అమ్మ అంటే అవ్యాజమైన ప్రేమ. “Work is love made visible” అని ఖలీల్ జిబ్రాన్ (పని అంటే ఆచరణ. ప్రేమను తెలియ జేస్తుంది). తనను చూడటానికి వచ్చిన వారంతా భోజనం చేయాలనే భావనే గొప్పది. అంతేకాక తన సన్నిధిలో సర్వ స్వతంత్రమైన సత్రంగా ఏ భేదాలు, అర్హతానర్హతలు, సమయాసమయాలు లేకుండా 1958 ఆగష్టు 15 నుండి నిరంతరాయంగా ఈ అన్నపూర్ణసత్రం నిర్వహింపబడుతుండడం మరీ విశేషం. అంతకు పూర్వం కూడా, అమ్మ చిన్నతనం నుంచీ, తాను తినకుండా మనుషులకే కాక పశువులకు కూడా అన్నం పంచి పెట్టడం, అన్నం కోసం కొందరికి నగలు ఇవ్వడం గుడ్డలు ఇవ్వడం జరిగింది. ప్రపంచానికి బాగా తెలిసేలా ప్రత్యేకంగా ఒక చోట అన్నం పెట్టడం 1958 నుండి. అన్నం పెట్టడంలో ఉన్న తృప్తి లక్షల వ్యయంతో బిల్డింగులు కట్టినా రాదంటుంది అమ్మ. అన్నం పెట్టి తృప్తి పరచినట్లు ఇంకేమిచ్చినా తృప్తి పరచలేం కదా. అన్నం తిని ఇంక చాలు అంటాడు. ఇంకేమిచ్చినా వాడి చేత “చాలు” అనిపించడం కష్టం.
అన్నాన్ని ప్రాణాధారమైన పదార్థంగా పరబ్రహ్మగా ప్రాచీనులు కీర్తించారు. అన్నంవల్లనే భూతజాలం అంతా వుట్టి, పెరిగి, అన్నంలోనే లయాన్ని పొందుతోన్నదని తైత్తిరీయోపనిషత్. అన్నం మనచే తినబడేది, మనల్ని తినేది కూడానట. ఆయుర్దాయం అన్నాన్ని ఇస్తుంది. అన్నమే మన ఆయువును హరిస్తుంది అని ఆర్యోక్తి. రంతి దేవాదులు అన్నదానం వల్ల ఉత్తమగతులు పొందారని భాగవతం. మొన్న మొన్న డొక్కా సీతమ్మగారు మొదలైనవారు కూడ ఏ భేదాన్ని సమయాసమయాలను పాటించక అన్నదానం వ్రతంగా ఆచరించారు. అయితే అమ్మ దీనిని ‘అన్నదానం’ అనడం లేదు. దీనిలో తన కర్తృత్వం లేదట. వాడికి అన్నం ఇక్కడ ప్రాప్తం ఉండి తింటున్నాడట, వాడు తినకపోతే ఇక్కడ వానికి ప్రాప్తం లేదను కుంటుందట. అయినా ఒక్కడు అన్నం తినకుండా వెళ్ళినా అమ్మ బాధపడుతుంది. “ఎవరికి కడుపులో మండితే వారే తింటారులే అని ఊరుకోలేను. నా కడుపే మండుతుంది” అంటుంది. తల్లి హృదయం కదా! అందరూ బిడ్డలే. అంతే కాదు. “మీరంతా నా అవయవాలు” అన్న
‘ఇది జగన్నాధ రధం – కదిలితే ఆగదు’ అని ఇదివరకే హామీ ఇచ్చింది. జగన్నాథ రధమంటే లోకులందరూ నాథులుగా కలిగిన రధం. అందరూ కలిసి లాగవలసిన రథం అని అనుకోవాలి. ఏ కోటీశ్వరుడూ కూడ ఒక్కడే చేయగల పని కాదు ఇది – అని అమ్మే చెప్పింది. 1958, ఆగష్టు 15 ప్రపంచానికే స్వాతంత్య్రం వచ్చిన రోజని అమ్మ ప్రకటించింది. ఏ దేశంవాడైనా, ఏ మతమైనా, కులమైనా ఇక్కడ ఏవేళలో నైనా భోజనం చేయవచ్చు. “అమ్మా! మన దేశానికి ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది’ అని అడిగితే, “అన్ని దేశాలు నావి అనుకోగలిగిన వారు” అని అమ్మ జవాబు. ఒకసారి అమ్మను ఒక సుప్రసిద్ధ జ్యోతిష్కులు ఒక ప్రశ్న అడగమన్నారు. అమ్మ మొదట్లో ఇష్టపడక పోయినా “ప్రపంచం అంతటా ఆకలి బాధ లేని రోజు వస్తుందా నాన్నా?” అని అడిగింది.
జిల్లెళ్ళమూడిలో కొత్తగా ఫోన్లు పెట్టినపుడు ఫోన్లో ఎవరితో నైనా “నానూట నీకు వినబడుతోందా? భోజనం చేశావా?” అనే మాట్లాడింది. బిడ్డల భోజనం విషయంలో అమ్మకు ఉన్న శ్రద్ధ ఎవరికీ ఉండదు.
అయితే, ఇది ఆకలికి అన్నమే కాని రుచికి కాదు. అసలు “ఆకలే రుచి” అని సూటిగా చెప్పింది. ఇప్పటికి పదులు, వందలు, వేలు, లక్షలు భోజనం చేసారు. తృప్తి పొందారు. ఆ అన్నం అమ్మ అమృతం వంటి ప్రేమతో కలిపింది కనుక ఎందరికో మామూలు ఆకలిని తీర్చడమే కాక ప్రసాదమై ఆధివ్యాధుల్ని దూరం చేసింది. ఇప్పుడుకూడ నిత్యం 3,4 వందలమంది భోజనం చేస్తుంటారు. స్వర్ణోత్సవంలో లక్షకు పైగాను, వత్రోత్సవంలో 60 వేలకు పైన ఒకే రోజున భోజనం చేసిన ఘట్టాలు చరిత్రలో అపురూపమైనవి. “అన్ని బాధలకంటే ఆకలిబాధ ఎక్కువ” అని అమ్మ అంటుంది. “అమ్మా! అయినవాడికీ కానివాడికి కూడ ఎందుకు అన్నం పెట్టడం!” అంటే, “ఆకలే భోజనం చేయడానికి అర్హత. అది ఉంటే ఎవరైనా ఎప్పుడైనా ఇక్కడ భోజనం చేయవచ్చు” అన్నది.
“మీరు తినకపోతే చిక్కిపోతారు. నేను పెట్టు కోకపోతే చిక్కి పోతాను. పంచి పెట్టడానికి కాక ఉండడం దేనికీ. మీచేత పెట్టించడం కోసమే నేను మీకు “పెట్టడం” అని అమ్మ వివరణ. ఉన్నంతలో నలుగురికీ ఆదరణగా పెట్టమని అమ్మ సందేశం.
మనమెలాగూ అన్నపూర్ణాలయాన్ని స్థాపించి నిర్వహించలేం. అంతవరకూ అమ్మ సన్నిధిలోని అన్నపూర్ణాలయ యజ్ఞశాలలో ఒక సమిధను అహుతి చేద్దాం. మనకున్నంతలో నలుగురికీ ఆదరణగా పెట్టడం మనకు సాధ్యమయ్యే వరకు కనీసం ఆ పనైనా చేస్తే అమ్మను మనం దర్శించినందుకు కొంతైనా ఫలం చేకూరుతుంది. ఇది అమ్మ ఆశించదు, కాని బిడ్డలుగా మనకెంతో శ్రేయస్కరం.
రామకృష్ణ పరమహంస “ఇతరులకన్న, నీ అలుబిడ్డలు స్వకీయులన్న భావం నీకెందుకు? నారాయణుడే నిరుపేద యాచక రూపంలో నీవాకిలి గడపదగ్గరే చస్తున్నాడే! వానికేమీ పెట్టకుండా నీ అలుబిడ్డలను మాత్రం షడ్రసోపేత భోజ్యాలతో తృప్తి పరుస్తావా? అది ఎంత ఘోరకృత్యం!” అంటారు.
అమ్మ ప్రేమ ప్రసారానికి ప్రధాన కేంద్రం అన్నపూర్ణాలయం. అమ్మ ప్రేమసాగరంలో మునిగిన మనం కనీసం కొంతైనా తోటివారికి మన ప్రేమను ప్రసరింపచేయవద్దా? అమ్మ నాటిన ఈ చెట్టు పుష్పఫల భరితం కావడానికి మనమూ చేదోడు వాదోడుగా ఉండాలి కదా! ఆ మహావృక్షం ఎన్ని రకాల పక్షులకో ఆశ్రయం అవుతున్నది. జీవనాధారమై ఉంది. మనమూ కొన్ని నీటి బిందువులనైనా రాల్చి మనవంతు కర్తవ్యాన్ని నెరవేర్చడానికి పూనుకుందాం.