన్నంటి ఉండేది భగవంతుడు మాత్రమే. ఆశక్తి, కనపడదు, కనిపెడుతుంది” అనే సమాధానాన్ని ఇచ్చింది అమ్మే.
‘విశ్వాసము’ అంటే ఏమిటో కూడా వివరించింది అమ్మ. అమ్మకి దాపరికం లేదు; కృపాధారాధార కనుక.
“సర్వధర్మా న్పరిత్యజ్య మామేకం శరణం వ్రజI
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచఃII” అని శ్రీ కృష్ణ పరమాత్మ అభయదానం చేశారు.
అదే వాక్యాన్ని అదే తత్వాన్ని తల్లిగా దిగివచ్చిన ప్రేమమూర్తి కనుక అమ్మ మరింత అందంగా సులభతరంగా- “నన్ను నమ్ముకో, నిన్ను నమ్ముకో. ఏదైనా ఒకటే. విశ్వాసమే భగవంతుడు” అన్నది.
ఇక్కడ ‘నన్ను నమ్ముకో’ అంటే అనసూయమ్మను నమ్ముకో అని కాదు; నేను నేనైన ఆ ‘నేను’ను నమ్ముకో – అని; సర్వం తానైన ఆశక్తిని.
అమ్మ వాక్యానికి ఒక నేపథ్యం ఉంది. అదీ అమ్మ ప్రబోధమే. “ఆ శక్తి (దైవం) తమాషా ఏమిటంటే శుద్ధంగా ఉంటే తనే అవుతాము” అనేది. ఈ పరమ సత్యాన్నే వేదాలు ‘బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి’ అనీ ‘బ్రహ్మవి దాప్నోతి పరం’ అనీ చాటి చెప్పాయి. కనుకనే “నిన్ను నమ్ముకో” అని ఒక Option ఇచ్చింది.
ఒకనాడు ఆచార్య ఎక్కిరాల భరద్వాజ అమ్మచేతికి ఒక గ్రంధాన్ని ఇచ్చారు. సాధారణంగా ‘అమ్మ ‘అంఆ’ అనే స్వీయనామ సంజ్ఞానాత్మక బీజాక్షరాలను వ్రాస్తుందని భావించారు. కానీ అక్షర రూపిణి, వాఙ్మయ స్వరూపిణి అమ్మ “I am am I” అని వ్రాసింది. అది పరమాద్భుతమైన వాక్యం; సృష్టికర్తి వైచిత్రికి సంపూర్ణ భాష్యం. నాకు అందినంతవరకు విపులీకరిస్తాను.
I= సృష్ట్యాదిలో ఏకాకిగా ఉన్న నేను,
am = ఇపుడు సృష్టి రూపంగా అనేకంగా ఉన్నాను.
I am = Evolution (సృష్టి, స్థితి కార్యాలు).
మరల అవే పదాలు తిరగబడ్డాయి- ‘am I’ అని.
am = అనేకంగా దీపిస్తున్న నేను,
I= ఆ అసలుగా, ఏక మేవ అద్వితీయం బ్రహ్మగా అవుతాను.
am I= Involution (లయ, తిరోధాన కార్యాలు)
ఆ విధంగా సృష్టి, స్థితి, లయ, తిరోధాన కార్యాలను నిర్వహించటమే ఆ శక్తి అనుగ్రహం. ‘అసలు ఇది ఏమిటి?’ అని తర్కించి సత్యాన్వేషణకి రాచబాట వేసి మార్గము, గమ్యము తానే అయిన అమ్మకి నిగమాగమసారానికి, పంచకృత్యపరాయణకి సాష్టాంగ ప్రణామాలు.