ఒకనాడు అమ్మ సమక్షంలో శ్రీ లక్ష్మణ యతీంద్రులు స్వీయ కవితాగానం చేస్తున్నారు. అంతలో అమ్మ యతీంద్రులవారి మెడలోనున్న పుష్పహారాన్ని తీసి క్రింద ఉంచింది. అది బరువుగా ఉన్నందువలన యతీంద్రుల వారికి అసౌకర్యంగా ఉంటుందని అమ్మ భావన.
వెంటనే చిరునవ్వుతో యతీంద్రుల వారు అన్నారు “అమ్మ అంటే అది. ‘అమ్మ’ అంటే నిర్వచనం కోసం డిక్షనరీ చూడకండి. ఇక్కడ చూడండి… ఇదీ అమ్మ అంటే” అని.
సంఘటన చిన్నదా, పెద్దదా – అన్నది ప్రధానం కాదు. అమ్మ ప్రతి కదలికలో, ప్రతి క్రియలో మాతృత్వం పరిమళాలు గుభాళిస్తూ ఉంటాయి. అమ్మ ప్రతి వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది.
అనుక్షణం వచ్చిన ప్రతివారు అన్నం తిన్నదీ లేనిదీ అమ్మ స్వయంగా విచారిస్తూ ఉంటుంది. కొందరు అన్నం తిని వస్తే వారికి అమ్మ యేదైనా ప్రసాదం తినిపిస్తూ ఉంటుంది. ఆ తినిపించేటపుడు, అమ్మ తీసుకునే జాగ్రత్తలూ, చూపించే శ్రద్దా మనను ఆశ్చర్యచకితులను చేయడమే కాదు, మన గుండెను కదుపుతాయి. అరటి పండు తినిపిస్తే – అది మెత్తగా ఉన్నదా, గట్టిగా ఉన్నదా, బాగున్నదా, లేదా అని వత్తి చూసి మరీ తినిపిస్తుంది. బత్తాయితొనలైతే గింజలను తానే తొలగించి నోటికి అందిస్తుంది.
అన్నం పెట్టేటప్పుడు అయితే ఎవరికి ఎట్లా కావాలో విచారిస్తూ, కొందరికి కారం ఎక్కువగా, కొందరికి ఉప్పు తక్కువగా కలుపుతూ, కబుర్లు చెబుతూ కొసరి కొసరి పెడుతూ ఉంటుంది. ఆ మధుర సమయాల్లో ఎవరికి వారికి,వారి వయసుతో గుణాలతో నిమిత్తం లేకుండా, తాము పసివాళ్ళు అయినట్టూ తమ కన్నతల్లుల ఒడిలోనో, చంకలోనో ఉన్నట్టూ అనుభూతి కలుగుతుంది. ఎవరికి వారికి తానే అమ్మకు ప్రధానమనీ, తానే ముద్దుబిడ్డననే భావన కలుగుతుంది.
ఒక సూర్యుడు ఒక్కొక్కరికీ ఒకొక్క సూర్యుడుగా కనిపించినట్లే. అమ్మ ఒక సందర్భంలో ఇలా చెప్పింది- “లక్షమంది బిడ్డలు ఉన్న తల్లి లక్ష మంది బిడ్డలను ఒకొక్కరిగా గుర్తించగలదు. అది హృదయసంబంధం” – అని. ఎవరికి వారు అమ్మకు నేనే ఎక్కువ అను కునేటట్లుగా వాత్సల్యాన్ని వర్షించేది. వారి అవసరాలను బాగోగులను ఎంతగానో పట్టించుకునేది.
అట్లాంటి ఘట్టం ఒకటి అవలోకిద్దాం. అమ్మ వాత్సల్యామృతజలధిలో మునిగితేలి పరవశించిన భాగ్యశాలి శ్రీ లాల అన్నయ్య.
1960 దశకం చివరిదశ నుండి దాదాపు దశాబ్దం పాటు నిరంతరం అమ్మ చరణసన్నిధిలో అమ్మ ప్రేమామృతాన్ని పుక్కిట పట్టిన అదృష్టశాలి.
బాపట్ల స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ బాపట్ల లోనే నివాసం ఉంటున్న శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు అన్నయ్య గారింటికి ఒకనాడు లాలన్నయ్య వెళ్ళటం జరిగింది.
దురదృష్టవశాత్తు లాలన్నయ్య అక్కడ అనారోగ్యం పాలైనాడు. ఒకరోజు గడిచింది, రెండు రోజులు గడిచాయి. కానీ లాల అన్నయ్యకు స్వస్థత చేకూరలేదు. రవిఅన్నయ్య ఎంతో శ్రద్ధతో స్థానిక వైద్యుల సహాయంతో వైద్యం చేయిస్తున్నా ప్రయోజనం కనిపించలేదు.
ఇక్కడ ఇలా ఉంటే – అక్కడ జిల్లెళ్ళమూడిలో అమ్మ లాలన్నయ్య కోసం అడగటం ప్రారంభించింది. బాపట్ల వెళ్ళాడన్నారు. ఇది వారికి మామూలే కనుక అమ్మ కూడా “అలాగా” అన్నది.
మరో రోజు గడిచింది. వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. జిల్లెళ్ళమూడిలో ఇంక ఎవరినీ ఏమీ ప్రశ్నించని అమ్మ లాలన్నయ్య కోసం సరాసరి బాపట్ల రవిఅన్నయ్య ఇంటికి వచ్చింది. లాలన్నయ్య మంచానికి అతుక్కుపోయి ఉన్నాడు. అన్నయ్య అనారోగ్యం గురించి అమ్మ అక్కడనే ఉన్న లక్ష్మీ నరసమ్మ అక్కయ్యను విచారించింది. అన్నీ తెలుసుకున్న తరువాత అమ్మ “అసలు వీడు మూత్రవిసర్జన చేసి ఎంతకాలం అయింది?” అని అడిగింది.
అప్పుడు అక్కయ్య “అవునమ్మా! నువ్వంటే గుర్తుకు వస్తుంది. వీడు రెండు మూడు రోజుల నుండి మంచం దిగలేదు. ఏ డాక్టర్ ఈ విషయం గమనించలేదు” – అని బదులిచ్చింది.
ఆ సంగతి అమ్మకి తెలియక ప్రశ్నించలేదు. సమస్యను సత్వరంగా పరిష్కరించి అన్నయ్యకు ఆరోగ్యం ప్రసాదించటానికే పనిగట్టుకుని వచ్చింది కదా!
తక్షణం అక్కయ్యకు తగు సూచనలు ఇచ్చి అవసరమైన కషాయం పెట్టించి అన్నయ్య చేత తాగించింది. తరువాత ఏం జరిగిందో చక్కగా ఊహించవచ్చు.
అరగంట తరువాత అన్నయ్యకు మూత్ర విసర్జన జరిగి, రోగం చేతితో తీసి పారవేసినట్లు అయింది.
అమ్మ లాలన్నయ్యను తన వెంట జిల్లెళ్ళమూడి తీసుకు వెళ్ళి ప్రత్యేక నివాసంలో ఉంచి, మహాశ్రద్ధగా పథ్యం చేయించింది. ఏం తినాలో అమ్మ నిర్దేశిస్తే వసుంధర అక్కయ్య చేసి పెట్టేది. అన్నయ్య తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యే వరకూ అమ్మ అలా సంరక్షించింది.
నిజానికి అందరినీ – వారు సన్యాసి అయినా, సంసారి అయినా, ఒంటరి అయినా అందరినీ అమ్మ ఇలాగే కనిపెట్టుకుని తన కంటిపాపలవలె ఆదరించింది. పశుపక్ష్యాదులనూ అంతే కరుణ, జాలి, వాత్సల్యంతో చూసేది.
ఒక రోజు జోరున వర్షం. ఆవరణంతా బురదతో జారుడుగా ఉంది.అప్పుడే ఒక కుక్క చావు బ్రతుకులో ఉంది. అమ్మ స్వయంగా చూడటానికి బయలు దేరింది. రామకృష్ణ అన్నయ్య ప్రభృతులు అమ్మను వారించారు. కానీ అమ్మ అంగీకరించక ఆ ప్రతికూల పరిస్థితుల్లో ఆ శునకాన్ని చేరి దానికి శుశ్రూషలు చేసి దాని అంతిమయాత్ర ప్రశాంతంగా జరిపించింది.
అమ్మ సర్వజీవశ్రేయోదాయిని.