“జిల్లెళ్ళమూడిలో మానవాకృతి ధరించి నడయాడే దైవం అమ్మ” అని, “అమ్మను దర్శించిన వారు ధన్యులు” అని, “అమ్మలో గోచరించే విశ్వప్రేమ అందరికీ ఆదర్శం” అని భారతీ సోమ్స్ అధినేత శ్రీ అరుణాచలం మాణిక్యవేల్ అన్నారు. గుంటూరు, బృందావనగార్డెన్స్లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో ఏప్రిల్ 5వ తేదీన జరిగిన “అమ్మతత్త్వచింతన సదస్సు”లో ముఖ్య అతిధిగా పాల్గొన్న శ్రీ మాణిక్యవేల్ తమ ప్రసంగంలో అమ్మను తన బ్యాలంలో చూశానని, అమ్మ ప్రేమను మరచిపోలేనని తమ స్పందనను తెలియచేశారు.
గుంటూరు మాతృశ్రీ అధ్యయనపరిషత్, మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వ విద్యార్థి సమితి, అమ్మ తత్వ ప్రచారసమితి కలసి ఏప్రిల్ 4, 5 తేదీల్లో నిర్వహించిన సదస్సు వైభవంగా జరిగింది.
4వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సదస్సు ప్రారంభమైంది. పూర్వవిద్యార్థి సమితి పక్షాన సర్వశ్రీ కె. శేషాద్రి, డి. భాస్కరశర్మ, అమ్మ సన్నిధిలో తమ అనుభవాలను వివరించారు. డాక్టర్ జయంతి చక్రవర్తి “అమ్మ” చలన చిత్రానికి పరిచయ వాక్యాలు పలికారు. అమ్మ ఆస్థాన గాయకులు శ్రీ రావూరి ప్రసాద్ మధుర గీతాలతో సభను అలరించారు. అనంతరం “అమ్మ” సినిమా ప్రదర్శన జరిగింది. అమ్మను ప్రత్యక్షంగా దర్శించిన అనుభూతి పొంది ఆబాలగోపాలం పులకించారు.
5వ తేది శనివారం సాయంత్రం 6 గంటలకు ‘సదస్సు’ ప్రధానసభా కార్యక్రమం జరిగింది. ఆనాటి సభకు ‘విశ్వజనని’ మాసపత్రిక సంపాదకులు శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సృష్టినంతటినీ తన బిడ్డగా దర్శించి, సాటిలేని ప్రేమను పంచిన అమ్మ అమ్మ అవతారము విలక్షణమైనదని, అంతులేని ఆ ప్రేమజలధిలో బిడ్డలందరూ పునీతులయ్యారని శ్రీ పి.యస్.ఆర్. తమ అధ్యక్షోపన్యాసంలో వివరించారు.
సభా ప్రారంభకులుగా పాల్గొన్న తత్త్వ ప్రచార సమితి కార్యదర్శి డాక్టర్. యు. వరలక్ష్మి మాట్లాడుతూ – పదిమందికి పంచిపెట్టే లక్షణాన్ని అమ్మ ఆచరణాత్మకంగా నేర్పిందని, ఈ పంచే గుణం నేర్చుకోవడమే అసలైన అక్షరాభ్యాసమని ప్రకటించిందని వివరించారు.
జ్యోతిప్రజ్వలనం చేసిన ఆలయపాలక వర్గ అధ్యక్షులు శ్రీ సి. హచ్. మస్తానయ్య మాట్లాడుతూ – అమ్మ సదస్సు తమ దేవాలయ ప్రాంగణంలో జరగడం తమకు ఎంతో ఆనందం కలిగిస్తోందన్నారు. ఇలాంటి సభలు ఈ వేదికపై తరచుగా జరగాలని అభిలాషను వ్యక్తం చేస్తూ ‘అమ్మ’ కార్యక్రమాలు నిర్వహించడానికి తమ వేదిక, తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
శ్రీ కళ్ళం గ్రూప్ విద్యాసంస్థల వ్యవస్థాపకులు, సుప్రసిద్ధ పారిశ్రామిక వేత్త శ్రీ కళ్ళం హరనాధరెడ్డి గౌరవ అతిధిగా పాల్గొని, తమ ప్రసంగంలో అమ్మలోని విశ్వమానవ ప్రేమను కొనియాడారు.
ప్రధానవక్త, అమ్మతత్త్వ ప్రచార సమితి ఉపాధ్యక్షులు, మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. యల్. సుగుణ ప్రసంగిస్తూ, అమ్మలో బాల్యం నుంచే వ్యక్తమైన విశ్వమానవ ప్రేమను సోదాహరణంగా వివరించారు.
ఆత్మీయ అతిథి, శ్రీ విశ్వజననీ పరిషత్ స్థానిక కార్యదర్శి శ్రీ వి.రమేష్బాబు ఇలాంటి సదస్సులు వాడవాడలా జరగాలని కోరుకుంటూ, పూర్వ విద్యార్థులను అభినందించారు. వేదికపై ఉన్న అతిథులకు ‘అమ్మ’ ప్రసాదంగా నూతన వస్త్రాలు సమర్పించారు. అందరూ అమ్మ బిడ్డలే అని, అందరూ జిల్లెళ్ళమూడి వచ్చి, అమ్మ ప్రేమను, ఆశీస్సులను అందుకోవాలని పిలుపునిచ్చారు.
పూర్వవిద్యార్థి ప్రతినిధిగా పాల్గొన్న శ్రీ జి.రంగాచార్యులు అమ్మ ఒడిలో తమ విద్యార్థి జీవితం నిరాటంకంగా సాగిందని, ఈనాడు తాము సమాజంలో సమున్నత స్థితిలో ఉన్నామంటే, అందుకు కారణం అమ్మ నెలకొల్పిన కళాశాలేనని ప్రకటించారు.
పూర్వవిద్యార్థి శ్రీ డి. భాస్కరశర్మ ధాన్యాభిషేకానికి విశేష విరాళాలు ఇచ్చి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెల్పి, వారిని సత్కరించారు.
కళాశాల పూర్వవిద్యార్థిని, బాపట్ల ఎ.పి. రెసిడెన్షియల్ జూనియర్ కాలేజి వైస్ ప్రిన్సిపాల్, “గజల్ గంగోత్రి” శ్రీమతి ఎం.బి.డి. శ్యామల మధుర గీతాలతో అమ్మకు “స్వరార్చన” సమర్పించారు.
అతిథులను, వేదిక పై ఉన్న పెద్దలను, సదస్సు నిర్వాహకులైన పూర్వ విద్యార్థులను అమ్మతత్త్వ ప్రచార సమితి శాలువలతో సత్కరించింది.
మాతృశ్రీ అధ్యయనపరిషత్ గుంటూరుశాఖ కార్యదర్శి శ్రీ కట్టమూరి వెంకటేశ్వరరావు వందన సమర్పణ చేశారు. విద్యార్థి కార్యకర్తలు అందరికీ అమ్మ ప్రసాదం పంచిపెట్టారు. గుంటూరు సదస్సు అందరి హృదయాలలో ఒక మధురానుభూతిగా నిలచింది.