మా ఇంటి (సింహద్వారం) ఎదురుగా ఉన్న అమ్మ ఫోటో చూసి మా అమ్మాయిని అడిగింది పై 4వ అంతస్తులో ఉన్న ఒక ఆమె అమ్మ గురించిన విశేషాలు. వాళ్ళ అమ్మమ్మగారు అమ్మ గురించి చెప్పేవారట. మరి ఇంకెవరి ద్వారానో కూడా విని ఉన్నారట. తాను కాని, వాళ్ళమ్మగారు కానీ అమ్మను చూడలేదట.
మామూలే. భర్తకు నచ్చదు భార్యకు నమ్మిక. జిల్లెళ్ళమూడి రావాలనుకున్నా రాలేని పరిస్థితి. నాకు అమ్మ తనతో ఏ విధంగా బంధం ఏర్పరచుకున్నది, అమ్మతో తనకు కలిగిన అనుభవాలు చెబుతూనే ఉన్నారు. బహుశః ఆమె వయస్సు 40 లోపు ఉండవచ్చు. ఆమె పాపకు 7 సంవత్సరాలు ఉండవచ్చు. పెద్దగా పరిచయం లేదు. కానీ అమ్మ గురించి ఆమె అనుభవాలు ఆమె వ్రాసి ఇస్తే బాగుంటుంది అని నా కనిపించి ఆమెతో అన్నాను. ఆమె పేరు సుభద్ర అని మాత్రమే నాతో అన్నది.
ఆమె మాటలలోని ఆవేదనే నివేదనగా నాతో పంపించింది. అలాంటి వారి ఎదలో నుండి వచ్చిన మాటలు గుండెను కరిగిస్తాయి కదిలిస్తాయి చూడండి. కాదేదీ కవితకనర్హం అని చెప్పబడినట్లు, అమ్మ ప్రేమకు అవధి అనేది ఈ అనంత విశ్వంలో కనపడదు. అమ్మ యొక్క ప్రేమ అనంతమైన సాగరం. అది ఒక అనిర్వచనీయమైన అనుభూతి.
మీరందరూ నా బిడ్డలే. కేవలం మిమ్మల్ని? అంతా పెంచడానికి పంచాను నాన్నా! అన్న అమ్మ మాటలను నిజం చేస్తూ తన భక్తులు, ఆశ్రితులు అమ్మను ఎపుడు ఏ జాములో పిలిచినా అమ్మ పరుగు పరుగున వస్తుంది. తన భక్తులు తన ప్రేమను చవి చూడడానికి అగ్నిలో నిలబడి, లేదా మంచులో నిలబడి కఠోరమైన తపోదీక్ష ఆచరించవలసిన అవసరం లేదు. అమ్మ ప్రేమమాత్రం చేత భక్తుల పాపాలు పటాపంచలు చేయగల కరుణామయి. ప్రపంచం పోకడ తెలియని తన యొక్క నిరుపేద బిడ్డలను, దీనజనులను, పండితులను ఒక త్రాటి మీద నిలబెట్టి ప్రేమమార్గము చూపి వారి యొక్క జీవితాలను ఉద్దరించడానికి వచ్చిన ఒక కరుణామయి. ముద్దుమాటలతో మురిపెంగా తల్లి చిన్నతనంలో ఇచ్చిన ప్రేమను చవిచూడని బిడ్డ ఎవరు? విశ్వజనని తన యొక్క ప్రేమ, కరుణామృతములచే ప్రతీభక్తుని పరమ సాత్వికమైన మార్గంలో ప్రయాణించు నట్లు చేయు పరమసాధనము.
అమ్మ యొక్క ప్రేమతత్వాన్ని చెప్పటానికి ప్రయత్నం చేయటం అంటే ఒక ఉద్దరిణితో సముద్రునికి తన యొక్క జలాలతో అర్ఘ్యం సమర్పించడం. కరుణామయి యొక్క అనుభవాలను పంచుకునే ప్రయత్నంలోకి ప్రయాణం చేస్తే……
నేను అమ్మను గురించి కేవలం వినటమే గాని, ఆవిడను ఎపుడూ దర్శించలేదు. కాని జీవితగమనంలో భాగంగా అమ్మ యొక్క చిత్రపటాన్ని చూసే భాగ్యం అప్రయత్నంగా కలిగింది. కానీ విచిత్రంగా అమ్మను నేను చాలా రోజుల నుంచీ ఎరుగుదును అన్న భావన మదిలో అప్రయత్నంగా ఏర్పడింది. కన్నులు చూసిన రూపాన్ని హృదయం ఎంతో పదిలంగా దాచుకుంది.
చదువులో, ఉద్యోగంలో ఎన్నో ఒడిదుడుకులు. అన్ని బాధలలో కూడా విచిత్రంగా అమ్మకు మాత్రమే అన్ని కష్టాలు చెప్పేదాన్ని. ఆవిడ నాకు అవన్నీ ఎంతో సహనంగా విని ఆప్యాయంగా వింటున్నట్టుగా అన్పించేది. అమ్మతో సహవాసం జీవితంలో ఓర్పును ప్రసాదించింది. పరుగులు పెడుతున్న ఈ మానవ ప్రపంచంలో నాకంటూ ఒకరు ఉన్నారని, నా కష్టాలను ఎంతో ప్రేమపూర్వకంగా వింటూ నాకు చేయూత నిస్తూ ధైర్యం చెపుతున్నారని అనిపించింది. ఈ భావన నేను ధ్యానం పట్ల ఆకర్షితురాలను అవటానికి ఉపకరించింది. అమ్మ యొక్క చిత్రపటాన్ని చూస్తూ మరియు కన్నులు మూసుకుని చేశారు. ధ్యానం చేస్తున్నపుడు మనస్సంతా తెలియని ప్రశాంతత ఆవరించుకునేది. అనంత విశ్వాన్ని ఆవరించి ఉన్న అమ్మ కేవలం నా మీద ప్రేమతో నేను కట్టిన ఒక నిరాడంబరమైన చిన్ని గుండెగుడిలో ఒదిగిపోయింది. అనేకమైన ప్రశ్నలకు సమాధానాలను అమ్మ మౌనంగా తెలియజేశారు. నా ఈ ధ్యానభూమికలో కేవలం రక్షణ ఇవ్వటమే కాకుండా ప్రాపంచికంగా అత్యంత కఠినమైన రోజులను చవిచూస్తున్న రోజులలో “అమ్మా ఆకలిగా ఉంది ఎవరినీ నోరు తెరిచి అడుగలేను” అని చెప్పగా. నాకు ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తుల ద్వారా తన బిడ్డ ఏ ఆహారాన్ని అడిగిందో ఖచ్చితంగా అదే ఇచ్చేలా చేశారు.
అమ్మ కరుణ, ప్రేమ, కేవలం జిల్లెళ్ళమూడికే పరిమితం కాదు. అమ్మ నుంచి ఉద్భవించిన ప్రతి జీవి | ఆప్రయత్నంగా అమ్మ ఒడిలోకి చేరడానికే ప్రయత్నిస్తారు. చక్కటి ఒరవడితో అకుంఠితమైన దీక్షతో ప్రతీ జీవనది. పయనం చేస్తూ అఖండమైన సముద్రాన్ని అత్యంత ఆనందంగా చేరుకుంటుందో, అమ్మ పాదాల చెంతకు అత్యంత ప్రేమతో చేరుకోవడమే ఈ జీవిత పరమావధి అని నేను అమ్మ ప్రేమ సాక్షిగా నమ్ముతున్నాను..