జిల్లెళ్ళమూడిలో విద్యాస్వరూపిణి అమ్మ అమృతహస్తాలతో ప్రారంభమైన ఆదర్శవిద్యాసంస్థ మాతృశ్రీ విద్యాపరిషత్. ఈ సంస్థ ఆధ్వర్యంలో 1971 ఆగస్టు 6వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కాలేజి, దానికి అనుబంధంగా 1977 లో మాతృశ్రీ సంస్కృత పాఠశాలను అమ్మ నెలకొల్పింది. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, పరిపూర్ణ మానవులుగా తీర్చిదిద్దే దేవాలయాలు మాతృశ్రీ విద్యాసంస్థలు. కీ.శే. శ్రీ అధరాపురపు శేషగిరిరావు గారు, శ్రీ కొండముది రామకృష్ణ గారు, డా॥ పన్నాల రాధాకృష్ణశర్మ గారు, శ్రీ బొడ్డుపల్లి సీతారామస్వామిశాస్త్రి గారు మొదలైన ఎందరో మహానుభావులు వ్యవస్థాపక కార్యదర్శులు అధ్యక్షులు అమ్మకు ఉపకరణాలయి అమ్మ స్థాపించిన ఈ కళాశాల అభివృద్ధికోసం అహరహం అనుక్షణం కృషిచేశారు. కళాశాలను కంటిపాపలా కాపాడుతూ కళాశాల నిర్వహణకోసం అహర్నిశలూ అలుపెరుగని ప్రయాణం చేసిన డా॥ పన్నాల రాధాకృష్ణశర్మగారు, విద్యార్థుల జీవితాలపై చెరగని ముద్రవేసిన ఆచరణశీలి శ్రీ విఠల రామచంద్రమూర్తిగారు కళాశాలను అభివృద్ధిపథంలో నడిపిన తీరు అందరికీ ఆదర్శం. ప్రారంభించిన నాటి నుండి కళాశాల క్రమంగా ఇంతింతై వటుడింతయై అన్న చందంగా దినదినాభివృద్ధి చెంది మహావృక్షమై ఈనాడు ఎందరికో ఆశ్రయాన్ని ఇస్తోంది. శ్రీ తుమ్మలపల్లి హనుమంతరావు గారు, శ్రీ కొండముది గోపాలన్నయ్య, శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు గారు, కీ.శే. శ్రీ కోన వేంకటేశ్వరరావు గారు, శ్రీ ఏకా రాజేశ్వరరావు గారు, శ్రీ తురుమెళ్ల చెన్నకేశవరావు గారు, శ్రీ టి.టి. అప్పారావు గారు, శ్రీ కోగంటి సత్యప్రసాద్ గారు, శ్రీ బి.రామచంద్ర గారు, శ్రీ యమ్. శరచ్చంద్ర కుమార్ గారు, శ్రీ వఝ ప్రసాదరావు గారు, శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ యన్. మోహనకృష్ణ గారు, కీ.శే. జి.వై.యన్. బాబు గారు ఇంకా ఎందరెందరో బాధ్యతకల్గిన భూమికలతో తమ సేవలందించి కళాశాలను ప్రగతిపథంలో నడిపించారు.
కళాశాల అభివృద్ధే తపస్సుగా భావించి అన్ని విధాలుగా తమ సేవలందిస్తూ ఉన్న శ్రీ బి. రామబ్రహ్మం గారు, శ్రీ యమ్. దినకర్ గారు, శ్రీ డి.వి.యన్. కామరాజుగారు, శ్రీ లక్కరాజు సత్యనారాయణ గారు కళాశాల తీరుతెన్నులను పర్యవేక్షిస్తూ తమ అమూల్యమైన సూచనలతో ముందుకు నడిపిస్తూ ఉన్నారు. కళాశాలకు అవసరమైన ఎన్నో విషయాలలో, తన సహకారాన్ని అందజేస్తూ ఉన్నారు యల్లాప్రగడ మధుసూదనరావు గారి కుమారులు వై. ప్రేమసతీష్. అమ్మకు ప్రతిరూపమై తమ ఉనికే కొండంత అండగా కళాశాల నిర్వహణలో ఏ విషయానికయినా వెంటనే పరిష్కారమార్గాలను అందిస్తూ ఉన్నారు శ్రీ బ్రహ్మాండం రవి అన్నయ్య గారు.
అందరి ఆలోచనలతో సహకారంతో అయిదు దశాబ్దాల ఉజ్వల చరిత్ర కల్గి శతాబ్దాల పరిణతితో కళాశాల ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.
అమ్మ సంకల్పానికనుగుణంగా కేవలం జీవనోపాధికోసం విద్యను పరిమితంచేయకుండా ఉన్నత విద్యతోపాటు విద్యార్థులలో క్రమశిక్షణ, సేవాదృక్పథం, ఆధ్యాత్మిక ధార్మిక చింతన పెంపొందే విధంగా ఇక్కడి విద్యార్ధుల దైనందిన కార్యక్రమప్రణాళిక ఇక్కడ చదివే విద్యార్ధినీ విద్యార్థులందరకీ ఉచితంగా విద్య, వసతి, భోజన సౌకర్యాలను శ్రీ విశ్వజననీ పరిషత్ సమకూరుస్తున్నది. నిరుపేద ద విద్యార్థులకు విద్యావకాశాలు కల్పించాలని కులమతవర్గవర్ణ విచక్షణ లేకుండా ఆసక్తే అర్హతగా అందరికీ విద్యను అందుబాటులోకి తేవాలని అమ్మ ఆశయం. ఆ ఆశయానికి అనుగుణంగానే ఈ కళాశాలలో నాటినుండి నేటివరకు రాష్ట్రం నలుమూలల నుండి ఎందరో విద్యార్థినీ విద్యార్థులు ఈ కళాశాలలో చదువుకుంటున్నారు. ఎందరో విద్యార్థులు ఉన్నత ప్రమాణాలతో విశ్వవిద్యాలయ స్థాయిలో ప్రథమస్థానాన్ని పొంది బంగారు పతకాలను పొంది కళాశాల కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపచేస్తూ ఉన్నారు. వీరంతా అమ్మ ఒడిలో అమ్మ బడిలో విద్యతోపాటు వినయాన్ని, వివేకాన్ని, సత్ప్రవర్తననూ అలవరచుకుంటూ అభ్యుదయపథంలో ముందుకు సాగుతున్నారు. అంతేకాదు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇక్కడ ఆలయాలలో జరిగే సంధ్యావందనం, సుప్రభాతం, లక్షనామార్చనలు ఇంకా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఈ కళాశాలలో చదివిన విద్యార్థులెందరో రాష్ట్రస్థాయి జాతీయ స్థాయిలో శాస్త్రబంధమైన వక్తృత్వపు పోటీలలో ఎన్నో బహుమతులను గెలుచుకున్నారు. రాష్ట్ర, రాష్టేతర ప్రాంతాలలో వివిధ విశ్వవిద్యాలయాలలో సంస్కృతాంధ్ర సాహిత్యాలలో పరిశోధనలు చేసి డాక్టరేట్ పట్టాలు అందుకుని విశేష గౌరవాన్ని పొందుతూ ఉన్నారు. పూర్వ విద్యార్ధులెందరో ఉత్తమమైన భావాలతో ఉన్నతమైన లక్ష్యాలతో సమాజంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా వివిధ శాఖలలో ఉన్నతోద్యోగులుగా ఒక గుర్తింపును పొంది ప్రస్తుత విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తూ మాతృసంస్థ పట్ల కృతజ్ఞతతో తమ సహకారాన్ని అందచేస్తూ ఉన్నారు. అంతేకాదు. రక్తదాన శిబిరాలు నిర్వహించడం, మొదలైన సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ వివిధ ప్రతిష్టాత్మక సంస్థలనుండి పురస్కారాలను పొందడం అమ్మ పరిపూర్ణ అనుగ్రహానికి రూపుదిద్దుకుంటుంది. అమ్మ ఆలోచనలకు అనుగుణంగా నిదర్శనం.
కరోనా విపత్కర పరిస్థితులలో ఎన్నో సేవాకార్యక్రమాలు చేపట్టి ‘అవసరమే విలువైనది’ అని అమ్మ చెప్పినట్లుగా అవసరాన్ని గమనించి ఎందరినో ఆదుకున్నారు. 2021 కళాశాల స్వర్ణోత్సవంలో ఆకలే అర్హతగా అమ్మకు ఎంతో ఇష్టమైన అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తూ తమ మాతృసంస్థ విశిష్టతను చాటి చెప్తూ ఉన్నారు.
శతసహస్రపద్మంగా వికసించిన జీవితాలలో మొగ్గ విద్యార్థి దశ. ఏ మనిషి అయినా ఒక వ్యక్తిగా రూపు దిద్దుకునేది విద్యార్థిదశలోనే. ఒక విత్తనం మొలకెత్తడానికి మొక్కగా ఎదిగి వివిధ శాఖోపశాఖలున్న వృక్షంగా నిలబడడానికి అన్నీ సహకరించినపుడే సాధ్యపడుతుంది. కర్తవ్యనిష్ఠ, నిబద్ధత, నిరాడంబరత, అంకితభావం కల్గిన మా గురువర్యులందరూ అమ్మ తత్త్వాన్ని పుణికిపుచ్చుకుని శిష్యులను కన్నబిడ్డలుగా ఆదరించి కళాశాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించి సేవాభావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచి అమ్మ సంకల్పానికి అనుగుణంగా విద్యార్ధులను ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దారు. అంతేకాదు. ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణ ప్రభావం విద్యార్థులు జీవితాలలో ఎంతగానో కన్పిస్తుంది. అన్నింటినీ మించి అమ్మ పరిపూర్ణ అనుగ్రహం అందరిపై ఎపుడూ ప్రసరిస్తూ ఉంటుంది.
నాడు ఏ ఆశయాలతో కళాశాల ప్రారంభం అయిందో అదే ఒరవడిలో ఇప్పటి అధ్యాపక బృందం విధినిర్వహణకు అంకితమై కళాశాల సర్వతో ముఖాభివృద్ధికి తోడ్పడుతున్నారు. అనేక సేవా కార్య క్రమాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అధ్యయన అధ్యాపనాలలోనే కాక అన్ని విషయాలలో ప్రగతిపథంలో నడుస్తూ కళాశాలకు పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తున్న పూర్వ ప్రస్తుత విద్యార్థులందరికీ ఈ స్వర్ణోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాను.