అమ్మ ప్రసాదించే అనుభవాలు వ్యక్తిగతమే అయినా చాలామందికి వర్తించేవిగా, కొన్ని ప్రత్యక్షంగా మరికొన్ని పరోక్షంగా ఉంటూ మధురస్మృతులుగా నిలిచి ఉంటాయి.
నా తొలికానుపు సిజేరియన్ శస్త్రచికిత్స అయినా అమ్మ కృపతోనే గట్టున పడ్డాను. తరువాత మూడేళ్ళవరకూ గర్భం ధరించడం మంచిది కాదని వైద్యులు హెచ్చరించారు. విధి – విధానం వేరే ఉంది. ఏడాదికే గర్భధారణ జరిగి ఆందోళనకి గురి చేసింది. మా బాబాయి శ్రీ బి.వి.వాసుదేవాచారిగారు ‘కొండంత అండ అమ్మ మన చెంత ఉన్నదికదా!’ అని నన్ను జిల్లెళ్ళమూడి తీసుకెళ్ళారు.
అమ్మ నన్ను చూస్తూనే గబాగబా ఎదురు వచ్చి నన్ను తన గుండెలకి హత్తుకుని ప్రేమతో తల – వెన్ను నిమురుతూ ‘ఎంత కాలానికి వచ్చావమ్మా’ అన్నది; ఆ చల్లనిస్పర్శ, తియ్యనిమాట ఎంతో హాయిని కలి గించాయి. ‘ఎలా ఉన్నావు?’ అని అడగకుండా ‘ఎన్నవ నెల?’ అని అడిగింది. – ఆ మాటలో నా యోగక్షేమాలు స్థితిగతుల గురించి అమ్మయే తపన పడుతోంది – అని తెలుస్తోంది. “మనస్సు దృఢంగా ఉంచుకో. అన్నీ సవ్యంగానే జరుగుతాయి” హామీ నిచ్చింది. “అమ్మా! ఇప్పుడు ఐదవ నెల. పెద్దమ్మాయికి ఏడాది. మొదటిసారి సిజేరియన్ జరిగింది కాబట్టి రెండవసారి సిజేరియన్ తప్పదు అంటున్నారు డాక్టర్లు” అని నా ఆవేదన నివేదించాను.
“మొదటిసారి ఆపరేషన్ చేయడానికి కారణం ఏం చెప్పారు డాక్టర్లు. నీకేదైనా లోపమున్నదన్నారా?”అని అడిగింది అమ్మ. “బిడ్డ మెడకు పేగు చుట్టుకున్నదని ఆపరేషన్ చేశారు. నాకు ఏలోపమూ చెప్పలేదు”అన్నాను.
“నాకు సైన్సు ఏమీ తెలియదమ్మా. పిల్లలు వస్తూంటారు. వాళ్ళల్లో డాక్టర్లు వున్నారు. వాళ్ళు చెపుతూ వుంటారు మొదటిసారి ఆపరేషన్ జరిగినంత మాత్రాన రెండవసారి జరిగి తీరాలని ఏమీ లేదట; నార్మల్ గానే అవుతాయట. ఎందరికో అలా జరిగిందని చెప్పారు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నువ్వు వస్తే నేను ఇక్కడే పురుడు పోస్తా” అని ధైర్యం చెప్పింది.
కొంచెము సేపు గడిచాక “నెల్లూరులో అన్నపూర్ణకు ఇలానే జరిగిందట. ఒక రోజంతా నెప్పులు పడ్డాక, ఆపరేషన్ కోసం సిద్ధం చేశాక, నార్మల్గానే కానుపు అయిందట. నువ్వు ఆపరేషన్ అని దిగులుపడకు” అని ఉదాహరణ పూర్వకంగా గట్టిగా నమ్మకం కలిగించింది. “అమ్మ చలిమిడి పెడుతుందిలే. నేను ప్రసాదం ఇస్తాను” అని బొట్టుపెట్టి ప్రసాదం ఇచ్చింది.
9 నెలలు గడిచాయి. నెలవారీ checkup కోసం డాక్టర్ దగ్గరకు వెడితే ‘delivery’కి ఇంకా సమయం ఉంది. నెప్పులు వస్తేరా’ అని చెప్పారు.
ఆ రోజు రాత్రి కాస్త నలతగా అనిపించింది. ఒక వైపు తుఫాన్ హెచ్చరికలు. మాకు ఆస్పత్రి దూరం. ముందు జాగ్రత్త కోసం ఆస్పత్రికి వెళ్ళి ఆరాత్రికి ఒక room అడిగితే, Labour room ఇచ్చారు. బయట కుంభవృష్టి. మార్నాటి ఉదయానికి నెప్పులు వస్తూనే ఉన్నాయి. కాని delivery అయ్యే సూచనలు లేవు. ఆ రాత్రికి తుఫాన్ తీవ్రత పెరిగి ఊరంతా అల్లకల్లోలం. రహదారిపై రాకపోకలు స్తంభించాయి. ‘Delivery అయ్యే పరిస్థితి లేనపుడు నెప్పులు అలా రాకూడదు. వెంటనే operation చెయ్యాలి’ అన్నారు డాక్టర్లు.
అన్నీ సిద్ధం చేసి నన్ను operation table మీద పడుకో బెట్టారు. “అమ్మా! హైమా! నాకు మళ్ళీ op- eration తప్పదా?” అని మధన పడుతున్నాను. సవివరంగా సోదాహరణంగా అమ్మ ఇచ్చిన హామీ స్ఫురించలేదు. డాక్టరు operation ఏర్పాట్లను పరిశీలిస్తూ “ఈ అమ్మాయిని వెంటనే delivery room కి shift చెయ్యండి” అని అరిచింది. నేను Room కి ఎలా వెళ్ళానో ఎక్కడ ఏ స్థితిలో ఉన్నానో తెలియదు. తక్షణం పాపాయి ఏడుపు వినిపించింది.
అప్పుడు అమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి, ‘నువ్వు ధైర్యంగా ఉండమ్మా, అన్నీ సవ్యంగానే జరుగుతాయని’ అని ఒక రక్షణ కవచాన్ని ముందుగానే కప్పి ఉంచిన అమ్మ అవ్యాజకారుణ్యం కట్టెదుట సాక్షాత్కరించింది. “అమ్మా! అన్నపూర్ణకు అలా అయింది. అని అన్నావు. ఆ అన్నపూర్ణని నేనే కదా!” అని తెలిసి కళ్ళవెంట కృతజ్ఞతా పూర్ణ బాష్పధారులు వర్షించాయి. ప్రత్యక్షంగా హామీనిచ్చింది. అక్షరాలా దానిని వాస్తవంగా చేసింది. అలా అవ్యక్తంగా వుంటూ సదా సర్వధా మనలను కంటిపాపల్లా సంరక్షిస్తుంది అమ్మ.
అమ్మ రక్షణ, అనుగ్రహం, వాత్సల్యం అగ్రాహ్యములు.